Home » కథలు » “చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 22వ భాగంFacebook Twitter Google
“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 22వ భాగం

 

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 22వ భాగం


   "ఎర్రన భారతంలోని అరణ్యపర్వశేషమునందు ఐదు పద్యాలలో చేసిన శారద రాత్ర వర్ణనకీ, హరివంశంలో పది పద్యాలలో వర్ణించిన శరన్నవసంపదకీ చాలా తేడా ఉంది.
   శరత్కాలంలో ఆకాశం రాజ చిహ్నాలతో అమరిందట..
   మరొక పద్యంలో సముద్రపు కెరటాలను కౌగలించుకొనడానికి ఏరులు తొందరపడుతున్నాయట..
   సూరన రాగయుక్తంగా చదివి వినిపిస్తుంటే ఆ శరత్కాలంలోకి వెళ్ళిపోయి విహరించిన అనుభూతి కలిగింది శ్రోతలందరికీ.
   అంత సహజంగా ఉంది వర్ణన.
   మధ్యాన్న విరామం..
   సభకొచ్చిన వారందరికీ, ప్రాసాదంలోనే భోజనాలు.

        ఘాటైన కొరివికారం, కమ్మని నెయ్యి, వరి అన్నం.. కలుపుతుంటే వస్తున్న వాసనలకి వచ్చినవారి ఆకలి రెట్టింపవగా.. మిగిలిన ఆధరువులన్నీ ఒకదాని మించి మరొకటి మరింత రుచిగా..
   అలా అలా నాలుకపైనుంచి కిందికి జారి.. అతిథులను సంతృప్తులను చేశాయి.
   ఆఖరున కమ్మని పెరుగు కడుపులను చల్లబరచింది.
   ఒక ఘడియ అయిన తరువాత అందరు సమావేశమయ్యారు.

   "మామూలుగా కావ్యంలో పద్యాలకున్న అందాలు గద్యానికుండవు. ఒక్కొక్కసారి, భావపుష్టి లేక చదువరికి తలనొప్పిగా తయారవుతాయి.
   కానీ ఎర్రనగారి వచనం తీరే వేరు.
   వచనం కూడా పద్యాలకి దీటుగానే ఉంటుంది.
   తెలుగు తనం ఒలికిస్తూ ఉంటాయి గద్యాలు.
   వానా కాలంలో గోవులు, గోపాలురూ ఎటువంటి పాట్లు పడతారో వర్ణించిన గద్యం చదువుతుంటే హ్రుదయం డెక్కు పట్టక మానదు..”
   ఏక వాక్యంగా సాగిన ఆ గద్యం చదివి ఆపగానే, శ్రోతలందరూ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చారు.
   వేల తుమ్మెదలు ఒకేసారి పూలబాలల మీదినుంచి లేస్తుంటే వెలువడిన ఝంకారావంలా ఉంది ఆ శబ్దం. సుష్టుగా భోజనం చేసిన తరువాత వచ్చే కునుకు పారిపోయింది నిలువలేక.
   "ఇది పూర్వ భాగం ఏడవ ఆశ్వాసంలో నున్న గద్యం.
   ఎర్రయగారి వర్ణనలు చిన్న విషయాలను కూడా వదలవు. ఆసక్తికరంగా సాగుతుంది.
   కాళీయుడు కొలనులో చేసే భీభత్సాలను భరించలేని కృష్ణుడు మడుగులోకి ఎలా దూకాడో చేసిన వర్ణన చూస్తే..
   మన కళ్ల ముందే కదలుతాడా చిన్ని కృష్ణయ్య..
    ‘పొలుచు పింఛపుదండ పుచ్చి వెండ్రుకల నొప్పెడు జడగా నల్లి ముడి యమర్చి
     మొలగచ్చగట్టుపై మలగిన పచ్చని నునుగొంగు దిండుగా మనిని చుట్టి..’
   ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వలస వెళ్ళడం అలవాటైన ఎర్రయగారు, వ్రేపల్లెనుండి బృందావనానికి వలస వెళ్ళిన గోకులాన్ని బాగా వర్ణించారు.
   కవ్వము, కొడవలి, కత్తి, వల్లెత్రాళ్లు.. ఏమీ వదలలేదు గోకులంలోని జనం."
   ఈ వర్ణన విన్న ప్రోలయ వేముని మోమున చిరునవ్వు కదలాడింది.
   సభలో కొందరు ప్రశ్నార్ధకములతో చూచారు.
   ప్రేక్షకుల కుతూహలమును గమనించిన సూరన తమ గురించి చెప్పుకోవలసిన సమయం వచ్చిందని అనుకున్నాడు. కంఠం సవరించుకున్నాడు..

   "వేగినాటి నుంచి పాకనాడుకు మేము వలస వచ్చాం.. వచ్చి ఇంతటి వాళ్ళం అయాం.
   దీనికి కారణం మన ప్రభువు ప్రోలయ వేమారెడ్డి. హరివంశ కావ్యం మనకందించిన కవి, ఎర్రన అప్పటికి ఇంకా జన్మించలేదు. కరాపర్తి గ్రామమునుండి, మమ్ములను గుడ్లూరు గ్రామమునకు రప్పించినది ప్రభువే..
   భటులను, మేనాలను పంపి సగౌరవంగా, సౌకర్యంగా తెప్పించారు.
   గుడ్లూరునందే మాకు పుత్రోదయం అయింది.
   ప్రభువు సోదరుడు మల్లారెడ్డి ప్రభువు ప్రోద్బలంతో చదవాలడ గ్రామమునకు.. ఆపైని, మరల వేమారెడ్డి ప్రభువు ఆదేశంపై అద్దంకికి వచ్చాం.
   వచ్చి ఇపుడు మీ ముందున్నాం."
   సభలో కరతాళ ధ్వనులు మిన్నంటాయి. అప్పటికే ఎర్రాప్రగడ కావ్యాలు పలువురు సాహిత్యప్రియుల మన్ననలందుకున్నాయి.
   ".. ప్రముఖులు గ్రుప్సియోలాకుపడ నెడనెడం గావలియై తగువారు నడిపింప నవ్విధంబునం జని బృందావనంబు ప్రవేశించి యుచిత ప్రదేశంబులు నివేశంబులుగా నిరూపించి గోపాల ముఖ్యులు నిలువ నాక్షణంబు.." ఈవర్ణనలో తెలుగుదనం ఉట్టిపడుతోంది..
   ఇందులో వర్ణించిన విధంగానే మా ప్రయాణములు కూడా సాగాయి.
   చిన్ని కృష్ణుడిని తెలుగు ఇళ్లల్లో పసిబిడ్డగా కూడా అంతే చక్కగా చూపించారు.
   ".. తండ్రిని గంటి నయ్యగంటి
    నిందు రావయ్య విందుల వింద వనుచు
    నర్ధిదను బిలువగ నడయాడియాడి
    యులసిల్లె గృష్ణుడు శైశవోత్సవముల్."


                   
   అదే విధంగా వెన్న, పాలు యశోద కృష్ణుడికి పెట్టడం చదువుతే.. తెలుగువారింటి ప్రతీ పసిబిడ్డడూ కృష్ణుడి వలెనే గోచరిస్తాడు.
   ఈ ఘట్టం అంతా చదివి ఎవరికి వారు ఆనందించి, చుట్టుప్రక్కలవారితో పంచుకోవాలే కానీ ఒకటి రెండు పద్యాలతో తృప్తి కలుగదు.
   ఇల్లిల్లు తిరిగి కృష్ణుడు చేసే దుండగాలు ఎర్రయ విపులంగా వర్ణించారు.
   కృష్ణయ్య అల్లరికి విసుగెత్తిన గోపికలు యశోద వద్దకు వెళ్ళి మొరబెట్టుకున్నారు..
   ‘ఎక్కడికేనియు బోయెద
    మిక్కష్టపు బాటువడగ నేమోర్వము నీ
    నొక్కపు గొడుకును నీవును
    నొక్కతలయు నొక్క మోరి నుండుడు నెమ్మిన్.’
   యశోద నొచ్చుకుని, "వీడిని ఎలా అణిచేస్తానో చూడండి. మీకనుమానం వద్దు.." అంటూ గోపికలకు సర్ది చెప్పి ఇళ్ళకు పంపేస్తుంది.
   ఆ తరువాత వాడిని లాలిస్తుంది.
   మళ్ళీ ఇళ్లల్లో పాలు పెరుగు త్రావే వాడి అల్లరి గుర్తుకొచ్చి ఉక్రోష పడుతుంది.
    "కదలిన మొత్తుదు నెక్కడ
    కదలెద వటు గరదులాడ కదలుసమ యేజూ
    చెద ననుచుబోయి యిమ్ముల
    ముదితనిజకుటుంబకార్యముల దత్పరయై."
   కదిలితే మొత్తుతాను. ఎక్కడికెళ్తావు.. కదలు చూస్తాను.. అంటూ ఇంటి పనుల్లో మునిగి పోతుంది.
   తెలుగింటి అమ్మల ముచ్చట్లు అన్నీ ఈ కావ్యంలో తేట తెలుగులో చదువుతాం.. చూస్తాం." సూరనార్యుడు కావ్య పఠనం ముగించి, గ్రంధాన్ని సరిది, తల ఎత్తి సభని కలియజూశాడు.
   సభ అంతా నిశ్శబ్దంగా ఉంది.
   అందరూ, కన్నులు మూసుకుని బాల కృష్ణుని క్రీడలలో తేలియాడుతున్నారు.
   ముందుగా ప్రభువే తేరుకున్నాడు.
   నెమ్మదిగా.. వున్నాయా లేవా అన్నట్లుగా కరతాళధ్వనులు మొదలయ్యాయి. ఒకటి రెండు క్షణములలోనే ప్రాంగణమతా చప్పట్లతో మారు మ్రోగి పోయింది.
   అప్పటికప్పుడు ప్రతులు వ్రాయుటకు వందమంది తయారయ్యారు.

