Facebook Twitter
క్రిస్మస్ పండుగ కోలాహలం!

క్రిస్మస్ పండుగ కోలాహలం!

 

క్రిస్మస్ తాత వస్తాడు.... ఏదో ధ్రువప్రాంతం నుండి, ధ్రువపు జింకలు లాగే స్లెడ్జ్ బండి ఎక్కి, తెల్లటి బరివి గడ్డంతో, నవ్వు నిండిన ముఖంతో, ఎర్రటి ఊలు అంగీతో. ఆ అంగీనిండా లోతైన జేబులు...జేబులునిండా టాఫీలూ, చాక్లెట్లూ, బహుమతులూ! అందరికీ అన్నీ అందిస్తాడు సంతోషంగా, నిర్విరామంగా. ఏ పిల్లలు ఇష్టపడరు ఆయన్ని?

ఊరూరా నక్షత్రాలను పోలిన స్వాగత చిహ్నాలూ, వాడవాడలా రంగురంగుల బట్టలూ, పండుగ వాతావరణం.

నూతన సంవత్సరానికి ఆహ్వానం, చర్చిల గంటలు, ప్రార్థనాగీతాల సాధనలు.

మంచుకురిసే ఉదయాలు. మబ్బుతునకలు లేని ఆకాశంలో కిక్కిరిసిపోయి, ఇక ఎప్పుడు బయటకి ఊడిపడతాయో అనిపించే తారల రాత్రులు.

వణికించబోతున్నాను సిద్ధంకండని హెచ్చరించే వెచ్చని చలి.

అన్నింటినీ మించి పిల్లల్ని ఊరించే శలవలు.

ఇన్ని సంతోషకర విషయాల నడుమ అందరం మరోసారి పరిశుద్ధ ప్రవక్త, దేవుని కుమారుడూ అయిన ఏసు ప్రభువులోని గుణాలను మరోసారి స్మరిద్దాం. కరుణామయుడూ, విస్వాసుల రక్షకుడూ అయిన ఆ ప్రభువు చూపిన సత్యమార్గంలో మనమూ పయనించేందుకు ప్రయత్నిద్దాం. విద్వేష కావేశాలను, మారణకాండల్నీదూరంచేసుకొని మన హృదయాలలోనూ పవిత్రతను నింపుకుందాం. హింస, పరపీడనల్ని దైవం ఏనాటికీ మెచ్చదని మరోసారి గుర్తుచేసుకుందాం. మతం ఉన్నది మనుషుల్ని దూరం చేయటానికి కాదనీ, మనసుల్ని దగ్గర పరచేందుకు ఉద్దేశించినదనీ చాటుదాం.

విశ్వాసపు బలాన్ని, ప్రేమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అద్భుత వ్యక్తి ఏసు ప్రభువు. డిసెంబరు నెల 25 న ఆయన జన్మ దినాన్ని పురస్కరించుకొని కొత్తపల్లి బృందం మీకందరికీ శుభాకాంక్షలను అందిస్తున్నది.

నవంబరు పధ్నాలుగు సందర్భంగా చెన్నేకొత్తపల్లిలో నిర్వహించిన కథలపోటీల్లో చాలామంది పిల్లలు పాల్గొన్నారు ఉత్సాహంగా. వారి రచనల్లో కొన్ని ఈసారి కొత్తపల్లి పత్రికలో చోటు చేసుకుంటున్నాయి. వీటిలో అధిక భాగం జానపదకథలు. అవీ ఇవీ కలుపుకొని, పిల్లలు సొంతంగా తయారుచేశారని వీటిని చూడగానే తెలుస్తుంది. వారికి స్ఫూర్తినివ్వటం, చదువరులకు చిరునవ్వునందించటం ఈ కథల ప్రచురణ వెనక గల మూలోద్దేశం.

ఈ సంచికలో చిత్రాలను సకాలంలో అందించి తోడ్పడిన బి యఫ్ ఎ (జె యన్ టి యు) విద్యార్థులు శివ ప్రసాద్, సాయి కిరణ్, యాదగిరి లకు కొత్తపల్లి బృందం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నది.

ఇక, ఆదిలాబాదు జిల్లా, చెన్నూరు మండలకేంద్రానికి దగ్గర్లో ఉన్న భావురావు పేటలోని ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల విద్యార్థులు పంపిన పాటలు ఈమాసపు కొత్తపల్లికి ప్రత్యేక ఆకర్షణలు. ఆ విద్యార్థులకు, వారికి స్ఫూర్తినిచ్చిన ఆ పాఠశాల అధ్యాపక వర్గానికి మనందరి తరపున కృతజ్ఞతాభినందనలు.



.......... kottapalli.in సౌజన్యంతో