Facebook Twitter
ఆరోజు వస్తుంది

ఆరోజు  వస్తుంది 

 

 

చీకటి పడిపోయింది.  కాస్త భయంగానే ఉంది  కౌసల్యకి  ఆ చీకట్లో.  వీధి దీపాలు వెలగట్లేదు. దానికి తోడు  అమావాస్య. అసలు చిన్నప్పటినించీ  భయస్తురాలే. ఇలా చీమ చిటుక్కుమంటే  భయపడిపోయేదానివి  రేపు  పెళ్ళయ్యాక  నీ పిల్లల్ని ఎలా పెంచుతావే  అంటూ  దిగులుగా  కూతుర్ని దగ్గిరకి  తీసుకునేది  తల్లి  పద్మావతి. 


“ మీ ఆడాళ్ళకి  పెద్దయ్యాక  మొండి ధైర్యాలు  అవే వస్తాయిలే. “  ఓ  విసురు  విసిరేవాడు తండ్రి సాంబమూర్తి. “  ఔనౌను.  లేకపోతే  సంసార సాగరం  ఈదగలమా ? మీలాంటి వాళ్ళకి  వెనకఉండి విజయాలు  తెచ్చిపెట్టగలమా ? “ నవ్వుతూ  చురక  వేసేది పద్మావతి.  వాళ్ళమాటలు  వింటూ నవ్వుకునేది  కౌసల్య .  కానీ  ఇప్పుడు  నవ్వు రావట్లేదు.  ఏ రోజుకారోజు  బతికి బయటపడితే అంతేచాలన్న రీతిలో  కాలం గడుస్తుంటే అమ్మయ్య  అన్న నిట్టూర్పులే  వస్తున్నాయి . 


ఆడపిల్లని  ఒక  అయ్య  చేతిలో పెట్టేస్తే  పెళ్ళంటూ చేసేస్తే  ఆ స్ర్తీకి రక్షణ   ఏర్పడిపోయినట్టేనని భావించేవారు  పూర్వపురోజుల్లో.  కంచే  చేను మేసినట్టు  వాడు కొట్టినా తిట్టినా  పట్టించుకునేవారే కాదు. అడిగేవారే  కాదు. అడిగి మాత్రం ఏం చెయ్యగలం అన్న ధోరణిలో  ఉండేవారు.  

ఇప్పుడూ  అలాంటి సంసారాలున్నాయి  లేకపోలేదు. ఎటొచ్చీ చదువుకుని   ఎవరి కాళ్ళమీద  వాళ్ళు నిలబడాలన్న ఆలోచన  పెరగడం మంచిదయ్యింది.  అయినా కూడా  రక్షణ  అనే  విషయానికి  వచ్చేసరికి అగమ్యగోచరంగానే  ఉంది. దాన్ని గురించే  ఆలోచిస్తూ  నడుస్తోంది కౌసల్య.  అసలు  సృష్టిలోనే  ఎందుకంత  అన్యాయం ! స్త్రీని  శారీరకంగా   బలహీనంగానూ  మానసికంగా సున్నితంగానూ  ఎందుకు  సృష్టించాలి ?


ఈ రోజుల్నిబట్టి ఆడవాళ్ళు కాస్త మారుతున్నారు నిజమే. మానసికంగా ధైర్యాన్ని అలవరచుకుంటున్నారు.  మానసిక బలంతో  కష్ట నష్టాలు ఎదుర్కుంటున్నారు.  అదీ  నిజమే. మంచిదే.  కానీ మరి  రౌడీల  ఆగడాలు అత్యాచారాలు  అంతకంతకీ  ఎక్కువ  అవుతున్నాయే  తప్ప తగ్గుతున్న  ఛాయలేవీ ! ఆ రౌడీ  కుటుంబంలో   ఆడవాళ్ళుండరా ! ఓ  తల్లి  కన్నబిడ్డే  కదా  వాడు. ఆడవాళ్ళంటే అంత  నీచమైన  నికృష్టమైన  భావన  ఎలా  చోటు చేసుకుంటుందో  అర్ధం కావట్లేదు కౌసల్యకి.  చదువూ  చదువుకుంది.  

ఉద్యోగమూ  చేస్తోంది  తను.  రెండు బస్సులు  మారి  వెళ్ళి రావాలి.  ఇంటికి  దూరం    బస్ స్టాపు.  ఆఫీసులో పని  అయ్యేసరికి  ఆలస్యమైందంటే ఇంటిదగ్గిర  బస్ దిగేసరికి  చిమ్మ చీకటే .  లోపలికి    సందులో  ఎక్కువే  నడవాలి.  


వీధి దీపాలు  ఎప్పుడూ  ఉండవు.   చివరగా  ఓ మూలగా  విసిరేసినట్టుంది  ఇల్లు.  ఆతర్వాత ఇంక  ఇళ్ళులేవు.   ఉన్న నాలుగు  ఇళ్ళల్లోనూ  టీ.వీ. లు చూస్తూ  తలుపులు వేసేసుకుని ఎవరిలోకంలో వాళ్ళుంటారు.  తలుపులు  తెరుచుకుని   కూర్చోడానికి   ఇదేమన్నా గుప్తులకాలంనాటి   స్వర్ణయుగమా? ఇళ్ళ   వెనకాల  పెద్ద పెద్ద   తుప్పలు చెట్లు  బండరాళ్ళూ.  ఇళ్ళ ముందూ  అవే కనపడతాయి. రాత్రయితే  జీబురుమంటూ ఉంటుంది. పగలు  కూడా  సుమారుగా  అంతే.  ఏవున్నా  లేకపోయినా ఎవరున్నా లేకపోయినా  రౌడీలకీ  దొంగలకీ  కొదవలేదు కదా . అలాంటివాళ్ళకి  ఇలాంటి సందులు మరీ చులకన.  


అందుకే  అప్పుడప్పుడు  తల్లితో  అంటూనే   ఉంటుంది  సమాజంలో  మృగాళ్ళు ఉన్నంతవరకూ ఆడవాళ్ళు  ఏం చదువులు చదువుకున్నా ఏం  ఉద్యోగాలు  చేసినా ఏవుంది  సంతోషం అని.  విని ఊరుకునేది కాదు  పద్మావతి. కూతురికి  ధైర్యం   చెప్పడానికి  శతవిధాల  ప్రయత్నం చేసేది.  రోజులు ఒక్కలా ఉండవులే  కాలం మారుతోంది అంటూ  చాలా  తేలిగ్గా  చెప్పేది.  కానీ ఆవిడకీ  మనసులో బిక్కుబిక్కుమంటూనే  ఉండేది.  ప్రతిపూటా  కూతురు  ఆపీసు నించి  ఇంటికి వచ్చేవరకూ హనుమాన్ చాలీసా  మనసులో  పఠిస్తూనే  ఉంటుంది.  కూతురి ఎదురుగా  బింకంగానే ఉంటుంది.  పిల్లకి సంబంధం  తొందరగా  కుదిరితే  బావుండునని  రోజుకి  వందసార్లు అనుకుంటూ  ఉంటుంది.  ఓ రోజు నవ్వుతూ  అడగనే  అడిగింది  కౌసల్య  తల్లిని.                                                              


వెర్రిదానివమ్మా  నువ్వు .  నేను  ఇంటికి  చేరేదాకా  నువ్వు  ఆదుర్దా  పడుతూ ఉంటావు. రేపు  పెళ్ళయ్యాక  ఆ కట్టుకున్న వాడు   పడతాడు.  అంతేగా ! అంటే ఏమిటి ?  ఆడది బయటికెళ్తే  చీకటి పడిందంటే   ఇంట్లో  వాళ్ళు   ఎవరో  ఒకళ్ళు   ఆదుర్దా   పడుతూ   ఆందోళనతో   రక్తపోటు పెంచుకోవలసిందన్నమాటేగా ?   దీనికి  పరిష్కారం లేదా ? “  “ఎందుకు  లేదూ పరిష్కారం ? మన ఆడవాళ్ళం  మనసుల్లో  సున్నితత్వం  గుండెల్లో మొండిధైర్యం  జీవిత  చరమాంకం  వరకూ పెంచుకుంటూ  పోవాలి.  లేకపోతే  జీవించడం కష్టం.  సమస్యలున్నప్పుడు  వాటికి  తగ్గ   పరిష్కారాలూ ఉంటాయి.  అమలు పరచడంలో తెలివితేటలు  ఉపయోగించే  నేర్పు  సంపాదించాలి .”  


“ అడవుల్లోకి  వెళ్తే  క్రూరమృగాలుంటాయి  కాబట్టి  అడవుల్లోకి  వెళ్ళద్దంటే  అర్ధం  ఉంది.  నగరాల్లో  వీధుల్లోకి  చీకటిపడితే  ఆడవాళ్ళు   వెళ్ళద్దంటే  మగవాళ్ళు   క్రూరమృగాలు  అని  అర్ధమా ? “ 


“అందరూ కాదే నా తల్లీ  కొంతమంది  రాక్షసులు కొన్ని క్రూరమృగాలు  నరరూపంలో వీధుల్లో  తిరగడం జరుగుతోంది. అటువంటివాళ్ళకి  భయపడుతోంది  ఆడది.  కానీ ఎన్నాళ్ళిలా  సాగాలి ? దీనికి  అంతం చూపించేందుకు  ఆడదే  ముందుకి రాక  తప్పదేమో !   వస్తుందిలే !  ఆడపిల్ల బ్రతుకులో  ఆ రోజు  తప్పక వస్తుంది. “  ఆమె మాటల్లో  ధ్వని    కంటే  నమ్మకం ఎక్కువగా  కౌసల్య హృదయాన్ని తాకింది.


తల్లి   మాటలు  పదేపదే   గుర్తొస్తున్నాయి   కౌసల్యకి .  తనవెనకే  ఎవరో  వస్తున్న సవ్వడి  అయ్యింది. రోడ్డు   మీద  ఎవరూ  లేకపోయినా  భయమే.  తనుకాక  ఒక్కడే ఒక్కడు  మరొకడెవరైనా చుట్టుపక్కల ఉన్నా  భయమే. ఎలా  బతకాలి ? బస్సులో  నిలబడి  నిలబడి  వచ్చిన  నీరసం  రెట్టింపుగా అనిపిస్తోంది  భయంవల్ల .   నడక వేగం  పెంచాననుకుంది.  అబ్బే ! ఉత్తదే !   వెనకాల   అడుగులు కాస్త దగ్గరగా   వస్తున్నట్టనిపించింది.  ఎందుకైనా  మంచిదని  చున్నీ  ఒక వైపునించి  తల చుట్టూ ముసుగులా  వేసుకుంది.   వెనక్కి  తిరిగి  చూడాలంటే  వణుకు  పుడుతోంది. అసలెందుకు  చూడటం? కొరివితో  తల  గోక్కోవడమెందుకు ?   కావాలని  రోటిలో  తల దూర్చడమెందుకు ?  


అయినా ఎంత చెప్పింది  తను  నాన్నగారికి   ఇలాంటి  చోట  ఇల్లు తీసుకోవద్దు అని. వింటేనా?  ఆయన గొడవ  ఆయనది మరి . అందులో   తప్పు ఎంచడానికి  లేదు. తక్కువ  సొమ్ములో  వచ్చేది ఆయన  తాహతుకి  తగ్గట్టు  చూసుకున్నారు.  మిగిలిన ఖాళీ స్థలాలన్నిటిలోనూ  ఇళ్ళు  లేచి చుట్టుపక్కల  కొన్ని  దుకాణాలవీ  వస్తే  గానీ   ఈ బిక్కు బిక్కుమంటూ  బతకడం  తప్పదు. 


అన్నయ్య  ఉన్నాడు  కాబట్టి   చెట్టంత కొడుకు  ఉన్నాడన్న  ధైర్యంతో అప్పు  తీసుకుని మారుమూల శివార్లలో  ఉన్నా కూడా  ఈ ఇల్లు  కొనేసి  సొంత  ఇంట్లో  ఉన్నాము హాయిగా  అన్న సంతృప్తితోనూ అస్తమానం  సామాన్లు  సద్దుకుని   నెత్తిన   పెట్టుకుని ఇళ్ళు మారే  ప్రయాస  తప్పిందన్న సంతోషంతోనూ   ఉన్నారు   నాన్నగారు. 


ఆలోచన్లలో  తల మునకలవుతూ  త్వరత్వరగా  నడుస్తున్న  కౌసల్యనోటిని   హఠాత్తుగా   వెనకనించి ఒకచెయ్యి  వచ్చి  గట్టిగా  మూసేసి  బలంగా చేతులు  రెండూ  నొక్కి పట్టేసుకుని  వెనక్కి  తిరిగే అవకాశం   ఏమాత్రం ఇవ్వకుండా   తుప్పల్లోకి లాక్కుపోతుంటే   శాయశక్తులా   పెనుగులాడుతోంది. గట్టిగా  అరుద్దామనుకుంటే  నోట్లోంచి  అసలు  శబ్దం  వస్తేగా ! తాగిన  మత్తులో తూలుతున్న ఆ వ్యక్తి    “ తొందరగా  రారా ! “  అంటూ పిలిచేదాకా వెనకాల ఇంకెవరో  వస్తున్నట్టు   తెలియదు కౌసల్యకి.  తెలిసిన మరుక్షణం  భయాందోళనలతో  వణికిపోతూనే  బలాన్ని పుంజుకోక తప్పదన్న నిర్ణయానికి  వచ్చింది. 


“ఎక్కడికితీసుకొచ్చావు?  ఎక్కడున్నాంఇప్పుడు?  నాకేమీ తెలియట్లేదు. “మత్తు మత్తుగా మాట్లాడుతున్న  ఆ  గొంతు  విని  తనకొచ్చిన సందేహానికి  తనని తనే  తిట్టుకుంది  అంత  దుర్భర పరిస్థితిలో కూడా.  “ఈ సందులో  చీకట్లో   ఒంటరిగా  పోతున్న   ఈఅమ్మాయిని  వదిలేసి  ఎక్కడికో  మనం  తిరగడానికి  ఎందుకెళ్ళడం  


అనిపించి  ఇటువైపు  మళ్ళాను.  తొందరగా  రావయ్యా  బాబూ ! ఎవరూ  టువైపు  రాకముందే.  “చిరాకు తొణికిసలాడింది  కౌసల్యని   బలవంతంగా  లాక్కుపోతున్న   వ్యక్తి గొంతులో.   “ వస్తున్నా  వస్తున్నా “ వెనకనించి  సమాధానం. తన  సందేహం తీరిపోయినట్టనిపించింది  కౌసల్యకి.  తల్లి  ఆవిడ  మనసులో ఎన్నెన్ని భయాలు  పడేదో  ఏఏ   దేవుళ్ళకి  మొక్కుకుంటూ  ఉండేదో  ఆ లెక్కాపత్రాలు  తనకి తలియదుగానీ  ఆవిడ తనకి  ప్రతి రోజూ  జీవితమ్మీద ఆసక్తి  కలిగిస్తూ  ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నాలు  చేయడం  మాత్రం  తెలుసు.   ఆ  ప్రయత్నాన్ని  తను  వమ్ము చెయ్యకుండా  నిలబడాలి.  ఔను. 


ఆ బలం ఎక్కడినించో కాదు  అమ్మ పలుకుల నించే  వచ్చింది  అందుకే   తనని పట్టుకున్న వ్యక్తిని చేతిమీద  కొరకడమే  కాదు  ఆదిశక్తిలా  అపరకాళిలా  కాళ్ళతో  ఎడాపెడా  తన్ని  పడేసింది.  రాళ్ళమీద రక్తమోడుతూ  పడ్డాడు. తూలిపోతూ  మెల్లిగా వచ్చి  వెనకనించి  తన భుజమ్మీద  చెయ్యి  వేసిన  వ్యక్తి మొహమ్మీద  ఛీత్కరించి  ఉమ్మేసింది.   “ నువ్వా ? “  తుళ్ళిపడి  ఒక అడుగు  వెనక్కి వేశాడతను దగ్గరనించి  చూశాక.                             


“ఏం? నేను కాక వేరే అమ్మాయి అయితే మాత్రం  ప్రాణమున్న మనిషికాదా ! ఆటబొమ్మనుకుంటున్నావా?  ఆడపిల్లల  మానప్రాణాలతో   ఆడుకునేవాడికంటే   అడవిలోని క్రూరజంతువులు  నయంరా  నికృష్టుడా !  నువ్వు  నా  అన్నయ్యవని  నేను నీ   చెల్లెలినని చెప్పుకోడంకంటే   దౌర్భాగ్యం  ఇంకొకటి  లేదు  నాకు.

చెట్టంత కొడుకున్నాడని   గుండెలమీద చెయ్యివేసుకుని  నిద్ర పోయే  నీ  తండ్రి  గుండెలమీద తన్నే పనులు  చేస్తున్నావని  తెలిసి తీరాలి ఆయనకి.  ఇంట్లో వాళ్ళ  కళ్ళు కప్పి నీలాంటివాళ్ళు  చేసే పనులు  బయటపడకపోవు. నిన్ను నేనే పోలీసులకి అప్పచెప్తాను. నడు. “    అదిరిపోయాడు  అన్నయ్య . కాదుకాదు  ఆ రూపంలో   ఉన్న నరరూపరాక్షసుడు. 


చీమ  చిటుక్కుమంటే  భయపడే  ఆడపిల్ల  అవసరమైతే   ఆదిశక్తి   కాగలదు.   ఓర్పు సహనం వహిస్తుంటే  ఓడిపోయిందనుకున్న   మొగవాడు   తెలివితక్కువవాడు. 


- తమిరిశ జానకి