   ప్రోలయ వేమారెడ్డి, ఆసనం మీదినుంచి లేచి వచ్చి ఎర్రాప్రగడని ఆలింగనం చేసుకున్నాడు.. ఆనంద భాష్పములు చెక్కిళ్ళని తడిపేస్తుంటే.
   ఉద్వేగంతో ఒకింత ఎర్రవడిన మోముతో ఎర్రన బిడియంగా నిలబడి పోయాడు.
   ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండటం విజ్ఞుల లక్షణం.
   సభలోని పండితులందరూ, ఒక్కొక్కరే వచ్చి తమ అభినందనలు తెలియజేశారు.
   సభలో ఉత్సాహమంతా సర్దుకున్నాక ఎర్రన వేమారెడ్డి ప్రభువును పుష్ప మాలాలంకృతుడిని చేశాడు. ఆ పిదప జాగ్రత్తగా తన కావ్యమును తీసుకుని వచ్చి, పరిచారికలందించిన బంగరు పళ్ళెరములో నుంచి కృతిని సమర్పించాడు.
   ప్రోలయ వేమారెడ్డి ఆకాంక్ష తీరి సంతుష్టుడైనాడు.
                           …………
                             
   కొండవీటి కోట నిర్మాణము పూర్తి అయినది.
   శతృ దుర్భేద్యమయిన కోట.

           
   రాజ్యం ప్రశాంతంగా ఉందని నమ్మడానికి లేదు.. ఏమరుపాటుగా నుండుటకు అసలే లేదు.
   ఏ క్షణమైననూ ఢిల్లీ నుంచి ముసల్మానులు రావచ్చును.. లేదా దక్షిణమునుండి పాండ్యులు, పశ్చిమమునుండి కర్ణాటకులు, తూరుపున కళింగులు..
   వీరువారని లేదు.. అందరికీ పరాయి రాజ్యమును ఎప్పుడెప్పుడు కబళిద్దామా అనే ఆశే.
   అందువలననే కొండవీడులో కోటని, రాతి కోట గోడలతో, కందకములతో పటిష్ఠంగా నిర్మించారు వేమయ ప్రభువు. రాజధాని అద్దంకి నుండి కొండవీడుకి మార్చబడింది.
   అద్దంకి వాస్తవ్యులందరికీ వీడుకోలు చెప్పి వేమారెడ్డి తన పాలనని, వసతిని కొండవీటికి మార్చాడు.
   శ్రీశైలములో, అహోబిలములో సోపాన నిర్మాణములు కూడా పూర్తి అయినవి. అనుకున్నపుడు అనుకున్నట్లుగా భక్తులు తమ స్వామిని దర్శించుకుంటున్నారు.
   ఎర్రన కుటుంబము కొల్లూరునకు తరలి.. అక్కడే స్థిరనివాసమేర్పరచు కున్నారు.

   కొండవీడునకు మారిన పదహారు వత్సరముల వరకూ వేమారెడ్డి ప్రజా రంజకముగా రాజ్యమును పాలించాడు. జ్యేష్ఠ కుమారుడు అనపోతారెడ్డికి రాజ్యమప్పగించి కన్ను మూశాడు.
   అనపోతారెడ్డి కాలములో ఇతని తమ్ముడు అనవేమ భూపతి ఎర్రయప్రగడగారికి యాభై పుట్ల చేనును ధారపోసి కొల్లూరును కలిపి, శాసనము వ్రాయించారు.
   తాతగారి వలెనే పూర్ణాయుష్మంతులై జీవించారు ఎర్రాప్రగడ. ఈ శంభుదాసుని పేరు మీదనే కొల్లూరు వద్ద చదలవాడ అనే గ్రామం ఏర్పడి.. ఎర్రయగారి సంతతకి చదలవాడవారనే ఇంటి పేరు వచ్చి ఉంటుంది.
   ఈ ప్రబంధ పరమేశ్వరుని ఒరవడితోనే తెలుగునాట ప్రబంధముల ఆవిర్భావము జరిగింది. నన్నయ తిక్కనార్యులతో చేరి భారతాన్ని పూరించిన ఎర్రయగారు లేకపోతే ఆంధ్ర మహాభారతము అసంపూర్తిగా మిలిపోయేది. తెనుగు వారికి గర్వకారణమయిన ఈ గ్రంధమునొసగిన కవిత్రయమునకు తెలుగువారు సర్వదా కృతజ్ఞులు.

                                             .సమాప్తం.
                       *-------------------*

  
   నమస్కారం. నా పేరు మంథా భానుమతి. తెలుగు వన్ డాట్ కాం వారి బహుముఖ రంగాలలో సాహిత్యం  విభాగం లో మొదలైన ధారా వాహిక వచన కావ్యం.. “చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” రచయిత్రిని.  ఆంధ్ర మహా భారతం సాహితీ జీవ మహా నది ఐతే.. రెండు వేర్వేరు ఒరవడులు కలిగిన సాహితీ వాహినులను.. వేగంలో, స్వచ్ఛతలో ఎటువంటి కల్తీ లేకుండా కలిపిన జీవ నది, ఎర్రాప్రగడ కవి రచించిన అరణ్య పర్వ భాగం. స్వయంగా మొత్తం కావ్యం రాయడం వేరు.. ఇద్దరు కవుల కావ్యానికి వారధి కట్టడం వేరు.. అందుకే నాకు ఎర్రనగారి జీవిత చరిత్ర మీద కుతూహలం కలిగింది.
పది సంవత్సరాల పసి వయసులోనే క్లిష్ట పదాలతో చందో బద్ధంగా పద్యం చెప్పి తాతగారిని ఆశ్చర్య పరిచిన ఎర్రన అంటే ఆరాధన కలిగింది. .
ఎర్రాప్రగడ జీవిత విశేషాలన్నీ, “ఎర్రాప్రగడ చరిత్ర” అని రాయచ్చు కదా.. చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు ఏమిటి అని సందేహం రావచ్చు.
ఎర్రాప్రగడ జీవిత కాలంలో తెలుగునాట రాజకీయ చరిత్ర అనేక మలుపులు తిరిగింది.
తొలి చూలుగా వంశోద్ధారకుడు కావాలనుకునే కాలంలో.. ఎర్రన తల్లి.. “దేవుడా.. నాకు ఆడపిల్లనే ఇవ్వు” అని ప్రార్ధించిన పరిస్థితులు.
ఆ చరిత్ర అంతా చెప్తూ, నృసింహ పురాణ కావ్య రచనతో ప్రబంధ పరమేశ్వర బిరుదాంకితుడైన ఎర్రన జీవితం ఆ కాలంలో ఎటువంటి విధానంతో నడిచిందీ అని చెప్పాలని ఈ వచన కావ్యం రాశాను.
ఎర్రాప్రగడ వారి ఆరాధ్య దైవం నీలకంఠేశ్వరుని ప్రార్ధిస్తూ.. ఈ సాహసం చేశాను.  నా ప్రయత్నం ఫలించిందా లేదా అనేది పాఠకుల నిర్ణయం. ఈ రచనలో దొర్లిన తప్పులను క్షమించమని పండితులను వినయంగా కోరుతున్నాను.

------------------------------     

.....మంథా భానుమతి


అనగనగా ఒక మంచాయన ఉండేవాడట. వాళ్ళ ఊరికి దగ్గర చాలా పండ్ల తోటలు ఉండేవి. పండ్లని తినేందుకు చిలకలు, వగైరా పక్షులు వచ్చేవి...
Feb 27, 2020
అది మంచి వేసవి కాలం. పిల్లలందరికీ సెలవలు. నారాయణ రెడ్డి ఆ రోజు ఉదయం బజారునుండి ఒక పుచ్చ కాయని తెచ్చాడు. పిల్లలంతా అది చూసి చాలా సంబరపడ్డారు....
Feb 8, 2020
అనగనగా ఒక ఊళ్లో ఇద్దరు దంపతులుండేవారు.
Aug 7, 2019
మతి మరుపు
Jul 31, 2019
ఆవులు కాసే రంగన్నకు ఉన్నట్టుండి ఓ సందేహం కలిగింది. "నేనేం చెయ్యాలి..
Jun 25, 2019
“అబ్బా!” తెల్లని డోరియా చీరపై గులాబీలు క్రాస్..
May 11, 2019
ఒక ఊరిలో రాజయ్య అని ఒక కట్టెలు కొట్టేవాడు వుండేటోడు...
Apr 27, 2019
గిరి వాళ్ళ నాన్న వీరయ్య కష్టజీవి. వాళ్ళు పడే కష్టం తెలుసు గనకనే..
Apr 26, 2019
అనగనగా ఒక ఊళ్లో ఒక అన్న, ఒక తమ్ముడు ఉండేవాళ్ళు.
Oct 30, 2019
ధర్మపురంలో చాలా పేద కుటుంబం ఒకటి ఉండేది.
Apr 24, 2019
TeluguOne For Your Business
About TeluguOne