Facebook Twitter
“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 17 వ భాగం

 

 

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 17 వ భాగం

"స్వామీ! గృహ కృత్యములకు.. అగ్నిదేవునకు, అత్తమామలకు, ఆచార్యులకు ఫల పుష్పాదులు తెచ్చుటకు అడవికి వెళ్తున్న మిమ్మల్ని ఆపలేను. అది మీ కర్తవ్యం. కానీ ఈరోజు మీరు వంటరిగా వెళ్ళవద్దు. నేనుకూడా మీ వెంట వస్తాను. మిమ్ములనొక్కరినీ పంపుటకు ఈ రోజు నామనస్సంగీకరించుట లేదు."
   సావిత్రి పలుకులు సత్యవంతుని ఆలోచనలో పడవేశాయి.
   "దేవీ! మన వివాహమయి సంవత్సరం కావస్తోంది. ఏ నాడూ నువ్వు ఒంటరిగా అడవిలో తిరగ లేదు. అడవి మార్గం కంటకాలతో రాళ్ళు రప్పలతో నిండి ఉంటుంది. నిటారుగా నడవడానికి చెట్ల కొమ్మలు అడ్డు వస్తాయి. పైగా మూడురోజుల ఉపవాస దీక్ష అనంతరం నీరసించావు. అడవిలో మనలేవు."
   "ప్రభూ! ఉపవాసం వల్ల నాకు నీరసం లేదు. ప్రయాణం వల్ల నేను అలసిపోను. మీతో కలసి అరణ్యాలకు రావాలని ఉత్సాహంగా ఉన్నది నాకీవేళ. దయచేసి నా మాట వినండి."
   తన పత్ని పట్టుదల తన వివాహమప్పుడే అవగతమయింది సత్యవంతునికి.
   "సరే! నాకేమియును అభ్యంతరము లేదు. అత్తమామల అనుమతి తీసుకుని రా."
   ద్యుమత్సేనుడి వద్దకు వెళ్ళి అడిగింది సావిత్రి,
   "మీరు పెద్దవారు, పూజ్యులు. నా మనస్సు అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ రోజు నా పతిని వదిలి ఉండుటకు అంతరాత్మ అంగీకరించుటలేదు. వారితో వనానికి వెళ్ళుదామని నిశ్చయించుకున్నాను. మీ అనుమతికై వచ్చాను."
   "వివాహమయిన తదుపరి నీవు కోరిన కోరిక ఇది యొక్కటే. దానిని కాదనే శక్తి మాకు లేదు. అలాగే వెళ్ళిరా తల్లీ. మార్గమధ్యంలో సత్యవంతుని కనిపెడుతూ ఉండు." అన్నాడు ద్యుమత్సేనుడు.
   అత్తమామల అనుమతి లభించింది. పుట్టెడు దుఃఖాన్ని గుండెలో దాచుకొని చిరునవ్వుతో భర్త వెంట అడవికి బయలుదేరింది సావిత్రి.
   సా జగామ యశస్వినీ,
   సహ భర్త్రా హసంతీవ
   హృదయేన విదూయతా."
   సూరనార్యుడు చిరునవ్వుతో తల పంకించాడు. మరల తేట తెలుగులో సెలవిచ్చాడు ఎర్రన..
   "చిత్తంబున బైకొనియెడు
   నుత్తలము నడంచి ముఖ పయోరుహమున ద
   క్కొత్తెడు వెడ నవ్వున బ్రియు
   చిత్తం బిగురొత్త జనియె జెలువు యడవికిన్."

220px-Satyavan_Savitri.jpg

                  
   యెర్రన రాగయుక్తంగా చదివిన కంద పద్యపు సొబగులకు సూరనార్యుని కన్నులు చెమర్చాయి. అందునా ఆపద్యము నందలి భావము మాత్రము సామాన్యమైనదా!
   మనస్సును కలచి వేసెడిది కదా..
   ఎర్రన తండ్రి మోమును చూచాడు. పోతమాంబ ఆందోళనగా లేవబోయింది.
   "ఏమీ లేదు. ఆ కంద పద్యపు అందాలను ఆస్వాదిస్తున్నాను. పద్యంలో భావమునకు ఒడలు గగుర్పొడిచింది." సూరనార్యుడు భార్యకు ధైర్యము నిచ్చాడు.
   యెర్రన చిరునవ్వుతో కొనసాగించాడు..
   "మనస్సులో పెల్లుబుకి వచ్చే పరితాపాన్ని అణచుకుంటూ, ముఖ కమలంబులో వెలుగొందే చిరునవ్వుతో భర్త మనస్సు చిగురించేలా సుకుమారి సావిత్రి అడవికి వెళ్ళింది.
   సావిత్రీ సత్యవంతులు వనమున ప్రవేశించారు.
   వివాహానంతరం దంపతులు చేస్తున్న విహారం అదే."

   సత్యవంతునకు మహోత్సాహంగా ఉంది. వనములోని విశేషాలను వర్ణిస్తూ, సతీ సాన్నిధ్యాన్ని మనస్ఫూర్తిగా ఆనందిస్తున్నాడు.
   ‘మనోహరమైన వన సౌందర్యం చూడు చెలీ..
   కొలనులో.. విరిసిన కమలాలు, నడయాడే రాజహంసలు,
   వాటి కదలికల సొంపులు అవిగో!
   ఎర్రని చిగురాకులు, రంగు రంగుల పూవులు
   చెట్ల మొదళ్ళని కమ్మేసిన తీవెల అందాలు చూడు సావిత్రీ!
   ఇంద్రధనుస్సులోని రంగులని మించి యున్న ఈ పూలబాలలందించే మకరందాన్ని గ్రోలుతున్న తుమ్మెదలని చూశావా?
   పువ్వు పువ్వుకీ ఎగిరి ఎగిరి పడుతున్న వాని విన్యాసాలు.. మత్తెక్కి అవి చేసే ఝుంకారాలు, లయతో కూడిన వాయులీనపు సవ్వడుల వలె లేవూ!
   ఆ చిలుకల వయ్యారాలను చూడు..
   పక్వానికొచ్చిన తియ్యని ఫలాలను కడుపారా తిని, అవి చేసే కిలకిలా రావాలని వింటున్నావా?’
   సత్యవంతుడు సౌందర్యోపాసన చేస్తూ వర్ణిస్తున్నాడు, రాబోయే ఆపద తెలియక.
   కానీ మీద పడనున్న భయంకర విపత్తును గురించి చింతిస్తూ సావిత్రి, నిర్వికారంగా తప్పని సరి సల్లాపం చేస్తూ నడుస్తోంది.
   సత్యవంతుడు వచ్చిన పని మీద దృష్టి నిలిపాడు.
   చెట్లనుండి మధుర ఫలాలను తెంపి బుట్ట నింపాడు. బుట్టలు నిండాక సమిధల సేకరణ మొదలు పెట్టాడు. గొడ్డలితో కట్టెలను కొడుతూ, బాగా అలసిపోయాడు. గొడ్డలి కింద పడేశాడు.
   సత్యవంతుని శరీరమంతా చెమటలు పోశాయి. దేహం వశం తప్పింది. మనస్సులో ఏదో గాభరా..
   శూలాలతో పొడిచినట్లు తల నొప్పి.. నిలబడుట కష్టమైపోయింది.
   భార్యని పిలిచాడు.. వణుకుతున్న కంఠస్వరంతో.
   "సావిత్రీ! శిరోభారం దుర్భరంగా ఉంది. అవయవాలన్నింటినీ ఎవరో కత్తులతో పొడుస్తున్నట్లుగా ఉంది. గుండెలో మంట.. ఈ బాధ భరింప లేకున్నాను. కొద్ది సేపు విశ్రమిస్తాను."
   వెంటనే సావిత్రి చెట్టుకింద కూర్చుని, తన ఒడిలో పడుక్కోబెట్టుకుంది పతిని, అంకతలాన్ని తలగడగా చేసి.
   నెమ్మదిగా నుదుటి మీద చెయ్యి వేసి వత్త సాగింది. వేడి నిట్టూర్పులు విడుస్తున్నాడు సత్యవంతుడు. ఊపిరి అందుట లేదు.. శ్వాస ఆడుట కష్టమవుతోంది. శరీరం చల్లబడుతోంది.
   నారద ముని మాటలు మనస్సులో మెదలుతున్నాయి సావిత్రికి. భయపడినట్లుగానే సత్యవంతుడు చైతన్యరహితుడయ్యాడు.

Savitri_and_Satyavan.jpg

 నిస్సహాయంగా అటూ ఇటూ చూస్తున్న సావిత్రికి కళ్ళముందు ఒక దివ్యపురుషుడు కనిపించాడు. కాటుకవంటి నల్లని దేహం.. మిలమిల మెరిసే అరుణారుణ నేత్రాలు.. శిరమున కిరీటం..
   చేత పాశంతో దివ్య తేజస్సుతో ప్రచండ భానుడి వలే ఉన్నాడు. సత్యవంతుని తదేకంగా చూస్తున్నాడు.
   ఒడిలో నున్న భర్త శిరస్సును నెమ్మదిగా కింద పెట్టి లేచి నిలబడి, ఆ దివ్య పురుషునికి నమస్కరించింది సావిత్రి.
   "మహాత్మా! మీరు దేవతా మూర్తుల వలే ఉన్నారు. మీరు ఎవరు? ఇక్కడికి ఎందుకు విచ్చేశారు? అభ్యంతరం లేకపోతే చెప్పండి స్వామీ!" వినయంగా అంది.
   "సావిత్రీ! నీవు మహాపతివ్రతవు. తపస్వినివి. అందుకే సామాన్యులు చూడలేని నన్ను చూడగలుగు తున్నావు. నాతో మాట్లాడగలుగుతున్నావు. నేను యమధర్మరాజును. నీ భర్త సత్యవంతుని ఆయువు తీరిపోయింది. అతడిని పాశముతో బంధించి తీసుకుపోవడానికి వచ్చాను."
   ఆశ్చర్యంగా చూసింది సావిత్రి.
   "స్వామీ! మీ భటులు కాకుండా మీరే స్వయంగా వచ్చితిరేమి?"
   "అమ్మా! నీవు అన్నది నిజమే. సామాన్యులకు నా భటులు వచ్చెదరు. నీ భర్త సామాన్యుడు కాదు. ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు. మహనీయుడు. అందువలన నేనే స్వయముగా వచ్చితిని."
   యమధర్మరాజు పాశాన్ని విసిరి, సత్యవంతుని లోని జీవుడిని బంధించి బయటకు లాగాడు. అతని ఊపిరి ఆగిపోయింది. శరీర కాంతి మారిపోయింది. అవయవాల్లో చలనాలు ఆగిపోయాయి. ఆ జీవుడిని వెంటబెట్టుకుని, యమధర్మరాజు దక్షిణ దిక్కుగా బయలు దేరాడు.
   సావిత్రి శోకిస్తూ, భర్త దేహాన్ని అక్కడే విడిచి, తన తపో మహిమతో యమధర్మరాజును వెంబడించింది. తన వెనుక వస్తున్న సావిత్రిని చూసి యముడు ఆశ్చర్య పోయాడు.
   సామాన్య జనం మృత్యువు తమ వెంట పడుతుందేమోనని భయపడతారు. సావిత్రి తనే మృత్యువు వెంట పడుతోంది.. నిర్భయంగా.
   "అమ్మా! పతివ్రతా శిరోమణీ.. నా వెంట ఎందుకు వస్తున్నావు? వెనుకకు మరలు.. నీ భర్త శరీరానికి అంత్యక్రియలు జరిపించి అతడిని విముక్తుడిని చెయ్యి. పతితో నీ ప్రయాణం ఆగిపోయింది. నీ పతి ఋణం తీర్చుకో.." యమధర్మరాజు అనునయంగా అన్నాడు.
   "సమవర్తీ! నా భర్త ఎక్కడికి కొని పోబడతాడో అక్కడికే నేను కూడా పోవాలి. అదే పతివ్రతా ధర్మము. తపస్సు, గురుభక్తి, పతి ప్రేమ, వ్రతమహిమల వల్ల నేను మీ వెంట రాగలుగుతున్నాను. ముఖ్యంగా మీ కృప నా మీద ఉంది. నాకు ఎటువంటి అడ్డంకి ఉండదు.
   భగవాన్! ఏడడుగులు కలిసి నడిచినా, ఏడు మాటలు మాట్లాడినా ఇద్దరు వ్యక్తులకు మధ్య స్నేహం సిద్ధిస్తుందని చెప్తారు. ఆవిధంగా మీరు నాకు స్నేహితులు. పవిత్రమైన ఈ స్నేహాన్ని పురస్కరించుకుని నా మాటలు రెండు వినమని మనవి.
   అన్నింటి కన్ననూ ధర్మమే శ్రేష్ఠమైనదని అంటారు. ధర్మాన్ని పాటించేవాడు సత్పురుషుడు. కావున ధర్మాచరణకు సత్పురుషుడే ఆధారము.
   ఆ ధర్మానికి మారుపేరు నీవు. శ్రేష్ఠుడవు. నీతో ఏడు అడుగులు నడచిన పుణ్యం, ఏడు మాటలు మాటలాడిన భాగ్యం నాకు దక్కాయి. సత్పురుషుల దర్శనం సత్ఫలితాలనిస్తుందంటారు. మీ పవిత్ర దర్శనం పొందగలిగిన నేను ఫలితాన్ని పొందకుండా వెనుకకు ఎలా మరలగలను?" సావిత్రి పలుకులు విని సంతృప్తుడయ్యాడు యముడు. అంతే కాదు ఆశ్చర్యపోయాడు ఆమె వివేకానికి.
   ధర్మాన్ని వినడము, ఆచరించడము ఎవరికైననూ సాధ్యమే.. కానీ కళ్ళతో చూడడం అసంభవం.. సత్పురుషులకు తప్ప. ఇది శాస్త్ర వాక్యము.
   మూర్తీభవించిన ధర్మమే యమధర్మరాజు. ఆ ధర్మాన్ని జ్ఞాన రూపంలో ప్రత్యక్షంగా చూడగలిగింది భాషించగలిగింది. ఇది యమధర్మరాజే స్వయంగా చెప్పాడు.
   ఉత్తమోత్తమమైన ధర్మ మార్గాన్ని అనుసరించే వారికి కూడా సాధ్యంకాని ధర్మమూర్తిని సావిత్రి అనుసరిస్తోంది. వెంట నడువ గలుగుతోంది. తన మార్గంలో అడ్డంకి ఉండదు అని చెప్పింది కూడా. సావిత్రి బుద్ధి కుశలత చూసి యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు.
   అందుకనే నిశ్శబ్దంగా తనపని తాను చేసుకునిపోయే కాలుడు సావిత్రితో మాటలు కొనసాగించాడు.
   "సావిత్రీ! నీ మాటలు నన్ను ఎంతగానో మెప్పించాయి. నన్నలరించాయి. నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా కోరుకో. అనుగ్రహిస్తాను."
   "యమపురాధీశా! మా మామగారు ద్యుమత్సేనుడు అంధుడై అడవుల పాలయ్యాడు. ఆయనకు దృష్టి ప్రసాదించి, శక్తి సమన్వితుడై, తేజోవంతుడగునట్లు ఆశీర్వదించండి."
   "సావిత్రీ! నీ కోరిక నెరవేరుతుంది. ఇంక వెనుకకు తిరుగు. ఇప్పటికే అలసిపోయావు.." ప్రసన్న దృక్కుడై అన్నాడు యముడు.
   "మహాత్మా! పతిననుసరిస్తున్న నాకు శ్రమ ఎక్కడుంది? మీకు సర్వధర్మాలు తెలుసు. ధర్మ సూక్ష్మాలు కూడా తెలుసు. అందువలననే తమరు ధర్మమూర్తిగా కీర్తింపబడ్డారు.
    సమబుద్ధి తోడ దత్త
    త్సముచిత కర్మఫల మఖిల జంతుతతులన్
    సమకూర్చుట నీకయ్యెను
    సమవర్తి యనంగ బేరు జగదభినుతమై.
   సమబుద్ధితో, సముచిత కర్మ ఫలాన్ని సమకూర్చే వారు కనుక మిమ్మల్ని సమవర్తి అని లోకం కీర్తించింది.
   మహానుభావా! దీనులకు దానం చెయ్యాలని శాస్త్రం చెపుతుంది. దానం అనేది పూర్ణంగా ఉండాలి కదా! అదియే సమవర్తనము." అంటూ యమధర్మరాజు ఇచ్చిన వరము తనకు పూర్ణ తృప్తినొసగలేదని తెలియ జెప్పింది సావిత్రి.
   "అమ్మా! దాహార్తునికి చల్లని నీరు తృప్తినిచ్చినట్లు నీ మాటలు నన్నెంతో సంతృప్తి పరచాయి. నీకు మరొక వరాన్ని ప్రసాదిస్తున్నాను. నీ భర్త ప్రాణాలు దక్క ఏదైననూ కోరుకో తల్లీ!" ధర్మమూర్తి పలికాడు.
   "భగవాన్.. అర్కతనయా! మా మామగారైన ద్యుమత్సేనుని రాజ్యాన్ని శతృ రాజులు అపహరించారు. ఆయన రాజ్యం ఆయనకు దక్కేటట్లు, ద్యుమత్సేనుడు ధర్మము తప్పకుండా జీవించునట్లు వరమివ్వండి." అన్నది సావిత్రి.
   "నీ కోరిక నెరవేరుతుంది. ఇంక నువ్వు వెనుతిరగడమొక్కటే మిగిలింది."
   "యమధర్మరాజా! మీకు తెలియని ధర్మము లేదు. మీరు ధర్మాధ్యక్షులు. ధర్మాత్ములు ధర్మాన్ని మధ్యలో వదిలిపెట్టరని మీకు తెలుసు. నా పయనం ఆపాలని నాకు అనిపించడం లేదు. ధర్మ మార్గం కుంటుపడటం మీకు సమ్మతమా?" సావిత్రి పట్టుదలకి పేరుపొందింది.
   "సావిత్రీ! ధర్మము నందు నీకుగల ఆసక్తి నాకు నచ్చింది. చాలా సంతోషం. మూడవ వరాన్ని కూడా కోరుకో. నీ పతి ప్రాణాలు తప్ప సుమా!"
   "ధర్మమూర్తీ! మద్రదేశాధిపతి అయిన అశ్వపతి నా జనకుడు. ఆయనకు నేనొక్కదాన్నే సంతానం. ఆయనకు నూరుగురు పుత్రులను ప్రసాదించండి స్వామీ."
   "అటులనే. వందమంది రాకుమారులకు నీవు సోదరివవుతావు. ఇకనైనా.."
   "ధర్మప్రభూ! మీరు ధర్మ మార్గాన చరిస్తూ, ప్రజలను ధర్మ మార్గంలో నడిపిస్తూ ధర్మ మూర్తి అయ్యారు. ప్రాణులను ఆయువు తీరాక ఆయా లోకాలకు తీసుకొని పోవుచుండుట చేత యమధర్మరాజులయ్యారు. మీరు ధర్మంలో అసమాన తేజో రూపులయ్యారు. మీవంటి ధర్మప్రభువుల నీడలో ఈ విశ్వమంతయునూ సర్వతో భద్రంగా శోభిస్తోంది." సావిత్రి ధర్మ వచనాలకు యముడు ఆనందాబ్దిలో మునిగి పోయాడు.
   "మహా పతివ్రతా శిరోమణీ! మంజుల సుందర సుకుమార శబ్ద భూషితములైన నీ ధర్మప్రవచనాలు వీనులకింపుగా ఉన్నాయి. ఇటువంటి ధర్మప్రసంగం నేనింత వరకూ వినలేదు. బహు సంతుష్టుడనైనాను. మరొక్కవరం కోరుకో! అనుగ్రహిస్తాను." అమందానంద కందళిత హృదయారవిందుడైన యముడు వరమనుగ్రహించాడు.
   "మహాత్మా.. ఈ నాల్గవ వరాన్ని మీరు పతి ప్రాణములు తప్ప అనే మాటలు లేకుండా అనుగ్రహించారు.
    ఆర్యా! మీ ఆజ్ఞ.. నా భర్త సజీవుడవుగాక..
    పతి విరహంబు దుస్సహము: భర్తృవినాకృత యైన కాంత దూ
    షిత యగు సర్వ మంగళ  విశేషము లందును గాన మత్ప్రియం
    డతులిత కీర్తిశాలి సుగుణాఢ్యుడు సాళ్వసుతుండు లబ్ధజీ
    వితుడుగ నిమ్ము ధర్మపదవీ పరిరక్షణ! పుణ్య వీక్షణా!
   తండ్రీ! అతులిత యశోవంతుడు, సుగుణ సంపన్నుడు, సాళ్వదేశ ప్రభువైన ద్యుమత్సేనుని కుమారుడు, నా ప్రాణ నాధుడు సత్యవంతుడు. తిరిగి జీవించేటట్లు వరమనుగ్రహించండి." అని ప్రార్ధించింది సావిత్రి.
   "తథాస్తు.." అని దీవించి సత్యవంతుని పాశాన్ని తొలగించాడు యమధర్మరాజు.
   "సుగుణశీలా! నీ సౌశీల్యము, ధర్మవర్తనము నన్ను తృప్తి పరచాయి. నీ భర్త పునర్జీవితుడవుటయే గాక, సంపూర్ణారోగ్యముతో జీవిస్తాడు. నీకు నూరుగురు పుత్రులు కలుగుతారు." యమధర్మరాజు సావిత్రిని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు."

   ఊపిరి బిగపట్టి వింటున్న శ్రోతలు ఉలిక్కిపడి ఎర్రన్నకేసి చూశారు.
   అప్పుడే అయిపోయిందా! ఎర్రన తాళపత్రాలను భద్ర పరుస్తున్నాడు.
   "అమ్మా! సాయం సమయమవుతోంది.."
   ఎర్రన్న పలుకులకు అవునన్నట్లు చూశారు అందరూ. నిజమే.. తాము సర్వం మరచి, మృదు మధుర గంభీర కంఠంతో చెప్తున్న ఎర్రన వచనామృతాన్ని గ్రోలుతున్నారు.
   కానీ.. ఇహం ఒకటి ఉంది.. అందులో కార్యక్రమాలు ఉంటాయి. తప్పదు.. పైగా మాటలాడే వారికి అలసట ఉంటుంది కదా!
   "మరల రేపు చెప్పుకుందాం." ఎర్రన, సూరన లేచారు.. నదికి వెళ్లి స్నానాదులు, గుడికి వెళ్ళి అర్చనాదులు నెరవేర్చడానికి.
   అత్తా కోడళ్ళు కూడా గృహ కృత్యాలకై ఆయత్తమవసాగారు.
                          ……………..
  మరునాడు మామూలుగా శ్రవణానికై విచ్చేసిన శ్రోతలు సరుదుకుని కూర్చున్నారు.
  ఎర్రన మొదలుపెట్టాడు, మృదుమధుర స్వరంతో..
  "సావిత్రి యమధర్మరాజు వరమిచ్చి వెళ్ళిన తరువాత వెనుదిరిగింది. ఉపవాస దీక్ష వలన ఏ మాత్రమూ నీరసము లేదు సరికదా నూతనోత్సాహము వచ్చింది.. అడుగులు అతి వేగంగా పడుతున్నాయి. ఎప్పుడెప్పుడు పతి సన్నిధికి చేరుదామా అని ఆతృత..
   భర్త పునర్జీవుడైనాడు.. అసాధ్యమును సాధ్యం చేసుకున్నది.. అదియును యముడిని మెప్పించుట వల్ల. ఆ ఉద్వేగంతో అడుగులు తడబడ సాగాయి. అయిననూ వేగం తగ్గలేదు.
   సావిత్రి మోము వేయి పున్నమి చంద్రుల కాంతితో వెలుగొందుతోంది.
   భర్తను సమీపించి, శిరస్సును ఒడిలో నుంచుకొని కూర్చుంది.
   కొంత సేపటికి సత్యవంతుడు సజీవుడై, చేతనంలోకి వచ్చి కళ్ళు తెరిచి సావిత్రిని చూశాడు.
   "దేవీ! నాకు గాఢంగా నిద్ర పట్టేసింది. నన్ను ఒక నల్లని ధృఢకాయుడు పట్టుకొని లాగుతూ ఉన్నాడు. అతడు ఎక్కడ? నువ్వు నన్ను నిదుర లేపలేదేమి?"
   "నాధా! ఆ విషయాలన్నీ ఆశ్రమానికి వెళ్ళాక తెలుపుతాను. మీ అలసట తీరితే బయలుదేరుదాము. లేదంటే ఈ రాత్రికి అరణ్యంలోనే కాలక్షేపం చేసి, తెల్లవారగనే బయలు దేరుదాము."
