Facebook Twitter
" ఏడు రోజులు " 10వ భాగం

" ఏడు రోజులు " 10వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 


 

అలా ఎంతసేపు కూర్చున్నాడో తెలీదు కాని, మిత్రులు నిద్రలేచే సరికి భళ్లున తెల్లారిపోయింది.
సూర్యుడి లేతకిరణాల జోరు నగరజీవనాన్ని ఎప్పట్లా ఉరుకుల పరుగులకు ఉసిగొల్పింది. ఫలితంగా అప్పటికే రోడ్డు వెంబడి క్రమక్రమంగా

వాహనాలు పరిగెట్టడం మొదలెట్టాయి.
పదిహేను నిముషాల తర్వాత మిత్రులతో కలిసి పార్కు నుండి బయటపడ్డాడు భవానీ శంకర్. అందరూ షూటింగ్ గురించిన ముచ్చట్లలో

మునిగి తేలసాగారు.
" బిచ్చగాళ్లలా పబ్లిక్ పార్కులో ఇంతసేపు పడుకోవడానికి మీకు సిగ్గులేదట్రా?  " మధ్యలో కల్పించుకున్నాడు  భవానీ శంకర్.
" ఉన్నట్టుండి వీడికి ఉన్మాదమా? " అని ఒక మిత్రుడు అనగానే " పబ్లిక్ పార్కులను తక్కువ అంచనా వేయద్దు. నేటి పబ్లిక్ పార్క్ పర్సనే

రేపటి పబ్లిక్ పర్సన్ కావచ్చు " మరో మిత్రుడి గొంతులో వ్యంగం.
" ఏదో గానీ, త్వరగా ఇంటికి వెళ్దాం " అన్నాడు భవానీ శంకర్.
" పోరా " చేయి విదిల్చారు మిత్రులు.
మనసంతా గౌసియావైపుగా ఉండి, ఎద లోతుల్లో ఏ కలవరాన్నో సృష్టిస్తున్న శతకోటిభావనలు అతడికి కోపం తెప్పించాయి.
" మీరు రాకపోయినా నేను వెళ్తాను " మొండిగా అన్నాడు.
మిత్రులంతా అతడ్ని పిచ్చివాడిలా చూశారు.
" గౌసియా కోసం " కోపాన్ని చల్లార్చుకుని శాంతంగా అన్నాడు.
" ఈ ప్రపంచం మొత్తంలో గౌసియా, నువ్వూ, ఇద్దరే ప్రేమికులు ఉన్నట్టున్నారు "
" తనకు గాళ్ ఫ్రెండ్ ఉందని ఆ బిల్డప్! కదట్రా? "
" నీ గౌసియా ఎక్కడికీ వెళ్లదుగానీ, కూచి మాటలు మాని కాస్త ఓపిక పట్టు "
తన మిత్రులు ఎవడు ఏ మాట మాట్లాడాడో కూడా పట్టించుకోలేదు భవానీ శంకర్.
" నా బాధ మీకు తెలియదురా " అని మాత్రం అనగలిగాడు.
" సర్లే గానీ కాసేపు బాధ మరిచిపో " అంటూ భవానీ శంకర్ భుజంపై చేయి వేశాడు ఒకడు.
" ప్చ్.." పెదవులు చిట్లించాడు భవానీ శంకర్.
" నాస్తా చేసి పోదాం లేరా " ఇంకో మిత్రుడు అన్నాడు.
" టీ తాగి వెళ్లిపోదాం " భవానీ శంకర్ అన్నాడు.
" నువ్వు ఇలాగే మాట్లాడితే, మధ్యాహ్నం లంచ్ చేసి వెళ్లాల్సి ఉంటుంది " ఇంకో మిత్రుడు భయపెట్టాడు.
" రండిరా " భవానీ శంకర్ గొంతులో అభ్యర్ధన.
" వెళ్తాం గానీ, గౌసియా గురించి ఆశువుగా ఒక కవిత చెప్పరా "  మరో మిత్రుడు అడిగాడు.
" నేను సి.నా.రె కాదు "  అన్నాడు భవానీ శంకర్.
" కవిత్వం చెప్పడానికి సి.నా.రె మాత్రమే కావాలా..? నేనూ చెప్పగలను " అన్నాడు వనస్థలిపురం నుండి వచ్చి షూటింగ్ దగ్గర కలిసిన ఓ

