Facebook Twitter
ప్రతిభ కు పట్టాభిషేకం (కథ)



ప్రతిభ కు పట్టాభిషేకం

 



               డల్ గా వున్న తేజ మొహంలోకి చూస్తేనే తెలిసిపోతోంది యివాళ యింటరవ్యు లో ఏమైందన్న విషయం . తేజాని అలా చూస్తూ వుంటే చిన్నగా ఏదో తెలియని ఆనందం కలిగింది రాకేష్  లో . కాఫీ వేడిగా వుండగానే తాగాలని యెప్పుడూ తనకి చెప్పే తేజ యివాళ తన ముందున్న కాఫీ చల్లారిపోతున్నా పట్టించుకోకుండా వుందంటే యెంత దీర్ఘాలోచనలో వుందో తెలుస్తోంది రాకేష్ కి .
               " ఏంటి మౌనంగా వున్నావు డియర్ , యింటర్వ్యూ విషయాలు చెప్పు ఈ సారికూడా కాయేనా ? నిన్ను చూస్తే తెలుస్తోందిలే కాయని " . రాకేష్ కి తెలియకుండానే సన్నని వ్యంగ్యం తొంగి
చూసింది అతని మాటలలో .
          "  వైటర్  కాఫీ వేడిచేసి యిస్తారా ప్లీజ్ " కాఫీ షాప్ వైటర్ని పిలిచి అంది తేజ.
           " ఇంక మీ సంగతేమిటి సర్ , బయటికి ఎన్ని కబుర్లు చెప్పినా కడుపులో వున్న కుళ్ళు బయట పడిందిగా?" .
         " కుళ్ళా ?  యేది యెక్కడ లేదే , నీకలా వినిపించిందేమో కాని నా వుద్దేశ్యం అదికాదు . కాయా ? పండా ? , అని అడిగేను అంతే డియర్ అన్నాడు రాకేష్ .
           " సరే సరే నీ మనసులో వున్న దొంగని పట్టుకోడానికే అలా మొహం వేలాడేసి కూర్చున్నాను మొత్తానికి బయటపడ్డావు " .
           " అమ్మ బాబోయ్ ఆడవారి మాటలకే కాదు చేతలకి కుడా అర్ధాలు వేరా ?  నీకు ఈమధ్య పనీ పాటా లేక యేదైనా తెలుగు ఛానల్ చూస్తున్నావా ?  ఇలాంటి పిచ్చి ట్రిక్స్ ప్లే చేస్తున్నావు " .
         "   ట్రిక్కులు లేవు ట్రక్కులు లేవు గాని ఏవైనా కబుర్లు చెప్పు " .
         " మనకి పరిచయం అయినప్పటి నుంచి వినడమే తప్ప ఎప్పుడైనా మాట్లాడేనా? కాదు కాదు యెప్పుడైనా మాట్లాడనిచ్చేవా ? అంటే సరిపోతుందేమో ? కదూ డియర్ " .
         "యూ .....  నిన్నూ .... " అంటూ నెత్తిమీద ముద్దుగా ఓ మొట్టికాయ వేసి గలగలా నవ్వింది తేజ .
           రాకేష్ కి తేజ అంటే యిష్ఠం  , దుమికే జలపాతంలా నవ్వే ఆమె నవ్వంటే యింకా యిష్ఠం , ప్రతికూల పరిస్థితులని కూడా తనకి అనుకూలంగా మార్చుకోగలిగే ఆమె ఆత్మ స్థైర్యం అంటే యింకా యిష్ఠం .
             రాకేష్ ,తేజ  ఇద్దరూ ఓ పేరున్న మాల్ లో కాఫీ షాప్ లో కూర్చొని వున్నారు. ఈ పాటికే మీరు వుహించే వుంటారు , కరక్టే ...  వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు . యిదేదో సినిమా పేరు అనుకొనేరు కాదండీ నిఝంగా తేజ , రాకేష్ లు ప్రేమించుకున్నారు . వాళ్లిద్దరిది పెద్దలు ఆమోదించిన ప్రేమ , తొందరలోనే కళ్యాణ మండపం చేరబోతోందికుడా.
            ప్రేమికులు కలుసుకునే చోట్లలో యిప్పుడు కాఫీ షాప్స్ కుడా చేరేయి.
             రాకేష్ , తేజాల పరిచయానికి రెండేళ్ళ వయస్సు . తేజ , రాకేష్ లు డిగ్రీ పూర్తిచేసి విదేశాలలో ఎం.బి.ఎ చెయ్యడానికి వెళ్ళినప్పటి  పరిచయం , ఆ పరిచయం తిరిగి
స్వదేశం వచ్చేకా పెద్దల అనుమతి పొందింది .
            చదువుకున్న చదువుకు విదేశాలలోనే అవకాశాలెక్కువ అనేది రాకేష్ మాట , సమర్ధతకి మన దేశం లో కుడా అవకాశాలున్నాయి అనేది తేజ వాదన . రాకేష్ ప్రపంచ వ్యాప్తంగా శాఖలు వున్న సాఫ్టవేర్ కంపెనీ లో మంచి వుద్యోగం సంపాదించేడు .తేజ వూ ... అంటే విదేశాలకి యెగిరిపొదాం అని ఎదురు చూస్తున్నాడు  . తేజ ఇంటర్యుకి వెళ్తే తప్పకుండా సెలెక్ట్ అయ్యేదే కాని తేజ వుద్దేశ్యాలు వేరు .
             అంతవరకూ చదివిన డిగ్రీలకి ఉద్యోగాలు రాకపోతే  గాలి యెటువీస్తే అటే అన్నట్టు రాకేష్ మరో ఆరునెలలు సాఫ్ట్ వేర్ కి పనికి వచ్చే ఒరాకిల్ కోర్స్ చేసి వుద్యోగం సంపాదించు కున్నాడు . తేజ కుడా అదే దారిలో నడవాలని రాకేష్ , మిగిలిన కుటుంబ సభ్యుల అభిప్రాయం .కాని తేజ ఉద్దేశ్యం వేరు. ఇంత కష్ఠపడి  కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివన డిగ్రీలు తుంగలో తొక్కి సంపాదనకోసం మరేదో చదవడం అన్న మాటే నచ్చలేదు తేజకి . సివిల్ ఇంజనీరింగ్ లో చేరింది ఆ సబ్జెక్టు మీది వున్న మక్కువతోనే , ఇంటీరియర్ డిజైనింగ్ అంటే అదోమోజు ఆమెకి.  ఆ మోజుతోనే  అందులో నిష్ణాతులు రాసిన బుక్స్ చదివి , విదేశం లో వున్నప్పుడు అక్కడ జరిగే ఇంటీరియర్ డిజైనింగ్ పొటీలని లైవ్ ఆడియన్స్ గా చూడడం పొటీలొ పాల్గొనే వాళ్లకి సలహాలు అరుస్తూ చెప్పడం చేసేది వాళ్ళు వాటిని పాటిస్తే చప్పట్లతో స్వాగతించడం చేసేది . ఆ క్షణం ఆమె మనస్సు యేదో తెలీని ఆనందం పొందేది . అదే మనసుకి నచ్చిన పని చెయ్యడం వల్ల కలిగే సంతృప్తి ,ఆ క్షణం లోనే ఆమె వో నిర్ణయానికి వచ్చింది .
             అప్పటికే యేడాది వయసున్న తన ప్రేమకి తన ఆశయం చెప్పింది . ఆశయాలు పెట్టుకోవడం వాటిని నెరవేర్చుకోడం కోసం పాటు పడ్డం అనే ఆలోచనలే లేని రాకేష్ కి యిదేదో విచిత్రంగా అనిపించినా తేజ మీద వున్న ప్రేమతో కాదన లేక పోయేడు .
              రాకేష్  కి వుద్యోగం వచ్చేక అసలు గొడవ మొదలయ్యిది . ఇద్దరి తల్లితండ్రులు పెళ్లి పెళ్లి అంటూ తొందర పెట్టడం యెక్కువైంది . ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసినా తేజకి నచ్చిన వుద్యోగం రాలేదు . రాకేష్ కి అతని అంగీకారం తో యెప్పుడంటే అప్పుడు విదేశాలకి వెళ్ళే అవకాశం వుంది , తేజాని పెళ్లి చేసుకొని రాకేష్ విదేశాలకి వెళ్ళాలనేది అందరి వుద్దేశ్యం . కాని తేజ ఆశయాలు వేరు . అందుకే  అందరూ కలసి వో  వోప్పందానికి వచ్చేరు . అదేంటంటే తేజకి ముచ్చటగా మూడునెలలు సమయంలో ఆమె మెచ్చిన జాబ్ రాకుంటే రాకేష్ ని పెండ్లి చేసుకొని అతని వెనకాల విదేశాలకి వెళ్లి అక్కడే ఆమె ఆశయాలకి తగ్గ వుద్యోగం వెతుక్కోవడం , లేదు దేవుడు మేలుచేసి ఆమెకు నచ్చిన వుద్యోగం  వస్తే యిద్దరూ యిక్కడే వుండి అవుసరాన్ని బట్టి రాకేష్ విదేశాలకి వెళ్లి వచ్చేటట్లు . ఈ వొప్పందం లో యెవరు గెలిచి ఎవరు వోడినా పెళ్లి మాత్రం తప్పదు కాబట్టి మూడు నెలల తరవాత వచ్చే  వో ముహూర్తం పెట్టుకొని యిద్దరి యిళ్ళల్లోనూ పెళ్లి పనులు జోరుగా, హోరుగా సాగుతున్నాయి .
                  మూడు నెలల్లో గెలుపో వోటమో తేలిపోవాలి కాబట్టి ముందుగా దేశంలో పేరున్న కొన్ని పెద్ద కంష్ట్రక్షన్ కంపెనీలని యెంచుకొని వాటి మీద బాగా హొమ్ వర్క్ చేసి వో నోట్ తయారు చేసుకొని వాటికి చెయ్యవలసిన మార్పులు చేర్పులు తయారు చేసుకోడానికి వో నెల ఖర్చయింది .
తన CV తో పాటు తను యేమేం మార్పులు చేసి వాళ్ళ సంస్థని ముందుకు తీసుకు వెళ్ళగలదో వివరిస్తూ ఒక నోట్ కూడా పెట్టి పేరున్న సంస్థలకి పంపింది . ముచ్చటగా మూడు సంస్థలనుంచి పిలుపు వచ్చింది . ఇవాళటిది రెండవది  . కారణాలు యేవైనా రెండు చోట్లా సమాధానం ఒకటే అదే ల కి ఏత్తం ద  కి కొమ్ము . అందుకే రాకేష్ తేజని ఆట పట్టించేడు .
                   ఇద్దరూ తొమ్మిది గంటల వరకు మాల్ లో గడిపి బాయ్ చెప్పుకున్నారు . రాకేష్ బాయ్ తో పాటు "నీ గడువు ముగియడానికి యింకా యెనిమిది  రోజులే వుంది , గెలుపు నాదే యెలాగూ ,
నువ్వు కుడా వప్పుకుంటే ...." .
           "  అ అ ఆఅ .... యింకా ఎనిమిది రోజులుంది గెలుపో వోటమో తెలియడానికి , దూకుడు తగ్గించు ,గుర్రాన్ని కట్టేయ్ ఎనిమిది రోజుల తరవాత మాట్లాడుదాం వొకే  బాయ్ " రాకేష్ ని మధ్యలోనే అడ్డుకొని అంది తేజ .
                  ----          -------               ---------           -------     ---------
          " ఇదీ క్లుప్తంగా నా పరచియం " అంటూ ఒక్కమారు హాల్ లో వున్న అందరినీ పరికించి చూసింది  తేజ . దేశం లో వోకటవ స్థానంలో వున్న కంష్ట్రక్షన్ సంస్థకి సంబధించిన కాన్ఫరెన్స్  హాల్ అది . ఆ హాల్ లో వోయిరవై మంది వరకు వున్నారు . నలుగురు తప్ప అందరు ఆ సంస్థలో వున్నత పదవులు నిర్వహిస్తున్నవారే . తేజ తో కలిపి ఆ నలుగురు ఆ సంస్థలో వున్న ఒకే ఒక్క ఖాళీ కోసం పోటీ  పడుతున్నారు . తేజా కి మూడో ఛాన్స్ యిచ్చారు . తేజ చాన్సు రాగానే ముందుగా తన గురించి చెప్పుకొని మధ్య లో చిన్న గాప్ యిచ్చి అందరిని పరికించి చూసింది.
ఎవ్వరి ముఖం లోను ఆమె చెప్పబోయే విషయం మీద యేవిధమైన ఆశక్తి కనిపించలేదు . ఇలాంటి బ్లాంక్ మొహాల్లో కుతూహలం పుట్టించగలననే ఆత్మవిశ్వాసం తేజా కి వుంది . అందుకే చిన్నగా గొంతు సవరించుకొని మాట్లాడ్డం మొదలు పెట్టింది .
