Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 16వ భాగం

ఎప్పుడెప్పుడు ప్రకృతి కరుణిస్తుందా అని ఎదురు చూస్తున్న మాధవుడు, పురుషోత్తమ దేవుడు కోటలోనుంచి బయటికి వచ్చారు.

  అంతా భీభత్సం..

  తుఫాను వచ్చే ముందు, కోటలో ఉండిపోయిన మాధవునికి, తన ఇంటికి వెళ్లే అవకాశమే లేకపోయింది.

  ఆందోళనగా  ఇంటి దారి పట్టబోయాడు. రాకుమారుడు అచ్చటే నిలబడి చూస్తున్నాడు.

  

                   

 

   ఎక్కడుంది దారి? బాటంతా నేలకొరిగిన చెట్లతో, కొమ్మలతో నిండి పోయింది.

   భయానకంగా ఉంది.. అడుగు వేసేట్లు లేదు.

   వెనుతిరిగి, పశువుల శాలల్లో ఉండిపోయిన పనివారిని, సైనికులను కత్తులతో, గొడ్డళ్లతో, గడ్డపారల్తో రమ్మని పిల్చుకొచ్చారిద్దరూ.

  కోటలో చెట్లన్నీ బాటలకి చాలా దూరంలో ఉన్నాయి. అలాగే.. గజ శాలలు, అశ్వ శాలలు, పాడి పశువుల కొట్టాలు.. అన్నీ దిట్టంగా గట్టిగా కట్టినవే. చెక్కు చెదరలేదు. లోపల ఉన్న సేవకుల ఇళ్లు కూడా బాగానే ఉన్నాయి. కొన్ని ఇళ్లల్లోకి నీళ్లు వచ్చేసినా కూడా.

  అందరూ చకచకా బాట మీదున్న చెట్లని తొలగించారు. రాకుమారుడు దగ్గరుండి పనులు చేయిస్తున్నాడు. వాన తగ్గగానే, ప్రజలంతా బయటికి వచ్చేసి, బాటలనీ, ఇంటి కప్పులనీ బాగు చేసుకునే పనిలో పడ్డారు.

  దారులన్నీ నీటి మయం. ఆ నీటిలోనే తేలుతూ పోతున్నాయి, రకరకాల పాములు, తేళ్లు, ఇతర క్రిమి కీటకాలు.

  మాధవుని ఇంటివరకూ నడిచే త్రోవ తయారయింది. పరుగు పరుగున మాధవుడు ఇంటికి చేరాడు.

  కొంతకో కొంత నయం.. ‘కళింగం’ వసతి గృహం తుఫాను ధాటికి తట్టుకుని నిలబడింది. సంభారాలన్నీ గట్టిగా కట్టిన కొట్ల గదుల్లో దాస్తారు కనుక అవి కూడా బానే ఉన్నాయి.

  మాధవుని చూడగానే నందుడు, గౌతమీ విప్పారిన మొహాల్తో ఎదురొచ్చారు.

సీతమ్మ.. ఎక్కడుందో, ఆరబెట్టుకుంటున్న జుట్టు ముడి వేసుకుంటూ పరుగున వచ్చింది.

  “అమ్మయ్య. ఎక్కడ చిక్కుపడి పోయావా నని హడిలి పోయాము కన్నయ్యా! ఇప్పుడే నందుడిని కోటకి వెళ్లమని అడుగుదామనుకుంటున్నాను.” సీతమ్మ మాట నోటిలోనే ఉంది.. వీధిలో కలకలం వినిపించింది.

  అందరూ ప్రహరీ దాటి బైటికెళ్లారు. దాదాపు యాభై మంది ఉంటారు.  పెద్దలు, పిన్నలు, పసి వారు.. అందరికీ కళ్లల్లో ఉన్నాయి ప్రాణాలు. చింపిరి జుట్లు. తడీ పొడి వస్త్రాలు.. చిన్న పిల్లలు కొందరు నోట్లో వేళ్లు పెట్టుకుని చీకుతున్నారు.

  కొందరు చేతుల్లో మట్టి చిప్పలు పట్టుకుని నిలుచున్నారు.

  “సామీ! మీరే రచ్చించాలి. తిండి తిని మూడు రోజులయింది. చూరులోంచి పడిన వాన నీళ్లు తప్ప లోనికేం పోలేదు. ఇంత ముద్దెట్టి బతికించండయ్యా!” నందుడి, మాధవుడి కాళ్ల మీద పడిపోయారు అందరూ.

