Home » కథలు » మిత్రద్రోహంFacebook Twitter Google
మిత్రద్రోహం

మిత్రద్రోహం

 

అనగా అనగా ఒక ఊళ్లో ఒక కోతి, పిల్లి, ఎలుక ఉండేవి. సాధారణంగా పిల్లికి ఎలుకకు పడదు కదా! కానీ ఈ‌ పిల్లి-ఎలుకలు మాత్రం మంచి మిత్రులు. ఊరి చివరన, అడవికి దగ్గరలో ఇళ్లు కట్టుకున్నాయి అవన్నీ. రోజూ మూడూ కలిసి అడవికి వెళ్ళేవి; వేటికవి తమకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకునేవి; ఆనందంగా కాలం గడుపుతూండేవి. అయితే ఒకసారి ఎండాకాలం, వానలు అస్సలు పడలేదు. అడవంతా ఎండిపోయింది. పిల్లి, ఎలుకలకు పరవాలేదు గానీ, కోతికి మాత్రం అక్కడ జీవించటం కష్టం అయ్యింది. కోతి కష్టాన్ని గమనించినై, ఎలుక- పిల్లి . 

ఒకరోజున, కోతి వింటుండగా అవి రెండూ మాట్లాడుకున్నాయి-"నాకు ఇక్కడ ఆహారం సరిగ్గా దొరకటం లేదు. పట్నానికి పోతే బాగుండుననిపిస్తున్నది" అన్నది పిల్లి. "నాకూ సమస్యగానే ఉంది; నేనూ వస్తాను" అన్నది ఎలుక. కోతి మాత్రం ఏమీ మాట్లాడలేదు. దానికీ వెళ్ళాలనిపించింది చాలాసార్లు. అయితే ఆ సంగతి చెబితే పిల్లి-ఎలుక ఏమంటాయో అని అది వాటితో ఇంతవరకు ఆమాట అనలేదు. "నువ్వేమంటావు?" అడిగాయి పిల్లి-ఎలుక. "కొంచెం ఆలోచించి చెబుతాను" అన్నది కోతి. మరునాడు కోతి తన నిర్ణయాన్ని ప్రకటించింది: "నేను పట్నానికి వెళ్తున్నాను" అని. ఎలుక, పిల్లి చాలా సంతోషించాయి. 

 

అయితే వాటి మనసు చివుక్కు మన్నది- "మీరు వస్తున్నారుగా?!" అని మాట వరసకైనా అడగలేదు కోతి. అయినా "ఇంత కాలం కలిసి ఉన్నాం కదా, ఇప్పుడు మాత్రం విడిపోయేదెందుకు?" అనుకొని, పిల్లి-ఎలుక కూడా కోతి వెంట పట్టణానికి బయలు దేరాయి. ఇంకా పట్టణం చేరకనే, దారిలో కోతికి ఒక బంగారునాణెం దొరికింది. పిల్లి-ఎలుకలకు ఆ నాణెం విలువ తెలీదు గానీ, కోతి చాలా తెలివైనది- "ఇది మీకేమీ పనికి రాదులే, నేను ఉంచుకుంటాను దీన్ని" అని అది అంటే, "దానిదేముంది, నువ్వే ఉంచుకో. దీంతో ఏం చెయ్యాలో‌ మాకేం తెలుసు?" అన్నాయి పిల్లి-ఎలుక.

కోతి ఆ బంగారు నాణాన్ని పట్టణంలో అమ్మి చాలా డబ్బులు సంపాదించింది. ఒక్కసారిగా వచ్చిన పెద్ద మొత్తంతో వెనువెంటనే అది కాస్తా షావుకారు అయ్యింది. కోతి వెంట వచ్చిన పిల్లి-ఎలుక అక్కడికి దగ్గర్లోనే వేరే ఎవరి ఇంట్లోనో జీవించటం మొదలు పెట్టాయి. ఆ యింటి వాళ్ళు దయ తలచి పిల్లికి ఇంత అన్నం‌ పెడితే అది దాన్ని ఎలుకతో పంచుకొని తినటం మొదలు పెట్టింది.

పట్నం వచ్చాక, కోతి ఇక పిల్లి-ఎలుకలకేసి చూడనే లేదు. తనకు వచ్చిన డబ్బుతో పెద్ద ఇల్లు కట్టి, చుట్టూ కంచె వేసింది అది!
ఒకసారి పిల్లి-ఎలుక కోతిని చూడడానికని వెళ్ళాయి. కోతికి వాటిని చూస్తే చికాకు అనిపించింది. వాటిమీద కోపం చేసుకొని, నిష్కారణంగా వాటిని కట్టెతో కొట్టి తరిమేసిందది! దాంతో ఆ చుట్టుపక్కల ఎక్కడా కనబడకుండా వెళ్ళిపోయిన పిల్లి-ఎలుక త్వరలోనే పట్నాన్ని ఏవగించుకున్నాయి. కొన్నాళ్ళకు రెండూ బయలుదేరి తిరిగి పల్లెను చేరుకుని, అడవికి పోయి స్వేచ్ఛగా బ్రతకటం మొదలు పెట్టాయి. 

 

ఇక అక్కడ, పట్నంలో కోతికి ఒక నక్క దొరికింది. ముద్దు ముద్దుగా మాట్లాడి కోతిని బుట్టలో వేసుకున్నది నక్క. కోతి దాన్ని నమ్మి, అదేదో గొప్ప తెలివైనది అనుకున్నది. దానితో స్నేహం చేసింది. కొంత కాలానికి, కోతి తనను గుడ్డిగా నమ్ముతోంది అని తెలియగానే, నక్క కోతిని మోసగించింది: కోతి దాచుకున్న డబ్బునంతా అది ఒక్క పెట్టున ఎత్తుకెళ్ళి-పోయింది! డబ్బు ఉన్నంత వరకూ కోతిని గౌరవించిన పట్నం వాళ్ళు, ఇప్పుడు 'దాని దగ్గర డబ్బు లేదు' అనగానే చిన్నచూపు చూడటం మొదలు పెట్టారు. రాను రాను పట్నంలో బ్రతకటం దుర్భరం అయిపోయింది కోతికి. అప్పుడు గానీ దానికి పాత మిత్రులైన పిల్లి-ఎలుక గుర్తు రాలేదు.

అయితే అది ఎంత వెతికినా పట్నంలో పిల్లి-ఎలుక కనిపించలేదు. చివరికి మిత్రులకోసం అది పల్లెకు బయలుదేరి పోయింది! అక్కడ సంతోషంగా జీవిస్తున్న పిల్లి ఎలుకల్ని చూసే సరికి దాని కళ్ళలో నీళ్ళు తిరిగాయి. వాటి దగ్గరకు వెళ్ళి 'క్షమించండి ' అని వేడుకుంది. 
అప్పటినుండి మళ్ళీ కోతి, పిల్లి, ఎలుకలు మూడూ స్నేహితులైపోయాయి. ఆ సరికి వానాకాలం కూడా వచ్చేసింది; అడవి బాగా తయారైంది; దాంతో మూడూ అడవిలో తమకు కావలసిన ఆహారం సంపాదించుకుంటూ సుఖంగా బ్రతికాయి.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

 


అనగనగా ఒక ఊళ్లో ఇద్దరు దంపతులుండేవారు.
Aug 7, 2019
మతి మరుపు
Jul 31, 2019
ఆవులు కాసే రంగన్నకు ఉన్నట్టుండి ఓ సందేహం కలిగింది. "నేనేం చెయ్యాలి..
Jun 25, 2019
“అబ్బా!” తెల్లని డోరియా చీరపై గులాబీలు క్రాస్..
May 11, 2019
ఒక ఊరిలో రాజయ్య అని ఒక కట్టెలు కొట్టేవాడు వుండేటోడు...
Apr 27, 2019
గిరి వాళ్ళ నాన్న వీరయ్య కష్టజీవి. వాళ్ళు పడే కష్టం తెలుసు గనకనే..
Apr 26, 2019
అనగనగా ఒక ఊళ్లో ఒక అన్న, ఒక తమ్ముడు ఉండేవాళ్ళు.
Oct 30, 2019
ధర్మపురంలో చాలా పేద కుటుంబం ఒకటి ఉండేది.
Apr 24, 2019
రామయ్య ఒకరోజు రాత్రి భోజనం చేసాక తోటకి బయలుదేరాడు.
Apr 22, 2019
చైత్ర మాసానికి స్వాగతం పలుకుతోంది...
Apr 4, 2019
TeluguOne For Your Business
About TeluguOne