Facebook Twitter
వృద్దాప్య వరము

వృద్దాప్య వరము (తెలుగువన్ ఉగాది కథలపోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
 

 

అమెరికా ఉదయం 5.00 
అల్లారం మోగడం తో  మెలుకువ వచ్చింది, కాని రోజు లాగా లేచే శక్తి లేక పోయింది. కాసేపు పడుకుంటే బావుండు అనిపించింది. బయట ఆరు సెంటిమీటర్ల మంచు తుఫానుట. వణికించే చలి.


పక్కనే ప్రశాంతంగా పడుకున్న మా వారిని చూసి, పోనీలే కనీసం తనకి అయినా విశ్రాంతి ఉంది అనుకుంటూ నెమ్మదిగా లేచాను. మొహం కడుక్కుని కొద్దిగా కాఫీ తాగగానే సత్తువ వచ్చినట్టు అనిపించింది. తరువాత చక చకా స్నానం చేసి, దీపం పెట్టుకుని వంట మొదలు పెట్టాను. 


ఏడింటికి కూతురు, అల్లుడు ఆఫీస్ కు వెళ్ళి  పోవాలి మరి. వాళ్లకి టిఫిన్, మధ్యాహ్నం భోజనం అన్నీ సిద్ధం చేసి ఉంచాను. ఇంతలోనే రెండేళ్ల వయస్సు ఉన్న నా మనవడు 'అమ్మమ్మా  మిలికిస్ 'అని అరవడం తో వాడి పాల సంగతి మర్చిపోయాను ఏమో, గబ గబా  పాలు కలిపి పట్టుకుని వెళ్ళాను. మరి వాడిని చూసుకోడానికే  ఐదు నెలల క్రితం మా అమ్మాయి దగ్గరికి వచ్చాము. వచ్చినప్పటి నుండి ఇదే దిన చర్య, వారు ఇద్దరు ఉదయం  ఏడింటికి ఆఫీస్ కి వెళ్లి సాయంత్రం  ఐదింటికి  రావడం. ఆఫీస్ నుండి వచ్చాక కూడా  పని చేసుకోవడం, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కదా. నేను ఇంటి పని, వంట పని, పిల్లాడి పని చేయడం, మా వారు వాడిని కాసేపు ఆడించి, బయటకి తిప్పడం. 


వచ్చిన మొదట్లో ఓపిక గానే ఉండేది. మా అమ్మ , అమ్మమ్మలు ఇలానే ఇంటి చాకిరీ ఓపిక గా చేసేవారు అని ,వాళ్ళని ఆదర్శంగా తీసుకుని  పని చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఇప్పుడే పని మీద ధ్యాస వెళ్లడం లేదు,చేసే పని నచ్చడం లేదు. ఇన్కమ్ టాక్స్ డిపార్టుమెంటు లో ముప్పై ఏళ్ళు పని చేసి రిటైర్ అయిన నేను, నాకన్నా మూడేళ్ళు ముందుగానే బ్యాంకు మేనేజర్ కింద రిటైర్ అయిన మా వారు ,అమ్మాయి డెలివరీకి అని అమెరికా రావడం ,ఆ తరువాత ప్రతి ఆరు నెలలకి ఇలా వచ్చి వెళ్తూ ఉండడం తో నాకు రిటైర్  అయిన అనుభూతి కలగడం లేదు. అలా అని తల్లిగా నా బాధ్యత వదులుకోలేను. కానీ నా ఇంట్లో , నా ఊర్లో, నాకు నచ్చిన పనులు చేస్తూ ఇంటిపని చేయడం అంత ఇబ్బంది కాదు ఏమో అని నా ఆలోచన. గత పదిహేను ఏళ్లుగా నేను రిటైర్ అయితే ఎలా ఉండాలి, ఏమి చేయాలి అని నేను వేసుకున్న ప్రణాళికలో ఏది ఆచరించినట్టు అనిపించలేదు. మా అత్తగారు, అమ్మ ఉద్యోగం చేసి ఎరగరు. అయితే మాత్రం వారు వృద్దాప్యం అంటే ,అరవేయేళ్ళు వచ్చేసరికి స్వతంత్రగా, వారికీ ఎక్కడ నచ్చితే అక్కడ ఉండి, ఎంత చేయగలిగితే అంత పని చేస్తూ, పుస్తకాలు చదువుతూ,పురాణ కాలక్షేపం చేస్తూ, రామకోటి రాస్తూ ,పెద్ద దిక్కుగా ఉండేవారు. 


మరి నేను ?
వారి పిల్లలుగా మేము ఎప్పుడు వారి నుండి పని ఆశించలేదు. వారి మీద ఆధారపడి మా జీవితాలు అల్లుకోలేదు. మంచి ఉద్యోగం చేస్తూ కూడా వారి మీద భారం వేయడం ఇష్టం లేక మూడేళ్ల పాటు ఉద్యోగం మానేసి , ఖర్చులు నియంత్రణ చేసుకుని మేము ఇద్దరం ఒకటి గా ఉండి పిల్లని చూసుకున్నాము. ఎందుకు అంటే  పిల్లని కష్టపడి కన్నది మా కోసం కానీ వాళ్ళ కోసం కాదు కాబట్టి. మేము వారికీ అంత ప్రాముఖ్యత ఇచ్చాము.

మరి మాకు?
ఆలోచిస్తూ ఉండగానే అమ్మాయి నుండి
వాయిస్ మెసేజ్ వచ్చింది.


" అమ్మా సాయంత్రం ఫ్రెండ్స్ ని పిలిచాను కూర సాంబార్ చెయ్యి. అలాగే మీ రిటర్న్ టికెట్స్ బుక్ చేశాను. ఇంకో నెలలో ప్రయాణం. కానీ అక్కడ ఒక నెల ఉండి అవకాయలు అవి పెట్టి వెనక్కి వచ్చేయండి. ఇప్పుడే చెప్తే ఆ టికెట్స్ కూడా బుక్ చేసేస్తాను, సరేనా ఒక అరగంట లో కాల్ చేస్తా బాయ్"


అది వినగానే నా ఆలోచనలకి ఒక అర్ధం ఉంది అనిపించింది. వెంటనే నేను అనుకున్నది మా వారితో చర్చించాను. తనకి నేను చెప్పింది నచినప్పటికీ, కూతురు మనస్సు బాధపడుతుంది ఏమో అనే సంకోచం, నాకు అర్థంకాకపోలేదు.   కానీ నా మనస్సుకి తెలుసు అన్ని అవే సర్దుకుంటాయి అని.
 
హైదరాబాద్ ఉదయం 6:30

బాల్కనీ లో కట్టిన ధాన్యం కుచ్చు ని తింటున్న పక్షుల కిలకిల రావాలతో మెలుకువ వచ్చింది.
నేను మా వారు ఇద్దరం లేచి , మొహం కడుక్కుని నింపాదిగా కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగి, ఒక అరగంట వ్యాహ్యాళి కి వెళ్లి వచ్చాము. 


రాగానే స్నానం చేసి , దీపం పెట్టి ఒక పావుగంట దేవుడుకి ధ్యానం చేసుకున్నాను. ఈలోపు పని అమ్మాయి వచ్చి కూరలు తరిగి, ఇంటి పని చేసి వెళ్ళింది. నేను టిఫిన్, మధ్యాహ్నం రాత్రికి కి కలిపి వంట చేయడంలో పడ్డాను, మా వారు గంట సేపు చేసే పూజలో నిమగ్నులయ్యారు.


9.30 కి పని , పూజ, టిఫిన్ అని అయ్యాయి.
ఈనాడు పేపర్ తీసి సుడోకు  పజిల్ నింపాము. నగరంలో ఈనాడు అనే శీర్షిక చూసి ఇవ్వాళ మనకి నచ్చిన కార్యక్రమాలు ఏవున్నాయా అని చూడగానే, త్యాగరాజ గాన సభలో భాగవత హరికథ కాలక్షేపం ఉంది. అది కూడా సాయంత్రం 5 ఇంటికి ఎలాగా అయినా వెళ్ళాలి అని అనుకున్నాము.


10.30 కి నేను దూరవిద్య లో కట్టిన ఎం.ఏ సోషియాలజీ కి సంభందించిన పుస్తకాలు తీసి ఒక రెండు గంటలు చదివాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యాలి అనే నా కోరిక తీరబోతోంది. మా వారు పక్కనే ఉన్న గుడికి వాలంటీర్ గా 
సర్వీస్ చేయడానికి ఈ రెండు గంటలు వెళ్తారు.


1.00 కి ఇద్దరం భోజనం చేసి ఒక గంట పడుకుని లేచి టీ తాగి కాసేపు పురాణాలు, ఇతిహాసాలు, సాహిత్యం మీద పుస్తకాలు చదవడం, రామకోటి రాయడం అలవాటు చేసుకున్నాము.


5.00 కి ఇద్దరం ఇవ్వాళ త్యాగరాజ గాన సభ కి వెళ్లి హరికథ విని చాలా ఆనందించాము. రోజు అయితే ఈ సమయానికే మా కాలనీ సీనియర్ సిటిజెన్స్ క్లబ్ కి వెళ్లి ఒక గంట స్నేహితులతో గడిపి వస్తాం. ఊరికే వెళ్లి కబుర్లు చెప్పుకుంటాం అనుకోకండి, వారానికి మూడు రోజులు సొసైటీ కి పనికి వచ్చే పనులు చేస్తూ ఉంటాము. పనివాళ్ల పిల్లల స్కూల్ ఫీజు కట్టడం, కాలనీ లో ఇంకుడు గుంతలు తవ్వడం, చెట్లు నాటడం, పూల మొక్కలు,కూర మొక్కలు పెంచడం, పిల్లలకి స్వచ్ఛ భరత్ మీద వాతావరణం కాలుష్యం మీద అవగాహన లాంటి పనులు. ఇంతే కాదు ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా మేము ఉన్నాము అంటూ కౌన్సెలింగ్ లాంటివి ఇస్తూ ఉంటాము. సోషియాలజీ  చదువుతున్నాను కదా దినికోసమే అనుకోవచ్చు. అంతే  కాక వారానికి ఓ రోజు మేము అంతా స్కూల్ పిల్లలుగా  క్లాసులకి వెళ్తాము. మా కాలనీలోని పిల్లలు మాకు ఇంటెర్నట్ వాడకం, యాంటీ వైరస్, మొబైల్ ఫోన్ వాడకం, హ్యాకింగ్ లాంటి విషయాల పయిన ఎంతో ఓపికగా పాఠాలు చెప్తారు. ఇంకా ఇలాంటివి చేయాల్సినవి చాలానే ఉన్నాయి , ఆ దేవుడు ఓపిక శక్తి ఇస్తే తప్పకుండా చేస్తాం.


7.30 లోపల భోజనం చేసి  కాసేపు టీవీ లో ఏ పాత సినిమానో, చాగంటి వారి ప్రవచనమో, పాడుతా తియ్యగా లాంటి కార్యక్రమమో చూసి అమ్మాయితో ఓ అరగంట స్కైప్ లో మాట్లాడి  పదింటికి  అలా అలసిపోయి, ఒక సంతృప్తి తో , నా జోవితానికి ఒక అర్ధం ఉంది అనే ఆత్మవిశ్వాసం తో వెంటనే నిద్రలోకి జారుకోవడం, మళ్ళి కొత్త ఉత్సాహం తో ఉదయం లేవడం ఇదే నేను కోరుకున్న ,  ఆశించిన  దినచర్య. అయితే ఇవ్వాళ అమ్మాయి ఇంకా వీడియో కాల్ చేయలేదు ,ఆన్లైన్ లో కూడా లేదు ఎందుకా అని ఆలోచిస్తుంటే అమ్మాయి నుండి మెయిల్ వచ్చింది.


"అమ్మా, మొదటిసారి నీకు సారీ చెపుకుంటున్నాను. ఇంక లైఫ్ లో నీకు ఇలా సారీ చెప్పుకునే సిట్యుయేషన్స్ రాకూడదు అనుకుంటున్నాను. నువ్వు వెళ్లిన ఈ 3 నెలల్లో నాకు నువ్వు ఏంటో ఇంకా ఎక్కువ అర్ధం అయింది. మూణ్ణెల్ల ముందు నువ్వు మేము ఇంకా అమెరికా తిరిగిరాము అన్ని మాకు చెపినప్పుడు నాకు చాల కోపం వచ్చింది. నన్ను సముద్రం మధ్యలో వదిలేసి వెలిపోతున్నావని తిట్టుకున్నాను. అమ్మమ్మ, నానమ్మ నీకు ఎంతో చేసారు మరి నువ్వు నాకు ఎందుకు చెయ్యట్లేదు అని అనుకొన్నాను. కానీ వాళ్ళు వాళ్లకి తగినట్టుగా , ఇష్టపడి ఎంత ఓపిక ఉంటె అంతే చేసారు కానీ నువ్వు ఎప్పుడు వాళ్లని ఇలా చేయి అలా చూడండి అని అడగ లేదు అని అర్ధం చేసుకున్నాను. ఇన్ని రోజులు నువ్వు చేస్తూ ఉంటే తెలీలేదు కానీ , అన్ని పనులు పిల్లాడితో చేసుకుంటుంటే  మూడుపదులలో ఉన్న నాకే ఓపిక ఉండట్లేదు. అలాంటిది అరవయి ఏళ్ళ వయసులో అది కూడా జీవితంలో ఎంతో కష్టపడిన నీతో చాలా చాకిరీ చేయించాను. ఈ వయసులో నీకు కావాల్సిన విశ్రాంతి  నేను నీకు ఇవ్వలేకపోయినందుకు చాల సిగ్గు పడుతున్నాను. అయినా నువ్వు ప్రతి నెల నాకు కూరపొడి, చారుపొడి దగ్గర నుండి వడియాలు అప్పడాలు వరకు అన్ని చేసి పంపిస్తూనే ఉన్నావు. తల్లి మనస్సు కదా అంతే మరి. ఇలాంటి ఎన్ని అడ్డంకులు వచ్చినా మొత్తానికి నువ్వు అనుకున్నది సాదించావు ప్రౌడ్ అఫ్ యు అమ్మా..   అందుకే నేను కూడా నిన్ను ఇన్స్పిరేషన్ కింద తీసుకుని కొంత కాలం ఉద్యోగానికి బ్రేక్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను. బాబు స్కూల్కి వెళ్ళేదాక నిన్ను కానీ మా అతగార్ని కానీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు, ఎలాగో అలాగా ఖర్చులు తగ్గించుకుని మీకు మీ ఫ్రీడమ్ ఇవ్వాలని అనుకున్నాము. థాంక్ యూ ఫర్ ఎవెర్య్థింగ్ అమ్మా, బాయ్, రేపు కాల్ చేసి మాట్లాడతాను."


మెయిల్  మూడు సార్లు చదువుకున్నాను , నాకు తెలుసు నా కూతురు ఆలస్యం అయినా నన్ను అర్ధం చేసుకుంటుంది అని ,మా పెంపకం మీద నాకు ఆ నమ్మకం ఉంది. పిల్లలు చెడు చూసినట్టే మంచిని చూసి కూడా నేర్చుకుంటారు. మనం చేసినది మనకి తప్పక తిరిగివస్తుంది. నా ప్రశ్నలకి సమాధానం దొరికినందుకు మనస్సులో ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ప్రశాంతంగా పడుకున్నాను. పొద్దునే లేచాము  కాని ఇవాళ మా దినచర్య లో కొద్దిగా మార్పు , ఎందుకు అంటే ఇవాళ మా సీనియర్ సిటిజన్స్ క్లబ్లలో వంద మంది సభ్యులు చేరిన తరుణం లో వాళ్ల కుటుంబాలుతో సహా అందర్నీ లంచ్ కి పిలిచారు.  అందరూ వారి వారి కుటుంబాలతో చక్కగా వచ్చారు. భోజనాలు అయ్యాక  ఆసక్తి ఉన్నవారు నాలుగు మంచి మాటలు చెప్పవచ్చు అని అందరికీ అవకాశం ఇచ్చారు . నా వంతు రాగానే 


“ వృద్దాప్యం శాపం కాదు, దేవుడు మన కలల్ని సాకారం చేసుకోడానికి ,మరల జీవించడానికి ఇచ్చిన గొప్ప వరం. అది ఎవరు తాహతుకి తగ్గట్టు గా ఆలోచించి ఆచరణలో పెట్టండి. అందరికీ అన్ని కుదరకపోవచ్చు ఆర్థిక సమస్యలు ,ఆరోగ్య సమస్యలు , పిల్లల సమస్యలు ఉండచ్చు కాబట్టి అనుకున్నవన్నీ చేయలేకపోవచ్చు. కానీ కనీసం కొంత స్వీయ సమయం అంటే రోజుకో గంట వ్యచించచ్చు. ఆ గంట మనకి నచ్చినట్టు ఉండి ,నచ్చినట్టు చెయ్యచ్చు.అది ఎంత చిన్న పని అయినా సరే, స్నేహితులని  కలవడం, పార్కులో వ్యాహ్యాళి,లైబ్రరీ కి వెళ్ళడం, పక్కన గుడికి వెళ్లడం లాంటి వాటికి ఎలాంటి ఇబ్బందులు అడ్డు రావు. ఎందుకు అంటే నచ్చింది చేయడం వల్ల మానసిక ఆరోగ్యం కుదుటపడి అలజిమేర్స్, డిప్రెషన్ లాంటి ఎన్నో వ్యాధుల్ని నియంత్రించి ,మన ఆరోగ్యం మన చేతిలో ఉంచుకోవచ్చు. అందుకే ఈ వృద్దాప్య వరాన్ని మన ముందు తరానికి బహుమతి గా ఇద్దాం , కదలి రండి నా తోటి మిత్రులారా…” అని నేను ముందుగానే ఆలోచించుకున్న నా భావాల్ని, అనుభవాల్ని  వారితో  పంచుకున్నాను. అందరూ కారతాళధ్వనులు చేసి, ఎవరి పిల్లలు వారి వారి తల్లిదండ్రులని మీకు మేము ఉన్నాము నచ్చింది చేయండి అన్నట్టుగా చూసారు అనిపించింది, ఒక  భరోసా వారి కళ్ళలో కనిపించింది. ఇది చాలు ,ఇంతకన్నా  సాధించటానికి ఇంకా ఏమి ఉంది అని, నిజానికి ఈ చప్పట్లు, ఈ కార్యసిద్ధి నావి కాదు, ఈ వయస్సు లో కూడా  నాకు  ఇంత స్వేచ్ఛని ఇచ్చిన నా కుటుంబానికే చెందుతుంది కదూ! 

 

-భాస్కరలక్ష్మి.సోంభొట్ల