Facebook Twitter
కలిసి బ్రతుకుదాం!

కలిసి బ్రతుకుదాం!

 

ఒక చేతిలో కర్ర, మరో చేత సంచీ పట్టుకొని ఒక మనిషి అడవిలోకి ప్రవేశించాడు. అటూ యిటూ చూస్తూ, పాటలు పాడుకొంటూ పోతున్నాడు. ముందుగా అతన్ని చూసిందొక కుందేలు. పరుగు పరుగున పోయి తన మిత్రులు జింకకు, నెమలికి ఆ సంగతి చెప్పింది. మూడూ పొదలమాటున దాగి చూసాయి. "వీడు ఇటు ఎందుకు వచ్చాడు?" అనుమానంగా అడిగింది నెమలి. "వేటకే అయి ఉంటుంది! ఇంకెందుకు వస్తాడు?" అన్నది జింక. "ఎట్లా కనుక్కోవటం?" అంది నెమలి. "వాడి చూపులు చూస్తే తెలియట్లేదా?" అంది జింక.

"ఆ మనిషినే అడిగి చూస్తాను.. అపకారి అయితే సూటిగా నేనే ఎదుర్కొంటాను. మీరు పొదలమాటున దాగి ఉండండి- బయటికి రాకండి! " అని ఓ ఎత్తయిన చెట్టు పైకెగిరి కూర్చుంది నెమలి- "ఎవరయ్యా, నువ్వు?! ఈ అడవిలోకి వచ్చింది వేటకోసమేనా? ఆ సంచిలో ఏమున్నాయి? వేటకత్తీ, వల తెచ్చావా?! మర్యాదగా అందులో‌ ఏమున్నాయో చూపించు తక్షణం!" గద్దిస్తూ ప్రశ్నించింది నెమలి.

ఆ మనిషి ఆగి "మిత్రమా! నేను వేటగాడిని కాదు- వేటాడేందుకు రాలేదు. నేనొక పర్యావరణ ప్రేమిని. సహజ వాతావరణమన్నా, పరిసరాలన్నా నాకు ఇష్టం. అడవి అందాలను ఆస్వాదిద్దామని, మిమ్మల్ని చూద్దామని వచ్చాను. మీరు నన్ను అనుమానించవలసిన పనిలేదు. నేను మేలు చేసేవాడినే కాని కీడు చేసేవాడిని కాను. పక్షులకు ఆహారంగా వేద్దామని ధాన్యాలు తెచ్చాను చూడండి" అన్నాడు నెమలికి సంచీని చూపిస్తూ.

"మీ మనుషుల్ని మేం నమ్మం. మీరు నమ్మించి మోసం చేస్తారు. మా పరిసరాలన్నిటినీ నాశనం చేస్తున్నది మీరే" అన్నది నెమలి. "అవును. నిజంగా అవును" అరిచాయి కుందేలు, జింక బయటికి వచ్చి నిలబడి. "మీ తెలివి తక్కువతనం, స్వార్థం వల్ల ఎన్ని జీవజాతులు అంతరించిపోతున్నాయో తెలుసా, అసలు మీకు?!" కుందేలు అన్నది ఆవేశంగా.

 

"రాయీ రప్పా, చెట్టూ-చేమా, పక్షులు-జంతువులు అన్నీ నాశనమే. సమతుల్యంగా వుంటేనే కదా, అన్ని జీవులకూ మనుగడ? ఈ సంగతి ఎప్పటికి తెలుస్తుంది, మీ మనుషులకు?" కోపంగా అడిగింది జింక. విచక్షణ లేకుండా ప్రవర్తించటం వల్ల ప్రకృతి దెబ్బతింటున్నదని గుర్తించే కదా, మా ప్రభుత్వం కొన్ని అరణ్యాలని అభయారణ్యాలుగా ప్రకటించింది; అంతరించిపోతున్న జీవ జాతులకు రక్షణ, పోషణ కల్పిస్తున్నది; పర్యావరణాన్ని కాపాడాలి అని ప్రచారం చేస్తున్నది" అన్నాడు మనిషి. "ప్రభుత్వాలు ప్రకటించినంత మాత్రాన మా కష్టాలు తీరినాయా? మీ మనుషులు దొంగచాటుగా ఎన్ని కృత్యాలు చేయడం లేదు?!" ఈసడిస్తూ అన్నది కుందేలు.

"నువ్వన్నది నిజమేనమ్మా. అక్షర సత్యం. వ్యక్తిగతంగా ప్రతి మనిషీ తనకు తానుగా బాధ్యతను గుర్తించి మసలుకోవాలి. జీవజాలం అంతా ఒకదానిమీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. పుష్పజాతులు పెరిగితే తేనెటీగలు వృద్ధి చెందుతాయి; మధురమైన తేనెను ఇస్తాయి. ఎలుకలను అదుపులో‌ ఉంచి పాములు, గింజలు తయారు చేయటంలో చురుకుగా వ్యవహరించి కీటకాలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి కదా. అట్లా ఒక జీవం లేదంటే మరొకటి ఉండదు. అందుకని అందరం కలిసి బ్రతకాలి. సహజీవనమే మార్గం; మరొకటి లేదు" అన్నాడు మనిషి.

 

"పరిసరాలను మీకు అనుగుణంగా మలుచుకుంటూ, మా ఉనికికి, భద్రతకు ముప్పు కలిగించడం సరైందేనా, చెప్పు అసలు?" ప్రశ్నించింది జింక. "తప్పే తల్లీ. అందుకనే- దాన్ని గుర్తించి, అట్లాంటి అనర్థాలు జరగకూడదనే ఉద్దేశ్యంతోనే. అనేకమంది మనుషులు స్వచ్ఛంద సంస్థలద్వారా కృషి చేస్తున్నారు. మనుషులందరూ స్వార్థపరులు కారు తల్లీ. ముఖ్యంగా ఇప్పటి పిల్లలు చాలామంది పర్యావరణాన్ని గౌరవిస్తారు; జీవరాసులన్నిటినీ అభిమానిస్తారు, ప్రేమిస్తారు" చెప్పాడు మనిషి.

"అవునవును. మమ్మల్ని కొట్టేయకూడదు. జంతువులతోటి ఎక్కడలేని విన్యాసాలూ చేయించకూడదు" అన్నది అప్పటివరకూ ఊరికే నిల్చున్న చెట్టు. "అవునవును. అందుకని మీరంతా ఇంక వేటాడటం మానెయ్యాలి. అందరం సహజీవనం చేద్దాం. అందరం కలిసి భావి తరాలకు మంచి పరిసరాలను అందిద్దాం" అన్నది జింక. "మనం అందరం ఒకరికొకరం శత్రువులం కాదు. నేస్తాలం!" అన్నాయి నెమలి, జింక, కుందేలు. మనిషి వాటితో గొంతు కలిపాడు.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో