Facebook Twitter
స్పూర్తి ( ఉగాది కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)

స్పూర్తి ( ఉగాది కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)      

  

" పంతులమ్మా యేటి బాగున్నావా ? " అన్న పలకరింపు కి ముప్పై సంవత్సరాల వెనక్కి వెళ్ళింది అశ్విని మనస్సు . పెళ్ళికాక ముందు తను స్కూల్లో చదువు కొనేటప్పుడు చాలా మంది తనని అలానే పిలిచేవారు . బాపనమ్మ అని , కొందరు మర్యాదాగా పంతులమ్మ అని పిలిచేవారు . తరవాత తరవాత పల్లె పల్లెకి ఆధునికత అడుగు పెట్టడం తో యిలాంటి పిలుపులు తగ్గి పోయేయి .

" అతను నీకు తెలుసా ? " అన్నవదిన  పిలుపుతో యీ లోకం లోకి వచ్చింది అశ్విని .
" చిన్నప్పుడు మా నాన్నగారు పూరీ లో పని చేసేటప్పుడు అక్కడ అందరూ నన్ను యిలాగే పిలిచేవారు , మరి యిక్కడ యీ పిలుపు ..... " అంటూ టీ కప్పులు అందిస్తున్న అతనిని పరీక్షగా చూసింది అశ్విని , అందరికి టీ అందించి వో పక్కగా నిల్చున్న అతను " రామారావు పంతులగారి అమ్మాయివి కదమ్మా నివ్వు , నన్ను గుర్తు పట్టనేదా ? నాను .... ",


" వుండు ..... వుండు .... నన్ను చెప్పనీ , ఆ ... ఆ. ....అప్పలరాజుకదూ ! , నువ్వేంటి యిక్కడ " అంటున్న అశ్వినిని వారించి " పంతులమ్మ వుప్పుడు పనుంది గాని రేత్రొచ్చి కలుత్త " అని ఖాళీ కప్పులు తీసుకొని వెళ్లిపొయేడు  .
ఎక్కడి ఒరిస్సా లోని పూరీ  , యెక్కడి పాకిస్తాను బొర్డరుకి దగ్గరగా వున్న ద్రాస్ . రమారమి నాలుగు వేల కిలోమీటర్ల దూరం వుండదూ ? ఏమో యింకా ఎక్కువే ఉంటుందేమో ? , యింతదూరం పొట్ట కోసమే వచ్చాడా ? , కను చూపు మేర వరకు వొక చెట్టుగాని , పచ్చని గడ్డి గాని కనిపించని ఎడారి లాంటి చోట ఏం బ్రతుకు తెరువు దొరుకుతుంది ? , పొట్టకోసం యింత దూరం రావాలా ? అప్పలమ్మ యేమైనట్లు , చంటి పిల్లెమీ కాదుగా పోయిందేమో ? .


యిదొక మిలిటరీ స్థావరం . అశ్విని చిన్నాన్న కొడుకు కల్నల్ ఆవడం తో , కార్గిల్ , ద్రాస్ చూడాలని పట్టుబట్టి వచ్చిందే గాని చెట్టూ , చేమా లేని ఎత్తైన కొండల పైన మిలిటరీ బళ్ళల్లో ప్రయాణం , బల్తాల్ నుంచి మూడురోజుల ప్రయాణం లో ఒళ్ళు హునమై సగం కుతూహలం చంపేస్తే రాత్రి గస్ట్ హౌస్ గా పిలువబడే టెంట్స్ బయట వినిపించే ఫైరింగ్ శబ్దాలు ప్రాణభయం అంటే ఏమిటో చెప్పేయి . భగవంతుడా బతికుంటే మరెప్పుడు యిలాంటి కోరిక కోరను దేవుడా .... దేవుడా .... అని మనసు ప్రార్ధనలు చేస్తూ వుంటే అలసిన శరీరం నిద్రకి వొరిగేది .


బతికుంటే బలుసాకు కూర తిని బతకొచ్చు కాని ఇలాంటి చోట పరమాన్నం  దొరికినా .... , అయినా అప్పారావుకి ఆరుగురు పిల్లలు వుండాలి కదా వారేమయినట్లు ? . పిల్లలు కుడా బుద్దిగా చదువుకుని వృద్ధి లోకి వచ్చేరని కదా వింది . ఓ యిది కుడా పాత కధే అన్న మాట , మంచి వుద్యోగాల్లో చేరి కట్టూ , బొట్టూ , భాష మారిన తరువాత పాచిపని చేసి పెంచిన తల్లి , మట్టి పనిచేసి చదువులు చెప్పించిన తండ్రి భారంగా అనిపించి వుంటారు , సరి అయిన తిండిలేక , జబ్బు చేస్తే పిల్లలు మందులు యిప్పించక అప్పలమ్మ  కన్ను మూసి వుంటుంది . పిల్లల ప్రవర్తనతో , భార్య మరణం తో విరక్తి చెందిన అప్పారావు బ్రతుకు తెరువు కోసం యిక్కడకి వచ్చి వుంటాడు . కొడుకులు సరే కూతుళ్ళ సంగతేమిటి ? వారైనా చేరదియ్యలేదా ? డెబ్భై , డెబ్భై అయిదు సంవత్సరాలు వుండవూ ? యింకా యెక్కువే వున్నాయేమో ? కాయ కష్టం చేసే వొళ్ళేమో యాబ్భై యేళ్ళ వాడిలా వున్నాడు . 


పిల్లలో పిల్లలో అని వాళ్ల తోటిదే లోకమన్నట్లుగా బతకడం వారు నిరాదరిస్తే యేడవడం , తరతరాలుగా జరుగుతున్నా , యీ పాశంలో మార్పులేదు .  సంసారికి వున్నది సన్యాసికి లేనిది యీ పాశమేనేమో కదూ .


రెక్కలు ముక్కలు చేసుకొని  పిల్లల్ని పెంచేం అని చెప్పే మాటలు అప్పారావు విషయంలో నిజంగా నిజం . అందరు వలస కూలీల కధే యితనిది కుడా ! వున్న ఊర్లో తినడానికి తిండిలేక , చేసుకోడానికి పని లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వందల కుటుంబాలలో అప్పారావుదీ వొకటి . అశ్వినికి ఆరేళ్ళు వున్నప్పుడు యింటి ముందున్న తోటలో వున్న చెత్తా చెదారం అప్పారావు కుటుంబం శుబ్రం చేస్తూ కనిపించేరు . చేసిన పనికి కూలి యెంత కావాలి అన్న నాన్న గారి ప్రశ్నకు తను చేసిన పని నచ్చితే తన భార్యా పిల్లలకు పట్టెడు అన్నం పెట్టించండి అనే  మాట తో అందరి మనసులలో స్థానం సంపాదించేడు అప్పలరాజు  .  పూరీ లోని రైల్వే కాలనీ లో అతి తక్కువ సమయం లోనే  అందరికి తలలో నాలుకై పోయింది అప్పారావు కుటుంబం . అప్పలరాజు , అప్పలమ్మ  , తాము చేసిన పనికి యింత అని యెన్నడూ వెలకట్టి అడిగినది లేదు నువ్వు చేసిన పనికి  నీకు యింతే వస్తుందని కాలనీ వాసులు లెక్క కట్టిందీ లేదు .

అందరిళ్ళల్లో కష్ఠసుఖాలు అతనివి , అతని కష్ఠసుఖాలు ఆ కాలనీ వాసులవి . అలాగే ఆడుతూ పాడుతూ కాలం ముందుకి దూసుకు పోయింది  పిల్లలంతా పెద్దవారయి , వుద్యోగాలు , పెళ్లిళ్లు అని ఆ ఊరిని వదిలి పోయేరు , పెద్దవారు ఉద్యోగ విరమణ చేసి సొంత వూర్లకో , పిల్లల దగ్గరకో వెళ్లి పోయేరు . అశ్విని తండ్రి విధులలో వుండగా పోవడం తో అన్నకు రైల్వే లో వుద్యోగం రావడం తో చుట్టం చూపుగా పూరీ వెళ్లగలిగేది . అలా వెళ్లి నప్పుడు అన్నతో మాటలలో అప్పారావు పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలలో స్థిరఅడ్డారని ఆడపిల్లలకు మంచి సంబంధాలు కుదిరి పెళ్లిళ్లయాయని తెలుసుకొని సంతోషించేది . మరి యిదేమిటి అప్పలరాజు యిక్కడ యీ ప్రతికూల పరిస్థితులలో యీ వయసులో కష్ట పడుతూ వుండడం చూసి తట్టుకోలేక పోయింది అశ్విని . అన్య మనస్కం గా భోజనం పూర్తి చేసుకొని పడక మీద వాలింది . అర్ధ రాత్రి దాటితేనేగాని పడక చేరని నగర నాగరికతకు అలవాటైన శరీరం ఎనిమిదింటికి నిదుర రానంటోంది . ఆ చీకటిలో చేసే పనేమీ లేక  . అప్పలరాజు రాకకోసం యెదురు చూస్తున్న అశ్వినిని  యెడతెగని ఆలోచనలు చుట్టు ముట్ట నారంభించేయి  . 


వుమ్మడి కుటుంబ వ్యవస్థ విఛ్చిన్న మయిన తరువాత వుత్పన్న మయిన సమస్యలలో ముఖ్యమైనది , జవాబు లేనిదీ యిదేనేమో ? ఏ విద్యావేత్తలు యీ సమస్యకు పరిష్కారం సూచించలేరేమో ? 


అంతూ పొంతూ లేని ఆలోచనలలో యెంత సేపు వుండేదోగాని చల్లని చెయ్య తన కాళ్లని వత్తడం తో యీలోకం లోకి వచ్చి గబుక్కున " వద్దు వద్దు " అంటూ కాళ్ళు లాక్కుంది .


" ఏం పర్నేదు పంతులమ్మ వుండు కాల్లు మాలీసు చేత్తాగా , నేప్పులన్ని సిటికేలో పోతాయి గందా ? " అంటున్న అప్పలమ్మని చూసి గిల్టీగా నవ్వింది అశ్విని .
 " బాగున్నావా అప్పలమ్మా "
 " ఆ అదేబాగు మరేటి ...... యేదో యినాగున్నాం "
అశ్విని కడుపులో సుళ్లు తిరుగుతున్న ప్రశ్నలన్నీ గబగబా తుటాల్లా అప్పలమ్మ పైకి వదిలింది .
 అన్ని ప్రశ్న లకి చిరునవ్వే సమాధానంగా నవ్వింది అప్పలమ్మ . 


" వోలమ్మ వోలమ్మ యేటి తల్లీ యిన్ని పశ్నలు వొణ్ణమ్ తినకుండా పెశ్నలు తినీసినావేటి ?"
ప్రశ్నల తీవ్రతకి తట్టుకోలేక ఆమె తన దుఃఖాన్ని తనతో పంచుకుంటుంది అనుకున్న అశ్వినికి  నిరాశే యెదురయ్యింది .
తనకి కేటాయించిన పనులు పూర్తి చేసుకొని  వచ్చి వీళ్ల దగ్గర కూర్చున్నాడు అప్పలరాజు  .


" ఏం జరిగింది రాజూ , నువ్వేనా చెప్పు ? మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకోలేదా ? పిల్లలు ఏదో చిరాకు పడితే మాత్రం యిలా యిల్లు వూరు వదిలేసి యింతదూరం రావాలా ? యీ వయసులో పిల్లలు పెట్టింది తిని కృష్ణా రామా అనుకుంటూ గడిపేస్తే జీవితం  గడిచి పోదా ? దిన దిన గండం నూరేళ్ళాయిష్షు అన్నట్లు వుండే యిలాంటి చోటులో గడపడం యేమిటి ? మీ పిల్లలతో వుండడం యిష్టం లేకపోతే నాతో వచ్చెయ్యండి , అంతేకాని యిలాంటి చోట ఉండడానికి వీల్లేదు , రాక పొతే నామీదొట్టె........ ఆ..... " .


