Facebook Twitter
కాకి పిండం (అల్లూరి నరసింగరావు స్మారక కథలపోటి లో రెండవ బహుమతి కథ)

కాకి పిండం (అల్లూరి నరసింగరావు స్మారక కథలపోటి లో రెండవ బహుమతి కథ)

 

 

పసి కూన ఇల్లెగిరి పోయేలా అరుస్తున్నా పడక్కుర్చీలో పడుకొని దీర్ఘాలోచనలో ఉన్నాడు పాపారావు. ఉదయపు ఎండ పూర్తిగా అతన్ని అల్లుకుపోయి ఉంది. సూర్యుడు కనపడకుండా తుండుగుడ్డ ఫైన కప్పుకున్నాడు.
“ఛత్.........ఎందుకేడుస్తున్నావే?” చిరాకుగా అన్నాడు.
చింటూ స్కూల్ డ్రస్సుకు బెల్టు బిగించుకుంటూ  చాప మీద పడి ఏడుస్తున్న చంటి దాన్నిగదమాయిస్తున్న తండ్రి వైపు చూసాడు. వాడి మొహము ఫైన జుట్టు నీళ్ళు కారుతూ అతుక్కుపోయి ఉంది. తడి మీద పౌడర్ రాసుకున్నాడేమో అంతా అతుకులు అతుకులు తెల్లగా. పిల్ల ఆపకుండా ఏడుస్తుంటే వాడికీ ఏడుపు వస్తోంది. 
“అమ్మొస్తుంది ఆగు....బాయి కావాలా పిలుస్తా ఉండు” అన్నాడు.


పిల్ల ఒక్క క్షణం ఆగి మళ్ళీ ఏడుపందుకుంది. 
“ఎక్కడ చచ్చిందిరా మీ అమ్మ! అదేడుస్తుంటే వినపట్టంలా...” పాపారావు మొహం ఫైనున్న తుండు గుడ్డ తీసి అరిచాడు. చింటూ తనకు బాక్సులో పెట్టిన అన్నం గబగబా మూత పెట్టి బ్యాగులో పడేసుకున్నాడు.
“అదేంటీ ఇప్పుడు తినవా?మద్యాహ్నం ఎలాగూ స్కూల్లో పెడతారుగా తిండి..పొద్దాకా ఎలా ఉంటావురా?”  పిల్లదాని ఏడుపు వినిపించుకోనట్లుగా లేచి లుంగీ సరిగా కట్టుకుంటూ అడిగాడు కొడుకుని పాపారావు.
వాడు బూట్లు రెండూ చేత్తో పట్టుకుని, బ్యాగు భుజానికి వేసుకొని పరిగేత్తాడు రోడ్డు మీదకు తడి తలతోనే, మూల మలుపు మీదికి బస్సు వస్తుంది మరి.
పిల్ల పెంకు లేపుతున్నది ఏడుపుతో. పాపారావు హాల్లోంచి ఇంటి ముందరికొచ్చాడు సుధ కోసం. గోడ మీంచి పక్కింట్లోకి చూసాడు.


‘ఎక్కడ చచ్చిందబ్బా పొద్దున్నే’ అనుకుంటూ వాకిట్లోకి వచ్చాడు, అక్కడ పంపు నీళ్ళు పడుతోంది సుధ.
“ఒక్కసారి దాని సంగతి చూడు ఫో...పట్టిన నీళ్ళు చాలుగానీ...ఏడ్చి ఏడ్చి చచ్చేలా ఉందది”
చుట్టుపక్కల ఆడాళ్ళున్నారని కూడా చూడకుండా అరిచాడు.
“కాస్త చూడకూడదూ...వచ్చేస్తున్నా...” చిన్నగా గొణిగింది సుధ. ఆమె బేల మొహం చూసి 
“నువ్వెళ్ళమ్మా ఏవన్నాఅనేయగలడా మానవుడు. నీ బింది నే నింపి పెడతాగానీ లోపలికి పో “
మామ్మగారు సుధను పంపేసింది పంపు దగ్గర్నించి.
“మందని చూసుకోని బానే పురమాయిస్తున్నావు పని...ఆ...” అతని మాటలకు భయంతో పరిగిత్తింది పసిదాని దగ్గరికి.
“కాస్త నిమ్మళంగా నడువు, ఏంటా పరిగెట్టడం...చిన్న పిల్లనుకుంటున్నావా? ఉత్త మనిషివి కూడా కావు”
స్నానం చేసి దొడ్లోంచి వస్తున్న కాంతమ్మ కసిరింది.
అత్తగారి మాటలు చెవికి దూరనివ్వకుండా వసుధ  నెత్తుకుని గుండేలకాన్చుకుంది. తల్లి గుండె చెప్పుడు వినటానికి విరామం ఇచ్చి మళ్ళీ కేవ్వుమన్నదది. రొమ్ము దానోట్లో పెట్టి కళ్ళు మూసుకుంది సుధ కిందికి దుమికే కన్నీటిని అదిమిపెడుతూ.


కుంపటి వెలిగించి పప్పుతప్పలాలో పప్పు పడేసి నాలుగు తోటకూర కాడలు ముందేసుకొని కూర్చుంది అత్తగారు. అవి రిల్లుతూ కోడలి హావ భావాలూ కనిపెడుతోంది.
‘మూడో కాన్పుకు రివటలా తయారైంది. ఇవ్వాళా రేపు ఎవరు కంటున్నారు మూడో సంతానాన్ని?? వాడికి బుద్ది లేకపోతే మానే, దీనికైనా ఉండద్దూ? ఆ పుట్టింటి వాళ్ళు కనీసం ఇటుకేసినా తొంగి చూడరు. అదేం పాపమో! మొదటి కాన్పుకు తీసుకొని పోయి, పురుడు పోసి పంపారు అంతే... తల్లి పోయి ఒక సంవత్సరం, తండ్రి పోయి ఇంకో సంవత్సరం...ఆనక అన్నదమ్ములు వేర్లుపడడం, అనారోగ్యాలు...ఈ వరస కార్యక్రమాలు జరుగుతూ సుధని మర్చేపోయినట్లుగా అయినారు. ఏనాడు ఎవర్ని పల్లెత్తు మాట అనని కోడలిని చూస్తే ఒక్కోసారి చిర్రెత్తుతుంటుంది. కొడుకు తిడుతున్నా నోరెత్తదు! ఇహ తనతో... తనంటేనే దానికి వెన్నులో వణుకు వస్తుంటుంది..’ అది తలుచుకొంటున్న కాంతమ్మ పెదవులు నవ్వుతో విచ్చుకున్నాయి.


“ఇచ్చకాల ముండ ఎంత లావు ఏడ్చిందీ...ఇప్పుడు చూడూ!” అత్తగారి మాటలకు బిడ్డ కళ్ళు తుడిచి బొంత సరిచేసి మళ్ళీ పడుకోబెట్టింది.
మోపెడు గుడ్డలు ఎదురుకుపోయి బావి గట్టు మీద పడేసి, నీళ్ళలో జాడించడం మొదలు పెట్టింది సుధ. సర్ఫు సబ్బు ఏమి లేవు. వసుధ గుడ్డలు నాచు వాసన వేస్తున్నాయి ఎంత బండకేసి బాదినా.
ఎండా చురచురా నెత్తి కాలుస్తోంది. సుధ ఏ పని చేస్తున్నా బస్సు ఫీజు గురించే ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. చింటూ గాడి ఫీజు ఇప్పటికే మూడు నెలలు బాకీ. 
వాడి పుస్తకాలూ, ఫీజులు, మద్యాహ్నం తిండీ అంతా పిల్లాడి తాతయ్య పరమయ్య స్కూలు యాజమాన్యం తో మాట్లాడుకొని మాఫీ చేయించాడు పౌరోహిత్యంతో వాళ్ళ ఇంటి కార్యాలు చక్కపెడతానని చెప్పి. 


