Facebook Twitter
మధూషిణి (కథ) పార్ట్ 1




మధూషిణి 
(part-1)

దారికి ఇరువైపులా పచ్చని పొలాలు.పొలాల చుట్టూ  కాలువ గట్లు,  మధ్యమధ్యలో కొబ్బరిచెట్లు. చీకట్లు ఇంకా బలంగా సంతరించుకోలేదు.పిల్లగాలులకు పచ్చని పైరు అందంగా కదులుతోంది  పదహారణాల కన్నె ఆకుపచ్చ  ఓణీతో ఆనందంగా ఉరకలెత్తుతున్నట్టుంది ఆ దృశ్యం. అక్కడక్కడా వంగి  ఉన్న కొబ్బరిచెట్లు ఆ దృశ్యాన్ని చూడటానికే ఆగాయా అన్నట్టుగా  ఉన్నాయి. నిర్మలమైన ఆకాశంలో అక్కడక్కడా ఆనందంగా విహరిస్తున్న పక్షులు. ఆనందమా? అంటే ఏమిటి ఆ పక్షులకు దుఃఖం లేదా? ఎప్పుడూ సంతోషంగానే ఉంటాయా? ఎందుకుండదు దుఃఖం ఏ ప్రాణికైనా భరించదగినంత కష్టాలే వస్తాయి మరి మనుషులెందుకు కష్టాన్ని భరించలేకున్నాను అని అంటూ ఉంటారు? ఇప్పుడు అనుభవిస్తున్నావు అంటే భరిస్తున్నట్టే లెక్క. శరీరం ఆ భరించే శక్తి కోల్పోయినపుడు దానంతటదే వెళ్ళిపోతుంది. కాబట్టి కష్టాలన్నీ స్థాయికి తగినట్టుగా ఏ ప్రాణి అయినా భరించదగినవే.

        సరిగ్గా ఆ సమయానికి ఒక ఎద్దులబండి ఊర్లోకి ప్రవేశిస్తుంది. దాని సవ్వడికి అనుగుణంగా పచ్చని పైరు నాట్యమాడుతున్నట్టుంది. బండి వెనకాల కూర్చొని ఉన్నదామె మోకాళ్ళ మీద గడ్డం ఆన్చుకుని కదులుతున్న ఆ పైర్ల వంక ఎంతో ఉత్సాహంతో చూస్తూ. ఆ ప్రకృతి ఎంతో నిర్మలంగా ఉంది అచ్చంగా ఆమె వదనంలా. ఆమె కళ్ళు చూసి కలువలు కుళ్ళుకుంటాయి. ఆమె చెక్కిలి చిరు దరహాసానికి మల్లెలు మూతి ముడుచుకుంటాయి. ఆమె కురుల నలుపు చూసి నిశిరాత్రి వణికిపోతుంది. అందానికి తగ్గ సంస్కారం ఆమెది. చాలా చిన్న వయసులో చూసిన పల్లెటూరు అది. పదిహేనేళ్ళ తర్వాత మళ్ళీ చూస్తోంది. మనుషులు మారారేమో తెలీదు. ప్రకృతి మాత్రం నాకు వయసే రాదు చూసావా అని గర్వంగా చెప్తున్నట్టుంది.

ఆమె బండి దిగి నడిచి వస్తుంటే ప్రతీ ఇంటి వాకిట్లో రకరకాల ముగ్గులు, ఆ పక్కన అందమైన పూల చెట్లు స్వాగతం చెప్తున్నట్టుగా ఉన్నాయి. ఆమె ఒక ఇంటి వద్ద ఆగి అరుగు మీద కూర్చున్న నడి వయసు వ్యక్తిని అడిగింది " జగన్నాథరావు గారి ఇల్లెక్కడండీ " అని. చూపు తిప్పుకోనివ్వకుండా ఉన్న ఆమె అందానికి ఒక్క క్షణం నివ్వెరబోయి ఆమె అడిగిన ఇంటికి దారి చూపించాడతను. కృతజ్ఞతలు తెలిపి ముందుకు నడిచిందామె. ఆ ఊర్లో చూసిన ఇళ్ళల్లోకి అదే పెద్ద భవనం. తెలుగుదనం ఉట్టిపడేలా పసుపు రాసి ముగ్గేసిన గడప, గుమ్మానికి పచ్చని మామిడి తోరణాలు. లోపలికి అడుగు పెట్టగానే ఓంకారం లీలగా వినిపిస్తుంది. ఇరువైపులా పూల చెట్లు. ఆమె లోపలికు ప్రవేశించి అత్తయ్యా అని పిలిచింది. లోపల వంట గదిలోంచి జానకి ఎవరమ్మా అని అడుగుతూ బయటకొచ్చింది నెమ్మది స్వరంతో.  నిండుకట్టుతో, నుదుటన పెద్దగా గుండ్రటి తిలకం బొట్టుతో, విశాల వదనంతో ఆమె నడిచొస్తుంటే ఎంతో హుందాగా కనిపిస్తుంది. ఆమె ఆ అమ్మాయిని ముందు గుర్తు పట్టలేదు. ఆమె నేనత్తయ్యా మధూషిణిని, రాఘవరావు గారి కూతురిని అన్నది. ఉద్వేగంతో జానకి కళ్ళు చెమర్చాయి. ఆవిడ తమాయించుకొని " ఎందుకొచ్చావ్ ఇక్కడికి? " అన్నది.


(వచ్చే వారం part-2 )

 

 

.....సరిత భూపతి