              " ఇప్పడు మనం మాట్లాడుతున్నది మన ఆరువందల ఎకరాల ప్రాజెక్ట్ గురించి . దీన్ని మనం వో టౌన్ షిప్ చేద్దామనేది మన ఆలోచన , ముందు ఈ టౌన్ షిప్ లోకి రావడానికి మన ఫ్రెండ్స్ చెప్పినట్లు రెండు గేట్స్ కాకుండా నాలుగు వైపులా నాలుగు గేట్స్ వుండాలి . రోడ్లు నూరు అడుగులు వెడల్పు వుండి రెండు వైపులా పచ్చని మొక్కలు యిలా వేస్తాం " అంటూ  రకరకాల రంగుల పువ్వులు వరుస వెనుక వరుసగా నాటబడ్డ ఫోటోలు తెరమీద వేసి అందరికి చూపించింది . రోడ్స్ ,రోడ్స్ మీది లైట్స్ , స్విమ్మింగ్ పూల్ అన్నీ ప్రీలాంచ్ కి ముందే తయారుగా వుంటాయి . మోడల్ హౌస్ తయారుగా వుండాలి . రెండు ఇంటర్నేషనల్ స్కూల్స్ , రెండు సూపర్ స్పెషాలిటి హాస్పిటల్స్ , ఆరు ముపైఅంతస్తుల కర్పోరేట్ బిల్డింగ్స్ , రెండు డే కేర్ సెంటర్లు , రెండు ఐదు నక్షత్రాల హోటల్ , నాలుగు అంతస్తుల మాల్ , పై అంతస్తు లో ఫుడ్ కోర్ట్ , మల్టి ప్లెక్స్ యివన్నీ మనం కట్టబోయే ఫ్లాట్స్ కి నడుచుకు వెళ్లేంత దూరంలో వుండేలా ప్లాన్ చెయ్యాలి . ' మీరు వుండేది ఫ్లాట్ లోనే అయినా బంగ్లా లో వున్న అనుభూతినిస్తాం ' అనేది మన కొత్త స్లోగన్ " మాట్లాడుతున్నది అక్కడకి ఆపి గ్లాసులో నీళ్ళు తాగుతూ అందరిని పరికించి చూసింది కొందరి కళ్ళల్లో చిన్న కుతూహలం కనిపించింది . అదే తేజాకి  కావలసింది . రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభించింది .
           " అంటే మనం కట్టే ఫ్లాట్స్  " T " ఆకారంలో ఇలా వుంటాయి అని మరో బొమ్మ తెరమీద చూపించింది . ఇలా వుండడం వల్ల  అన్ని గదుల కిటికీలు బయటికి వుంటాయి కాబట్టి గాలి వెలుతురు బాగా వస్తాయి . యే ఫ్లాట్స్ కి కుడా కామన్ గోడ వుండదు కాబట్టి మనం ఆ ఫ్లాట్స్ ని బంగ్లా అనికూడా అనవచ్చు అని కొనుగోలుదారులకి చెప్తాం ". దీర్ఘం గా వూపిరి పీల్చుకొని అందరిని వో కంట చూసింది తేజ ఇప్పుడు చుట్టూ వున్న వాళ్ళ కళ్ళల్లో ఆమె ఏం చెప్పబోతోందో అనే కుతూహలంతోపాటు ఆమె మీద వోవిధమైన నమ్మకం కూడా కనిపించింది .
            వక్తలు యెప్పుడూ తమ ధోరణి లో చెప్పుకుంటూ పోకూడదు . ఎదుటి వారి ముఖకవళికలు కుడా గమనిస్తూ మధ్య మధ్యలో చిన్న హాస్యం జోడించి చెప్తే వింటున్నవాళ్ళల్లో వినాలనే కుతూహలం  కలుగుతుంది .
           వాళ్ళ కళ్ళల్లో కపించిన  భావాలకి తేజకి తన నమ్మకం వమ్ము కాలేదనే  అభిప్రాయాన్ని కలుగ జేసింది . ఆ నమ్మకం ఆమెలో వెయ్యి యేనుగుల బలన్నిచ్చింది .
         ఆ బలంతోనే తన ప్రపోజల్ వారిముందు వుంచడానికి సిద్ధ పడింది .
