Facebook Twitter
చల్ మోహనరంగ

 

చల్ మోహనరంగ

 

 

రంగారు చెట్టుమీదా - బంగారు గోరువంక
వినీపించే కతలు విందాము పదరా
చివురాకూ పళ్ళెరములో - మివుల పండిన పండ్లు
సవిరించీ ఆరగింతము పదరా
పొగడ పూవులు గోసి - పొందుగనే దండ గుచ్చి
దండ నీమెడాను వేసుకురారా
చిరిమంచు కోటలోన - గురుతైన మంచెమీద
శిరిపాట పాడుదాము పదరా
చల్ మోహనరంగ

చుట్టు తుమ్మెదలు గూడి - గట్టి బాజాలు పాడి
అట్టిట్టు తిరుగుచున్నవి కదరా
కొనమావి కొమ్మలందు - గొనబైన రామచిలుక
ధనము లందించుచున్నది కదరా
గుబురైన చింత మీద - కబురు తెచ్చేటి చిలుక
సొగసైన గూడు కట్టెను కదరా
చల్ మోహనరంగ

నీవుపోయే దారిలోని - నిలువుటద్దముల లోన
నీదురూపు నిలిచిపోయెను గదరా
చిరునవ్వూ నవ్వితేనూ కురియూ పువ్వుల వాన
చిరునవ్వాసించి యుంటిని గదరా
శనివారం సంతలోన పనిబూని సంతలోన నినువెదకి
పరుగెత్తి పట్టుకొంటిని కదరా
బొండుమల్లె పూలదండ నిండుగా నీ మెడనువేసి
నిండారా కౌగిలింతును రారా
చల్ మోహనరంగ

చీకటి రాత్రినాడు - కోక నల్లది కట్టుకోని
చీకట్లో కలిసిపోయితి గదరా
ఊడలమర్రి క్రింద - మోడైన తుమ్మ చూచి
చీకట్లో ఝడుసుకొంటిని గదరా
గట్టు దాటి పుట్టదాటి ఘనమైన యడవి దాటి
అన్నిదాటి అరసి తరలితి గదరా
ఒంటిగా పోవద్దు వద్దని - పైటబట్టి లాగగానే
పైటజారి సిగ్గుబడితిని గదరా
పొడుపు కొండలమీద - నిడుపైన చందమామ
నీలాగె నిలువబడెను గదరా
నేనొంటిగాను పోతే - నీవు నా వెంట వస్తే
నీడ జూచి జడుసుకొంటిని గదరా
చల్ మోహనరంగ

(చల్ మోహనరంగ అనే పదం తెలుగునాట ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. నిజానికి ఇది ఒక జానపద గేయంలోని మకుటం. ఈ పాటలోని కొంతభాగం ఇది. కృష్ణశ్రీగారు సేకరించిన పల్లెపదాలు అనే గ్రంథం నుంచి ఇది తీసుకోబడింది)