Facebook Twitter
ఓరెంకా రేవడ్సే కాదిస్కే

ఓరెంకా రేవడ్సే కాదిస్కే

 


అనగనగా నాగసముద్రంలో గంగరాజు అనే నేతగాడు ఒకడు ఉండేవాడు. అతనికి లేకలేక ఒక కుమార్తె పుట్టింది. ఆమె పేరు రాణి. రాణిని చాలా ముద్దుగా పెంచుకున్నారు గంగరాజు దంపతులు. ఆ పాపమీద బాగా ఆశలు కూడా పెట్టుకున్నారు. ఆ పాప కూడా పెరిగి పెద్దయ్యే కొద్దీ చేనేత విద్యలో మంచి నిపుణతే సాధించింది. గంగరాజు నోరు ఊరికే ఉండదు. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండాలి. ఒట్టి కోతల-రాయుడు కూడా. ఉన్న విషయాన్ని ఉలవలు పలవలుగా పెంచి, అసలు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ చేసి చెప్పటం అతనికి అలవాటు. 'అనవసరమైన మాటలే కొంప ముంచు-తాయి' అని ఏమాత్రం తెలీదు అతనికి. ఒకరోజు అతను వాళ్ళ బంధువు లింగరాజుతో మాట్లాడుతూ "మా రాణి చెయ్యి మామూలు చెయ్యి కాదురా! ఆ పాప డోలు చుడుతుంటే, అందులో వేసిన గడ్డి పరకలు కూడా బంగారు కడ్డీలుగా మారిపోతాయి!" అనేసాడు.


ఆ మాట వారి నోటా వీరి నోటా పడి నలిగి, చివరికి ఆ దేశపు రాజు చెవిలో పడింది. ఇంకేముంది?- "వెళ్ళి అమెను తక్షణం వెంట బెట్టుకు రండి" అని భటుల్ని పంపించారు రాజుగారు. భటులు రాణిని వెతుక్కుంటూ నాగసముద్రం వరకూ వచ్చి, "లింగరాజు ఇల్లు ఎక్కడ?" అని వాకబు చేసారు. 'సంగతేంటి?' అని కుతూహలపడ్డ ఊళ్ళోవాళ్ళు, వాళ్ల వెంట వచ్చి మరీ లింగరాజు ఇల్లు చూపించారు. "రాజుగారు నిన్ను వెంట బెట్టుకు రమ్మన్నారు తల్లీ" అని చెప్పారు భటులు. ఇక రాణికి వాళ్ల వెంట రాక తప్పలేదు. రాజుగారి దర్బారుకు వెళ్ళి నిలబడింది. రాజుగారు ఆ అమ్మాయిని చూడగానే మర్యాదగా లేచి నిలబడి, "నువ్వు డోలు చుడుతుంటే అందులో గడ్డి పరకలు వేసినా కూడా బంగారు కడ్డీలు అవుతాయట కదా! మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఖజనాలో నిధి బాగా తగ్గిపోయింది. నువ్వు ఇప్పుడు ఎలాగో ఒకలాగా నిధిని పెంచాలి- ఎంత కష్టమైనా సరే, తప్పదు" అని చెప్పేసాడు.

 

"అయ్యో రాజావారూ, దయచేసి నామాట ఆలకించండి. నాకు ఇవేవీ రావు. మా నాన్న వట్టి కోతలరాయుడు. గొప్పలు చెప్పుకోనిదే బ్రతక లేడు!" అని నిజం చెప్పింది రాణి. అయినా రాజుగారు ఆమె మాటలు నమ్మలేదు. "చూడమ్మా! పరాచికాలకు ఇది సమయం కాదు. దేశం ఎట్లా ఉందో చెప్పాను నీకు! చేతిలోని విద్యల్ని దేశం కోసం‌ కాకపోతే ఇంక దేనికి వాడతావు? నువ్వు ఖజానాలో సంపదని పెంచాల్సిందే. వేరే మాట లేదు!" అని, రాజుగారు ఆమెకు సకల సౌకర్యాలూ కల్పించాడు; సేవలు చేసేందుకు చెలికత్తెల్ని పెట్టాడు; కడుపునిండా ఫలహారాలు సమకూర్చాడు. ఆమె ఉండే గదిలో ఒక డోలు, గది నిండా గడ్డి సమకూర్చాడు! రాణికి ఇంక ఏమి చేయాలో తెలీలేదు. పగలంతా కూర్చొని తండ్రిని బాగా తిట్టుకుంది. రాత్రంతా ఆ గడ్డి కుప్ప ముందు కూర్చొని ఏడ్చింది. చివరికి ఇంక తట్టు-కోలేక, 'చనిపోవాల్సిందే' అనుకున్నది. 'ఈ గడ్డితోటే ఉరి వేసుకుంటాను' అని నిశ్చయించుకున్నది.

 

అయితే సరిగ్గా అదే సమయానికి ఆమె ఉన్న గదిలోకి దూకింది, ఒక భూతం! రాణి దాన్ని చూసి కూడా చూడనట్లే ఉంది. అది రాణిని చూసి భయంకరంగా పళ్ళన్నీ కనబడేట్లు ఇకిలించింది. జవాబుగా రాణి మూతి ముడుచుకున్నది. భూతం ఓ చర్నాకోల తీసుకొని గడ్డినంతా చెల్లాచెదరయ్యేట్లు కొట్టింది. దాన్ని కళ్ళార్పకుండా చూసిన రాణి, "గడ్డిని కొడితే ఏమొస్తుంది, నన్ను చంపెయ్యి మామయ్యా! కనీసం ఈ పీడన్నా విరగడౌతుంది" అని ఏడ్చింది. ఆశ్చర్యపోయిన భూతం గడ్డిని ఏకే పనిని ఆపి "ఏమైంది? ఏడవాల్సినంత విషయం ఏం జరిగింది?" అని అడిగింది. జరిగిన సంగతంతా పూస గుచ్చినట్లు చెప్పి, ఇంకోసారి కళ్ళనీళ్ళు పెట్టుకున్నది రాణి.

"సరే సరే, అర్థమైంది! ఇప్పుడింక మళ్ళీ ఏడవకు, ఊరికే. నేను నీకు సాయం చేస్తాను!" అని, రాణినే పరీక్షగా చూస్తూ "ముందు నీ కాళ్ళకు వున్న బంగారు పట్టీలు తీసి ఇవ్వు" అన్నది భూతం. రాణి తన కాళ్ళకు ఉన్న పట్టీలు తీసి భూతానికి ఇచ్చింది. భూతం వాటిని గడ్డిలో వేసి చేతులు తిప్పింది. వెంటనే అక్కడున్న గడ్డి పరకలన్నీ బంగారు కడ్డీలుగా మారాయి. ఆ వెంటనే భూతం కూడా మాయమైపోయింది. తెల్లవారగానే రాజుగారు వచ్చి, బంగారంగా మారిన గడ్డిని చూసి చాలా సంతోషించాడు. "నాకు తెలుసు తల్లీ! నువ్వు కోరుకుంటే ఏమైనా చేయగలవు! నీవల్ల మన ఖజానాలో మూడో వంతు నిండి పోయింది! ఇంక మన పెద్దలు చేసిన బాకీలు తీరినట్లే. ఇవాళ్టిరోజున కొంచెం శ్రమ పడ్డావంటే మనం చేసిన బాకీలు కూడా తీరిపోతాయి. ఇలా అడుగుతు-న్నానని ఏమీ అనుకోకు- మళ్ళీ గదినిండా గడ్డి వేయిస్తాను" అన్నాడు.

 

"నాకేమీ రాదు! ఇది నేను చేసింది కాదు!" అని రాణి ఏదో చెప్పబోయింది గానీ ఆయన విననే లేదు! గదిలో ఒక్క బంగారు కడ్డీ కూడా లేకుండా ఎత్తుకెళ్ళి, కొత్త గడ్డి తెచ్చి వేయించాడు మళ్ళీ. రెండవరోజున కూడా ఏడ్చుకుంటూ కూర్చున్నది రాణి. "భూతం మామయ్య వస్తే బాగుండు!" అనుకున్నది గానీ, "రోజూ రావాలని ఏమున్నది?" అని కూడా అనుకున్నది. అయితే ఆమె అదృష్టం‌ కొద్దీ‌ మళ్ళీ వచ్చింది భూతం. "నాకు తెలుసు; నీ పరిస్థితి ఇట్లా అవుతుందని. ఏదీ, బంగారం ఇవ్వు. అంటూ రాణి వేసుకున్న బంగారు గొలుసును తీసుకొని, అక్కడున్న గడ్డినంతా ఒక్క క్షణంలోనే బంగారు కడ్డీలుగా మార్చేసి, వెళ్ళిపోయింది.

