Home » కథలు » కరిగిన అహంFacebook Twitter Google
కరిగిన అహం

కరిగిన అహం

 


అనగనగా ఒక పెద్ద రాజ్యం. ఆ రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. అతని పేరు శూరసేనుడు. శూరసేనుడికి చాలా పెద్ద కోట ఉండేది. ఆ కోట నిండా బంగారం ఉండేది. రాజు ప్రజలను హింసించి వాళ్ళ దగ్గర నుండి కప్పాలు వసూలు చేసేవాడు. 'పన్నులు కట్టేందుకు సరిపడా పంటలు వాళ్ళకు పండాయా, లేదా' అని చూసేవాడు కాదు. 'ఈ ప్రపంచంలో తన కంటే గొప్ప వాడు లేడు' అని అనుకునేవాడతను. సహజంగానే అట్లాంటి రాజులకు యుద్ధం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఒకసారి పొరుగు దేశం మీద యుద్ధం చేయాలని ప్రకటించాడు శూరసేనుడు. 


ఆ దేశం వాళ్ళు ఇతన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు కానీ, చివరికి ఇతనే గెలిచాడు. దాంతో శూరసేనుడి అహంకారానికి పట్ట పగ్గాలు లేకుండా అయింది. అతను చేయించిన ఆ యుద్ధంలో అనేకమంది సైనికులు మరణించారు; వారి కుటుంబాలన్నీ‌ వీధిన పడ్డాయి. అయినా యుద్ధోన్మాదంలో మునిగిన శూరసేనుడికి, 'సైనికులు తనవారు' అనే ఆలోచనే లేదు! 'తను గెలవాలి' అనే పట్టుదల వల్ల, ప్రజలు, సైనికులు అందరూ పరాయి వాళ్ళే అయ్యారు! 


ఒక రోజున అతను ఎప్పటిమాదిరే గుర్రం ఎక్కి అడవికి బయలుదేరి పోయాడు, వేటాడేందుకు. అసలైతే రాజులు ప్రజల సమస్యలను వినాలి; వాటిని పరిష్కరించాలి. ఇప్పుడు క్రూరమృగాల సమస్యలేమీ లేవు: అయినా శూరసేనుడి తీరు అంతే. అడవిలో అతనికి జింకలు, కుందేళ్ళు మాత్రం ఎదురయ్యాయి. అవన్నీ తనని చూసి బెదిరి పరుగు పెడుతుంటే, అతని చేతులు దురద పెట్టాయి. చివరికి ఓ కుందేలుని చంపేందుకు బాణాన్ని ఎక్కుపెట్టాడు. అంతలో అతనికి కళ్ళు తిరిగినట్లు అయింది. ఎవరో ఋషి వచ్చాడు- ఎక్కడినుండో, మరి?! "కుందేలుని చంపద్దు!" అన్నాడు.


"ఇది నా రాజ్యం; ఇక్కడ నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను- నువ్వెవరు, నన్ను ఆపడానికి?" అన్నాడు రాజు, ఆవేశంగా. ఋషి నవ్వాడు. "ఆలోచించు. నీ రాజ్యంలో ప్రజలంతా నిజానికి నీ పిల్లలే. ఇక్కడి జంతువులన్నీ నిన్నే నమ్ముకొని జీవిస్తై. ప్రజల్ని వేధించటం, జంతువుల్ని చంపటం- అదేం గొప్ప?" అన్నాడు. అయినా శూరసేనుడి మనసు మారలేదు. "ప్రక్కకు జరుగు. లేకపోతే బాణం నీకే తగుల్తుంది" అన్నాడు. 


"ఇదిగో, నా మాట వినకపోతే నీకు పుట్ట-బోయే పిల్లలు పందుల వలే పుడతారు" అన్నాడు రుషి. శూరసేనుడు గట్టిగా నవ్వేసి, “చూద్దాం" అంటూ కుందేలుని చంపేసాడు! అతను రాజధానికి తిరిగి వెళ్ళే సరికి 'రాణికి కవల పిల్లలు పుట్టారు' అని వార్త వచ్చింది. వెంటనే రాజు ఉత్సాహంగా ప్రసూతి గృహం వైపుకు వెళ్ళాడు- రాణిని పలకరించేందుకు, తన పిల్లల్ని చూసేందుకు! తీరా చూస్తే ఆ పిల్లలు ఇద్దరూ రెండు చిట్టి చిట్టి పంది పిల్లల్లాగా ఉన్నారు! శూర సేనుడికి మతి పోయింది. గిర్రున వెనక్కి తిరిగి తన ప్రాసాదానికి వెళ్ళిపోయాడు. అయినా అతని మనసు మనసులో లేదు: "తన పిల్లలు అలా ఉండేందుకు వీల్లేదు. ఎందుకు అవుతారు, అలాగ?!” మళ్ళీ ఓసారి ప్రసూతి గృహానికి వెళ్ళి చూసుకున్నాడు. 

 


నిజమే-” రెండు చిట్టి చిట్టి పంది పిల్లలు!- "కుదరదు- అవి అట్లా ఉండే వీల్లేదు!” అని అతని మనసు అరిచింది. ఆవేశం వచ్చింది. చర్రున కత్తి దూశాడు. పంది పిల్లల్ని రెండిటినీ చేత్తో పట్టి ఎత్తాడు- చంపేద్దామని. కానీ వాటి ముఖాల్లో అతనికి తనే కనిపించాడు. వాటి కళ్లలో తన రాణి! శూరసేనుడి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. కత్తి అతని చేతిలోంచి జారి పడింది... తెలివి వచ్చేసరికి శూరసేనుడు ఇంకా అడవిలోనే ఉన్నాడు- రాజ్యానికి పోనే లేదు, ఇంకా! అతని కళ్ళ ఎదురుగానే కుందేళ్ళు చెంగు చెంగున ఎగురుతున్నాయి, జింకల గుంపులు పోతున్నాయి నిర్భయంగా.


అతని చేతిలో‌ని ధనుర్బాణాలు క్రింద పడి ఉన్నాయి. చిత్రంగా, ఇప్పుడు ఆ జంతువులన్నిటిలోనూ తన ప్రతిబింబం కనిపిస్తోంది అతనికి. వాటిని వేటాడాలనే ఆలోచనే లేదు అతనిలో. అతనిక నిద్రలో ఉన్నట్లే వెనక్కి తిరిగి వచ్చాడు రాజ్యానికి. "జయము జయము మహారాజా! మన రాజ్యానికి యువరాజుల వారు పుట్టారు! చంద్రబింబం లాంటి ముఖం! అచ్చుగా తమరి పోలిక!" అని సంతోషంగా స్వాగతించారు పురోహితులు. ప్రజలంతా ఆ సరికే పండుగల్లో మునిగి ఉన్నారు! 

 


శూరసేనుడు వెళ్ళి రాణిని, కొడుకును చూసి వచ్చాడు. కొడుకు పందిలాగా లేడు- మామూలుగానే ఉన్నాడు- చాలా అందంగా, అచ్చు తన లాగానే! కానీ ఎందుకనో, తనే, పూర్తిగా మారిపోయాడు... తన అహం ఏదో కరిగిపోయింది! శూరసేనుడికి ఇప్పుడు ప్రజలందరిలోనూ స్వయంగా తనే కనిపిస్తున్నాడు! పూర్తిగా ప్రజల మనిషి అయిపోయాడు అతను. అటుపైన అతను తన సంపదని యావత్తూ కేవలం ప్రజల మేలు కోసమే వినియోగించి 'మంచి రాజు' అనిపించుకున్నాడు. 

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో


అనగనగా ఒక మంచాయన ఉండేవాడట. వాళ్ళ ఊరికి దగ్గర చాలా పండ్ల తోటలు ఉండేవి. పండ్లని తినేందుకు చిలకలు, వగైరా పక్షులు వచ్చేవి...
Feb 27, 2020
అది మంచి వేసవి కాలం. పిల్లలందరికీ సెలవలు. నారాయణ రెడ్డి ఆ రోజు ఉదయం బజారునుండి ఒక పుచ్చ కాయని తెచ్చాడు. పిల్లలంతా అది చూసి చాలా సంబరపడ్డారు....
Feb 8, 2020
అనగనగా ఒక ఊళ్లో ఇద్దరు దంపతులుండేవారు.
Aug 7, 2019
మతి మరుపు
Jul 31, 2019
ఆవులు కాసే రంగన్నకు ఉన్నట్టుండి ఓ సందేహం కలిగింది. "నేనేం చెయ్యాలి..
Jun 25, 2019
“అబ్బా!” తెల్లని డోరియా చీరపై గులాబీలు క్రాస్..
May 11, 2019
ఒక ఊరిలో రాజయ్య అని ఒక కట్టెలు కొట్టేవాడు వుండేటోడు...
Apr 27, 2019
గిరి వాళ్ళ నాన్న వీరయ్య కష్టజీవి. వాళ్ళు పడే కష్టం తెలుసు గనకనే..
Apr 26, 2019
అనగనగా ఒక ఊళ్లో ఒక అన్న, ఒక తమ్ముడు ఉండేవాళ్ళు.
Oct 30, 2019
ధర్మపురంలో చాలా పేద కుటుంబం ఒకటి ఉండేది.
Apr 24, 2019
TeluguOne For Your Business
About TeluguOne