ఎండా వానా తెలీకుండా తిరుగుతాడు పరమయ్య. ఇంట్లో భోజనం చేయడం ఎప్పుడో, అంత పెద్ద ఊళ్ళో ఎప్పుడూ ఏదో ఓ కార్యం జరుగుతూనే వుంటుంది. పదో పరకో దొరుకుతాయి. ఆ సంపాదన సంసారానికి బొటాబోటిగా సరిపోతాయి.
పాపారావు నాలుగు గంటలకు లేచి బస్టాండ్ లో పేపర్ తెచ్చి ఇంటింటికీ వేసి, ఆ చేత్తోనే పాల ప్యాకెట్లూ  వేసోస్తాడు. అప్పటికి తెల్లవారుతుంది. స్నానం చేసి గుడి కేడతాడు.  అక్కడ మూడు గంటలు పూజ చేసి బత్యం తెచ్చుకుంటాడు. పగలు తండ్రి తో పాటు అపర కర్మలకు, ఇతర కార్యాలకు వెళ్లి వస్తుంటాడు. సాయంత్రం ఇరవై మంది పిల్లలకు ట్యూషన్లు చెబుతుంటాడు. 
ఏమిచేసినా ఇంటర్ పాసయిన తనకేం ఉద్యోగం సద్యోగం దొరకదని తెలిసి రెక్కల్ని కరగదీయడం మొదలుపెట్టాడు . కడుపులో అతనికో భయం పట్టుకుంది. తల్లీ తండ్రీ పెద్దవాళ్ళు అవుతున్నారు. తనకి మూడో సంతాన౦ అందబోతున్నది. అరా కోరా సంపాదనతో వీళ్ళందరి అనారోగ్యాలకూ, చదువులకూ, తిండికీ ఎన్నాళ్ళు దేవుళ్ళాడినా ఫలితం ఉండదని అర్థం అయ్యిందగ్గర్నించీ విసుగూ, చిరాకూ పెరిగిపోయి అభద్రత ఎక్కువయ్యింది.


భార్యని పోరుపెట్టాడు గర్భం తీయించుకోమని, భయపడిపోయింది సుధ. తను పోషించలేనని ఖరాఖండిగా చెప్పాడు. అత్తగారికి చెప్పుకోలేకా...భర్త నస భరించలేకా నలిగిపోతోంది సుధ.
పాపారావుకు ఆరోజు ఇంట్లోనే భోజనం. ఒంటిగంటయ్యింది. అమ్మ పిలవదేం ఇంకా అన్నానికని ముందర వరండాలో వాలు కుర్చీలో ఎదురుచూస్తూ కూర్చున్నాడు. రెండుగంటలకు కాబోలు
“నాయనా, భోజనానికి వస్తావా?” అంటున్న తల్లి మాటలకు దిగ్గున లేచాడు. విస్తరి ముందు కూర్చుంటే 
ఆత్మన్యూనత గా అనిపించింది. అత్తా కోడళ్ళ వాటా లో ఏంతో కొంత తగ్గితేనే తన విస్తరి నిండుగా కనిపిస్తుంది 
అనుకున్నాడు.


“పెద్దిరాజు గారిని  ఇవాళో రేపో తీసుకోస్తున్నారటగా ... కర్మలకు కాస్త మీ తండ్రీ కొడుకుల గొంతులు పెగలాలి. ఎంతసేపూ గిద్దెడు బియ్యం, అర గిద్దెడు కందిపప్పుసాయిత్యం కుదరదు. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అంటే ఎలా?” ఆవిడ నిష్టూర పడింది. 
“అమ్మా, బయట చావు సంపాదన క్కూడా ఎంత పోటీ వుందో తెలుసా? పెద్దాచారి గారికి ప్రతి పనికీ కమీషన్ పడితేనే మనకీపాటి అధరవులు అన్నం లోకి వస్తున్నాయి తెలుసా? ఊరంతా ఆయనదే నాయే... ఏకార్యం దొరికినా ముందుగా ఆయనకీ వాటా పోతేనే మనకి పని దొరుకుద్ది”  తెలిసిన విషయమైనా మళ్ళీ వల్లించాడు.
“శాస్త్రం గురించి చెప్పాలి జనాలకి..” అంది కాంతమ్మ.
“ఈ కరువు రోజుల్లో శాస్త్ర ప్రకారం ఎవడు మటుకు చేస్తున్నారూ? ఏదో అల్లాటప్పాగా కానిచ్చేయమని వాళ్ళే మనకి
చెప్పుతుండిరి. చెరువులో స్నానం చేయడానికి భయపడే జనానికి గజ ఈతగాడి స్వగతం ఎందుకు? వాళ్ళు అవసరం అయితే స్నానం మానుకుంటారు గానీ...”


కొడుకు నిర్వేదం ఆవిడకు కడుపులో అగ్గి పుట్టించింది.
“మీ నాయన నిర్వాకం అనూ, చాదస్తం అనూ ఇదిగో ఇప్పుడిలా కుటుంబాన్ని కుంటుపడేలా చేసింది. నిన్ను ఫైకి చదివిద్దామంటే తనకు తోడుంటాడని వెంట తిప్పుకునే వాడు. ఈ రోజుల్లో బ్రాహ్మణీకానికి గౌరవం ఏమేడిసింది? పెద్దలు ఇచ్చిపోయిన ఈ పెంకుటిల్లే ఇంతమందికి నీడనిస్తోంది”  అంటూ మూడో కాన్పువిషయం మాట్లాడలనుకున్నా అది భార్యాభర్తల విషయంగా మద్యలో దూరలేకపోయింది కాంతమ్మ.
“మీ నాయనకి ఒక కల ఉండే...అందరూ ఉద్యోగాలకు పోతే ఖర్మలూ, క్రతువులూ జరిపించే నాథుడు కరువైతాడు అనీ... అప్పుడు మనకే ఇబ్బడి ముబ్బడి అని మురిసాడు పాపం” మూతి విరిచింది ఆవిడ.
“ఆ....ఈ రోజుల్లో మంత్రాలకు మనిషక్కర లేదు. సెల్ ఫోన్లు చాలు”  తల్లి మాటలకు విసుగ్గా అన్నాడు పాపారావు.
బయటి తలుపు జారేసి  పిల్లని పడుకోబెట్టి రాబోతున్న సుధ విన్నదా మాటలు. దాంతో పిల్లాడి ఫీజు డబ్బులకై ఆమె మనసు ఇంకా వ్యాకుల పడింది. కడుపులో పిండం భారం ఎక్కువైంది. అదోలాంటి విరక్తి ఆమెనూపేసింది.


పెళైన కొత్తల్లో వాయలు చీరలు కట్టుకుని సాయంకాలాలు సాయబు అమ్మే మల్లె పూలు పెట్టుకొని భర్తతో సినిమాకి పోవాలని ఆరాటపడేది. కానీ అత్తా మావ ఆంక్షల మధ్య అది ఆవిరిపోయింది.
చింటూ గాడు పుట్టాక పుట్టింటితో సంబంధాలు కనుమరుగై పోయాయి. తక్కువ సంపాదనతో ఎదగలేక అవస్థ పడుతోంటే, బావమరదుల సహాయ సహకారాలు లేకపోవడం తోడై పాషాణంలా  తయారయ్యాడు పాపారావు. సుధ ఏమడిగినా అదో పనికిమాలిన విషయంలా తోచేదతడికి. భార్య కడుపు చూస్తోంటే పుండు మీద ఉడుకునీళ్ళు పోసిన చందంగా గుండెలో భాధ! చంటిది పుట్టగానే ఆపరేషన్ చేయిస్తే పీడా పోయేది. చూస్తూ చూస్తూ బ్రూణహత్య చేయించలేడు. ఇప్పుడు పుట్టేది ఆడో మొగో...పెంచడం ఎంత ప్రళయం! ఎవరికైనా పెంపుకిస్తే?...అమ్మో కన్నపేగది. ఎప్పుడూ శాపనార్థాలు పెడుతూనే ఉంటుంది మనసు.


సగం తిని లేచిపోయాడు పాపారావు మనసు మొద్దుబారుతుంటే. సుధ కూర్చుందా విస్తరి ముందు. కాంతమ్మ ఊసురంటూ కూర్చుండి పోయింది
“ఇప్పటి పిల్లలు తిండి తినాలేరూ...పనీ చెయ్యలేరు.ఏంటో వీళ్ళ వరుస” అంటూ కాంతమ్మ నీళ్ళు చిలకరించి విస్తరి దులుపుకుని, తోటకూర పప్పుకూర వేసుకుని అన్నం వడ్డించుకుంది. పక్కన నీళ్ళ చారు గిన్న పెట్టుకుంది. కంది పచ్చడి కోడలికి వేసింది.
“కాస్త మీరూ వేసుకోండి పచ్చడి”
“ఆ...పర్లేదులే...రెండు ముద్దలు ఎక్కువ తింటే కడుపులో పెట్టె పెట్టినట్లు ఉంటోంది. అరిగి చావట్లేదు” అంది కాంతమ్మ.  కోడలితో మాట కలిపి కడుపు విషయం ఆరా తీయాలని ఉందామెకు.
“శుబ్రంగా తిను బాగా నీరసంగా ఉన్నట్లున్నావ్”

వ్యంగ్యమా? అన్నట్లు కళ్ళెత్తి చూసింది అత్తగార్ని సుధ. 
ఏవిటో ఆలోచించింది కాబోలు ఉన్నట్టుండి ఫకాల్మన్ని నవ్వింది కాంతమ్మ. చొక్కా తగిలించుకుని రోడ్డు మీదకి వెళ్లబోయే వాడల్లా తల్లికేసి సాలోచనగా చూసాడు ఎందుకు నవ్విందా అని పాపారావు.
“మా మామగారి తండ్రి భోజన పరాక్రమం చుసానొకసారి...నాకు టారెత్తి పోయి౦దనుకో...” అంటున్న కాంతమ్మ మాటలకి ‘అదా ‘అనుకుంటూ తలుపు దగ్గరికి వేసుకుని బయటకి వెళ్ళిపోయాడు.
“ఏం?” అంది సుధ. ఆ ముచ్చట ఎన్నో సార్లు విన్నదే అయినా అడిగింది.
“ఆయనకు రాక్షస ఆకలి...ఇంట్లో పాపం తిండికి ఏమీ అమిరేది కాదు. దొరికితే మటుకు ఊదిపారేయ్యడమే! ఆయన తిండి మీద ఓ పెళ్ళిలో పందెం కూడా కాసారు. అప్పట్లో గంగాళాల లో వంటలుగా... నాలుగు బానల పెరుగులో ఆవడలు ఊరేస్తే భోజన సమయానికి ఆయన విస్తరి వేసుక్కుర్చున్నాక ఒక్కటంటే ఒక్కటీ పక్క విస్తట్లో పడేది కాదట. వడ్డన ఆయన దగ్గరకి వచ్చేసరికి గారెలు మొత్తం వేయించుకునే వాడట. మద్య మద్యన గొంతు జారడానికి మంచినీళ్ళు తాగుతూ, మెంతిపెరుగు తాలింపు ఆవడల్ని హాంఫట్ అనిపించే వాడట! తద్దినాలకు వెడితే వడ్డించే ఇంటావిడ నడుములు విరిగిపోవల్సిందేనట.


మెంతికాయ ముక్కల పచ్చడి, ఉత్తపప్పు నెయ్యి కలిపితే వంటవాడు మళ్ళీ వెనకవాళ్లకు ఎసరు వెయ్యాల్సి వచ్చేదట!” 
సుధ గుటకలు మింగిందా తిండి ప్రతాపానికి. అత్తగారు చెప్పే ముచ్చట అంత వైభవంగా ఉంది మరి.
“మామిడికాయ మాట తెస్తే మాబోటి వాళ్ళకే నోట్లో నీళ్ళూరుతాయ్. నీబోటి దానికి మరీనీ..” అంటూ కాంతమ్మ కాస్త సందు చూసుకొని
 “మూడో కాన్పుగా... ఒళ్ళు కాస్తా భారువుగా ఉండొచ్చునేం?” అంది.
“నీరసంగా ఉంది ... దీనికే ఇపుడు పాలు లేవు ఇహ పుట్టబోయే వాళ్లకెలాగో పాలు. అదో ఖర్చు అదనం అయితే తల్లి పిల్లలం కూలికి పోవాల్సిందే” చెప్తున్న సుధలో అలవికాని దుఃఖం కనురెప్పల కింద అల్లాడింది.
“మన దరిద్రానికి ముగ్గురు పిల్లలు అవసరమా? కాస్తన్నా ఇంగితం లేకపోయే “
కాంతమ్మ మొహంలోకి కటినత్వం అలవోకగా వచ్చేసింది. 
“ఇప్పటిదాకా ఇద్దరూ ఏవీ ఆలోచించుకోలేదా?” మళ్ళీ ప్రశ్నించింది. 



“లేత నెలలేగా...ఓ నిర్ణయం తీసుకోలేక పోయారా?”
“మాట్లాడకుండా ముంగిలా ఉంటే ఏమిటర్థం?? ఈ సంతానం నీకిష్టమా ...వాడికిష్టమా??”
“నాకే భయం. కాన్పు కాగానే ఆపరేషన్ చేయించుకుంటా... “ అంటూ మళ్ళీ తనే అంది కాంతమ్మతో.
“శ్రీరామనవమి ఉత్సవాలకి పదిమంది ఉన్న వంటల బృందం వస్తోందట మనూరు. ఇంటింటికీ నీళ్ళు పోసే 
మామ్మ గారు చెబుతోంది కూరలు తరిగే పనికి ఇద్దరు మనుషులు తక్కువ పడ్డారనీ ...” భయంగా అత్తగారి కళ్ళల్లోకి చూసింది.
“ఎన్నిరోజులో?”
“తొమ్మిది రోజులనుకుంటా!” కాంతమ్మ మౌనంగా విస్తట్లో ఎంగిలినీళ్ళు విదిల్చి లేచింది.
సాయంకాలం పేరయ్యగారు లొనికొస్తూనే చేసంచి పక్కన పారేసి పడక్కుర్చీలో కూలిపోయాడు. ఆయన మొహం కందగడ్డలా ఎర్రగా...కళ్ళు చింతనిప్పుల్లా ......వంట గదిలోంచి మామగారిని చుసిన సుధ మళ్ళీ  బయటరాలేదు. కాంతమ్మ చెంబుతో నీళ్ళు తీసుకెళ్ళి ఇస్తూ


 “అలా ఉన్నారే?” అంది చిన్నగా. 
చూసాడాయన పెళ్ళాన్ని కోపంగా ...కాంతమ్మలో ఏదో అలజడి కలిగి నీళ్ళ చెంబు తీసుకొని వెనుతిరిగింది. ”పెద్దిరాజుగారింటి మీద కన్నేసి ఉంచో అని వారం రోజులుగా కోరుతుంటివిగా. విధి లేక పొద్దున్నే దాసుగారింట్లో తద్దినం భోజనం చేసి పెద్దిరాజు భార్యని పలకరిద్దామని వారింటికి వెళ్ళా..ఇంటి నిండా బందువులు. ఆవిడ్ని చూద్దామని లోనికి వెళ్ళానోలేదో  ‘వీళ్ళు ఒకళ్ళు పీనుగ వచేస్తోందన్నట్టు వాసన పట్టేస్తారు వెంటనే...చచ్చాడా లేదా అని చూడ్డానికి వచ్చినట్టున్నాడు. ఈళ్ళు చేసే ఖర్మలేంటో గానీ పిండాలు ముట్టడానికి కూడా కాకులు రావడం లేదంటే ఎంత ఘోరంగా ఉందో చూడు...’ అని హేళనగా మాట్లాడుకుంటున్నారు. ఎంత బాధేసిందో...చెప్తే వినకపోతివి ఆ బేరం ఎవరికిపోతుందో అని నీ ఆరాటం...” అన్నాడు.
“వాళ్ళకేం పోయేకాలం??” కనుబొమ్మలు ముడిచింది కాంతమ్మ.
“కానికాలం మనదీ...డబ్బున్నవాళ్ళు ఏదైనా మాట్లాడతారు. ఈ బస్తీలో ఎంత కాలుష్యం ఉందీ, ఏం చెట్లున్నాయి? నీళ్ళు ఎక్కడున్నాయీ... ఇలాంటి ఊళ్ళల్లో, కాకులు ఎక్కడినుంచి వస్తాయని ఒక్కసారైనా  ఎవడన్నా  ఆలోచించాడా?? కాకి వెదవలు...” ఎప్పుడొచ్చాడో పాపారావు ఆవేశపడ్డాడు. 


ఎవ్వరూ మాట్లాడలేదు.
“కాశీ పోదాం పదండి పీడా పోతుంది. నది ఒడ్డున తలా ఒకపని చేసుకు బతకచ్చు. ఉన్న ఊళ్ళో ఏం పనీ చేసి బతకలేం. పేపరేస్తున్నానని ఎంత చిన్నచూపో అందరికి” పాపారావు అక్కసు పడ్డాడు.
సుధకు కడుపులో దేవుతున్నట్టుగా ఉంది వింటో౦టే.
కాశీ లో ఆడాళ్ళు కూడా పూజలు చేయిస్తారట! కాలే శవాల దగ్గర రోగాల గబ్బు, కాలే కట్టెల వాసనా కలిసి ఉన్నచోట తన పిల్లలు పెరగాలేమో.... నిలుచున్న పాటున ముక్కల పీటమీద కూలబడింది తల విసురుతోంటే.
అర్ధరాత్రి పెద్దిరాజు గారి శవం ఊళ్లోకి వచ్చింది. ఆ వెనకే కార్లూ, జీపులూ, బంధువులూ ... 
పెద్దాచారి గారు ఫోన్ల మీద ఫోన్లు. పరమయ్యగారు, పాపారావు ఉన్నపళాన వెలుగు రేఖలు భూమ్మీద పడకముందే శవం ముందు వాలారు. 


కమీషన్ మాట్లాడ్డం పూర్తయ్యింది. పదిరోజుల ఖర్మ పరమయ్య చేయించేట్టు, ఆఖరి రోజుల సంభావన్లు అయిన గోదానం, సువర్ణ దానం, భూదానం లాంటివి చెరి సగం పంచుకునేటట్టు ఖరారు చేసుకున్నారు.
అయిదోరోజు వంట మొదలుపెట్టి పిండాలు పిట్టకేసారు ఊరి బయట. ఎంత సేపు పిలచినా ఒక్క కాకీ జాడలేదు. పెద్దిరాజు కొడుకులకు విసుగు ఎక్కువైపోతున్నది. తడకోసారి వాచీ చూసుకుంటూ ’స్టుపిడ్ సాంప్రదాయాలు... కాకులు వచ్చి మెతుకు ముట్టకపోతే డాడి స్వర్గానికి పోడా? స్టుపిడ్ కాకులు  ఛ... ‘ విసుగు పడుతున్నారు.
ఒంటిగంట దాటింది. కాకి కాదుకదా ఏ పక్షులూ,ఏ జంతువులూ రాలేదు. వచినవాళ్ళల్లో అసహనం తారాస్థాయిలో పెరుగుతున్నది. చూస్తున్న పాపారావులో చటుక్కున మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తండ్రి చెవిలో ఊదాడు. ఆయన స్తబ్దుడై ఉంటే వత్తిడి చేసాడు కొడుకు. వెంటనే పెద్దచారి గారికి ఫోను కొట్టాడు. అటునుంచి ఏం సమాచారం వచ్చిందో గాని అంతాలేచి ఇంటికి నడిచారు. 


వంట బ్రామ్మడు వసారా లో  విస్తరి వేసి వేడి వేడి అన్నం, నాలుగు కూరలూ, నాలుగు పచ్చళ్ళు లాంటి వండిన వంటంతా వడ్డించి, గారెలు, నెయ్యి, నువ్వుపొడి వేసాడు. 
కళ్ళు తడి వారుతుంటే పరమయ్య మొహం తుడుచుకునే నెపంతో కండువాతో కళ్ళు తుడుచుకున్నాడు. పాపారావు తమ ఇలవేల్పుని తలుచుకుని విస్తరి ముందు కూర్చున్నాడు. 
“కాకులు స్మశానంలో లేవు వండిన వంట తినడానికి. ఎంతోసేపు చూశాం. చివరకు చిన్నయ్యగారే ఉపాయం చెప్పాడు ‘కాకి పిండం’ తాను తింటాడని. కానీ దానికి వేరే రేటు ఉంటుందన్నాడు. పీడా పోయింది మరక్కడ ఎంతసేపని కూర్చుంటాం? రెండువేలకు ఈ కార్యక్రమం ఒప్పుకున్నాము” లోపల తల్లితో చెబుతున్నాడు పెద్దిరాజు కొడుకు.
నీళ్ళ బిందె లోపలకి తెస్తూ గడప తగిలి భోర్లపడింది సుధ కేవ్వుమన్న కేకతో. ఎవ్వరికీ ఇష్టం లేని పిండం గడప అవతలే చితికిపోయింది.    
కాకిపిండం తృప్తిగా తిని లేచాడు పాపారావు.    

         
-తమ్మెర రాధిక