Facebook Twitter
“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 20 వ భాగం

 

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 20 వ భాగం
 

ఎర్రాప్రగడ, తనకి అరణ్యపర్వ రచనలో దొరకని అవకాశం, తదుపరి రచన నృసింహ పురాణంలో పుష్కలంగా వాడుకున్నారు. అదే... పీఠిక.
   “అహోబలేశు డతిలోకుడు లోకము కాంచు గావుతన్" అంటూ అహోబల నరసింహుని మహిమను పొగడుటకై తానీ కావ్యమును వ్రాస్తూ, ఇష్ట దేవతా ప్రార్ధన తో కావ్యమారంభించాడు.
   అదే విధంగా దేవతలను స్తుతిస్తూ భారతీదేవిని, “భాసురమగు మౌక్తికంపు జపసూత్రము దాల్చుట బ్రహ్మవాదియై” అంటూ చిత్రంగా సన్యాసిని రూపంలో తలచారు.
   సరస్వతీదేవి రూపంలో గురువైన శంకరస్వామి గోచరించి ఉండాలి ఆ సమయంలో. అందుకే ఆవిడ జపమాల ధరించింది.
   తండ్రికంటెనూ గురువుగారి ప్రమేయం ఎర్రాప్రగడ జీవితంలో అధికం.
   “శ్రీ శంకరస్వామి సంయమీశ్వర చరణసరోరుహ ధ్యానంద సౌందర్య ధుర్యుడ” నని చెప్పుకున్నారు ఎర్రన తన గద్యములలో. శ్రీశైల పర్వత ప్రాంతాల శంకరస్వామి వేదోద్ధరణ కార్యములు చేపట్టారు. ఎర్రనగారికి శంభుదాసుడను బిరుదు గురువుగారే ఇచ్చారు.
   కావ్యరసము గ్రోలిన మానవకోటికి పశుసమానత మాన్పిన, రాఘవుని కథ చెప్పిన, మునీశ్వరులలో నాతనికి ఎవరూ సాటిలేని వాల్మీకి మహర్షిని కొలిచారు.
   ఆదిమపండితుడు, అచ్యుతుడు, వేదములను మానవాళికి ఒసగినవాడు.. పరాశరుని పుత్రుడు అయిన వ్యాసమునిని కొలిచారు.
   తన ప్రధమ కావ్యమునకు స్ఫూర్తినిచ్చి, కవిత్రయములో చోటిచ్చిన వారినీ విధంగా స్తుతించారు.
   “భాసుర భారతార్ధముల భంగులు నిక్క మెరుంగ నేరమిన్
    గాసట బీసటే చదివి గాధలు ద్రవ్వు దెనుంగు వారికిన్
    వ్యాసముని ప్రణీత పరమార్ధము తెల్లగ జేసినట్టి య
    బ్జాసనకల్పులం దలతు నాద్యులు నన్నయ తిక్కనాదులన్.”

   నిత్య శివరాత్రి వ్రతము జేయు గురువు శంకరస్వామి మునీంద్రుని ఆశ్రయిస్తూ ఈ కథ చెపుతానన్నారు.
   ఆ పిదప తన వంశ చరిత్రను తెలిపారు.
   తాతగారు పేరింటిగాడైన తనను ఎంత ప్రేమగా చూసినదీ, ధ్యానమున తనకి కానిపించి నరసింహుని గాధను రచించమని కోరినదీ చెప్పారు.
   చివరగా.. అహోబిల నారసింహునికిన్..
   పదునొకండు కంద పద్యములలో అహోబిల నారసింహుని మీద షష్ఠ్యంతములు వ్రాసి, కావ్యరచనలోనికి ప్రవేశించారు.
   పురాణమే అయిననూ ఇందులో సమకాలీన విషయాలు జొప్పించి, ఆ నాటి కాలమాన పరిస్థితులను తెలియజేశారు.
   వైకుంఠంలో విష్ణుమూర్తిని కొలవడానికి వచ్చిన వాళ్ళను ఫణిహారులు ఎదురేగి సర్ది కూర్చోపెడుతున్నారు.
   “హస్తులై ఫణిహారు లందంద నిలువ నధికమై యొప్పె సమ్మర్ధమాదిదేవు..”
   నృసింహపురాణ కావ్యం చిన్నదే.. కానీ చిన్నికృష్ణుని బుల్లి నోటిలో అండపిండ బ్రహ్మాండం దాచినట్లు.. భావం అనంతం. కవిత్వం హిమవన్నగం.

   ప్రసిద్ధం “అహోబిలం”
   ప్రహ్లాదవరద నారసింహుని నిలయం.
   ప్రకృతి రమణీయం. ఆస్వామికి
   ప్రణామం. ఆతని మహిమ అనన్యం.

   శ్రీమహా విష్ణువు లోకసంచారానికి వెళ్ళాడు. సిరికూడా వెనువెంటే..
   క్షీరసాగరమున స్వామికి శయ్యగా సేవ చేసుకుంటున్న ఆదిశేషువునకు విశ్రాంతి, కాసింత విరామం దొరికింది. నిశ్చలుడైన ఆయనకి విరామం చలనమే కదా!
   చుట్టలు విప్పి విప్పి తోకమీద లేచి నలు ప్రక్కలా చూచాడు. పదునాలుగు లోకాలూ గోచరించాయి. ఎన్నెన్ని అందాలు..
   ఆనందంలో ఒడలు విరిచి మెలికలు తిరిగిపోయాడు. సాగరమంతా అల్లకల్లోలమయిపోయింది. వేయిపడగలూ బుసలుకొట్టి విషాన్ని గ్రక్కబోయాయి.
   ఆ విషమంతా బయటికి వస్తే.. పదునాలుగు లోకాలూ.. ఆ తలపే భయంకరం.
   ఆదిశేషుడు అమ్మో అనుకుని, నాలుకలు కరచుకొని, తలలను కిందికి దించి, ముడుచుకుని ముడుచుకుని, కామరూపుడై మామూలు పాము అయిపోయాడు.
   చరచర పాకుతూ సంద్రం బయటికి వచ్చి, జంబూద్వీపే భరతఖండే భరతవర్షే శ్రీశైలప్రదేశే పయనించాడు.
   సకలలోకాల పైకీ లేచి వీక్షించి నపుడాయనకి ఆ ప్రాంత ప్రకృతి మానసోల్లాసాన్ని కలిగించింది.
   మహోన్నత వృక్షాలన్నీ తీరుగా, తమకి ఎదురే లేదన్నట్లుగా గంభీరంగా నిలిచి ఉన్నాయి. తొణకక బెణకక ఊపిరి మరచి స్థిరంగా నిలిచి ఉన్నాయి. వానినల్లుకుని రంరంగుల పూలున్న తీవెలు, సుగంధ భరితములై కన్నులకింపై స్వాగతిస్తున్నాయి.
   చల్లనిగాలికి తలలూపుతున్న కొమ్మలు ప్రకృతి మాత చీర చెరగు వలే వయ్యారాలు పోతున్నాయి.
   నందన వనాన్ని మించిన అందాలతో ఉన్న అచ్చోటుని చూసి ఆదిశేషుడు పరవశించి పోయాడు.
   క్షీరసాగరంలో కనుచూపుమేర ఏమీ కనిపించదు. సూర్యోదయ అస్తమయాల్లో తప్ప ఎప్పుడూ నీలి ఆకాశం, నీలి సంద్రం. ఎవరికైనా మార్పు స్వాగతమే కదా!
   నెమ్మదిగా వృక్షాల మధ్య చోటు చూసుకుని పవళించాడు. శ్రీ మహావిష్ణువునకు తాను కావాలనుకుంటే అక్కడికే వస్తాడు.
   అలాగే వచ్చాడు.. మరి ఏం చేస్తాడు! ఆదిదేవునికైననూ, ఎక్కడెక్కడ తిరిగినా, ఎన్ని పనులు చేసినా శయ్యా సుఖం అనివార్యం కదా!

.....................

ప్రహ్లాదుడు హరినామస్మరణతోనే పుట్టి, హరినే ధ్యానిస్తూ, తండ్రి అరిని కొలువ వద్దని నయానా, భయానా ఎంత చెప్పిననూ వినకుండా విష్ణు ధ్యానంలో పడిపోయాడు.
   తండ్రి అయిన హిరణ్యకశిపుడి ఎదురుగా స్తుతించ సాగాడు.
   “విష్ణుమయము వేదంబులు
    విష్ణుమయము వర్గ మఖిల విజ్ఞానములున్
    విష్ణుమయము జగమంతయు
    విష్ణుమయము విష్ణుడొకడ వేద్యుడు బుద్ధిన్.”
   హిరణ్యకశిపుడు ఆగ్రహావేశాలతో ఊగిపోయాడు. ఏనుగుల చేత తొక్కించాడు. ఎత్తైన కొండ మీదినుంచి కిందికి విసిరివేయించాడు.. భార్య లీలావతి ఎంత వేడుకున్ననూ కరగలేదు ఆ కఠిన హృదయం.
   సముద్రంలోకి పడవేయించాడు. హరి నామస్మరణ ఆ బాలుని కాపాడింది.
   తన భక్తుని, బాల ప్రహ్లాదుని పెట్టు కష్టముల చూచి సహించలేని శ్రీ మహావిష్ణువు, స్తంభము లోనుండి వచ్చి, నరహరి రూపుడై అహోబిలం వద్ద హిరణ్యకశిపుడిని ఉదరము  చీల్చి సంహరించాడు.

అలసి సొలసిన ఆది విష్ణువు పవళించదలచాడు.
   పవళించిన ఆదిశేషుడిని చూసి అహోబిలం వద్ద.. లక్ష్మీ సమేతుడై నారసింహుడు ఆతని నడుముపై స్థిర నివాసమేర్పరచుకున్నాడు. తిరుమల కొండల వద్ద పడగలపై శ్రీనివాసుడు.. శ్రీ శైలము దగ్గర వాలముపై మల్లిఖార్జునుడు వెలిశారు.
   లక్ష్మీ నరసింహుని పద సరోజములు కడిగే పాద్యంగా దివినుండి గంగ భు వికి దిగి వచ్చింది., భవనాశిని అనే నామముతో.
   “అమ్మహానది కొలు గైకొనియె నా దేవుండు భవనాశినీ సమాహ్వయం బని యభినందించె.”
   వాగులతో, ఏరులతో, కొలనులతో
   వానిలోని కలహంసలతో,
   వటవృక్షములతో వాని మీది తీవెలతో
   వాలుకొమ్మలమీద వాలిన పికములతో
   వాలముల ఝాడించి కొమ్మలమీద గెంతు
   వానరములు వెట్టు కిచకిచలతో
   వన్య మృగములు కూడ భక్తితో నడయాడు
   వనమదే అహోబలేశు వాసము.
   నారసింహుని నుతిస్తూ కొండనెక్కుతున్నారు అద్దంకినుండి తరలి వెళ్ళిన ప్రోలయ వేమారెడ్డి, ఆయన కొలువులోని ప్రముఖులు.
   అహోబల నారసింహునికి అంకితమిచ్చుటకు ‘నృసింహపురాణ కావ్యమును’ పట్టుబట్టల చుట్టి, కదంబ మాలతో అలంకరించి తన కుటుంబముతో సహా ఉన్నాడు ఆ ప్రముఖులలోనే ఎర్రాప్రగడ.
   నృసింహపురాణమను కావ్యమును పూర్తి చేసితినని చెప్పి, కొన్ని పద్యములు వినిపించాడు ఎర్రన, వేమారెడ్డి సాహిత్య సభలో.
   షష్ఠ్యంతములలో అహోబల నారసింహుని నుతించాడు కనుక కృతి కర్త నారసింహుడే.
   కావ్యమును చదివిన వేమారెడ్డి ప్రభువు, తన యాస్థానకవి అంతటి ఉద్గ్రంధమును రచించినందున అందరూ కలిసి అహోబిలమునకు వెడలి, ఆ స్వామిని దర్శించి అంకిత మివ్వాలని ఆదేశించాడు.
   కాలినడకన ఆ కొండలలో దుర్గమమైన దారిలో, నరసింహ స్తోత్రములు చదువుతూ, ప్రహ్లాదుని చరితమును చెప్పుకుంటూ కొండ ఎక్కి.. నరహరికి పూజలు చేసి.. అంగరంగ వైభవముగా కృతి సమర్పణ చేశారు.
   ఆ సమయమున ఎర్రన, రాజునకు రామాయణ కావ్యమును రచించి ఇస్తానని వాగ్దానము చేశాడు.
                        ………………….
                                 16
   ప్రోలయ వేమారెడ్డి బహు సంతుష్టుడై ఉన్నాడు.
   కాకతీయ సామ్రాజ్యములో నాయంకరుడిగా నుండి, కప్పము కడుతూ.. యుద్ధములలో పదాతి దళమునూ, తురగ సైన్యమునూ, గజ బలమునూ పోగొట్టుకుని దిన దినమూ భయంతో బ్రతికిన తానూ, తన ప్రజలూ తురుష్కులను గెరిల్లా యుద్ధము చేసి ఓరుగల్లు వరకూ తరిమి కొట్టిన తరువాత స్వతంత్ర రాజ్యమును స్థాపించి ఎనిమిది సంవత్సరములయింది.
   ఈ అష్ట వర్షములలో ఎంతో ప్రగతిని సాధించాడు.
   గ్రామ గ్రామములో చెరువులు తవ్వించాడు. చెట్లు నాటించాడు.
   పాకనాడులో నున్న అడవులను రక్షింప బూనుకున్నాడు.
   వంట చెరకుకు కట్టెలు కొడితే.. ఒక చెట్టుకు పది చెట్ల చొప్పున నాటి వాటి సంరక్షణ కూడా వారే తీసుకునేట్లు శాసనం చేశాడు.
   అక్షర యజ్ఞం మొదలుపెట్టాడు. ఐదు సంవత్సరముల బాలబాలికలందరూ అక్షరాభ్యాసం చేసుకుని పాఠశాలలకు వెళ్ళాలి.
   కనీసం కోమటి లెక్కలు వచ్చే వరకైననూ గణితం అభ్యసించాలి.
   వ్యవసాయం వర్తకం.. రెండూ బాగుగా అభివృద్ధి చెందాయి.
   పెక్కు దాన ధర్మములు కూడా చేశాడు.
   ఆస్థాన కవి ఎర్రాప్రగడ, ప్రోలయ వేముని దాన ధర్మములను ఆశువుగా వర్ణించి తదుపరి కావ్యము హరివంశములో భద్ర పరచాడు.
   “అగ్రహారములు విద్యా తపో వృద్ధ విప్రులకిచ్చి యజ్ఞకర్తలుగ బనిచె
   గొమరార జెరువులు గుళ్లు ప్రతిష్ఠించి లోకసంభావ్యంబులుగ నొనర్చ
   నిధులు నల్లిండ్లును నిలిపె దోటలు సత్రములు చలిపందిళ్లు వెలయబెట్టె
   హేమాద్రిపరికీర్తి తామిత వ్రతదాన నివహంబులన్నియు నిర్వహించె
          జేసె జేయుచు నున్నాడు సేయనున్న
          వాడు పునరుక్త కృతి శుభావలుల నెల్ల
          ననగ శ్రీవేమ విభునకు నలరు పేర్మి
          వశమె వర్ణింప దద్‍భాగ్య వైభవంబు.”
   రాజ్యం సుభిక్షంగా ఉంది. రామరాజ్యంలో వలె సకాలంలో వానలు కురుస్తున్నాయి. కరవు కాటకాలు దరిచేరడం లేదు.
   యువతీ యువకులనేకమందికి వివాహములొనర్చి, వారికి ఇండ్లు కట్టించి ఉపాధి కలిపించి నల్లిండ్లు నిలిపారు వేమయ ప్రభువు.
   అంతా ఆ నారసింహుని, మల్లిఖార్జునుని కృప అనుకున్నాడు వేమారెడ్డి.
   రెడ్డి ప్రభువు దైవభక్తి ఎన్నదగినది.
   కొండంత దేవునికి గోరంత పత్రిని ఇవ్వదలచాడు.
   అహోబిలంలో, శ్రీశైలంలో సోపానములు కట్టించడానికి నిశ్చయించాడు.
   ఈ వార్త విన్న ప్రజలలో సంతోషించని వారు లేరు. శైవులకీ, వైష్ణవులకీ కూడా నోట తేనె త్రావించిన చందమయింది.
   ఇష్ట దైవమును సులభముగా చేరుకొన గలుగుట ఒక ఎత్తైతే.. దారి సుగమం చెయ్యడానికీ, మెట్లు కట్టడానికీ, వందలమందికి ఉపాధి దొరుకుతుంది.
   కొండవీటి కోట పని పూర్తి కావచ్చింది.
   అహోబిలంలో, శ్రీశైలంలో పనులు మొదలయ్యాయి.

   ఎర్రాప్రగడ రామాయణ రచనకి కూర్చున్నాడు.
   ఒక్కసారి ఆలోచించి పని చెప్పాలే కానీ ఆ గంటం ఆగదు. అందునా ఒక ఒరవడికి అలవాటు పడిపోయిన చేయి అది.
   శంభుదాస బిరుదాంకితుడు..
   శివభక్తుడు. అనునిత్యం శివాభిషేకం చేసే సూరనార్యుని కుమారుడు. శంకరస్వామి శిష్యుడు. ఏమైననూ.. ఏది జరిగిననూ ఈశ్వరకృప వలననే అని నమ్మినవాడు ఎర్రనార్యుడు.
   కానీ అతడి కావ్యాలన్నీ విష్ణు సంబధితాలే!
   అందుకు తాతగారు నూరిపోసిన హరిహరాద్వైత సిద్ధాంతం కొంత కారణమైతే.. ఆ శివుడే తన చేత వ్రాయిస్తున్నాడన్న ఎర్రన నమ్మకం మరింత దోహదం చేసింది.
   మహాభారత అరణ్యపర్వ భాగంలోనే, రామాయణం మూడువందల పదకొండు గద్యపద్యాలు వ్రాశారు. తన భావాలకు అనుగుణంగా మూల రచనలో కొన్ని మార్పులు చేశారు. ఇది అరణ్యపర్వం లోనున్న రామాయణంలోనే కనిపిస్తుంది.
   వాల్మీకి రామాయణంలో రావణుడు, ఇంద్రజిత్తును పిలిచి రామ లక్ష్మణులను సంహరించి రమ్మని చెప్పి నపుడు.. రావణుడు ఇంద్రజిత్తుని పొగడుతాడు. అతని పరాక్రమాన్ని మెచ్చుకుంటాడు.
   ఎర్రనగారు మాత్రం ఇంద్రజిత్తు తండ్రిని ఊరడిస్తున్నట్లు వ్రాశారు.
   “క్రోతులను కొండ మ్రుచ్చులను చీల్చి చెండాడుతాను. దిఙ్ము ఖుండనై విజృంభిస్తాను. వీర నృత్యము ఆడుతాను. రయంబున బార్ధివ సూనులిద్దరం గ్రీడయపోలె గిట్టి పెడకేళ్ళొగి గట్టెద బట్టి తెచ్చెదన్.”
   తండ్రి కొడుకుని పిలిచి తన్ను ఆదుకొమ్మని అడిగినప్పుడు, నీవు నాకు అప్పజెప్పిన పని చేస్తాను అని ఊరడించడం ఎంతో ఉచిత మైన పని.
   తెలుగు వారి ఇళ్లల్లో తల్లిదండ్రులు పిల్లలను పొగడుట, మెచ్చుకొనుట ఉండదు. వారికి దిష్టి అనీ, ఆయుక్షీణం అనీ ఒక నమ్మకం.
   తెలుగువారి మనోభావాలను, సాంప్రదాయాలను సున్నితంగా తెలియజెప్పారు ఎర్రన.
   ఇతర రామాయణాలలో.. ఎంతో ఉదాత్తమైన రాముడి పాత్ర ఒక ఘట్టంలో దెబ్బతిన్నట్లు కనిపిస్తుంది. ఆక్షణంలో రామ భక్తులకు కూడా కోపం వస్తుంది.
   సీతమ్మ అగ్నిప్రవేశానికి ముందు రాముడు చాలా నిర్దయగా మాటలాడుతాడు. అగ్నిప్రరీక్ష అయ్యాక, అందరూ సీతమ్మ శీలాన్ని పొగుడుతే అప్పుడు తేరుకుని అర్ధాంగితో ప్రసన్నంగా పలుకుతాడు. అయితే ఎర్రనగారు మాత్రం, ఆ కఠిన పరీక్షకు కారణం రాముడి చేతనే అగ్నిహోత్రునకు చెప్పిస్తాడు.
   “దశానను నంతిపురము నందు పెక్కు దినంబులున్న జనకాత్మజను శోధన చేయక అనార్య విహిత వృత్తిని రఘురాముడు తెచ్చాడని అవని జనంబులెల్లరు ఎంచరా?
   భువనములెల్ల నమ్ముటకుబో యిటు చేసితి హవ్య వాహనా.”
   ఈ విధంగా రాముడు చెప్పుకుంటే అయ్యో పాపం.. అనిపించదా! అప్పుడా రాముని పాత్రలో ఔచిత్యం కనిపించకుండా ఉంటుందా!
   రాముడు తన మనస్సులో సీత పునీత అని నమ్ముతున్నట్లు ఎర్రయగారు వ్రాశారు. నిప్పువంటి మహనీయ చరిత్ర గలది అని రాముడన్నట్లు చెప్పారు.
   చదువరికి హృదయానంద కరంగా అనువాద రచనల్లో మార్పులు చెయ్యడం విజ్ఞుల అభిరుచికి నిదర్శనం.
   రమణీయమైన రామాయణకావ్యాన్ని అనుకున్న సమయంలోగానే పూర్తి చేశారు ఎర్రాప్రగడ.

