Facebook Twitter
ఉగాది కవిత

టోరీ ఉగాది కవితల పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత 
ఉగాది కవిత

 


ఉ. స్వాగతమో! విళంబి శుభ వత్సరమా! విజయ ప్రదాయివై

సాగరమంత సత్ఫలము సన్మతి నీయగ నేగుదెంచు నీ

యాగమనమ్ముతో మదులు హర్ష పరిప్లుత మయ్యె; సత్కృపా

యోగము గల్గజేసి సమయోచిత సత్ఫలముల్లోసంగుమా!


ఆ.వె. చైత్ర రథము నెక్కి చైతన్య దీప్తితో

స్ఫూర్తి తోడ దివ్య మూర్తితోడ

శుకపికమ్ములెల్ల యకలంకమతి గొల్వ

నరుగుదెంచె నవవసంతుడిలకు!


ఆ.వె.పూల తావి పొందె పొలుపారు పులకింత

తెమ్మిరమ్మ తగిలి తీపి పెంచ

కొమ్మ కొమ్మ చిగిర్చి సమ్ముదమ్మున నూగ

ప్రకృతి పరవశించె రాజితముగ


ఆ.వె. కోయిలమ్మ కూసె కుహు! కుహూ!! రవముల

కిసలయములు నవ్వె; కీరవాణి

రవము వనుల నిండె; నవనవోన్మేషంబు

కలుగ ప్రకృతి కాంత కాంతి నొందె

 

ఆ.వె. బొండు మల్లె లెల్ల నిండు గుండెల తోడ

పండు వెన్నెలందు వలచి కలిసె

సౌరభమ్ము వలనె సౌందర్య పుష్పాల

జాడ తెలిసె కనుల చూడ నవక


రచన :  శ్రీ ఘట్టి కృష్ణమూర్తి గారు