Facebook Twitter
చిలుకతో స్నేహం

చిలుకతో స్నేహం

 

 

ఒక అడవి అంచున చెన్నప్ప అనే బోయవాడు ఒకడు ఉండేవాడు. రోజూ ఏదో ఒకటి వేటాడి తెచ్చుకొని కడుపు నింపుకునేవాడు. అతనికి దగ్గరి బంధువులు అంటూ పెద్దగా ఎవ్వరూ లేరు- ఒంటరివాడు. ఒకరోజు అతను బిగించిన ఉచ్చులో చక్కని రామ చిలుక ఒకటి తగులుకున్నది. చాలా అందంగా, ముద్దుగా ఉన్నదది. అది దొరికిన రోజున ఇంట్లో తినేందుకు వేరే ఏమీ లేవు; కానీ చెన్నప్పకు దాన్ని చంపబుద్ధి కాలేదు. 'దీన్ని తింటే ఏం కడుపు నిండుతుంది?' అని దాన్ని ఓ పంజరంలో పడేసి, తను ఇన్ని నీళ్ళు త్రాగి పడుకున్నాడు. 


తర్వాతి రోజున చెన్నప్ప నిద్రలేచే సరికి అది పంజరంలోనే తిరుగుతూ చక్కగా పాటలు పాడుతున్నది. అతనికి దాన్ని చూస్తే బలే ముచ్చట అనిపించింది. "సరేలే!‌ నీ టైం బాగుంది" అని వాడు దానికి కొన్ని పళ్ళు, విత్తనాలు తెచ్చి ఇచ్చి, వేటకు వెళ్ళాడు. ఆ రోజున అతను ఇంటికి వచ్చేసరికి చిలుక "ఇంత లేటైందేం?" అన్నది. అతను దానికేసి వింతగా చూసాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అతనికి చిలుకతోటి అనుబంధం పెరిగింది. దాని రెక్కలకి బంధం వేసి, ఇప్పుడు తనతో పాటు వేటకి కూడా తీసుకువెళ్తున్నాడు, చెన్నప్ప. దానికి ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నాడు. 


ఒక రోజున అతను చిలకను వెంటబెట్టుకొని అలా వేటకు వెళ్ళాడు. ఆ రోజున ఏ జంతువూ దొరకలేదు; ఎండ బాగా ఉంది కూడా. మధ్యాహ్నం అయ్యేసరికి చెన్నప్ప బాగా అలసిపోయాడు. వేటను ఆపి ఒక చెట్టుకింద విశ్రాంతిగా పడుకున్నాడు. అతన్ని అలా చూసేసరికి రామచిలకకి జాలి అనిపించింది. దగ్గర్లో అంతటా వెతికి, ఓ పళ్ల చెట్టు మీదికి అతి ప్రయత్నం మీద ఎగిరింది. కొన్ని పళ్లను తను తిని, చెన్నప్ప కోసం కూడా కొన్ని పళ్ళు తీసుకున్నది. 'ఇక క్రిందికి దూకుదాం' అనుకుంటుండగా దానికి భయంగొలిపే దృశ్యం ఒకటి కనిపించింది! చెన్నప్ప పడుకున్న చెట్టు వెనకనే ఒక పొద ఉన్నది. ఆ పొదలోనే ఒక పులి కూర్చొని ఉన్నది. అది ఆశగా చెన్నప్ప వైపే చూస్తూ, పెదిమలు నాక్కుంటున్నది! దానికి ఆకలిగా ఉందని, ఏదో ఒక క్షణంలో అది చెన్నప్ప మీదికి దూకబోతున్నదని చిలుకకు అర్థమైంది. 

 


దాని బుద్ధి చురుకుగా పని చేసింది. చెన్నప్ప పడుకున్న చెట్టు పైనే ఒక తేనెతుట్టె ఉంది. అతనికి ఇచ్చేందుకు తను కోసిన పండ్లను అది గురిచూసి సూటిగా ఆ తేనెతుట్టె మీదికి విసిరేసింది. తేనెటీగలు 'జుం' అంటూ లేచాయి. కొన్ని తేనెటీగలు సూటిగా క్రింద ఉన్న పొద వైపుకు దూసుకు పోయాయి. వెంటనే పులిని కుట్టటం మొదలెట్టేసాయి కూడా! పులి గిరుక్కున వెనక్కి తిరిగింది. తనను చుట్టుముడుతున్న తేనెటీగలనుండి తప్పించుకోవటం కోసం దూరంగా పరుగు తీసింది. ఇక చిలుక చెన్నప్ప దగ్గరికి వెళ్ళి "లే!లే! త్వరగా!" అని అరిచింది. చెన్నప్ప లేచేసరికి చుట్టూ తేనెటీగలు ముసురుకుంటున్నాయి. చటుక్కున తను వెంటతెచ్చుకున్న గోనెసంచీలో దూరాడతను! తేనెటీగలు పోయాక బయటికి వచ్చిన చెన్నప్పకు చిలుక పులి సంగతి చెప్పింది. 

 


పొదలో పులి ఉండిన గుర్తులు కూడా చూసాక, చెన్నప్పకు చిలుక అంటే ప్రత్యేకమైన అభిమానం కలిగింది. "నువ్వు చాలా గొప్ప స్నేహితుడివి! నా ప్రాణాలు కాపాడావు! నీకు ఏ బహుమతి ఇవ్వమంటావు, చెప్పు!" అన్నాడతను. "వేరే ఏమీ వద్దు- నీకు ఇష్టమైతే నా రెక్కలకు కట్టిన బంధాలు తీసెయ్యి. నన్ను స్వేచ్ఛగా ఎగరనియ్యి!" అన్నది చిలుక. చెన్నప్ప మారు మాట్లాడకుండా దాని రెక్కలకున్న బంధాలను తొలగించాడు. 'చిలుక ఎగిరిపోతుంది' అనుకున్నాడు. కానీ అది అతన్ని విడిచి పోలేదు! ఇప్పుడు వాళ్ల స్నేహం మరింత గట్టిపడింది. 


- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో