Facebook Twitter
విరిసిన కవిహృదయం

పద్య కవిత 
చైత్ర వసంతాన శ్రీవిళంబి  (విరిసిన కవిహృదయం)


 చం||  యుగముల కాదియై, గణన యోగ్యముగా, ప్రభవాదిపేరులన్
           జగతిని కాల చక్రమున, చైత్ర వసంత, శుభోదయంబుగన్
           సుగతిని జూపి మానిసికి, సుందర నందన మౌచు ధాత్రికిన్
           ప్రగతి ఫలాలు పంచగను, వచ్చెనుగాదియు శ్రీవిళంబిగన్ "

 చం||   సగటున వర్షపాతమును, సాలున, పంటకు గిట్టుబాటునున్
            తగిన యుపాధి కల్పనలు, తగ్గని రాబడి వస్తుసేవలన్
            తగవులు లేని పాలనము, ధర్మము దప్పని నాయకత్వమున్
            సొగసగు జీవనంబు, మన సొంతము నూతన వత్సరంబునన్"

తే||గీ||   వత్స వత్సరానికుగాది, వచ్చుచుండ 
            నిత్య శోభలన్ వర్థిల్లు, నేలతల్లి 
            ప్రకృతి యందాలు, మానవుల్, పాడుజేయ
            కాలమే, కరవాలమై, కలచివేయు"

 ఉ||      పచ్చని పైటవేసికొని, బారులు తీరగచెట్టుకొమ్మలున్
            విచ్చిన పూలు దాల్చికొని, వేళలు గాచగ తీవెకోమలుల్
            అచ్చికబుచ్చికన్, నెమలు లాడగ, కోయిల గుంపు పాడగన్ 
            వచ్చెను, నేత్ర పర్వముగ, వ్యక్తము కాగ, వసంత మీయెడన్"

ఆ||వె||  మధురమైన తెలుగు, మాకందమేయని
             చిలుక పలికె నోట, తెలుగు మాట 
             మధువుకన్న తెలుగు, మాధుర్యమనుకొని 
             తెలుగు పదము గ్రోలె, తేనెతిండి " .

రచన:- పొనకంటి దక్షిణామూర్తి