Home » కథలు » తపనFacebook Twitter Google
తపన

తపన

 

తాళ్లరేవులో గోపాలుడనే యువకుడు ఒకడు, పశువులు కాస్తూ ఉండేవాడు. చిన్నతనంనుండీ అదే పనిలో ఉండటం వల్లనో ఏమో, వాడు అసలు ఏమాత్రం చదువుకోలేదు. ప్రతి సంవత్సరమూ శ్రీరామ నవమికి ఆ ఊరి రామాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. ఒక ఏడాది వాడు వెళ్ళేసరికి గుడిలో రామాయణ ప్రవచనం జరుగుతున్నది. వ్యాసపీఠం మీద రామాయణ గ్రంథం పెట్టుకుని చదువుతూ, అందులోని సూక్ష్మాలను పామరులకు అర్థమయ్యేట్లు వివరిస్తున్నారు రామశర్మగారు. ఆయన గొంతూ, చెప్పే తీరూ బాగుండటంతో గోపాలుడు అక్కడే కూర్చొని ఆయన చెప్పేది ఆసాంతం విన్నాడు.


ఆయన చెప్పిన సంగతులన్నీ గోపాలుడి హృదయంలో నాటుకుపోయాయి. "అబ్బా! చదువు వచ్చి ఉంటే ఇట్లాంటి పుస్తకాలన్నీ నేనే చదవగలిగేవాడిని కదా! ఏమయినా సరే ఇవాల్టి నుంచీ చదువు నేర్చుకోవాలి. మంచి మంచి పుస్తకాలన్నీ చదవాలి" అని గట్టిగా అనుకున్న గోపాలుడు, సభ అయిపోగానే రామశర్మ దగ్గరికి వెళ్ళి, తన గురించి చెప్పుకొని, "అయ్యా! నాకు బొత్తిగా చదువు రాదు. కానీ బాగా చదువుకోవాలని అయితే ఉంది. రోజూ‌ మీ సేవ చేసుకుంటాను, నాకు చదువు చెప్పండి" అని ఆయన కాళ్ళకు దండం పెట్టాడు.


గోపాలుడి జిజ్ఞాసకు రామశర్మ చాలా సంతోష పడ్డాడు. "నాయనా! రామాయణం రాసిన వాల్మీకికి కూడా మొదట్లో అసలు చదువే రాదట. చదువుకోవాలని కోరికతోటి, తగినంత కృషి చేసి అంత గొప్పవాడు అయ్యాడు. ఇవాళ్ల నీలో ఈ ఆలోచన కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పక్క వీధిలోనే మా ఇల్లు. నువ్వు రోజూ మా ఇంటికి రా. నేను నీకు చదువు చెబుతాను. చదువుకోవాలన్న తపన ఉండాలే కాని చదువు ఏమంత కష్టం కాదు" అన్నాడు.


గోపాలుడికి చాలా సంతోషం అయ్యింది. మరుసటి రోజునుండీ ప్రతిరోజూ ఉదయాన్న రామశర్మ వద్దకు వెళ్ళి అక్షరాలు, అంకెలు నేర్చుకోవటం మొదలుపెట్టాడు. కొన్ని నెలల్లోనే చిన్న వాక్యాలు, చిట్టి చిట్టి పద్యాలు చదవసాగాడు. ఇంకొన్ని నెలలు గడిచే సరికి కఠినమైన పద్యాలు చదవటం కూడా వచ్చేసింది. అట్లా కొద్దికాలంలోనే మంచి పుస్తకాలు చదివే స్థాయికి ఎదిగాడతను. ఆ సమయంలో మేత మేసేందుకు వెళ్ళిన ఆవుల్లో ఒకటి తప్పిపోయింది. దాన్ని వెతుక్కుంటూ కొండ అంతా తిరిగిన గోపాలుడికి చెట్ల గుబుర్ల వెనకగా గుహ ఒకటి కనిపించింది. 