 

తెల్లవారాక వచ్చి చూసిన రాజుగారు, బంగారాన్నంతా ఖజానాకు తరలించి, ఆమెను చాలా మెచ్చుకొని, "అమ్మా, నీ‌ చలవ వల్ల నా ఖజానా రెండు వంతులు నిండిపోయింది. మన బాకీ అంతా తీరినట్లే. ఇప్పుడు ఇంక ఒక్క రోజు శ్రమ పడ్డావంటే, ఇక మన తర్వాతి తరం అంతా దర్జాగా పెరుగుతుంది!" అన్నాడు, కొత్తగా గడ్డి తెచ్చి వేయిస్తూ. ఆ రోజు రాత్రి కూడా భూతం మామయ్య కోసం ఎదురు చూస్తూ కూర్చున్నది రాణి. అనుకున్నట్టు గానే భూతం వచ్చింది. అది రాగానే "మార్చేయి, మామయ్యా; మార్చేయి గబగబా!" అన్నది రాణి. "సరే, ఏదైనా బంగారు నగ ఇవ్వు మరి-" అని చేతులు చాపింది భూతం. కానీ రాణి దగ్గర ఇచ్చేందుకు ఇంక ఏ బంగారు నగా లేదు. కాళ్ల పట్టీలు, మెడలో గొలుసు రెండూ ఇచ్చేసిందిగా?! "అయ్యో! నా దగ్గర ఇంక బంగారం ఏమీ లేదే!" అంది రాణి. "బంగారం లేకపోతే మరి ఇంక నేనేమీ చెయ్యలేను!" అంది భూతం. రాణి భూతాన్ని చాలా బ్రతిమిలాడేసరికి, చివరికి అది రాణితో ఒక మాట తీసుకుంది: "నేను ఇప్పుడు ఈ గడ్డిని బంగారు చేస్తాను. రేప్పొద్దున రాజు వచ్చి, నిన్ను తన కొడుక్కు ఇచ్చి పెళ్ళి చేస్తాడు. ఆ తర్వాత మీకు ఒక కుమారుడు జన్మిస్తాడు. వాడికి ఐదేళ్ళు రాగానే వాడిని నాకు ఇచ్చెయ్యాలి" అని.

అంతా భూతం చెప్పినట్లే జరిగింది. రాజుగారు రాణిని తన కోడలుగా చేసుకున్నాడు. భూతం భయం కొద్దీ రాణి "ఇవేవీ వద్దు. నేను మా ఊరికి వెళ్ళిపోతాను" అన్నది గానీ, రాజుగారు ఆమె మాటల్ని అస్సలు వినలేదు. చూస్తూండగానే రాణికి ఒక కొడుకు పుట్టాడు; వాడికి నాలుగేళ్ళు నిండి ఐదో ఏడాది పడే సరికి భూతం వచ్చి కనిపించింది రాణికి: "గుర్తుందిగా, ఈ ఏడాది గడిచే సరికి నీ కొడుకుని నాకు ఇచ్చేయాలి. ఈ ఏడాదంతా నేను కూడా మీ ఇంట్లోనే ఓ గదిలో నివసిస్తా" అంటూ. రాణి దు:ఖంతో బక్కచిక్కిపోసాగింది. "నీలో ఏదో మార్పు ఉంది- ఏమైంది?" అని యువరాజు ఎంత అడిగినా ఆమె మటుకు ఏమీ చెప్పుకోలేదు. అయితే యువరాజు కూడా చాలా మంచివాడు; అతను గంగరాజుతో "మామా! రాణి ఎందుకో చాలా బాధ పడుతున్నది. నువ్వైతే ఆమెను అర్థం చేసుకుంటావు. వచ్చి కొన్నాళ్ళు మాతోనే ఉండు" అని చెప్పి పిలిపించాడు.

గంగరాజు రాణిని మాటల్లో పెట్టి అసలు సంగతిని రాబట్టాడు. "తల్లీ! ఇదంతా నా తప్పు వల్లే జరిగింది కాబట్టి, దీని పరిష్కారం కూదా నేనే చూపిస్తాను. నువ్వు కంగారు పడకు" అని, ఆనాటి నుండి రోజూ భూతం ఉండే గదిలోకి వెళ్ళి దానితో ముచ్చట్లు పెట్టుకోవటం మొదలు పెట్టాడు. గంగరాజు చెప్పే జోకులు, సామెతలు భూతానికి చాలా ఇష్టం అయ్యాయి. అతను అడిగే పొడుపు కథలు విప్పటంలో దానికి ప్రత్యేకంగా మజా వచ్చేది. ఒక్కోసారి గంగరాజు దానితో చిన్న చిన్న పందేలు కూడా వేసేవాడు. "అడవిలో పుట్టింది-అడవిలో పెరిగింది.."అని ఓ పొడుపు కథ అడిగి, "సమాధానం చెబితే నీకు ఒక చాక్లెట్ ఇస్తా" అనేవాడు. భూతానికి అట్లాంటి పందేలు కూడా చాల నచ్చినై. ఒకరోజున భూతం గంగరాజుకి ఒక సమస్యను ఇచ్చి పరిష్కరించమన్నది- "ఓరెంకారేవడ్సాకాదిస్కే అంటే ఏంటి?" అని. "నాకు తెలీదు- నువ్వే చెప్పెయ్యి" అన్నాడు గంగరాజు. "కాదు కాదు. నువ్వే చెప్పాలి" అన్నది భూతం. "లేదులే, నేను ఓడిపోయాను" అన్నాడు గంగరాజు. "కాదు కాదు! కనుక్కో! కనుక్కుంటే మంచి బహుమతి ఏదైనా ఇస్తాను" అంది భూతం.

 

"ఏమిస్తావు?" అడిగాడు గంగరాజు ఉత్సాహంగా. "ఇది చాలా పెద్ద పందెమే మరి. నీకు వారం రోజులు సమయం ఇస్తాను. సరైన సమాధానం చెప్పావంటే, నేను నీ‌ బిడ్డ రాణిని, మనవడిని వదిలిపెట్టి ఇక కనబడకుండా వెళ్ళిపోతాను. చూడు మరి!" అన్నది భూతం మెరిసే కళ్లతో. "సరే" అని గంగరాజు ఆ సమస్యని రాణికి, యువరాజుకు నివేదించాడు. వాళ్ళు మంత్రుల్ని అడిగారు. మంత్రులు తమకు తెలిసిన పండితుల్ని అడిగారు- ఎవ్వరికీ అసలు ఈ ప్రశ్న ఏంటో, ఏ భాషలోదో, ఏమీ అంతు చిక్కలేదు. ఆ సరికి ఐదు రోజులు గడిచాయి. గంగరాజు రాజ్యంలో అంతటా తిరగటం మొదలెట్టాడు. పండితులు-పామరులు అనకుండా ఎవరు కనిపిస్తే వాళ్లని "ఓరెంకారేవడ్సాకాదిస్కే" అంటే ఏంటి?" అని అడగటం మొదలెట్టాడు. ఆ రోజున కూడా అతను వెతికి వెతికి అలసి పోయి, ఓ నది ఒడ్డున ఉన్న మర్రి చెట్టు కింద కూలబడ్డాడు. అక్కడికి దగ్గర్లోనే ఒక ఊరు ఉంది. ఆ ఊళ్లో ఉండే ఒక సెట్టిగారికి నది అవతలగా ఐదు ఎకరాల పొలం ఉంది. సెట్టి గారి దగ్గర ఒక పాలేరు ఉండేవాడు. అతని పేరు వెంకన్న.

సెట్టిగారు రోజూ పొలానికి వెళ్తూ వెంకన్నను వెంటబెట్టుకొని వెళ్ళేవాడు. నదిలో ఒక్కోసారి నీళ్ళ ప్రవాహం ఎక్కువ ఉండేది; ఒక్కోసారి నది నడచుకొని దాటేందుకు వీలుగా ఉండేది- ఏ రోజున నది ఎలా ఉందో పరీక్షించటం వెంకన్న పని. ఆ రోజున మొదటగా వెంకన్న నదిలోకి దిగి కొంత దూరం నడిచాడు. ప్రతిరోజూ మాదిరే గట్టు మీదినుండి సెట్టిగారు "ఓరెంకా! రేవడ్సా?" అని అడిగాడు గట్టిగా. "ఓరీ వెంకా! రేవు అడుసా?- ఒరే వెంకన్నా, రేవు బురద బురదగా ఉందా?" అని దాని అర్థం. "కాదిస్కే!" అని అరిచాడు వెంకన్న. "కాదు ఇసకగానే ఉంది, బురదగా లేదు" అని! చెట్టు క్రింద కూర్చున్న గంగరాజుకు ఆ క్షణంలో మొత్తం అర్థమైపోయింది: గతంలో భూతం ఈ మర్రిచెట్టు మీదే ఉండి ఉంటుంది! రోజూ శెట్టిగారు, వెంకన్న ఇలా మాట్లాడుకోవటం గమనించి ఉంటుంది. కానీ దానికి ఇదేమీ అర్థమై ఉండదు!! అందుకే ఇప్పుడు అది తనకు ఈ సమస్య ఇచ్చింది! గంగరాజు తక్షణం రాజధానికి వెళ్ళి, తను కనుగొన్న రహస్యాన్ని వివరించి చెప్పేసాడు భూతానికి . భూతం గట్టిగా నవ్వి, తను ఇచ్చిన మాట ప్రకారం రాణిని, ఆమె కొడుకుని వదిలిపెట్టి ఇక కనబడకుండా వెళ్ళిపోయింది. "ఎక్కించి చెప్పి అనవసరంగా నా బిడ్డను కష్టాలపాలు చేసానే!" అని బాధపడే గంగరాజు మనసు ఇప్పుడు చల్లబడింది. యువరాజుకు భార్య అంటే గౌరవం పెరిగింది. అటుపైన అందరూ సుఖంగా ఉన్నారు.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో