Facebook Twitter
మధూషిణి (కథ) పార్ట్ 3

 

మధూషిణి  (part-3)

 

 

    ఆ  ఊళ్ళో ఉంటున్న వీరయ్యకు, రాఘవరావుకు సంబంధాలున్నాయి. ఒకప్పుడు రాఘవరావు పొలం వీరయ్యకు కౌలు కు ఇచ్చారు. అక్కడి వారితో సంబంధాలు తెంచుకున్నందున ఆ పొలం అమ్మేసారు. అయినప్పటికీ రాఘవరావు మీద అభిమానంతో పట్నం వచ్చినపుడల్లా కలుస్తుంటాడు. రాఘవరావు భార్య అరుగు మీద కూర్చొని బియ్యం చెరుగుతుంది. రాఘవరావు సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు. ఇంతలో వీరయ్య వచ్చి అసలు విషయం చెప్పాడు. అమ్మాయి గారు మన ఊరు వచ్చారు కదండీ! అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ జగన్నాథం కొడుకుతో చెట్టాపట్టాలేసుకొవి తిరగడం... క్షమించండి ఊర్లో వాళ్ళు అనుకుమటున్న విషయం చెప్పాను. మీరు గానీ వాళ్ళ కుటుంబంతో మళ్ళీ సంబంధాలు పెట్టుకున్నారా ఏమిటీ అని వీరయ్య అంటుండగానే క్షణం ఆలస్యం చేయకుండా రాఘవరావు ఆత్రేయపురం బయలుదేరాడు. జగన్నాథం ఇంట్లో నలుగురూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తుండగా కాలితో తలుపు తన్ని లోపలికి వచ్చి, మధూషిణి చెయ్యి పట్టుకొని లాక్కొచ్చాడు.

ఆనంద్,జానకమ్మ అడ్డుపడుతున్నా వాళ్ళను పక్కకు తోసేసి మధూషిణిని కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంకోసారి ఆ ఊళ్ళోకి వెళ్తే కాళ్ళు విరగ్గొడతానని గద్దించాడు. తల్లి బావురుమని ఏడ్చింది. తర్వాత నాన్న సంగతి తెలిసి కూడా ఆ ఊరికి ఎందుకు వెళ్ళావని మందలించింది. " నేను బావను ప్రేమిస్తున్నాను" అన్నది మధూషిణి. తల్లి గుండెల్లో గునపాలు దించినంత పనైంది. ఆమెకి నోటమాటరాలేదు. " మర్చిపోమ్మా అది జరిగే పనికాదు " అని మాత్రం అనగలిగింది. తర్వాత ఒక్కసారి జరిగిన తప్పుకే అందరం శిక్ష అనుభవిస్తున్నాం మళ్ళీ నువ్వు అదే తప్పు చేయెుద్దు అని నిదానంగా చెప్పింది. మధూషిణి ఏడుస్తూ గదిలో తనను తానే బంధించుకుంది. మంచినీళ్ళు కూడా ముట్టడం మానేసింది. తల్లి ఎంత చెప్పినా ఆమె మాట వినటం లేదు. తండ్రి ఇదంతా చూసి మధూషిణికి పెళ్ళి చేస్తే ఈ పరిస్థితి నుంచి కుదుటపడుతుంది అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా నెలరోజుల్లో  ఓ సంబంధం ఖాయం చేయనే చేసాడు. పెళ్ళి పనులు సాగుతున్నాయి.

ఆనంద్ కు ఏం చేయాలో తోచడం లేదు. పిచ్చివాడయ్యేలా ఉన్నాడు. ఏదైతే అదే జరగనీ అనుకొని పట్నం బయలుదేరాడు. బస్సు దిగి రాఘవరావు ఇంటికి నడుస్తూ ఉండగా పెళ్ళి పత్రికలతో రాఘవరావు ఎదురుగా కనిపించాడు. ఆనంద్ ని చూసి రాఘవరావు కోపంతో ఊగిపోయాడు. కాలర్ పట్టుకొని ఎందుకు వచ్చావురా ఇక్కడికి అంటూృపిడికిలి బిగించి మూతి మీద గుద్దాడు. నోటి నుంచి జలజలా రక్తం కారింది.ఆవేశంలో ఏం చేస్తున్నాడో  రాఘవరావుకు  తెలియట్లేదు. అంతటితో ఆగక పక్కనున్న కర్ర తీసుకొని ఆనంద్ తలపై కొట్టాడు. ఆనంద్ స్పృహ తప్పి పడిపోయాడు. రాఘవరావు ఇంట్లో పని చేసే సైదులు పరిగెత్తుకొచ్చి విషయమంతా రాఘవరావు భార్యకు చెప్పాడు. ఆమె అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయింది. లోపల వీణాపాణియై విషాదంతో చక్రవాకరాగం ఆలపిస్తున్న మధూషిణి ఈ వార్త విని కంట్లోంచి నీరు జలజలా వీణపై కురియగా వేళ్ళ నుంచి రక్తం కారేంత వేగంగా వాయిస్తుంది. వాగ్దేవి శోకసంద్రంలో మునిగినట్టుంది ఆ దృశ్యం. ఆమెకి ఏం జరుగుతుందో తెలియట్లేదు. కాసేపటికి ఏమీ వినిపించట్లేదు. అచేతనావస్థలో ఆ రాగం మూగవోయింది. చేతుల్లోంచి అసంకల్పితంగా వీణ జారిపడిపోయింది. దుఃఖం నిండిన స్వరంతో ఆనంద్ అంటూ నేలకొరిగింది.



(వచ్చే వారం part-4 )

 

 

.....సరిత భూపతి