"అరే! ఇన్నిసార్లు ఇటు వచ్చినా ఈ గుహ ఎన్నడూ కనబడలేదే?! ఇందులో ఏముంది?" అని ఆశ్చర్యపోతూ ఆ గుహలోకి ప్రవేశించాడు గోపాలుడు. గుహ అంతా అప్పుడే ఊడ్చినట్టు శుభ్రంగా ఉంది. ఒక ప్రక్కగా ఎత్తైన రాయిమీద కొన్ని తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. గోపాలుడు ఆశ్చర్యపోయాడు. 'గుహ చుట్టు ప్రక్కల ఎవరైనా ఉన్నారేమో' అని వెతికాడు. ఎవ్వరూ లేరు. ఆ తాళపత్ర గ్రంథాలలో ఏమి రాసి ఉన్నదో చదివేందుకు ప్రయత్నించాడు. అవేవో సంస్కృత శ్లోకాలు.. గోపాలుడికి ఏవీ అర్థం కాలేదు.


"గుహలో ఎవరో ఋషి ఉంటాడల్లే ఉంది" అని సాయంత్రం చీకటి పడే వరకూ.. మర్నాటి ఉదయం వరకూ ఎదురు చూసాడు గోపాలుడు. ఎవ్వరూ రాలేదు. "ఈ గ్రంథాలను ఒక్కసారి తీసుకువెళ్ళి, గురువుగారికి చూపించి, మళ్ళీ తెచ్చేస్తాను" అని వాటిని జాగ్రత్తగా ఊళ్ళోకి తీసుకువెళ్ళాడతను. వాటిని చూసిన రామశర్మ ఆశ్చర్యపోయాడు. అవి లోక ప్రసిద్ధి చెందిన కారుణ్య మహాముని రచించిన సూక్తులు. ఎలా నడచుకుంటే జీవితం సక్రమంగా ఉంటుందో చెప్పే శ్లోకాలవి. ఇన్ని రోజులుగానూ వాటిని కర్ణా కర్ణిగా విని చెప్పుకునేవాళ్ళు అందరూ. కానీ ఇప్పుడు దొరికినవి, వందల సంవత్సరాల క్రితం రాసిన గ్రంథాలు! వాటి విలువ అమూల్యం!


రామశర్మ ఆ సంగతి గోపాలుడికి చెప్పి,"నాయనా! వీటిని సేకరించి గుహలో పెట్టుకున్నవాళ్ళెవరో మహాత్ములు, వీటికోసం వెతుక్కుంటూ ఉంటారు. నువ్వు వీటిని తీసుకెళ్ళి వాళ్లకు ఇచ్చి, "మీరు అనుమతిస్తే వీటి నకలు చేసుకొని, కొద్ది రోజుల్లో తిరిగి తెచ్చిస్తాను" అని అడిగి చూడు. వాళ్ళు ఒప్పుకుంటే చాలా మేలు! లేకపోతే మనకు ప్రాప్తం లేదనుకుంటాం" అన్నాడు. గోపాలుడు వాటిని పట్టుకొని గబగబా కొండ ఎక్కి చూసాడు. ఎంత వెతికినా అతనికి మళ్ళీ ఆ గుహ కనబడనే లేదు!


అతను తిరిగి వచ్చి ఆ సంగతి చెబితే రామశర్మ సంతోషానికి అవధులు లేకుండా పోయింది: "నాయనా! నువ్వు నిజంగా సరస్వతీ‌పుత్రుడివే!‌ చదువుకోవాలనే తపన నీకు ఈ అవకాశాన్ని ఇస్తున్నది. ఇన్ని శతాబ్దాలుగా ఎవ్వరికీ లభించని మహోన్నత గ్రంధాలు నీకు లభించాయంటే ఆ మహాముని కరుణ సంపూర్ణంగా నీ మీద ఉన్నట్లే" అని చెప్పి, అతనికే ఆ గ్రంధాల నకళ్ళు తీసే పనిని అప్పగించాడు. గోపాలుడు గుండ్రని అక్షరాలతో ఆ గ్రంథాలకు అనేక నకళ్ళు తయారు చేశాడు. ఆ ప్రతులను కొన్నింటిని వేరు వేరు పాఠశాలలకు ఇచ్చాడు రామశర్మ. అక్కడి ఉపాధ్యాయులు ఆయన సహకారంతో ఆ సూక్తుల్ని, జీవిత సత్యాలను పిల్లలకు బోధించసాగారు.


