Facebook Twitter
పెద్దల మాట

పెద్దల మాట

 


అనగా అనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఓ పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టుకో తొర్ర ఉండేది. ఆ తొర్రలో ఒక ముసలి గుడ్లగూబ ఉండేది. అది చాలా మంచిది, తెలివైనది. అందరికీ సాయం చేసేది.

ఆ అడవిలో లెక్కలేనన్ని పూలు ఉండేవి. ఎన్నో కాయలు కాసేవి. ఏ చెట్టుకు చూసినా పండ్లు, గుత్తులు గుత్తులు గా వేళ్ళాడుతుండేవి. ఓసారి ఆ అడవిలోకి ఒక రామచిలుక వచ్చింది. అప్పటివరకూ అది పట్నంలోనే, ఎవరి ఇంట్లోనో ఓ పంజరంలో‌బ్రతికింది. దానికి అడవి గురించి అస్సలు ఏమీ తెలీదు. అయితే ఆ సంగతి చెప్పుకోవాలంటే దానికి నామోషీ. 

 

తనకు అన్నీ తెలిసినట్లు నటిద్దామనుకున్నదది. అడవిలోకి వచ్చీ రాగానే గుడ్లగూబను పలకరించింది. “ఏంటి మామా?! కులాసానా? అందరూ బాగున్నారా? నేను పట్నం నుండి వచ్చాను మిమ్మల్ని అందర్నీ చూసిపోదామని; మన అడవిలో దొరికే పళ్ళన్నీ తిందామని!” అని. "పళ్ళన్నీ తినద్దురో అల్లుడూ!” అంది గుడ్లగూబ. "మిలమిలా మెరిసేవన్నీ మంచి పళ్ళు కాదు. 

ఎర్రగా బుర్రగా కనిపిస్తా ఉన్నాయని ఎగబడి తినేవు జాగ్రత్త, విషపు పళ్ళుంటాయి!” చెప్పింది. “నాకు తెలీదా, ఆ మాత్రం?!” అంది చిలుక. “ముసలి వాళ్లంతా ఇంతే, చాదస్తం!” అనుకున్నది చిలుక. అడవంతా తిరిగి, ఏవేవో పళ్ళు తిన్నది. “అన్నీ కొరికి చూడాలి" అనుకొని, నిజంగానే అన్నీ‌కొరికి చూసింది.

 

ఓ గంటసేపు అట్లా తిరిగి తిరిగి ఏమేం తిన్నదో కడుపులో గడబిడ మొదలు అయ్యింది. కళ్ళు మసక బారాయి. తల తిరిగింది దాని అదృష్టం బాగుండి, గుడ్లగూబ ఉండే చెట్టు ముందుకే వచ్చి నేలబారుగా పడిపోయింది. "శబ్దం ఏంటా!?” అని లేచి వచ్చి చూసింది గుడ్లగూబ . ఎదురుగా నేలమీద చిలుక, గుడ్లు తేలవేసి పడి ఉన్నది. 

వెంటనే అది తనకు తెలిసిన మందు ఆకులు తెచ్చి, నూరి దాని ముక్కులో పిండింది. చిలుక ప్రాణాలను కాపాడింది. లేచి కూర్చున్న చిలుక తన అవివేకానికి సిగ్గుపడి తలవంచుకుంది. “తెలీనప్పుడు ఎవరన్నా పెద్దవాళ్ళు చెబితే వినాలిరా అల్లుడూ" అని గుడ్లగూబ అంటే "నిజమే" అనిపించింది దానికి ఇప్పుడు!

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో