Facebook Twitter
బైరాగి పాట

బైరాగి పాట!

 


ఇప్పుడంటే కనిపించడం లేదు కానీ, ఒకప్పుడు ఊరూవాడా తిరిగే విరాగులకి కొదవుండేది కాదు. బహుశా ఈ విరాగి అన్న మాట క్రమంగా బైరిగిగా మారి ఉంటుంది. ఎవరన్నా పెడితే ఇంత తినడం, ఏదో ఒక అరుగు మీద పడుకోవడం. కొంత కాలం ఇలా గడిచిన తర్వాత మరో ఊరికి సాగిపోవడం... ఇదే బైరాగుల జీవన విధానం. వీళ్లు అద్భుతమైన జ్ఞాన సంపన్నులు కాకపోవచ్చు, ఆధ్యాత్మికతలో లోతులు తెలియకపోవచ్చు...

 

కానీ జీవితం మీద విరక్తి భావం మాత్రం మెండుగా కనిపిస్తుంది. ఒక తంబురాని వాయిస్తూ, జీవితం మీద తమకి ఉన్న అభిప్రాయాన్ని పదాలుగా పాడుకుంటూ తిరిగే వీరి పాటలు ప్రజల్లో కావల్సినంత భక్తిభావాన్ని నింపేవి. జీవితం అశాశ్వతమన్న వైరాగ్యాన్ని నేర్పేవి. కాలక్రమంలో వీరి సంఖ్య తగ్గిపోయింది.  కొన్ని ప్రాంతాల్లో ఈ పేరు ఒక కులానికి సూచనగా మిగిలిపోయింది. కానీ జానపద సాహిత్యంలో మాత్రం బైరాగుల పదాలకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి పాటలలో ఒకటి ఇది....


నాద బ్రహ్మానందయోగీ వీడు
వేదాంతసారము వినిచే బైరాగీ
రాజసంబు దుఃఖదమురా, ఘన
రాజయోగ మార్గమే సౌఖ్యదమురా

చిత్తశుద్ధి గల్గియుండు, భక్తి
జేరి సద్గురు నీవు సేవించుచుండు
నాద బ్రహ్మానందయోగీ వీడు
వేదాంతసారము వినిచే బైరాగీ

మత్తత్వము లేకయుండు, స
మస్త మింద్రజాలమంచూరకుండూ
నాద బ్రహ్మానందయోగీ వీడు
వేదాంతసారము వినిచే బైరాగీ

పెద్దల నిందించవలదూ, ఒరులు
పీడించినా నీవు భీతిల్లవలదూ
నాద బ్రహ్మానందయోగీ వీడు
వేదాంతసారము వినిచే బైరాగీ

వనిత లేకున్న దుఃఖమురా, కాని
వనిత గల్గెనేని వగవదుఃఖమురా
నాద బ్రహ్మానందయోగీ వీడు
వేదాంతసారము వినిచే బైరాగీ

ధనము లేకున్న దుఃఖమురా, చాల
ధనము గల్గెనేని దాచదుఃఖమురా
నాద బ్రహ్మానందయోగీ వీడు
వేదాంతసారము వినిచే బైరాగీ

పచ్చి కుండ వంటిమేను, ఇది
చచ్చుగాక ఆత్మ చావదెన్నడును
నాద బ్రహ్మానందయోగీ వీడు
వేదాంతసారము వినిచే బైరాగీ

విచ్చికుండ వ్రక్కలైనా, లోన
హెచ్చియున్న బయలు విచ్చి రెండౌన
నాద బ్రహ్మానందయోగీ వీడు
వేదాంతసారము వినిచే బైరాగీ