Home » కవితలు » రాతిగుండెగల తాజమహల్!Facebook Twitter Google
రాతిగుండెగల తాజమహల్!

 

రాతిగుండెగల తాజమహల్!

 

 

 

తాజమహల్ పడగొట్టండోయ్!
వెన్నెలరాత్రుల్లో కలగా
సౌందర్య సాగరపు అలగా
మా పీడిత హృదయాల్చీల్చీ
మా ఎత్తిన తలలను వాల్చీ
దరిద్రులను హేళనచేస్తూ
మానవులను చులకన చేస్తూ
ఆకాశంవైపుకు చూపే
ఈర్ష్యలతో హృదయంఊపే
తాజమహల్ పడగొట్టండోయ్!

ధ్వంసాన్ని ధిక్కరించిన
కాలాన్ని వెక్కిరించిన
శిల్పులను విస్మరించిన
ప్రభుస్మృతులనే వరించిన
ఈ ద్రోహిని దండించండోయ్!
ఈ పాపం పండించండోయ్!

మొగ్గలుగా తుంచిన సుమాలు
పచ్చవిగా నరికిన ద్రుమాలు
జగమెరుగని ప్రేమగాధలూ
దరిద్రతా మిశ్రమ బాధలూ
ప్రభు ప్రేమల కుళ్ళు వాసనలు
మాకవి బీభత్సకల్పనలు

మా కెందుకు షాజహాన్ ప్రణయం
మానవ శ్రమ మింగిన ప్రళయం
ఈ కుళ్ళిన విలాస చిహ్నం
కర్దయ మోహపాశ చిహ్నం
తాజమహల్ పడగొట్టండోయ్!
రాయిరాయి విడగొట్టండోయ్!

అది అతీత శవదుర్గంధం
ముందడుగిడు కాళ్ళకుబంధం
అది ఐశ్వర్యపు వెటకారం
గృహహీనుల హాహాకారం
తాజమహల్ పడగొట్టండోయ్!
రాయిరాయి విడగొట్టండోయ్!

మన శ్రమతో నిర్మింపబడేదీ
మనలనే వెక్కిరించేదీ
ప్రపంచమందుండదు ఏదీ
ప్రేమకు గురుతీ పన్నీరా!
వెచ్చని బాధల కన్నీరా!
రాతిగుండెగల తాజమహల్!

ప్రేమగురుతు గావీశిలలు.
తాజమహల్ పడగొట్టండోయ్!
రాయిరాయి విడగొట్టండోయ్!

 

 


- ఆలూరి బైరాగి (చీకటి నీడలు)

 

 


నా దేశం
Aug 14, 2019
మేలు
Aug 5, 2019
చాలా రోజుల తర్వాత వర్షంలో తడిశా
Aug 2, 2019
కొమ్మన కోయిలలు వరసన పాడితే
Jun 27, 2019
ఆశ (కవిత)
Jun 14, 2019
సంస్కృతి, సంప్ర‌దాయం సంద‌డిచేసేలా.. పసుపు, కుంకుమ ప‌ల్ల‌వి పాడిన శుభ‌వేళ‌..
Apr 5, 2019
ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను.
Apr 30, 2019
అమ్మ నుంచే మన అమ్మ భాష ఆటలతో ఆనందభాష్పాలు
Feb 20, 2019
నేను నిన్ను ప్రేమిస్తున్నా...............తెలుగులో... ముజే తుమ్ సే ప్యార్ హై.............హిందీలో.........
Feb 13, 2019
నీ కనుపాపలోని ప్రతి స్వప్నం నా గురించే అనుకున్నా...
Feb 12, 2019
TeluguOne For Your Business
About TeluguOne