Facebook Twitter
“అజ్ఞాతకులశీలస్య..” పార్ట్ - 1



             “అజ్ఞాతకులశీలస్య..”  పార్ట్ - 1

                                                         

                                              ఉపోద్ఘాతం
                                                         
                    సీ.   జనమమెత్తినదాది జగతిలో మనుజుండు
                                    జాతి పోరులనెన్నొ జరుప గాను;
                           జంతు జాలములనే చాల చంపెను నాడు
                                   మార్గమదియె గాన మనువు కొఱకు;
                           ఆహారమున కైన యాహార్యమున కైన
                                   యన్వేషణముచేసె నంత తాను,
                           ఆశ తీరనె లేదు యన్నియమరిననూ
                                    వెదకులాటను నింక వేగ పఱచె.

                      ఆ.వె. ఆడువారి కొరకొ నాట గెలుచుటకో
                               దేవుని కొరకో నదె ధనమునకొ
                               రాజ్యవిస్తరణకొ రాజ్య మేలుటకునో
                               పురజనుల తరుముతు పోరు సలుపు.

  
   అనాదిగా మానవుని అనేక విధములైన కోరికలు, ఇంకా ఇంకా ఏదో కావాలనే ఆశ, జాతి మనుగడకే ప్రమాదం కల్పిస్తున్నాయి. ఆ కోరికలనే నియంత్రించుకోగలుగుతే మానవుడే మహనీయుడు కాలేడా?
   సాటి మనుషులనూ, తోటి జీవులనూ, పొరుగు దేశాలనూ, పర మతాలనూ ఆదరించ గలుగుతే.. భూతలమే స్వర్గం కాదా!
   అటువంటి ఆలోచనే అత్యాశా?

   పదిహేనవ శతాబ్దంలో, భారత దేశ చరిత్ర అనేక మార్పులకు లోనయింది. పరదేశ పాలనని నిరోధించే, ప్రతిఘటించే.. అనేక మంది రాజులు, దేశమాత గౌరవాన్నీ, ఉనికినీ కాపాడాలని శతవిధాల పాటుపడ్డారు.
   ఆ శతాబ్దిలో.. రెండవ దశాబ్దంలో వంగ దేశంలో జన్మించి, మూడవ దశాబ్దంనుండీ, పది సంవత్సరాల పసి వయసులో.. కళింగ దేశానికి వలస వెళ్లి, ఒంటరి జీవన పోరాటాన్ని సాగించిన అజ్ఞాత కులశీలుని కథ ఇది.
   పసితనం నుంచే అనేక విపత్కర పరిస్థితులను అధిగమించిన ఆ చిన్నారి, తనకు ఎదురైన అవరోధాలను, ఏ విధంగా ఎదుర్కొంటాడు? అతని పయనం సాగే వైనమేది?
                                    ………………..


         
                                           తొలి ప్రస్థానం

 


  
                   

ఆ అరణ్యంలో గుర్రం గిట్టల శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు! గుర్రం మీద ప్రయాణిస్తున్న ఇద్దరి గుండెలూ ఆ గిట్టల శబ్దంతో సమంగా కొట్టుకుంటున్నాయి.
   వెనుక నుంచి ఎవరో తరుముకొస్తున్నట్లు పరుగెడుతోంది గుర్రం.
   “అమ్మా! ఒక ప్రశ్న అడగనా? కాదు కాదు.. రెండు ప్రశ్నలు.”
   మాధవుడి పిలుపు విని, కళ్ళెం గట్టిగా పట్టుకుని కొద్దిగా తల వెనక్కి తిప్పింది దుర్గాదేవి. వాళ్ళనెక్కించుకున్న గుర్రం మాత్రం తనపని తాను చేసుకుపోతోంది, కొంచెం కూడా వేగం తగ్గించకుండా.
   మాధవుడికి పది సంవత్సరాలు. గుర్రపుస్వారీ, కత్తి యుద్ధం, విలువిద్య ఆరు వత్సరాలనుండీ నేర్చుకుంటున్నాడు. వంశపారంపర్యంగా వచ్చిన తెలివి, మెలకువలు అతన్ని ఆ విద్యల్లో రాణించేలాగ చేశాయి.
   “ఒకటి, మనం ఎక్కడికెళ్తున్నాం? రెండు, హిందూ మతమైతేనేం ఇస్లామ్ మతమైతేనేం?”
   చుట్టూ పరికించింది దుర్గాదేవి. నింగి కనిపించకుండా ఎగసిన చెట్లు, వాటినల్లుకున్న లతలు, కనుచూపు మేరలో ఏ ప్రాణీ ఆనటం లేదు. మనుషుల అలికిడికి ఎక్కడెక్కడో పొదల్లో దాక్కోడం వాటికలవాటే. సన్నని బాట మెలికలు తిరుగుతూ సాగిపోతోంది.
   లయ బద్దంగా హయం పరుగిడుతుంటే, రౌతు *నింజిలి కాసింత నెమ్మదించ సాగింది.
   అలసటను ఆవేదనను మరపించి మనసును ఊరడింప జేసింది. దుర్గాదేవి వీపు సాగదీసి, అటూ ఇటూ కదలి.. గుండె నిండుగా గాలి పీల్చి వదిలింది. మాధవుడు కూడా సర్దుకుని కూర్చున్నాడు.

 
                కం. చల్లని గాలులు వనమున
                                  మెల్లగ వీచగ పుడమిని మిగుల ముదంబున్
                      కొల్లగ యలసిన మేనికి
                      యల్లన కలుగును నవరతి హాయిగ తాకన్.
           
     వంగ, ఉత్కళ దేశాల మధ్య నున్న అడవి అది. ఎడమ పక్కన కొన్ని యోజనాల దూరంలో సముద్రం, కుడి వైపున కొండలు, మైదానాలూ ఉన్నాయని తెలుసు దుర్గాదేవికి.. ఉత్కళ సరిహద్దు దాటి కళింగ దేశం చేరుకుంటే అక్కడ ఏదో విధంగా, కత్తిసాము నేర్పి ఐనా జీవనం కొనసాగించవచ్చు.
   “మనం వెళ్తున్నది కళింగదేశం. రెండవ ప్రశ్నకి జవాబు పెద్దయ్యాక నీకే తెలుస్తుంది”
   “ఇంక ఆ దేశంలోనే ఉండిపోతాము కదూ!  స్నేహితులని, బంధువులనీ ఎన్నటికీ కలవము కదా!”
   దుర్గాదేవి వామహస్తం వెనుకకి తిప్పి, తన వీపుకి కట్టుకున్న కుమారుడిని మరింత హత్తుకుంది, కన్నులలో నీరు చిప్పిల్లుతుండగా.
   మాధవుడు రెండు చేతులతో మరింత బిగించి పట్టుకున్నాడు అమ్మని.
   “ఎక్కడైనా ఆగుదామా? ఆకలిగా ఉందమ్మా!”
   కన్నతల్లి కడుపు మెలితిప్పినట్లయింది. మాధవుడి వీపుకి కట్టిన మూటలో తిండిపదార్ధాలు ఉన్నాయి. అనువైన ప్రదేశం చూసుకుని ఆకలి తీర్చుకోవచ్చు. దూరాన పొగ కనిపిస్తోంది. ఏదైనా గ్రామం ఉందేమో!
   కళ్ళాన్ని కొద్దిగా బిగించింది.. గుర్రం వేగాన్నిపెంచింది.
   తమ పట్టణం నుండి బయలుదేరి పన్నెండు ఘడియల పైనే అయుంటుంది. గుర్రానికి కూడ విశ్రాంతి అవసరమే! యజమానురాలి నిస్సహాయతని అర్ధం చేసుకుని పరుగు పెడుతోంది అంతే.
   దుర్గాదేవి ఆలోచనల్లో ఉండగానే, గుర్రం వేగం తగ్గించి చదునుగా ఉన్న చోట ఆగింది. అక్కడినుంచి వచ్చిన పొగనే దుర్గాదేవి గమనించింది. ఆరీ ఆరని నెగడులోనుంచి వస్తున్న పొగ అది. రెండుమూడు ఘడియలకి మునుపే ఎవరో అక్కడి నుంచి వెడలినట్లున్నారు. ఆ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. వంట చేసుకున్న గుర్తులు.. మంచినీటి కుండలు, మట్టి పిడతలు, మిగిలి పోయిన కట్టెలు.
   మాధవుడి కట్టును విప్పి, తను కిందికి దూకి, చేయి అందించింది.
   ఇద్దరూ, గాఢంగా ఊపిరి పీల్చి, నడుం సాగదీసు కున్నారు. కాళ్ళూ చేతులూ కూడా ఝాడించి, శరీరాన్ని స్వాధీన పరచుకుంది దుర్గాదేవి. గుర్రాన్ని చెట్టుకి కట్టేసి, దాని వీపు కాళ్ళు నిమరసాగింది.
   మాధవుడు ఒక వస్త్రంలో గుగ్గిళ్ళు తీసుకుని గుర్రానికి తినిపిస్తున్నాడు..
   “హయరాజా.. మనం మూడు నాలుగురోజుల్లో కటకం చేరుకోవాలి. తెలుసు కదా?” దుర్గాదేవి గుర్రంతో మాట్లాడసాగింది.
   గుగ్గిళ్ళు భక్షిస్తూనే నిలువుగా తలూపింది గుర్రం.
   మాధవుడు మరింత ఆనందంగా దాని మెడ సవరిస్తూ నిలుచున్నాడు. దుర్గాదేవి గుర్రాన్ని నిమురుతూనే.. కటకం వెళ్ళాక తమకు కావలసిన ధైర్య సాహసముల గురించి చెప్పసాగింది.

         తే.గీ. కన్నుల నెపుడు స్థిరతయు కాన వలెను
                 కలత కలిగిన నాడు వికలము వలదు
                 బలిమి కల రాచ బిడ్డవు బాగ  ఎరుగు
                 కాళి మాత నీ వెనువెంట కలదు నిజము.

    అశ్వానికి చెప్తున్నా అదంతా మాధవుడు వినాలనే.  కుండలో నీళ్ళు తీసుకుని చేతులు కడుగుకుని.. సంచీలోనుండి భక్ష్యాలు, పులిహోర తీసింది.
    మాధవుడు కూడా, చేతులు కడుక్కునొచ్చి, కొంచెం దూరంలో ఉన్న బాదం చెట్టు కిందికెళ్ళి ఆకులు, పుల్లలు ఏరుకొచ్చాడు. చకచకా నాలుగేసి ఆకులు కలిపి విస్తర్లు కుట్టి, శుభ్రంగా కడిగి తీసుకొచ్చాడు.
   ఒక్కొక్క భక్ష్యం, రెండు కుడకలు పులిహోర మాత్రం వేసింది వాటిల్లో దుర్గాదేవి.
   మాధవుడు తింటూనే తనకి వచ్చిన సందేహాలు అడిగి తీర్చుకున్నాడు. ఆకలి, సంశయాలు.. రెండూ తీరాక, లేచి ఆకు పారేసి.. అంతా సర్దేసి, గుర్రాన్ని మాలిష్ చెయ్యసాగాడు.. దానితో సంభాషిస్తూ.
   కళ్లలో నీళ్లు బైటికి కనిపించకుండా తను కూడా లేచి, చల్లని నీళ్లతో మొహం తొల్చుకుని వచ్చింది దుర్గాదేవి. మాధవుడు మామూలుగా మూడు రెట్లు తినగలడు.. అర్ధాకలితో లేపెయ్యవలసి వచ్చింది. తన వంటి స్థితి ప్రపంచంలో ఏ తల్లికీ రాకూడదు.
   ఆహార పదార్ధాలు జాగ్రత్తగా వాడుకోవాలి.. ఎప్పటికి అనుకున్న చోటికి చేరగలుగుతారో! అప్పటి వరకూ ప్రాణాలు నిలుపుకోవాల్సి ఉంది.
   “ఇంకొక మాట మాధవా!” మాధవుడు తల్లి చేయి పట్టుకున్నాడు. ఆవిడ గొంతులో ఆవేదన అర్ధం చేసుకున్నట్లుగా.
   “మన పెద్దలొక మాట చెప్తారు.. ‘అజ్ఞాతకులశీలస్య వాసో దేయో న కస్యచిత్.’ ఊరూ, పేరు, కులము, శీలము తెలియని వారికి తమ గృహములందు స్థానమియ్యకూడదని, ఇచ్చినచో ప్రమాదమనీ!
    భవిష్యత్తులో నీకు సంకట స్థితి ఏర్పడ వచ్చు. నిజం చెప్తే చారులకు దొరికిపోతాము. అంచేత *అనృతం ఆడక తప్పదు. నీకు ఎవరి ఆశ్రయం దొరుకుతే వారి కులమేనని చెప్పాలి. వారికి అనుగుణంగా మసలుకోవాలి సుమా!”
   “జై కాళీ..” అంటూ గుర్రాన్ని చెట్టునుంచి విడిపించింది.  ఆ కాళీ మాత దయ ఏ విధంగా ఉందో అనుకుంటూ.
   నిజంగా ఆ మాత తమ దీనావస్థని చూస్తోందా? దుర్గాదేవి తల విదిలించి మనసును సర్ది పుచ్చుకుంది. ఇప్పుడు ఏదైనా చింతించడానికి సమయం లేదు.. సాగి పోవలసిందే!
   మాధవుడు రికాబు మీద కాలేసి, ఒక్క గెంతుతో జీను మీద కూర్చున్నాడు. దుర్గాదేవి ఒక కాలు ఎత్తబోయింది. సరిగ్గా ఆ సమయంలో ఒక బాణం రివ్వున వచ్చి ఆమె గుండెలో దిగింది.
   ఆమె నోటినుండి కేక బైటికి వచ్చేలోగా గుర్రాల గిట్టల చప్పుడు వినిపించింది.
   “మాధవా! నువ్వు వెళ్ళిపో! నీకు చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకో. నా కోసం ఆగద్దు. గణేశుల రాజ వంశంలో హిందూత్వ చిహ్నంలా నువ్వైనా నిలిచి ఉండాలి, చరిత్ర చెప్పడానికైనా! ధైర్యంగా బ్రతుకు. రాజ్యాల కోసం పోరాటం వద్దు. మన వంశం నిలుపు.. జై కాళీ..” గుర్రం జీను మీద ఒక్క దెబ్బకొట్టి, ఒరలోంచి కత్తి తీసి వెనక్కి తిరిగింది దుర్గాదేవి కాళికావతారం ఎత్తి.
    మాధవుడు గుర్రం కళ్ళెం పట్టుకుని ముందుకు వంగాడు. వెంటనే గుర్రం పరుగు తీసింది వాయువేగంతో.
   దుర్గాదేవి బాణం బైటికి లాగకుండా కత్తి ఝళిపించింది. రెండు గుర్రాల మీద ఇద్దరు వంగ సైనికులు దగ్గరగా వస్తున్నారు. వారిని ముందుకు సాగనీయకుండా ఒక ఘడియ సేపు ఆపి, వారి అశ్వాలు ఒక పూట మాత్రం కదలకుండా వాటి కాళ్ళకి గాయాలు చేసి.. నేలకొరిగింది, వంగ బెబ్బులి దుర్గాదేవి.. వంగ దేశాన్నేలిన గణేశుల రాజవంశంలో మిగిలిన హిందూ స్త్రీ..
   ఆ సమయం చాలు.. మాధవుని గుర్రం ఆ సైనికులకి అందనంత దూరం వెళ్ళడానికి, అతడు మనుగడకై మార్గాలు వెతుక్కొనడానికి.
                                        ………………

(నింజిలి = దిగులు;   అనృతము = అసత్యము)

 

“అజ్ఞాత కులశీలశ్య….” 2వ భాగం


......మంథా భానుమతి