             "ఇప్పుడు  నేను కొన్ని ముఖ్యమైన ప్రపోజల్స్ చేస్తున్నాను .వీటిని అమలు చెయ్యడం మనకి ఖర్చులు పెరిగి కొనుగోలు దారుని మీద కొంచెం భారం పడుతుంది  కాని మనం వాళ్ళకిచ్చే సౌకర్యాలకి యిది యెక్కువ కాదని మనం వాళ్లని వొప్పిస్తాం . ప్రకృతికి దగ్గరగా వుండేటట్టు ఫ్లాట్స్ యిస్తాం అనేది  మన మరో స్లోగన్ . ప్రకృతి అంటే గాలి , నీరు , వెలుతురూ , భూమి . మనదగ్గర కావలసినంత నేల వుంది కాబట్టి వేప , మామిడి , పున్నాగ లాంటి వృక్షాలని బాగా ప్లాన్డ్ గా వేస్తాం . తరవాతి అంశం నీరు . మన దేశం మొత్తం ఎదుర్కుంటున్న సమస్య నీటి సమస్యే . ఈ సమస్యకి పరిష్కారం కుడా అందరికి  తెలిసిందే . అదే నీటిని పొదుపుగా వాడుకోవడం . ఆచరణలో మాత్రం యెవ్వరూ అమలు చెయ్యరు . యిక్కడే మనం కొన్ని మార్పులు చెయ్యబోతున్నాం . అవేమిటంటే ప్రతి ఇంటికి వచ్చే నీటి పైపులకి మీటర్స్ పెట్టడం ఇది చాలా బిల్డర్స్ యెప్పుడో చేసేరు , రెండవది వర్షపు నీటిని జాగర్త చేసి మళ్ళా మనం వాడుకోగలిగేటట్లు చెయ్యడం . ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టిన వాళ్ళం కాబట్టి  ఇదేమీ  కష్ఠమైన పనికాదు . మన ఈ ప్రాజెక్ట్ లో సోలార్ పానల్స్ పెట్టి ప్రతి యింటికి వేడినీటి సరఫరా యివ్వాలి  .  కనీసం రెండు బకెట్ల నీళ్ళు వృధాగా వదిలిన తరువాతే వేడినీళ్ళు వస్తాయి . సగటున ఒక యింట్లో నలుగురిని వేసుకున్నా కనీసం ఎనిమిది బకెట్స్ అంటే ఇంచుమించుగా రోజుకి వంద లీటర్ల నీరు వృధా అవుతోంది . దీన్ని మనం అరికట్ట గలిగితే ఎంతో నీటిని ఆదా చెయ్యొచ్చు . దీనికి నాదగ్గర వున్న సూచన యేమిటంటే ప్రతి యింటికి రెండు బాత్రూంలలో వో అయిదు లీటర్ల టేంక్ పెట్టి వెంటిలేటర్ కి సోలార్ పానల్స్ పెడతాం" . అందరిని పరికించి చూస్తూ గ్లాసులో నీళ్ళు తాగి తిరిగి ప్రారంభించింది .
        " వీధి దీపాలు , పార్కుల్లోను యిలా అవకాశమున్న చోట సోలార్ దీపాలనే వాడుతాం . కారిడార్స్ లో కదలికలని బట్టి వెలిగి , ఆరే దీపాలని వాడుతాం ,దీనివల్ల విధ్యుత్ శక్తిని కుడా ఆదా చేసిన వాళ్ళ మౌతాం . ప్రతీ బిల్దింగ్ లోను తొంభై ఫ్లేట్స్ వుంటాయి అలాంటి రెండేసి బిల్డింగ్స్ కి కలిపి వొక స్విమ్మింగ్ పూల్ , చిన్న పిల్లలు ఆడుకొనే పార్క్ ఏర్పాటు చేస్తాం . టౌన్ షిప్ మెత్తానికి రెండు టెన్నిస్ కోర్ట్స్ , పెద్ద స్విమ్మింగ్ పూల్ , ఆడిటోరియం , జాగర్స్ పార్క్ ఇలా అన్ని సౌకర్యాలు ఇస్తాం . అంటే ఈ టౌన్ షిప్ లో వుండేవాళ్లకి ఏ అవుసరానికి కుడా గేట్ దాటి బయటికి వెళ్ళనవుసరం లేదు . అలాగే ప్రతీ యింటికి RO సిస్టంని యెలాగూ యిస్తున్నాం కాబట్టి 'మీ RO సిస్టం లో వృధా అయేనీటిని  మాకివ్వండి  ' అని పూల మొక్కలు అర్దిస్తున్నట్లు రాయించిన చిన్న చిన్న అందమైన బోర్డ్ లని అక్కడక్కడ పెడతాం . వీటికి సంబంధించిన వివరాలు యిందులో వున్నాయి . నా ప్రతి పాదనలలో ఏవేనా అనుమానాలు వుంటే ఎవ్వరైనా నన్ను ప్రశ్నించవచ్చు  ".
అలా అంటున్నప్పుడు ఆత్మవిశ్వాసం కళ్ళల్లో తొణికిసలాడింది .
          మెల్లగా మొదలైన కరాతాళ ధ్వనులు హాలంతా మారుమ్రోగేయి .
     ఆ ధ్వనులు ఆగిన తరువాత యేం జరిగిందో చెప్పమంటారా ?
    ఛ...ఛ... అఖ్ఖర్లే మీకు తెలుసునని నాకు తెలిసిందిగా !

---- V LN Murty Karra