మిత్రుడు జోసెఫ్.
" ఏదీ చెప్పరా..! "  అన్నాడు భవానీ శంకర్.
" చెట్టుకు పువ్వులు అందం..
మనిషికి మాటలు అందం..
తారలకు మేకప్ అందం.."
జోపెఫ్ చెప్పుకు పోతుంటే, " వద్దురా " భవానీశంకర్ తో పాటుగా అందరూ చెవులు మూసుకున్నారు.
" ఏంట్రా? " చిన్నబుచ్చుకున్నాడు జోసెఫ్. " ముందే నాకు పిచ్చిగా ఉంది. ఈ పిచ్చి కవిత్వాలు చెప్పి నా మతి మరింత చెడగొట్టద్దు. "

అన్నాడు భవానీ శంకర్.
" చూస్తూ ఉండండ్రా..నేను ఈ కవితను ఏ పత్రికకో పంపిస్తాను. అది అచ్చుకాకపోతే, నా పేరు జోసెఫ్ కాదు. " అన్నాడు జోసెఫ్.
అందరూ కిసుకున్న నవ్వారు. జోసెఫ్ రుసరుసగా చూశాడు.
అదే సమయంలో సమీపంగా కూర్చుని ఉన్న ఓ బిచ్చగాడు మిత్రబృందాన్ని చూస్తే పాటందుకున్నాడు.
" నరుడా..ఓ మానవుడా.."
రాగయుక్తంగా పాడుతూ, డొక్కు డబ్బాను ఆడిస్తున్నాడతను.
" వాడు అన్ ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ, ఎంత బాగా పాడుతున్నాడో చూడు..! పదాల్ని కూడా బాగా ఉచ్ఛరిస్తున్నాడు..! " బిచ్చగాడ్ని

చూస్తే మెచ్చుకోలుగా అన్నాడు జోసెఫ్.
" ఏం బాబూ " మాట్లాడేది తన గురించే అని అర్ధం కాగానే చప్పున వాళ్లకు సమీపంగా వచ్చాడు బిచ్చగాడు.
" మా దగ్గర డబ్బుల్లేవు. ఉంటే ఇచ్చి వెళ్లు..నీ పేరు చెప్పుకుని టీ తాగుతాం. " చమత్కరించాడు ఒక మిత్రుడు.
" ఊరుకోరా..! " అంటూ వాణ్ని వారించి " ఏ ఊరు మనది "  బిచ్చగాణ్ని అడిగాడు జోసెఫ్.
" కోటప్ప కొండ బాబూ..! " చెప్పాడు బిచ్చగాడు.
" అక్కడ బిక్షం దొరకడం కష్టమైందా..? "  అడిగాడు జోసెఫ్.
బిచ్చగాడు ఏమనుకున్నాడో ఏమో.. జోసెఫ్ వైపు అయిదారు క్షణాలు అర్ధం కానట్టుగా చూసి ఆ తర్వాత " జాతకాలు చెప్పుకోడానికి

వచ్చాను బాబూ.! నా జాతకం నూటికి నూరుపాళ్లు కరెకుటు! " అన్నాడు బిచ్చగాడు.
" నీ జాతకం కరెక్టా..? నీవు సెప్పే జాతకం కరెకుటా..? " అతన్ని తమాషాగా అనుసరించాడు జోసెఫ్.
" నేను సెప్పే జాతకం "  అన్నాడు బిచ్చగాడు.
" అట్లాగా..! అయితే ఒకసారి మావాడి జాతకం చెప్పు..! " అంటూ భవానీ శంకర్ ను చూపించాడు జోసెఫ్.
" రూపాయి బిళ్ల ఏస్కోవాలి " అన్నాడు బిచ్చగాడు.
" ముందు నీవు జాతకం చెప్పు " అన్నాడు జోసెఫ్.
" మాద్యావర ఒప్పుకోదు " అన్నాడు బిచ్చగాడు
" అట్లాగా..! ఆహా..! " అంటూ రాగం తీసి " సర్లే..ఇదిగో రూపాయి." అంటూ తన జేబులోంచి రూపాయి బిళ్ల తీసి బిచ్చగాడికిచ్చాడు

