Facebook Twitter
" ఏడు రోజులు " 8వ భాగం

" ఏడు రోజులు " 8వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 


 

లోపలి ఇంట్లో తల్లి లక్షీదేవమ్మ జొన్నలు జల్లెడ తిప్పుతోంది. కొడుకురాకను ఆమె గ్రహించలేదు.

అలాగే ఒక అర్ధగంట కూర్చున్నాడు భవానీశంకర్. అంతసేపటి వరకు గౌసియా వాళ్ల ఇంట్లోంచి ఎవ్వరూ బయటకి రాలేదు. పరదా చాటునుండి అస్పష్టంగా ఆమె చెల్లెళ్ళు అటూ ఇటూ తిరుగాడుతూ కనబడుతున్నారు. కనీసం తన గౌసియా అలాగైనా కనబడుతుందేమోనని ఆత్రంగా చూస్తున్న భవానీశంకర్ కి, మరో అర్ధగంట తర్వాత కూడా నిరాశే ఎదురయ్యింది.

అప్పటికి ఎండకూడా బాగా ఆరంభమయ్యింది. అందుకే ఇక నెమ్మదిగా లేచి ఇంట్లోకి నడవబోయాడు భవానీశంకర్.

కాసింత దూరంగా ముదురురంగు బురకాధరించి వస్తూ కనబడింది పర్వీనా.

" ఇంతగా మాకు సహాయం చేస్తున్నందుకు, నీకు చేతులెత్తి దణ్ణం పెడతాం ఆపా" ఆమెనే చూస్తూ మనసులో అనుకున్నాడు అతడు.

అతడెవరో తనకు పరిచయం లేనట్లుగానే, తన దారిన తను వచ్చి గౌసియా వాళ్ళ ఇంట్లోకి వెళ్లింది పర్వీనా.

తృప్తిగా ఇంట్లోకి నడిచాడు భవానీశంకర్.

" ఏరా ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు?" కొడుకును చూడగానే అడిగింది లక్ష్మీదేవమ్మ.

" టైమ్ పాస్ గా ఉంటుందని అలా బజారుకి వెళ్లొచ్చా ఇంతకూ నాస్తాకు ఏం ఉండావు? వెళ్లి గిన్నెలు తెరిచిచూస్తూ అడిగాడు.

" గోధుమ పులకాలు చేసాను" చెప్పిందామె.

"కూర?"

"  ఏమీలేదు. మిరప్పొడిలో నూనె కలుపుకో"

"ప్చ్" విసుగ్గా పెదవులు చిట్లించాడు అతడు.

" ఇట్లాంటివాడివి సంపాయించి పైసలు తీసుకురావాలి. అప్పుడు కమ్మగా కావాల్సినవన్నీ వండిపెడతాను" కొడుకు విసుగును గ్రహించి విసురుగా అంది లక్ష్మీ దేవమ్మ.

ముందే గౌసియా గురించిన తొందర అతడ్ని పీడిస్తోంది. పైగా ఇంట్లో కూర లేదు. దానికి తోడుగా తల్లి విసుర్లు. కోపం వచ్చింది అతడికి. అందుకే చేతిలోకి తీసుకున్న కంచాన్ని అక్కడే గూట్లోకి విసిరేస్తూ బయటకి నడిచాడు.

" మూతిమీద మీసం మొలవగానే మొనగాడివైపోయావు" వెళ్తున్న కొడుకును చూస్తూ అంది లక్ష్మీ దేవమ్మ.

అతడు మారుమాట్లాడలేదు. వెళ్లి అరుగుమీద కూర్చున్నాడు. ఎండ తీవ్రంగా ఉన్నందున వీపు చుర్రుమంటోంది. అయినప్పటికీ ఖాతరు చేయకుండా గౌసియావాళ్ళ ఇంటివైపు చూస్తూ కూర్చున్నాడు.

అర్ధగంట తర్వాత బయటకి వచ్చిన పర్వీనా, ఈమారు కూడా భవానీశంకర్ చూసీ చూడనట్లుగానే తన ఇంటివైపు నడిచివెళ్లింది.

లేచి వెనుకే నెమ్మదిగా వెళ్లబోయాడు భవానీశంకర్.

" రేయ్.. శంకరూ" అంతలోనే లోపల్నుంచి తల్లి పిలుపు.

"ఆ!" పలికాడు భవానీశంకర్.

" ఎండలో ఎందుకు కూర్చున్నావు? వచ్చి పులకాలు తిందువుగానీ రా" పిల్చింది.