   ఎర్రాప్రగడగారి ఇంట కోలాహలంగా ఉంది.
   ఇంటిలోని వారందరినీ రాజుగారి సభకి తీసుకుని వెళ్తున్నారు ఎర్రన.
   ఆ రోజు రామాయణ మహా కావ్యాన్ని వేమారెడ్డి ప్రభువునకు అంకిత మిచ్చే మహోత్సవం.
   ప్రభువు, కవీ కూడా ఎన్నినాళ్ళుగనో ఎదురు చూసిన పవిత్రమైన రోజు. కృతి కర్తకీ, కృతి భర్తకీ.. వారి జన్మ నక్షత్రాలకి అనుకూలంగా కుదిరే లాగున ముహుర్తం పెట్టారు సూరనార్యుడు.
   ఎర్రాప్రగడగారి గృహము మాత్రమే కాదు..
   ఊరు ఊరంతా కొలువుకి తరలి వెళ్ళడానికి తయారవుతున్నారు. ఇల్లు కదలని స్త్రీలకి అదొక అపూర్వ అవకాశము.
   ప్రతి దినమూ ధరించే నగలతో తృప్తి లేదు..
   చోరుల కందకుండా నేల మాళిగలలో దాచిన కాసులపేర్లు, వడ్డాణాలు బయటికి వచ్చాయి.
   పట్టు వస్త్రములు ధరించి, ముక్కుకున్న నత్తులు మెరుస్తుండగా, చంద్రహారాలు, కంటె, అడ్డిక.. అన్ని రకముల నగలూ ధరించి ఆడవారు హడావుడిగా తిరిగేస్తున్నారు.
   "అయ్యయ్యో!" ఎర్రనగారి పడక గృహమునుండి విన వచ్చిందొక కేక.
   పోతమాంబ వడివడిగా అడుగులు వేస్తూ పరుగిడింది. తండ్రీ కొడుకులు దగ్గరుండి అలంకరించిన, ఏనుగునూ బళ్లనీ తీసుకొని వచ్చుటకు వెళ్ళారు. ఆలస్యం కుదరదు సూరనార్యునికి.
   "ఏమిటి తల్లీ! ఏమయింది?" పోతమాంబ ఆదుర్దాగా అడిగింది కోడలిని.
   "ఈ పచ్చలపతకం, చంద్రహారం, ముత్యాల హారం చిక్కుపడిపోయాయి. ఎంత ప్రయత్నించిననూ చిక్కులు వదలుట లేదు" కోడలు నిస్సహాయంగా చూస్తూ అంది.
   అత్తాకోడళ్ళిద్దరూ కలిసి, జాగ్రత్తగా చిక్కుముళ్లని విప్పారు.
   రాణీగారి ప్రక్కన కూర్చుని వేడుక చూడాలి మరి.. తీరుగా లేకపోతే ఎలా!

.....మంథా భానుమతి