   "సావిత్రీ! నా బడలిక పూర్తిగా తగ్గి, తల నొప్పి కూడా పోయింది. దేవీ.. నా జననీ జనకులను చూడకుండా నిశి రాత్రి ఉండలేను. ఆశ్రమంలో నా కొరకై తల్లిదండ్రులు ఎంతగా పరితపిస్తున్నారో! ఎంత ఆవేదన చెందుతున్నారో.. నేను నెమ్మదిగా నడుస్తాను. చీకటి పడుతున్ననూ ఈ దారి నాకు కొత్త కాదు. ఆకుల మధ్యనుండి పడే వెన్నెల కాంతిలో దారి చూచుకుంటూ నడిచి వెళ్ళ గలుగుతాము."
   సావిత్రి సుకుమారమైన చేతులతో భర్తను కౌగిలించుకుని లేపి నిలబెట్టింది. భర్త శరీరానికి అంటుకున్న దుమ్ము ధూళిలను దులిపింది.
   ప్రయాణానికి సిద్ధమయ్యారిరువురూ.
   సత్యవంతుడు సేకరించిన ఫలములు, గొడ్డలి ఉన్నాయి. తామిద్దరికీ బరువులు మోసే శక్తిలేదు అప్పుడు. గొడ్డలి రక్షణకి కావాలనిపించి చేత ధరించింది. పండ్ల బుట్టను చెట్టు కొమ్మకు వేళ్ళాడ దీసింది.
   ఒక చేత గొడ్డలి, ఇంకొక చేత భర్త చెయ్యి పట్టుకుని ప్రయాణమయింది.
   సత్యవంతునికిది పునర్జన్మ. పూర్వజన్మలో సేకరించిన పళ్ళు అవి.. సత్యవంతుడు ఆ పళ్ళబుట్టను చూస్తూ నడిచాడు.
   "పళ్ళబుట్టను రేపు తెచ్చుకుందాం" అంది సావిత్రి.
   కానీ గత జన్మ బంధాలవి.. వదిలి వెళ్ళవలసిందే.. తప్పదు. ఇదే జీవుల చరిత్ర. ఎంత కష్టపడి సేకరించనవైననూ వదిలి వెళ్ళిపోవలసిందే సమయం వచ్చినప్పుడు. సంసార బంధనాలు ఖండిచుకోవాలి. దానికి కావలసింది గొడ్డలి. అది అసంగశస్త్రము.
   అశ్వత్థ మేనం సువిరూఢ మూలం
   అసంగ శస్త్రేణ ధృడేన చిత్వా..
   అశ్వత్థమనే సంసార వృక్షపు వ్రేళ్ళని అసంగశస్త్రంతో ఖండించాలి.
   ఇది జీవన చిత్రాన్ని చూపించే చరిత్ర."
   తన కార్యక్రమములు త్వరగా ముగించుకుని, సూరన్న కూడా ప్రొద్దుటే వచ్చేశాడు సావిత్రి చరిత్ర వినడానికి. జనమేజయునికి వైశంపాయనుడు, సూతమహర్షి శౌనకాది మునులకు, మార్కండేయ మహర్షి ధర్మరాజునకు చెప్పిన చరిత్ర.. మహా పతివ్రత గాధ.. ఇప్పుడు ఎర్రాప్రగడ తన కుటుంబ సభ్యులకు చెపుతున్నాడు. ఎన్ని మారులు విన్ననూ మరీ మరీ వినాలనిపించే పుణ్య చరితలు అవి.



 

 

 

.....మంథా భానుమతి