Facebook Twitter
మధూషిణి (కథ) పార్ట్ 2

 

మధూషిణి  (part-2)

 

 

నేనత్తయ్యా మధూషిణిని రాఘవరావు గారి కూతురుని అన్నది. ఉద్వేగంతో ఆవిడ కళ్ళు చెమర్చాయి. తమాయించుకొని "ఎందుకొచ్చావ్ ఇక్కడికి ?" అన్నదామె. వెంటనే మధూషిణి అదేమిటత్తయ్యా నా అత్తారింటికి నే రాకూడదా అన్నది. జానకమ్మ దుఃఖం నిండిన స్వరంతో "మీ నాన్నేమీ అనలేదా నువ్విటు వస్తుంటే? అసలు మేమిక్కడున్నట్టు నీకెలా తెలుసు?" అన్నది. నేనిక్కడికి వస్తున్నట్టు నాన్నకు తెలీదు. " అమ్మ మీ గురించి అంతా చెప్పింది అన్నది " మధూషిణి.

      మధూషిణి వాళ్ళ నాన్న రాఘవరావుకు ఒక్కగానొక్క చెల్లెలు జానకి. ఆమెకి గొప్పింటి అబ్బాయిని భర్తగా తీసుకురావాలని రాఘవరావుకు కోరికుండేది. అనుకోకుండా జానకమ్మ జగన్నాథంను ప్రేమించి పెళ్ళి చేసుకొని రావటంతో రాఘవరావు షాక్ కి గురి అయ్యాడు. ఆ కోపంలో ఈ రోజు నుంచి నాకు చెల్లెలు లేదనుకుంటాను నీ మెుహం నాకు చూపించకు అని ఇంట్లోంచి పంపించేశాడు. అది జరిగిన విషయం.
మధూషిణి తల్లి కూడా జానకిని ప్రేమగా చూసుకునేది. ఆ తర్వాత జానకి,జగన్నాథం ను పెళ్ళి చేస్కోవటంలో ఆమెకేమి తప్పు కనిపించలేదు. ప్రతీరోజు ఆమెని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే మధూషిణిని సమానంగా జానకిని చూసుకుందావిడ. జానకి గురించి రోజూ తల్లి చెప్తూ ఉంటే మధూషిణికి తన అత్తయ్యను ఒకసారి కలవాలనిపించింది. సమ్మర్ క్యాంప్ వంకతో ఆ ఊరొచ్చింది.

       జానకి అనునయంగా మధూషిణి చేయి పట్టుకొని " ఎప్పుడనగా తిన్నావో వెళ్ళి స్నానం చేసిరామ్మా వడ్డిస్తాను" అన్నది. అతి తక్కువ సమయంలో ఆ ఇంట్లో బాగా కలిసిపోయింది మధూషిణి. అత్తయ్య,మావయ్య చూపించే  ప్రేమానురాగాలు చూస్తుంటే అసలు వాళ్ళను వదిలిపెట్టి వెళ్ళాలనే లేదు తనకి. ఒక రోజు నిండుగా పండువెన్నెల కురుస్తుండగా చంద్రునికి తానేమీ తీసిపోనన్నట్టుగా అందంగా తెల్లని పరికిణిలో మెరుస్తోందామె. వీణాపాణియై చక్రవాకరాగం ఆలపిస్తుంది. అది కొంచెం విషాదమిళితం. ఎక్కువమందికి నచ్చదు కూడానూ. కానీ మధూషిణి అలా లీనమైపోతూ వీణపై వేళ్ళు కనపడనంత వేగంగా ఆలపిస్తుంటే చూసేవారు ఎవరైనా మంత్రముగ్ధులు అవాల్సిందే. నిర్మలమైన వదనం , ఆమె రాగంలో లీనమై వాయిస్తుంటే తల లయబద్ధంగా ఊగుతోంది. ఆమె చెవికున్న జుంకీ రాగానికి అనుగుణంగా నాట్యమాడుతున్నట్టుంది. అప్పుడే పట్నం నుంచి వచ్చిన ఆనంద్ ఆ దృశ్యం చూస్తూ స్థాణువై నిలబడిపోయాడు. అదంతా ఒక కలగా అనిపిస్తుందతనికి. ఏదో అలజడి అవటంతో ఆపి తలుపువైపుకి తిరిగి చూసింది మధూషిణి. తను సరిగ్గా ఊహించగలిగింది అతను తన బావేనని. అనుకోకుండా అతను అక్కడ కనిపించేసరికి ఆమెకి నోట మాట రాలేదు. "నమస్కారం" అని మర్యాదపూర్వకంగా పలకరించి చెంగున అత్తయ్య దగ్గరికి పరిగెత్తుకెళ్ళి నిలుచుంది. జానకి ఆనంద్ ని చూసి సంతోషంతో "ఒరేయ్ ఎప్పుడొచ్చావురా వస్తున్నట్టు కబురు చేస్తే నాన్నగారు స్టేషన్ కి వచ్చేవారు కదా" అన్నది. " ఫరవాలేదమ్మా నాన్నగారికెందుకు ఇబ్బందనీ..అది సరే.. ఈ అమ్మాయి ఎవరు?" అనడిగాడు ఆనంద్. జరిగినదంతా చెప్పింది జానకి.

    ఆ రాత్రంతా తనకు మధూషిణి ఆలోచనలే. ఆమె వీణాపాణియై ముద్దుమోముపై గాలికి ముంగురులు సయ్యాటలాడంగా పరవశిస్తూ రాగాన్ని ఆలపించిన దృశ్యం పదే పదే జ్ఞప్తికి వస్తోందతనికి. మరునాడు ఉదయం మధూషిణి మునుపటంత సిగ్గుపడక ఆనంద్ దగ్గరకొచ్చి " నాకు మీ ఊరు చూపిస్తారా?" అని అడిగింది. " ఓహ్ తప్పకుండా..నేనే అడుగుదామనుకున్నాను. ఈ పల్లెటూరిలో పొలాలు అవ్వీ తిరగటం నీకిష్టముంటుందో లేదోనని అడగలేదు.. పట్నం పిల్లవి కదా" అని ఉడికిస్తున్నట్టుగా చిన్నగా నవ్వాడు. " భలేవారే నాకు ఈ పంటపొలాలన్నా, ఇక్కడి వాతావరణమన్నా నాకు చాలా ఇష్టం" అన్నదామె.



(వచ్చే వారం part-3 )

 

 

.....సరిత భూపతి