  పూటకూళ్ల ఇంట్లో తిండి దొరుకుతుందని తెలుసు. వారున్న పల్లె రెండు కోసులుంటుంది.  అడ్డదిడ్డంగా పడిన చెట్లనీ, అడ్డంకులనీ తొలగించుకుని ఏ విధంగా రాగలిగారో.. ఆశ్చర్యమే.

  ఆకలి.. ఆహారం దొరుకుతుందనే ఆరాటం ఎక్కడలేని శక్తినీ ఇస్తుంది.

  నందుడి ఇంటి వారందరికీ కడుపు ద్రవించుకు పోయింది.

  ఇంటిలోని వస్తువులు ఎన్ని నాళ్లు వస్తాయో.. ఆ జగన్నాధునికే ఎరుక. ముందు ఎదురుగా ఉన్న అన్నార్తుల ఆకలి తీర్చడం మానవ ధర్మం.

  అందరినీ, లోనికి రమ్మని పిలిచారు.

  ముందున్న సావడిలో కూర్చోపెట్టి,  దాహం తీరడానికి వారు తెచ్చుకున్న చిప్పల్లో కాసిని నీళ్లు పోశారు.

  వసతి గృహం కనుక అన్ని రకాల ఆటుపోట్లకీ తట్టుకునేట్లుగా నిర్మించాడు నందుడు. సంభారాలన్నీ ఎప్పటికప్పుడు సర్దుతూ, పురుగు పుట్ర లేకుండా చూసుకుంటూ ఉంటారు.

  వంట చెరకు కూడా జల్లు కురవకుండా కట్టిన సావళ్లలో పేర్చి ఉంచుతారు.

  బైటంతా ఆకాశం.. ఒక్క మేఘం కూడా లేకుండా తేటగా స్వచ్ఛంగా ఉంది. వెనుక వైపు పెరడంతా బాగుచేశారు, ఇంట్లోనే ఉండే పనివారు.

  మూడు రాళ్ల పొయ్యిలు మూడు వెలిగించాడు నందుడు. రెండు గుండిగల్లో ఎసరు పెట్టాడు మాధవుడు. వీశ చింతకాయలు కడిగి, మరుగు నీళ్లలో నానబెట్టింది సీతమ్మ. కిందికొరిగిన కరివేపాకు చెట్టునుంచి ఆకులన్నీ దూసి కడిగి ఆరబెట్టింది గౌతమి.

  వీధి వసారాలో ఉన్న జనాలని కదిలించ దల్చుకోలేదు ఎవరూ. వాళ్లందరూ శోషొచ్చినట్టు పడిపోయున్నారు.

  సరిగ్గా రెండు ఘడియల్లో వేడివేడి అన్నం వార్చి, గంజిని దాచింది సీతమ్మ. చింతకాయ చారు కాచింది గౌతమి గుండిగ నిండా. కరివేపాకు, చింతకాయ పిప్పి, ఉప్పు, బెల్లం, మిరపకాయలు రోట్లో నూరాడు మాధవుడు. అందులో ఘుమఘుమలాడే పోపు వేయించాడు నందుడు.

  నలుగురూ తలా చెయ్యీ వేసి, వంటచేసేశారు. పాలేళ్లిద్దరూ, వసారా తుడిచి, రాలి పడిన అరిటాకుల్లోంచి మంచివేరి పరిచారు.

  కమ్మని పోపు వాసనకి, నోరూరిపోతూ లేచి సందు చివరినుంచి తొంగి చూస్తున్నారు అభ్యాగతులు.

  బావి దగ్గరికి వెళ్లి, చేతులు కాళ్లు, నోరు శుభ్రంగా కడుగుకొమ్మని చెప్పారు పాలేళ్లు. ఒకరి తరువాత ఒకరు, శక్తి తెచ్చుకుని ఒడలు శుభ్ర పరచుకుని తమ స్థానాల్లో కూర్చున్నారు.

  మాధవుడు, నందుడు వడ్డన మొదలు పెట్టారు. మట్టి పిడతల్లో గౌతమి మంచి నీరు పోసింది.

  వడ్డించే వాళ్లు వడ్డిస్తూనేన్నారు.. అలా తింటూనే ఉన్నారు తినే వాళ్లు. చివరికి వేళ్లకి అంటుకున్న మెతుకులని నాక్కుంటూ లేచారు ఒక్కొక్కరూ.

  గౌతమికి కన్నీరాగలేదు వారిని చూస్తుంటే. ఇప్పుడు సరే.. మహా ఐతే మరో నాలుగైదు రోజులు తాము పెట్టగలరు. ఆ తరువాత?

  తుఫాను దాడి నుంచి కోలుకోవడానికి ఎన్ని రోజులు, మాసాలు పడుతుంది? మళ్లీ పైరు లేవాలి, పుయ్యాలి, కాయాలి. ఎప్పటికి..

  రాజుగారే తలుచుకోవాలి..

                                      ………………

 

  రాజుగారు తలుచుకున్నారు..

  తుఫాను తగ్గిన రోజే.. కటకం ప్రజంతా కోట ముందుకి వచ్చేశారు.. ధనవంతులు, వ్యాపారస్థులు తప్ప..

  కాపలా దారులంతా కోటలోకి వెళ్లి రాజుగారి చెవిని వేశారు. కపిలేంద్రదేవుడు, పురుషోత్తమునికి అప్పగించాడు కార్యాన్ని.

  రాకుమారుడు గజం మీద కోట బైటికి వచ్చి, అందరికీ అభయ మిచ్చాడు.

  

                సీ.     పెనుతుఫానున చిక్కి వీటిపట్టు ప్రజలు

                              భయముతో నటునిటూ పరుగు లిడగ

                        చెట్లుచేమలు నేల చేరి యొరిగి యుండ

                              బాటలన్నియు మూత పడెను గాద

                        నిలువ నీడ కనక నీరు కారు కొనుచు

                              దిక్కు తోచక నెంతొ దీను లైరి

                         అచట నిలిచె నతడచ్యుతుడే యన

                              సకల జనులకును శరణు నొసగ

 

                ఆ.వె.   నృపుని యనుమతి గొని నీరసించిన ప్రజన్

                          ఆర్తి నంత బాపి యాదు కొనగ

                          వంట శాలలందు పంచలందునకూడ

                          ఆశ్రయంబొసగెను యాజ మిచ్చె.

 

  అంతే కాదు, బెహారీలందరినీ సమావేశ పరచాడు. కోటలోని ధనాగారంలోనుంచి వెచ్చాలకి ధనం యిస్తానని వాగ్దానం చేశాడు.

  అందరికీ దినవెచ్చాలిప్పించడమే కాదు.. వారి ఇళ్లు బాగు అయే వరకూ కోటలోనే ఉండమన్నాడు.

  కోటలో ఒక పట్టణం పట్టేంత జాగా ఉంది.

  యుద్ధ ప్రాతిపదికలో ఇళ్లన్నీ బాగుచేయించాడు పురుషోత్తముడు. అతనికి తోడు మాధవుడు.

  మూడు నెలలలో నాము పంట వచ్చేసింది నవనవలాడుతూ.

  రెట్టింపు ఉత్సాహంతో పనుల్లో పడ్డారు ప్రజలంతా! తుఫాను వలన నష్టం ఎంతయినా.. వందల్లో మనుషులు, వేలల్లో పశువులు పోయినా.. కోలుకోవడమనేది చాలా ముఖ్యమైనది, బ్రతికున్న వారికి. పోయిన వారినెవరూ తీసుకు రాలేరు కదా!

  ఆ సమయంలో రాకుమారుడు, మాధవుడు చేసిన సహాయాలు ఎనలేనివి.

  అదిగో.. అప్పటి నుంచీ, పురుషోత్తముడు, జగన్నాధుని అవతారమని ఇంకా.. ఇంకా ప్రచారమయిపోయింది.

                                         ………………

 

  ఆరుమాసాలయింది..

  సంధ్యా సమయంలో మహానదీ తీరాన విహరిస్తూ, తాము ఎప్పుడూ కూర్చునే చెట్టు ఊడల్లో కూర్చుని, పురుషోత్తమ దేవ, మాధవులు హర్షుని నైషధానికీ, శ్రీనాధుని శృంగార నైషధానికీ గల సామ్యాలని చర్చిస్తున్నారు.

  “గాఢ పాకంబైన హర్ష నైషధ కావ్యాన్ని ఆంధ్ర భాషలో కల్పించానని శ్రీనాధుడు గర్వంగా చెప్పుకుంటాడు. శృంగార నైషధం శ్రీనాధుల వారి కావ్యాలలో కెల్లా గొప్పదని నా ఉద్దేశ్యము  మిత్రమా!” మాధవుడు అన్నాడు.. నైషధంలో నుండి తెచ్చిన కొన్ని తాళ పత్రాలను తీసి చూస్తూ.

  “నిజమే. కానీ, కొన్ని ఆయువు పట్టు శ్లోకాలను చివర్లో డు,ము,వు,లు కలిపి, యథాతథంగా తెలుగులోకి దించారని సంస్కృత పండితులన్నారుట. పైగా నీ డుమువులు నువ్వు తీసుకుని మా నైషధాన్ని మాకిచ్చేయ మన్నారని కూడా అంటారు.” పురుషోత్తముడు చెప్పాడు.

  “సంస్కృత పదాలను అధికంగా వాడిన మాట నిజమే. అయితే.. ‘నీకంటికి పేలగింజయుం పెద్దయ్యెనే’, ‘చేదు తిన్న విధము’, ‘ఐదు పది చేయు’ వంటి తెలుగు పలుకు బడులు కూడా బాగా చూపించారు శ్రీనాధుల వారు” మాధవుడు చెప్తుంటే తల ఊపాడు పురుషోత్తముడు.. అవునన్నట్లుగా.

  “కవిత్రయం తరువాత అంతటి పేరునూ శ్రీనాధునికే అంద జేశారు సాహితీ ప్రియులు. వారి చాటువులు ముఖ్యంగా..” రాకుమారుడు ఆపేశాడు సగంలోనే.. గుర్రం వస్తున్న చప్పుడు విని.

  “మిత్రమా! శ్రీనాధ కవిని చూడాలని ఉంది నాకు. ఇది వరకు ఒకసారి అడుగుతే వారు ఎచ్చట ఉన్నారో తెలియదన్నారు మీరు. ఈ రాచ కార్యాల నుండి కొద్ది విరామం తీసుకుని దేశాటనం చేసి రావాలని ఉంది.” మాధవుడు తల పక్కకి తిప్పి వస్తున్నదెవరా అని చూస్తూ అన్నాడు.

  కోటలోనుండి వార్తా హరుడు..

  “ప్రభూ! మహారాజుగారు తమరిని వీలయినంత త్వరగా కలవాలని మీతో చెప్పమన్నారు. మాధవుల వారిని కూడా తీసుకుని రమ్మన్నారు.”

  వెంటనే మిత్రులిరువురూ తమతమ అశ్వాలని అధిరోహించి కోటలోనికి బయలుదేరారు.

  అశ్వశాలలో అశ్వాలని అప్పజెప్పి ప్రాసాదం లోనికి నడుస్తుండగా ఎదురు పడింది.. ఒక అందాల రాశి.

  మాధవుడు కళ్లార్పడం మరచి పోయాడు.

  ఉద్యానవనంలో.. పొదరిళ్ల మధ్య నుండి వడివడిగా నడిచి వస్తూ తడబడుతూ ఒక మెరుపు తీగ.. మాధవుడు కొద్ది సంవత్సరాల క్రితం మేనాలో చూసి, చెంగల్వ పువ్వందించిన బాలిక. నిండు యవ్వనంలో! నిగనిగని మోములో మాత్రం అదే పసి తనం. బెదురు చూపులు చూస్తూ పొద వెనక నక్క బోయి, మిత్రులిరువురినీ చూసి ఆగి పోయింది.

   వెనుకగా నలుగురు చెలియలు..

  “ఆ.. దొరికి పోయారుగా చెలీ..” అంటూ.

  అందరూ కదలకుండా నిలుచుండిపోయారు, ఆగంతకులను చూసి.

  భయం లేదన్నట్లుగా చిరునవ్వుతో అచటి నుండి కదిలాడు పురుషోత్తముడు.

  వెనుకనే మాధవుడు, వెను తిరిగి చూసుకుంటూ!

  

  “మా సోదరి కాదంబరీ దేవి మిత్రమా! అంటే మేము ఏక గర్భ సహోదరులం కాదు.. తండ్రిగారి మూడవ భార్య పుత్రిక. మా తల్లిగారు రెండవ భార్య. ఐతే.. మాతో చాలా ఆప్యాయంగా ఉంటుంది రాకుమారి. నాలుగు భాషల్లో నిష్ణాతురాలు.” రాకుమారుడు, మాధవుడికి చెప్పాడు.

  రాకుమారి? ఇంకేముంది.. ఆశ వదులు కోవలసిందే. పలుకరించడానికి కూడా లేదు. కొంచెం నిరాశగా, నిశ్సబ్దంగా పురుషోత్తముడి వెనక నడిచాడు మాధవుడు.

  కానీ మనసు మాత్రం ఆ జవ్వని తో వెళ్లిపోయింది.

  “తండ్రిగారు వరునికోసం వెతుకుతున్నారు. మా సోదరికి సాటి అయిన వీరుడు, విద్యావంతుడు దొరకడం కష్టమే. పొరుగు దేశాల రాకుమారులలో వారికి నచ్చిన వారు ఇప్పటి వరకూ దొరక లేదు. ఎక్కడున్నాడో గజపతుల అల్లుడు..” రాకుమారుడు కించిత్తు గర్వంగా అన్నాడు.

  నిజమే.. గజపతుల సామర్ధ్యం అప్పటికే నలుదిశలా వ్యాపించింది. చిన్న చిన్న రాజ్యాలన్నీ స్వచ్ఛందంగా సామ్రాజ్యం లో కలిసి పోయాయి.

  కనుల ముందొక్క సారి కాదంబరి నిలిచింది మాధవునికి..

 

                 తే.గీ.   చదువు లందున గీర్వాణి సత్యముగను

                            సిరుల యందున నెలతియే సిరియె కాద

                            పొందికనె తాను సీతయై పొసగు చూడ

                            కాంతి వలె మెరసె నిలను కలయు కాదు.

 

  కానీ, రాకుమారెక్కడ.. తానెక్కడ? పూటకూళ్ల ఇంటికి రాకుమారిని పంపుతారా కోడలిగా? పైగా తాము బ్రాహ్మణులు, వారు క్షత్రియులు.. నిట్టూర్చాడు మాధవుడు. ఐతే చంచల చిత్తం చెప్పిన మాట వినదే!

  ఆలోచనల మధ్య రాకుమారుని వెంట వెళ్తూ, మహారాజుగారి ప్రాసాదంలోకి వచ్చినట్లు చూసుకోలేదు మాధవుడు. పురుషోత్తమ దేవునికి కొద్దిగా వెనుక నిలుచుని, రాకుమారునితో పాటుగా అభివాదం చేశాడు.

  కపిలేంద్ర దేవుడు మహారాజయ్యాక, అంత దగ్గరగా చూడటం అదే ప్రధమం.

  చిన్నతనంలో.. కోటలోనికి, సైనికులతో వెళ్తుండగా, ‘వీరేనా మహారాజుగారు.’ అని నందుడిని అడగడం గుర్తుకొచ్చింది.

  కొద్దిగా వయసు ప్రభావం కనిపిస్తున్నా.. అదే పొంకం మహరాజులో..

  “ఇతడే కదా నీ అనుంగు మిత్రుడు మాధవుడు, పురుషోత్తమా?”

  “అవును తండ్రిగారూ..”

  “మీరిరువురూ కాంచీ పురం వెళ్లి రావాలి. అక్కడి ప్రభువును కలిసి, సంధి సందేశాన్నివ్వాలి.” మహారాజు, ఆదేశ మిచ్చారు.

  “మరి జగన్నాధుని ఉత్సవాలు?” సన్నగా అన్నాడు మాధవుడు.

  ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే పూరీ జగన్నాధుని రథ యాత్రకి రాజ వంశస్థులు ఉండి తీరాలి. పురుషోత్తముడు యువకుడయ్యాక అతడి చేత కూడా జగన్నాధునికి సేవ చేయిస్తున్నాడు రాజు.

  ప్రజలు కూడా వేల సంఖ్యలో వచ్చి, జగన్నాధుని అంశ అయిన రాకుమారుని చూడ డానికి వస్తారు.

  “ఉత్సవాలు ఇంకా రెండు మాసాల తరువాత. అప్పటికి వచ్చెయ్యవచ్చు.. వెంటనే బయలు దేరండి.” రాజుగారు లేచి లోనికి వెళ్లి పోయారు.


                                       ………………....

  

......మంథా భానుమతి