జోసెఫ్.
" తమరి పేరేందన్నావు..? " రూపాయి బిళ్లను కళ్లకద్దుకుంటూ, భవానీ శంకర్ ను అడిగాడు బిచ్చగాడు.
" ఇంకా అనలేదు. వాడి పేరు భవానీ శంకర్ " చెప్పాడు జోసెఫ్.
" తమరికి పెండ్లి అయిందా..? " అడిగాడు బిచ్చగాడు.
" అయింది. నలుగురు పిల్లలు కూడా.." జోసెఫ్ సమాధానం చెప్పాడు.
మిత్రులంతా తమలో తామే నవ్వుకుంటూ ఆసక్తిగా చూస్తున్నారు. భవానీ శంకర్ మాత్రం నిశ్శబ్దంగా బిచ్చగాడినే చూస్తూ ఉన్నాడు.
బిచ్చగాడు కాసేపు కళ్లు మూసుకుని, ఆ తర్వాత ఆకాశానికేసి చూసి, " బాబూ! నీకు శానా కట్టాలున్నాయి. వాటిని నీవు పడగొట్టాలంటే

ఒక్కటే మార్గం. నేను సిరసైలం కొండల్ల తెచ్చిన ఒక సెక్క ఇస్తాను. దాన్ని నీ మొలతాడుకు కట్టుకో అంతే. నీ కట్టాలు పిట్టలు

ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతాయి. ఈ సెక్కకు యాభై రూపాయలు మాత్రం ఇచ్చుకో...అదే వేరే వాళ్లకు అయితే నూర్రూపాయలు.."
" అట్లాగా..! పూర్వజన్మంలో మేము మీకు బంధువులం అయ్యి ఉంటాం.." వెటకారంగా అన్నాడు జోసెఫ్.
" గట్లని కాదు బాబూ..! మీరు పిల్లల లెక్కన ఉండరు అందుకే..! " అన్నాడు బిచ్చగాడు.
" ఆ..నీ పాటను మెచ్చుకోవడం మేము ఇప్పుడు చేసిన పొరపాటు కావచ్చు.." ఆ వెంటనే అన్నాడు జోసెఫ్.
బిచ్చగాడు బేలగా చూశాడు జోసెఫ్ వైపు.
" ముట్టుకుంటే అంటుకొచ్చావు! ఆ...చెప్పు చెప్పు.. " అన్నాడు జోసెఫ్.
"  చూడు బాబూ..! మేము పొట్ట సేతిలో పట్టుకుని వచ్చినోళ్లం. మాతో తమరిట్టా మాట్టాడ్డం మంచిది కాదు " అన్నాడు బిచ్చగాడు.
" ఒకే..! " అన్నాడు జోసెఫ్.
" అంటే..! " అర్ధం కాలేదు బిచ్చగాడికి.
" ఓకే అంటే తప్పయింది, నన్ను క్షమించు అని అర్ధం. "
" అయ్యో..! అంత మాట ఎందుకు బాబూ..!  అంటూ ఇంకొంచెం ముందుకు జరిగి.."  సెక్క గావాల్నా బాబూ..? ఆ సెక్క ఒక్కటీ

తీసుకుంటే సాలు..మళ్లా తమరు జాతకం సెప్పించుకోనవసరం లేదు. ఆ మరుసటి దినం నుండే మీ జాతకం బ్రెమ్మాండంగా మారిపోతుంది.

"  అన్నాడు బిచ్చగాడు.
" తప్పకుండా చెక్క కొనుక్కుంటాం " అన్నాడు జోసెఫ్.

 

....... ఇంకా వుంది .........