ఈ సంగతులన్నీ రాజుగారికి తెలిసేసరికి, ఆయనే స్వయంగా తన పరివారంతో సహా ఆ గ్రామానికి వచ్చి, రామశర్మను, ఆ గ్రంధాలను దర్శించుకున్నాడు. గోపాలుడిని మెచ్చుకొని, "రామశర్మగారూ! చదువు పట్ల ఇతనికి చాలా ఆసక్తి అని తెలిసి సంతోషించాము. ఇతనికి అయ్యే ఖర్చుల్ని పూర్తిగా మేమే భరిస్తాం. తమరు చదువులో గోపాలుణ్ణి దిట్టగా తయారుచేయండి. భవిష్యత్తులో అతనికి మా ఆస్థానంలోనే తగిన ఉద్యోగం ఇస్తాము" అని చెప్పారు రాజుగారు.


గోపాలుడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. "మీరు సరేనంటే ఈ తాళపత్ర గ్రంథాలను రాజధానిలోని సంగ్రహాలయంలో పెట్టిస్తాను. ఆ విధంగా దేశ విదేశాల వారు వాటిని చదివే అవకాశం ఉంటుంది" చెప్పారు రాజుగారు. "అంతకన్నా భాగ్యం ఏముంటుంది మహారాజా!" అని ఆ గ్రంథాలను రాజుగారికి అప్పగించారు రామశర్మ, గోపాలుడు.


ఇక ఆ తరువాత గోపాలుడి చదువు అద్భుతంగా సాగింది. అతను ఇక అనేక గ్రంథాల మీద, శిలాశాసనాలమీద పరిశోధనలు చేసాడు. పలు పరిశోధనా గ్రంథాలను వెలువరించాడు. కొంత కాలానికి రామశర్మ అనుమతితో రాజుగారి కొలువులో ఆయనకు సలహాదారుగా చేరాడు. "చదువు పట్ల ప్రేమ ఉంటే చాలు అది మనల్ని ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది" అని చెప్పేవాడతను, అందరికీ. 

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో


అనగనగా ఒక మంచాయన ఉండేవాడట. వాళ్ళ ఊరికి దగ్గర చాలా పండ్ల తోటలు ఉండేవి. పండ్లని తినేందుకు చిలకలు, వగైరా పక్షులు వచ్చేవి...
Feb 27, 2020
అది మంచి వేసవి కాలం. పిల్లలందరికీ సెలవలు. నారాయణ రెడ్డి ఆ రోజు ఉదయం బజారునుండి ఒక పుచ్చ కాయని తెచ్చాడు. పిల్లలంతా అది చూసి చాలా సంబరపడ్డారు....
Feb 8, 2020
అనగనగా ఒక ఊళ్లో ఇద్దరు దంపతులుండేవారు.
Aug 7, 2019
మతి మరుపు
Jul 31, 2019
ఆవులు కాసే రంగన్నకు ఉన్నట్టుండి ఓ సందేహం కలిగింది. "నేనేం చెయ్యాలి..
Jun 25, 2019
“అబ్బా!” తెల్లని డోరియా చీరపై గులాబీలు క్రాస్..
May 11, 2019
ఒక ఊరిలో రాజయ్య అని ఒక కట్టెలు కొట్టేవాడు వుండేటోడు...
Apr 27, 2019
గిరి వాళ్ళ నాన్న వీరయ్య కష్టజీవి. వాళ్ళు పడే కష్టం తెలుసు గనకనే..
Apr 26, 2019
అనగనగా ఒక ఊళ్లో ఒక అన్న, ఒక తమ్ముడు ఉండేవాళ్ళు.
Oct 30, 2019
ధర్మపురంలో చాలా పేద కుటుంబం ఒకటి ఉండేది.
Apr 24, 2019
TeluguOne For Your Business
About TeluguOne