Home » ఈపేజీ మీకోసం » సుమతీ శతకం ఎందుకంత ప్రత్యేకం!Facebook Twitter Google
సుమతీ శతకం ఎందుకంత ప్రత్యేకం!

 

 సుమతీ శతకం ఎందుకంత ప్రత్యేకం!

 

 

అక్కరకు రాని చుట్టము, అప్పిచ్చువాడు వైద్యుడు... లాంటి మాటలు నిత్యం మన జీవితంలో వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఒక శతకంలోని చరణాలంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రతి పద్యంలోనూ ఒక సామెతనో, జాతీయతనో సృష్టించిన ఆ శతకమే సుమతీ శతకం. తెలుగునాట తొలి శతకాలలో ఒకటిగా సుమతీ శతకాన్ని భావిస్తారు.

సుమతి అంటే మంచి బుద్ధి అని అర్థం. ఆ పద్యం చదివేవాడు అలాంటి సద్బుద్ధి కలగాలనే ఉద్దేశంతో ‘సుమతీ’ అనే మకుటంతో అందులోని ప్రతి పద్యమూ ముగుస్తుంది. ఇంతాచేసి ఈ శతకాన్ని రాసింది ఎవరన్న విషయం మీద మాత్రం స్పష్టత లేదు. కాకపోతే రాణీ రుద్రమదేవి కాలంలో కాకతీయులకు సామంతునిగా ఉన్న బద్దెన భూపాలుడే ఈ శతకాన్ని రచించాడని చాలామంది అభిప్రాయం.

సుమతీ శతకాన్ని ఒకవేళ బద్దెన కవే రాసి ఉంటే... ఈ రచన జరిగి 700 సంవత్సరాలకు పైనే గడిచిపోయి ఉంటుంది. కానీ ఇప్పటికీ అందులోని పద్యాలన్నీ మనకు కంఠస్థం ఉన్నాయంటే, ఆ రచన సులభశైలిలో సాగడమే కారణం. చిన్న చిన్న పదాలు, లయబద్ధంగా సాగిపోయే పాదాలు, వ్యవహారానికి దగ్గరగా ఉండే భాష, నీతి.... అన్నీ కలిసి సుమతీశతకాన్ని చిరస్థాయిగా నిలబెట్టాయి. అటు పండితులని తృప్తి పరిచేలా, ఇటు పామరులకి ఉపయోగపడేలా సాగాయి.

సుమతీ శతకంలో తానేం చెప్పదల్చుకున్నాడో కవి తన మొదటి పద్యంలోనే తేల్చేస్తాడు...
శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ
.... అని సాగే ఆ పద్యంలో జనులు మెచ్చుకునేలా చక్కని నీతులని ధారాళంగా చెప్పాలనుకున్న తన ఆశని వెలిబుచ్చుతాడు. ఈ పద్యం తర్వాత అకారాదిగా (alphabetical order) శతకం ముందుకు సాగుతుంది. తెలుగులో ఈ సంప్రదాయానికి నాంది పలికింది బద్దెన కవే అని చెబుతారు.

సుమతీ శతకంలో చాలా పద్యాలలో ఆచరించదగిన నీతి ఉన్నమాట నిజమే! కానీ కొన్ని పద్యాలలో రచయిత పక్షపాత ధోరణ, చిత్రమైన అభిప్రాయాలు కనిపించకమానవు. ముఖ్యంగా స్త్రీలనీ, కొన్ని కులాలనీ, కొందరు అలవాట్లనీ తన పద్యాలలో చులకన చేయడం వల్ల విమర్శకులు మండిపడుతూ ఉంటారు. అలాంటి అభ్యంతరకరమైన పద్యాలని పక్కనపెడితే... ప్రతి తెలుగు విద్యార్థీ జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన పద్యాలు సుమతీశతకంలో చాలానే కనిపిస్తాయి.

- నిర్జర.

 

 


నిజం చెప్పనా
May 31, 2019
జీవితంలో ఏ పోటీ అయినా పరుగు పందెంలా సాగాలి!
Apr 16, 2019
ఆనందీ గోపాల్  జోషి పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన  మొట్టమొదటి భారతీయ మహిళావైద్యురాలు..
Mar 30, 2019
మన భారతదేశంలో  శాస్త్రీయ నృత్యాలు... ఎనిమిది రకాలు... అవేమిటంటే.....
Mar 22, 2019
ఫిబ్రవరి 21 వ తేదీ ప్రపంచ మాత్రుభాషాదినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. బహుభాషాతనాన్ని, భాషా సాంస్క్రుతిక భిన్నత్వాన్ని గుర్తించేందుకు అవగాహన పొందేందుకు ఈరోజును ప్రపంచ మాత్రుభాషా దినోత్సవంగా.....
Feb 20, 2019
బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మా మా ఇంటికి రావమ్మ మురియెంగా...
Oct 15, 2018
మునిగిన జలమును నీవు కరిగి  పవిత్రముగ జేసి నీ గుర్తుగా...
Sep 19, 2018
ఒక చిన్న కథ. ఓ వ్యాపారవేత్త పనిమీద బయల్దేరతాడు...
Sep 5, 2018
తెలుగునాట లాలిపాటలకు కొదవేమీ లేదు. కాలం ఎంత మారినా కూడా...
Sep 3, 2018
తన శివతాండవ కావ్యాన్ని సంగీత సాహిత్య నాట్య త్రివేణీసంగమంగా మలచేందుకు మా అయ్యగారికి స్ఫూర్తినిచ్చినది చిదంబరంలోని
Feb 12, 2018
TeluguOne For Your Business
About TeluguOne