" నా తల్లి నాతల్లి అంతమాటొద్దు గాని , నేను సేప్పేదిను తల్లీ " అశ్వినిని వారిస్తూ అప్పలరాజు  చెప్పింది విని అవాక్కయింది . ఇలాంటి కోరికలు కోరుకొనే వారు కూడా ఉంటారా ? వుంటే దాన్ని తీర్చుకోడానికి యింత దూరం వచ్చి యిన్ని కష్టాలని సంతోషంగా భరిస్తారా ? అని ఆలోచిస్తున్న  అశ్విని దృష్ఠి లో అప్పలరాజు దంపతులు యెంతో యెత్తుకు యెదిగి పోయేరు . విద్య లేని వాడు వింత పశువు అని అన్నది ఎవరో గాని వారు అప్పలరాజు నిర్ణయం వింటే , అతనితో వొక్కసారి మాట్లాడితే ఆ సామెతని మార్చి పారేస్తారు . 


" అందరి తల్లితండ్రులలానే కొడుకుల పంచన చేరిన తరవాత ఏటో పనికి రాని వస్తువుల మయిపోనామేమో ? అని గుబులు మొదలయినాది . పనిపాట్లు చేసుకొనే వొళ్ళం ఊరికే కూకోవాలంటే ఏటీ తోచీది కాదు . మా మాట , కట్టూ  బొట్టూ  , సదూ కున్న పిల్లోల్లకి నచ్చీది కాదు . పక్కింటోల్లకో యెదురింటోల్లకో మొక్కలు యెయ్యడానికో మరేదేనా సాయం సేసే దానికి పొతే పిల్లలు  అవుమానం అంటారు , అనాగని వూరికే కూకోని తినాలంటే పానం మీదికొత్తాది , తిండి పెడతన్నాం గందా మరింకేటి కావాలా ? అంటే నానేటి సేప్పనేను గాని పని పాటు లేని శరీరం బూజెక్కిపొదా ? మనుమల్ని సేరతీద్దారంటే నా పిల్లలే మట్టిపిసికే సేతులతో బిడ్డని తాకొద్దంతారు , యీ సేతుల్తోనే గదేటి ఆళ్ళని సాకినాము .అప్పుడు అక్కరకొచ్చిన సేతులు యిప్పుడు పనిరాకుండా పొనాయా ? ఊరికే కూకున్తే మన కొలనీ లో హరిదాసుగోరు సెప్పిన మాటలు సెవ్విలొ తిరిగీవి .

రామాయణం , భారతంలో రాజులు రాజ్యాలేలి , యువరాజు కి పట్టాభిషేకం సేసేసి వనాలలోకి యెల్లి పూజలు పునస్కారాలు సేసుకుంటా గడిపేవోరంట , పులులు ,సింమ్మాలు ఆ అడవుల్లోంచి ఎల్లే బాటసారుల్ని బాధిస్తావుంటే మాత్రం అస్తరాలు యెత్తి జంతువులని సంపెవోరంట యీస్వరుని సృష్టి లో మనిషి తప్ప మరే జీవి కుడా తను కన్న పిల్లలమీద ఆధారపడి బతికెయ్యాలని అనుకోదు . నిన్ను కన్నందుకు నీకు రెక్కలొచ్చినంకా  నన్ను మొయ్యి అని ఏ పచ్ఛీ తన పిల్లని అడుగదు . ఏ జంతువా  ముసలి కాలంలో తన కోసం ఏటకి మరో జంతువని ఎల్లి  ఏటాడమని సెప్పదు  . మరి మనిసేటి  తన జబ్బలో సక్తి వున్నా ఎందుకు పనికి రానోడిలా గోల్లు  గిల్లుకుంటా కుకుంతాడు అంతే జవాబు నేదు . పిల్లలు సిన్నగున్నప్పుడు ఆళ్ల పొట్టలు నింపేదానికి కట్టపడ్డా , యిప్పుడు నాకేటి బంధకాలు నేవు , యిప్పుడు నాకోసం నాను బతకాలని తలచి మా యావిడని అడిగినా నా కూడా వోత్తావా ? పిల్లల కాడుంతావా? అని అడిగితే  నువ్వెక్కడుంతే  నానూ అక్కడే అనీసినాది . పిల్లలకి సెప్పి బండెక్కీసినాము . మా కాయ కష్టం   మాము సేసుకుంటా హరద్వార్ సేరినాము .

