Facebook Twitter
ఇటు ఉద్యోగం... అటు కుటుంబం... ఓ సరిత కథ!

ఇటు ఉద్యోగం... అటు కుటుంబం... ఓ సరిత కథ!

 

 

పొద్దున్న లేస్తూనే విపరీతమైన తలనొప్పి. వేడిగా ఒక టీ తాగినా తగ్గని పోటు. ఆ హడావుడిలోనే వంటపని ముగించి, పిల్లల్ని క్యారేజీలు సర్ది స్కూలుకి పంపేసరికి సరిత తలలో నరాలు జివ్వుమనడం మొదలుపెట్టాయి. ఇంకా నయం తన భర్త తన పని తనే చేసుకుంటాడు. అలాగని సరిత పనిలో మాత్రం సాయపడడు. మగవాడు వంటపనీ, ఇంటిపనీ చేయడమా? డామిట్!

పిల్లలూ, భర్తా ఎవరి దారిన వారు వెళ్లిపోయారనుకోవడానికి లేదు. తన ఉద్యోగం ఒకటుందిగా! వేణ్ణీళ్లకు చన్నీళ్లుగా ఉంటుందనో, ఇంట్లో ఉంటే తన చదువు వృధా అయిపోతుందనో.... కారణం ఏదైతేనేం, తనూ ఓ ఉద్యోగంలో చేరింది. ఉద్యోగంలో చేరాక నిమిత్తమాత్రంగా ఉండటం చేతకాలేదు. జాబ్లో చేరిన కొద్ది రోజులకే కంపెనీకి తన ప్రతిభ అర్థమైపోయింది. దాంతో అటు జీతమూ, ఇటు బాధ్యతా రెండూ పెరిగిపోయాయి.

సరిత ఆఫీసులోకి అడుగుపెడుతూనే సవాలక్ష సవాళ్లు మెయిళ్ల రూపంలో సిద్ధంగా ఉన్నాయి. వాటికి తోడు ఆఫీసులో పిల్లి ఎలుకా రాజకీయాలతో సమస్యలు మరికొన్ని కాచుకుని ఉన్నాయి. తలనొప్పి తగ్గేందుకు ఓ కాంబిఫ్లామ్ మాత్ర వేసుకుని పనిలో పడిపోయింది సరిత. అంత ఒత్తిడిలోనూ టైమ్ చూసుకుంటూనే ఉంది. రేపటి నుంచి పిల్లల పరీక్షలు. రోజూ సాయంత్రం కాసేపు వాళ్లని పుస్తకాల ముందు కూర్చోపెట్టాలి. రేపేమో అత్తగారు ఇంటికి వస్తున్నారు. ఆవిడ వచ్చేసరికి ఇల్లు కాస్త నీట్గా కనిపించాలి. ఓహ్!

ఒక్కసారిగా ఏదో తెలియని నిస్తేజం సరితను ఆవరించింది. ఇక తన వల్ల కావడం లేదు. అటు పిల్లల్ని గమనించుకోవాలి, భర్తని చూసుకోవాలి, ఆయన తల్లిదండ్రుల గౌరవానికి భంగం కలగకూడదు. ఇటు ఆఫీసునీ సంభాలించుకోవాలి, తనేమిటో నిరూపించుకోవాలి. ఎక్కడ ఏ పొరపాటు వచ్చినా అంతా బుర్ర వాచిపోయేలా క్లాసు పీకేస్తారు. నేరుగానో, నేర్పుగానో తనలో అశ్రద్ధ పెరిగిపోతోందని దెప్పిపొడుస్తారు. కూరలో ఉప్పు తక్కువైనా, పిల్లవాడికి మార్కులు తక్కువ వచ్చినా, కంపెనీ ప్రాఫిట్ తగ్గినా... అన్నిటికీ తనదే బాధ్యత. ఛీ బోడి ఉద్యోగం అంటూ ఒకోసారి రిసిగ్నేషన్ లెటర్ విసిరికొట్టాలని అనిపిస్తుంది. కానీ ఆ జీతంతో తన కుటుంబం అలవాటుపడిన జీవితం గుర్తుకువచ్చి మనసు నెమ్మదిస్తుంది.

సరిత కథ మనకి కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే మనలో చాలామందికి నిత్యం అనుభవమే! మన ఇంట్లో సరితలాంటి మనిషి ఉంటే వాళ్లని అర్థం చేసుకుని, మన వంతు బాధ్యతగా ఓ చేయి అందించగలం. మనమే ఆ పాత్రలో ఉంటే ఇతరుల నుంచి మాటిమాటికీ సాయం అర్థించలేం కదా! అందుకని మనలోని సూపర్ మామ్ని కాసేపు పక్కన పెట్టి అన్ని పాత్రలనూ ఎలా పోషించాలో ఒక అంచనాకు రావడం అవసరం...

పిల్లలకు వారి పనులు వారు చేసుకునేలా అలవాటు చేయాలి; ఇంటి ఆడది ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు మగవాడు ఇంటిపనిలో సాయపడాలి అన్న విషయాన్ని భర్తకు స్పష్టంగా తెలియచేయాలి; ఉద్యోగం ఎందుకు చేయవలసి వస్తోందో పిల్లలకి చెప్పితీరాలి; ప్రతి సమస్యకీ కారణం ఉద్యోగమే అన్న గిల్టీ ఫీలింగ్ నుంచి బయటపడాలి; తక్కువ శ్రమ, తక్కువ ఒత్తిడితో ఎక్కువ ఫలితం సాధించే నేర్పు అలవాటు చేసుకోవాలి; ఇంట్లో గడిపే సమయంలో టీవీ, సెల్ఫోన్లకి అంటుకుపోకుండా పిల్లలతో క్వాలిటీ టైమ్ను గడిపే ప్రయత్నం చేయాలి; ఆఫీసు ఇచ్చే సెలవలని పూర్తిగా వినియోగించుకుని కుటుంబంతో అలా సరదాగా వెళ్లి రావడమూ మంచిదే! అన్నింటికీ మించి కుటుంబంతో నేరుగా గడపకపోయినా వారి బాగోగులను మనం నిశ్చింతగా చూసుకోవచ్చు. స్కూల్ టీచర్కి ఫోన్ చేసి పిల్లవాడి చదువు గురించి వాకబు చేయడం, అత్తగారు రోజూ మందులు వేసుకుంటున్నారో లేదో గమనించుకోవడం... లాంటి చిన్నచిన్న జాగ్రత్తలతో వారిని అశ్రద్ధ చేస్తున్నామన్న భావన రాదు.

దురదృష్టం ఏమిటంటే... ఉద్యోగం చేసే ఆడవారిని చూసి వారి ప్రతిభను మెచ్చుకుంటామే కానీ, ఆ ప్రతిభను నిరూపించుకోవడం కోసం వారెంత శ్రమిస్తున్నారో లెక్క కట్టలేం. సరితలాంటి వ్యక్తులు అటు ఉద్యోగాన్నీ, ఇటు కుటుంబాన్నీ ఎలా చూసుకోవాలో సలహాలు ఇవ్వగలమే కానీ... వారి చుట్టూ ఉండే మనుషుల్ని మార్చలేం.

- నిర్జర.