Facebook Twitter
రైతు కష్టాలు

రైతు కష్టాలు

 

 

అనగనగా శ్రీశైల క్షేత్రానికి దగ్గరలోని ఒక కుగ్రామంలో లింగయ్య అనే రైతు ఒకడు ఉండేవాడు. లింగయ్యకు తండ్రి తాతలు ఇచ్చిన ఆస్తి పన్నెండు ఎకరాల చేను ఉండేది. అయినా ఏం, ప్రయోజనం? ఆ భూమిలో‌ ఏదీ సరిగా పండేది కాదు. అంతేకాక తను చాలా పేదవాడు- పంటకు కావలసిన పెట్టుబడి కూడా దొరక్క తంటాలు పడుతూండేవాడు.

ఒకసారి వాళ్ల ఊరికి కొందరు వ్యాపారులు వచ్చారు. "భూముల్ని కొంటాం. ఎకరానికి పదివేలిస్తాం" అంటూ. పదివేలు అనేసరికి రైతులందరూ‌ చాలా ఉత్సాహపడ్డారు. చాలామంది వాళ్ళకు భూములు అమ్ముకున్నారు. లింగయ్య మటుకు అమ్మలేదు. 'భూమి అమ్ముకొని నేను ఎక్కడికి పోవాలి?' అన్నాడు.

త్వరలోనే అందరికీ తెలిసింది- "శ్రీశైలంలో కృష్ణకు ఒక పెద్ద డ్యాము కడతారు. ఆ ఆనకట్ట వెనక లక్షలాది ఎకరాల్లో నీళ్ళు నిలవ ఉంటాయి. ఒక్కో ఎకరాకి పదిలక్షలకు తక్కువ కాకుండా వస్తుంది. చేన్లన్నీ పొలాలైపోతాయి" అని. "నేను చెప్పలేదా, ఈ వ్యాపారులు ఒట్టి మోసకారులు. మన దగ్గర పదివేలకే ఎకరా కొనుక్కుందామనుకున్నారు" అన్నాడు లింగయ్య సంతోషంగా.

అయితే చూస్తూండగానే శ్రీశైలం ప్రాజెక్టు వెనక్కి జరిగింది. వీళ్ల చేను రిజర్వాయర్‌కి సంబంధం లేకుండా దూరంగా విసిరేసినట్లు అయ్యింది. వీళ్ల ఊరికి నీళ్ళు అందలేదు. భూములు అమ్మినవాళ్ళు ఏనాడో ఊరు వదిలేసి పోయారు. భూములు కొన్న వ్యాపారులు ఆజాపజా లేరు. ఊరంతా బోసిపోయింది. పంటలు పెడదామంటే కూలీలు దొరకని స్థితి ఏర్పడింది.

 

త్వరలోనే అందరు రైతులూ బోర్లు వేయటం మొదలెట్టారు. "రిజర్వాయర్లో నిండా నీళ్ళుంటాయి. మనం బోరు వేస్తే కొల్లలుగా నీళ్ళు పడతాయి" అని ఆశ పెట్టారు బోర్ల వ్యాపారులు. లింగయ్య దగ్గర బోరు వేసుకునే డబ్బు లేదు. అప్పుగా కూడా దొరికే అవకాశం లేకుండింది. బోరు పంపుల ఆధారంగా వ్యవసాయం చేసిన రైతులు రకరకాల పండ్ల తోటలు పెట్టారు. వారికి లక్షలు ఆదాయం రావటం మొదలు పెట్టింది. కొన్నేళ్లకు మడి కట్టుకొని కూర్చున్న లింగయ్యకు కూడా తల తిరగటం మొదలైంది.