మా యిద్దరి పొట్టలకి యెంత కావాలేటి ? రాయివాలా లో వున్న మిలిటరీ యిళ్ళల్లో పనులు సేసేటప్పుడు హింది మాస్టారు గారు పిల్లలకి సెప్పే పాఠం గమనానికొచ్చింది . నివ్వు సదివే వుంతావు  వో పువ్వు  తన అభిలాస సెప్తాది అదేటంటే ఆపువ్వుకు దేవుడి పాదాల  కాడ పడుండాలని గాని ఆడోల్ల కొప్పులో సేరాలని గాని వుండదంట దేసభక్తులు నడిచే దారిలో తనను పడేయ మంటది . దేసభక్తుల కాళ్ళ కింద నలిగిపోయినా జన్మ ధన్య మౌతాది అని అంటది . ఆ పాఠం గమనానికొచ్చీ దేశ రచ్చన లో పానాలు యిడిచి పెడుతున్న మిలటరీ వోల్లకి సేవసేసుకోవాలని అనిపించినాది . అందుకే పది సమ్మత్సరాల కింద యిక్కడికి వొత్తున్న వో బెటాలియన్ తో వొచ్చీసినాము . అప్పటినుంచి యిక్కడే వున్నాము తల్లీ ".అని ముగించేడు అప్పారావు .


" యీ చలిలో , ఎప్పుడు శత్రువు గుండు గుండెల్లో దూసుకు పోతుందో తెలీని చోట వుండడం అవుసరమా ? "


" పానాలకి తెగించి సరిహద్దు కాపాడడం అవుసరమా అని యీ సైనుకులు అనుకుంటే యీ దేసం ఎటవుతాది ? సావా ? టైమొచ్చినపుడు వొత్తాది , నా టైమురాకపోతే గుండ్రాయిలా గుంతాను , యిక్కడ రోజూ  యుద్ధమే  . అదిగదిగో అల్లా కొండ మీద పాకిస్తానీ వోల్ల పోస్ట్ అక్కడనుంచి ఆల్లు కాలుత్తావుంటారు . మనోళ్ళు వున్నది కింద , ఆల్లకి మనని కాల్చడం సులువు కాని మనోళ్ళకి ఆళ్ళని కాల్చడం కష్టం  . ఆళ్ల కాల్పుల్లో యెందరు సైనుకులు సనిపోనేదు . యెవ్వురైనా పోవలసినొళ్లెమే  యీ పొద్దు కాకుంటే రేపు , యింతోటి దానికి భయ మెందుకు " .


" మీ పిల్లలకి తెలుసా మీరిక్కడ వున్నట్లు "  .
"  యింటి కాడ బయలెల్లి నపుడు సెప్పినాము , యినగినాగా మా వొంట్లో శక్తి వున్నంత దాక పని సేసుకొని బతుకుతాము అని సేప్పినాము . ఆళ్లు పల్లకున్నారు గాని యెప్పుడొత్తారనీ అడగనేదు , వో కార్డు ముక్క రాయించు అని సేప్పనేదు . వొల్లు పాడయితే మా కాడకి ఎలిపిరండి అనీ అననేదు . మరి ఆల్లకి మా అవుసరం నేదు , మరింకేలా ఆళ్లతొ బంధాలు , యీల్లకి కూడా మాకెవురూ  నేరు అనే సేప్పినాము . యీళ్లకి సేవ సేసుకుంటా బతికేత్తాము , పోయినంక యిక్కడే బుగ్గయి పోతాము .  యినాయక సవితి పూజలప్పుడు  హరి దాసు గారు సెప్పినట్టు నా ఇల్లు నా పిల్లలు అనే బంధకాలు యెట్టుకుంటే పెపించికం  సిన్నదయిపోతాదంట , బంధకాలు తెంచుకుంటే పెపించికం అంతా నాదే . మనూర్లో ఉండేతప్పుడు నాకు ఆరుగురు పిల్లలు కాని యిప్పుడు ఇక్కడున్న అందరూ నా పిల్లలే , యిక  సలి అంతావా ? యీల్లందరికీ లేని సలి మాకేటి ? కట్టెపుల్లల్లో కాలిపోయే శరీరాలకి సూకరాలెందుకు తల్లీ , మట్టిలోంచొచ్చనాము మట్టిలో కలిసిపోతాం ? యింతోటిదానికి యిన్ని ఆలోచనలెందుకు తల్లీ , సర్లే అమ్మ తొంగో సనా అలసి పోయునావు రేపు మల్లా పొద్దుటే బయలెల్లాల " అని యిద్దరూ నిష్క్రమించేరు .


నాలుగు రోజులుగా గుబులు గుబులు గా వుంటూ చిన్న శబ్దానికే హడలి పోయి ప్రాణాలు అరచేతిలో వున్నట్టుగా గడిపిన అశ్విని ఆరోజు నిశ్చింతగా నిద్ర పోయింది .
        
" పల్లు దోమీసినావేటి ?" అంటూ టీ కప్పుతో నిలబడ్డ అప్పలరాజు ని చూసి చిరు నవ్వు నవ్వింది . 
" వోర్నాయినో పంతులమ్మగోరు తానం కుడా సేసేసి తయారయిపొనారు " అంటూ టీ కప్పు అందించి వెళ్లిపోయేడు అప్పలరాజు .
" ఇతను మీ వురి వాడా ? " ఆ బెటాలియన్ ఇంచార్జ్ కేప్టన్ మెహరా అడిగేడు .
ఔను అన్నట్లుగా  తలూపింది అశ్విని . 


" అతని వాళ్లెవరైనా వుంటే వారి ఎడ్రస్ యిస్తే వీళ్లకి ఏమైనా అయితే వాళ్ళ వాళ్ళకి తెలియ జేయ్యడానికి వీలుంటుంది . అతనిని యెప్పుడడిగినా మాకేవ్వరు లేరు అనే చెప్తున్నాడు . మీకేమైనా అయితే యెలాగా అంటే అనాధలకి మీరు దహన సంస్కారాలు యెలా చేస్తారో అలా చేసెయ్యండి అన్నాడు . ఏడాది కిందట భార్యా భర్తలు యిద్దరూ అవయవ దానం చేసేరు . యీ పని ఆ పని అని లేకుండా చేస్తూనే వుంటారు మహాను భావులు . ఇలాంటి వారు యేకొద్దిమందో వుంటారు " 
" ఔను యే కొద్ది మందో వుంటారు వీరి లాంటి వారు . వాళ్లు చెప్పినట్లు వారికెవరూ  లేరు కాదు.....కాదు ..... మీ రంతా వారి పిల్లలే , ఎక్కడో దురాన వున్న మీ తల్లి తండ్రులని వీళ్లల్లో చూసు కోండి .  మీ ఆథిధ్యానికి కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను " అని రెండు చేతులు జోడించి అక్కడ వున్న అందరి వైపు తిరిగి పదేపదే జేతులు జోడిస్తూ , ధన్యవాదాలు చెప్పుకుంటూ శలవు తీసుకొని జీపెక్కింది అశ్విని .

 

-కర్రా నాగలక్ష్మి