" నాకేం వద్దు" రోషంగా అన్నాడు.

" చింతకాయ చట్నీ నూరి, తాలింపు పెట్టిస్తానుగానీ రారా" ప్రేమగా పిలిచింది.

" ఇప్పుడే వస్తాను" అంటూ ఆకలి కూడా మరిచి పర్వీనావాళ్ల ఇంటికి వెళ్లాడు భవానీశంకర్.

" వాళ్లు చెప్పలేదుగానీ, ఈరోజో రేపో ఆ పిల్లకు నిఖా జరగబోతున్నట్టు నాకు అనుమానం వచ్చింది" వెళ్లగానే చెప్పింది పర్వీనా.

" ఆ.. ఆ..." భయంగా చూశాడు భవానీశంకర్.

" మా ఆయన ద్వారా వాళ్లకీ నాకూ మంచి పరిచయం ఉంది కదా! ఆ పరిచయం నుండే గౌసియాను నావెంట బయటకు పంపించారు. గౌసియాను తీసుకొని బయటకు వెళ్లాక, ఆ పిల్ల నీకోసం రావడం.. నేను మా బంధువుల ఇంటికి వెళ్లడం.. ఆ సాయంకాలానికి తిరిగి ఇద్దరం కలిసి బయలుదేరి రావడం.. అంతా ఎలాంటి అనుమానం రాకుండా జరిగిపోయింది.

" కాని ఇప్పుడెందుకో వాళ్ళెవ్వరూ నాతో సరిగ్గా మాట్లాడలేదు. ఆ పిల్లలు మంచి వాళ్లే. అయితే మాట్లడవద్దని తల్లిదండ్రులు  చెప్పిఉంటారు. అందుకే నేను వెళ్తే కనీసం బయటకి కూడా రాలేదు గౌసియా.

" అయినప్పటికీ గౌసియా గురించి అడిగాను. అడగడం ఏదో పెద్ద తప్పయినట్టు " మా పిల్ల గురించి ఇంక అడగద్దు. దాన్ని ఇంకెక్కడికీ తీసుకువెళ్లవద్దు" అని ముఖం పైనే చెప్పేసింది వాళ్ల అమ్మ అయినా కూడా " ఎందుకు?" అని అడిగాను. హమ్మో! ఇందుకు ఆ ఖతీజాబీ ఏముందో తెల్సా?

" మా పిల్లకు శని చీడ ఉందంట. కాబట్టి ఎవ్వరితో మాట్లాడించవద్దు. బయటకు పంపించొద్దు.. అని మున్సీపు చెప్పిండు అని నమ్మకంగా చెప్తోంది. నాకు అన్నీ తెల్సు కాబట్టి నేను ఇంకేం మాట్లాడకుండా వచ్చేశాను" చెప్పుకుపోయింది పర్వీనా.

" అయ్యో ఆపా.. ఇప్పుడెలా?" ముచ్చెమటలు పట్టేశాయి భవానీశంకర్ కి.

" మీరు అలా వెళ్లి ఉంటే నేను చిక్కుల్లో పడిపోయేదాన్ని. అయినా ' మధ్యలోనే నాకళ్ళుగప్పి వెళ్ళిపోయిందనో, ఇంటికి వెళ్తున్నానని చెప్పి మధ్యలోనే తిరిగివచ్చిందనో చెప్పుకునేదాన్ని. అయినా ఈ జుమ్మారోజు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా పంపించి వేయాలి అనుకున్నాను. ఎలా అంటే... ఆ పిల్లకోసం నేను వెళ్లడంకాకుండా, ఆ పిల్లనే మా ఇంటికి రప్పించి పంపించాలి అనుకున్నాను. ఇలాంటపుడు ' అపిల్లను నేను తీసుకువెళ్లాను' అన్న బాధ్యత ఉండదు. ఆపిల్లే మా ఇంటికి వస్తానని చెప్పిపోయి వెళ్లిపోయినట్టుగా ఉంటుంది!ప్చ్ .. కానీ ఏం చేస్తాం? ఆలోచన ఆచరణలోకి రాకమునుపే పరిస్థితులు ఇలా తయారయ్యాయి నిట్టూర్చింది పర్వీనా.

" దేవుడా " తల పట్టుకున్నాడు భవానీశంకర్.

" ఒక పని చేస్తావా?" అంది పర్వీనా.

ఏంటన్నట్లుగా ఆత్రంగా తల ఎత్తిచూసాడు అతడు.

" పోలీస్ స్టేషన్ కి వెళ్లి గౌసియా పెళ్లి గురించి ఫిర్యాదు చేయి. నీ పేరు బయట పెట్టవద్దని పోలీసువాళ్లకు ముందే చెప్పు, వాళ్లు ఇక సాయిబు ఇంటిమీద ఓ కన్నేసి ఉంచుతారు. అప్పుడు గౌసియా క్షేమంగా ఉండగలుగుతుంది" సూచించింది పర్వీనా.

" పోలీసు వాళ్ల దగ్గరికి వెళ్లాలంటే నాకు భయం ఆపా" భయపడ్డాడు అతడు.

" ధైర్యం తెచ్చుకోవాలి" అంది పర్వీనా.

" మీరే ఫిర్యాదు చేయండి" అన్నాడు.

"హమ్మో!" గుండెలపై చేయివేసుకుని, నీకు వేరే ఎలాంటి సహాయం చేయమన్నా చేస్తాను కాని, ఇట్లాంటి సహాయం మాత్రం  చేయలేను. అయినా నీకు తెలియంది ఏముంది? మీ ప్రేమ గురించి నాకూ, సిరాజ్ కి మాత్రమే తెలుసు. ఆయనకు తెలియకుండా మేము ఇద్దరం నీకు సహాయం చేస్తున్నాం. ఇట్లాంటపుడు నేను గాని, సిరాజ్ గాని, సిరాజ్ గాని పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఇంకేమైనా ఉందా..?

" ఒకవేళ ధైర్యంచేసి సిరాజ్ వెళ్లినా, అది ఒకవేళ బయటపడ్తే వాడి పరిస్థితి ఏంకావాలి? చదువుకోరా అని అక్క ఇంట్లో పెడ్తే నువ్వు ఇట్లాంటి రాచకార్యాలు నిర్వహిస్తున్నావా అని వాడ్ని మా అమ్మావాళ్లు తన్ని ఊరికి తీసుకెళ్లిపోతారు. ఇక నాకు ఆయన నుండి తలాఖ్ తప్పదు. అందుకే నేను నీకు ధైర్యాన్ని మాత్రం అందిస్తున్నాను. వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయి అంతకన్నా గత్యంతరంలేదు" చెప్పింది పర్వీనా.

కాసేపు మౌనంగా ఉండిపోయి, ఆ తర్వాత నెమ్మదిగా పెదవులు విప్పాడు.

" ఆపా! పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటే మీదొక భయం. నాదొక భయం! గౌసియా గురించి నేను ఫిర్యాదుచేస్తాను అన్న విషయం ఒకవేళ బయటపడ్తే హిందూ, ముస్లీం గొడవలు తప్పవు. అప్పుడు మా ఇద్దరికోసం మరెందరో చావాల్సి ఉంటుంది"

" ఇదీ నిజమే. ఇలాగని వెనుకడుగు వేస్తే నీవు గౌసియాను మర్చిపోవాల్సి ఉంటుంది" అంది పర్వీనా.

" నేను గౌసియాను మర్చిపోలేను. అస్సలు ఆమె లేకుండా బతకలేను" అంటుంటేనే భవానీశంకర్ గొంతు గద్గదమయ్యింది.

" నేను మీ హిందువుల్లో ఉంటే ధైర్యంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లేదాన్ని. కాని మా మిల్లత్ ( ముస్లీం సమాజం) లో స్త్రీలు అట్లాంటి ప్రదేశాలకి వెళ్లడం అంటే, అది అనంగీకార విషయం!

" మా సమాజం స్త్రీలను మసీదుకే వెళ్లనివ్వదు. అట్లాంటిది పోలీస్ స్టేషన్ కి వెళ్లడమా? అందునా సంబంధంలేని విషయంలో జోక్యం చేసుకోవడం. పైగా తోటి ముసల్ మాన్ విషయంలో"!?

" ఇంతకంటే చెప్పలేను. నన్ను అర్ధం చేసుకో శంకర్!" అంది పర్వీనా.

భవానీశంకర్ కు తను ఒంటరివాడైపోయిన భావన కలిగింది.

భారంగా పర్వీనా వైపు చూస్తూ, " నీవు చెప్పినట్టుగానే చేస్తాను ఆపా" అంటూనే లేచి నిల్చున్నాడు.

" నీలో భయంగాని, బాధగానీ ఉండకూడదు" తను కూడా లేచి నిల్చుంది పర్వీనా.

" సరే ఆపా" అంటూ బయటకి నడిచాడు అతడు.

ఆమె లోపలికి వెళ్లిపోయింది.

....... ఇంకా వుంది .........