"ఒక్క బోరు వేయాలి. పండ్లతోటలు ఎన్నటికీ నిలుస్తాయి" అని పైసా పైసా కూడబెట్టటం మొదలెట్టాడు. తిండి తిప్పలు మాని పొదుపు చేసాడు. ఆలోగా అక్కడున్న పండ్లతోటలు అన్నీ ఒక్కటొక్కటే ఎండిపోవటం మొదలెట్టాయి. "ఈ నీళ్ళు మంచివి కావంట" అని కొందరు అనసాగారు. "భూగర్భ జలాలు అడుగంటాయంట" అని ఇంకొందరు చెప్పుకోసాగారు.

ఆలోగా పళ్లతోటలు పెట్టిన రైతులు ఇంకా ఇంకా బోర్లు త్రవ్వటం మొదలు పెట్టారు. కొందరి బోర్లలో మంచి నీళ్ళు పడ్డాయి. నీళ్ళు పడని వాళ్ళు భూములమ్ముకొని ఎటుపోయారో, పోయారు. లింగయ్య కూడా ఒక జమిందారి దగ్గర అప్పు తీసుకొని బోరు వేశాడు. కాని తన దురదృష్టం, బోరులో నీళ్లు పడలేదు!

ఆలోగా కొత్తరైతులు కొందరు పత్తి పంట వేయటం మొదలెట్టారు. "పత్తికి వాననీళ్ళు చాలు! చీడపీడల్ని తట్టుకుంటుంది! ఎకరాకి లక్షరూపాయలు ఆదాయం‌ ఉంటుంది!" చూసి, చూసి ఆశపడిన లింగయ్య 'ఇక లాభం లేద'ని తనూ పత్తి పంట వేశాడు. అయితే ఏం ఖర్మమో- ఆ సంవత్సరం ఎండలు విపరీతంగా కాశాయి. లింగయ్య పత్తి అంతా ఎండకు కాలింది. 

చివరికి పంట అంతా బూడిద అయ్యింది. మరుసటి సంవత్సరం లింగయ్య మళ్ళీ అప్పు చేసి, ఈసారి మిరపతోట వేశాడు. పంటను జంతువులు తొక్కి నాశనం చేసినా, 'మిగిలిందే చాలు' అనుకున్నాడు. తీరా పంట చేతికి వచ్చేసరికి మిరప రేట్లు ఎంత అడుగంటాయంటే, పంటని కోసిన కూలి డబ్బులు కూడా గిట్టలేదు!

 

అయినా పట్టువదలని లింగయ్య మళ్లీ అప్పు తీసుకొని, ప్రక్క పొలం వారితో‌ నీటి ఒప్పందం పెట్టుకొని, ఈసారి వరి పంట వేశాడు. నీళ్లు లేక వరి పంట దాదాపు ఎండిపోయింది. ఆ సరికి లింగయ్య జమీందారుకు ఇవ్వాల్సిన డబ్బు ఆరంకెల స్థాయికి చేరుకున్నది. లింగయ్య నీరసించి పోయాడు. అతని మనసు విరిగిపోయింది. వరి పంటకోసం కొన్న పురుగు మందును తాగి చనిపోవాలని నిశ్చయించుకొని, ఒక రోజు మధ్యాహ్నం సమయంలో‌ పొలం చేరుకున్నాడు.

సరిగ్గా ఆ సమయానికి మేఘాలు క్రమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులతో భయంకరమైన వాన మొదలైంది. లింగయ్య ఆవేశం అంతా ఆ వానతో ఆవిరైంది. అతని ఆశలు మళ్ళీ చిగురించాయి. తన వరిపంట ఇక తిరుక్కుంటుంది. ఈసారి బాగా పండుతుంది! తన కష్టాలన్నీ తీరతాయి! లింగయ్య చనిపోయే ఆలోచనని ప్రక్కన పెట్టేసి పనిలోకి దిగాడు. ఈసారి అతని పొలం మంచిగా పండి కోతకు వచ్చింది. వచ్చిన వడ్లు అమ్మేసరికి ఆనాటి వరకూ తనకు ఉన్న అప్పంతా తీరింది! తను గెలిచాడు!

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో