Home » పిల్లల కోసం » పండు-మామిడి చెట్టుFacebook Twitter Google
పండు-మామిడి చెట్టు

పండు-మామిడి చెట్టు

 

 

పండుకి ఆరేళ్ళు. ఈమధ్యే కొత్తగా బడికి వెళ్ళటం మొదలు పెట్టాడు. బళ్ళో టీచరుగారు చెప్పేవన్నీ శ్రద్ధగా వినటం, వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించటం- ఇవన్నీ‌ వచ్చేశాయి వాడికి. టీచరు రాజారావు గారంటే వాడికే కాదు, పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం. రాజారావు వాళ్ళకి పరిసరాల విజ్ఞానం నేర్పేవాడు. చెట్లు, మొక్కలు, పూలు, కాయలు, విత్తనాలు, జంతువులు వీటన్నిటి గురించీ ఎంత చక్కగా చెప్పేవాడంటే, పిల్లలందరికీ అవంటే పెద్ద ఇష్టం పట్టుకున్నది. రాజారావు పిల్లల సాయం తీసుకొని, బడి చుట్టుప్రక్కల అంతా శుభ్రం చేయించేవాడు, కొత్తగా చెట్లు, మొక్కలు నాటించేవాడు; వాటిని పెంచే బాధ్యతను పిల్లలకే ఇచ్చాడు- ఒక్కోరిదీ ఒక్కో చెట్టు!

పండు వంతుకు ఓ మామిడి చెట్టు వచ్చింది. రాజారావుగారు పండుకు చెప్పారు- "చూడు పండూ! నువ్విప్పుడు ఒకటో తరగతి. ఈ బడిలో ఇంకా నువ్వు ఐదేళ్ళుంటావు. ఇక్కడినుండి వెళ్ళేలోపల నువ్వు ఈ చెట్టునుండి వచ్చిన పళ్ళు తిని, అందరికీ‌ పంచి వెళ్తావు. సరేనా? దీన్ని జాగ్రత్తగా కాపాడుకో, మరి!" అని. ఆ మాటలు పండు హృదయాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. రోజూ బడి గంట కొట్టేలోగా రావటం, మామిడి మొక్క చుట్టూ పాదు సరిగా ఉందో లేదో చూసుకోవటం, అవసరమైతే సరి చేయటం, కొంచెం ఎరువు తెచ్చి వేయటం, దాని చుట్టూ పుల్లతో గీకి, నీళ్ళు పోయటం- మళ్ళీ బడినుండి ఇంటికి పోయేటప్పుడు 'బై' చెప్పి వెళ్లటం- అట్లా ఆ తర్వాత చాలా రోజుల వరకూ వాడి మనసంతా మామిడి మొక్క పైనే.

 

ఒక సెలవు రోజున ఆడుకునేందుకు బడి దగ్గరికి వెళ్లాడు పండు. ఆడుతూ ఆడుతూ అనుకోకుండా తన మామిడి చెట్టు వైపుకు వెళ్ళాడు. ఆశ్చర్యం! అది ఇప్పుడు పది అడుగుల ఎత్తు ఉన్నది! దృఢంగా, నిటారుగా పెరిగింది! అదంతా తను దానికి వేసిన ఎరువు మహత్యమే! పండుకి చాలా సంతోషం వేసింది. వెళ్ళి దాన్ని ఆప్యాయంగా నిమిరాడు. దానికి తన చెక్కిళ్ళు ఆనించి మురిసిపోయాడు. అంతలో వాడికి నేలమీద ఒక పెద్ద మామిడి పండు కనిపించింది. పెద్దగా, అందంగా, ఉదయించే సూర్యునిలాగా వెలిగి పోతోందది. ఎంత తియ్యటి వాసనో! మనసును ఊరించేంత తీపి! "నిన్నటి వరకూ ఒక్క కాయ కూడా లేదు, మరి ఒక్క రోజులోనే ఇంత మంచి పండు ఎలా తయారైందబ్బా?" అని తలెత్తి పైకి చూశాడు పండు. చూస్తే ఆశ్చర్యం! చెట్టు నిండా కాయలే! కొన్ని కాయలు ఆకుపచ్చగా ఉన్నై; కొన్ని పసుపు రంగుకు తిరుగుతున్నై. చెట్టు మీద రామ చిలుకలు కూర్చొని ఆ పళ్ళని ముక్కుతో వాసన చూస్తున్నై. "అరే! ఇన్ని కాయలు వచ్చినై! నేను గమనించనే లేదే?" అనుకున్నాడు పండు, మామిడి పండును చేతిలోకి తీసుకొని- "దీన్ని ఇంటికి తీసుకెళ్ళి అమ్మకు చూపిస్తాను" అని.

అయితే ఆ ఉత్సాహంలో రెండడుగులు పడ్డాయో లేదో, అక్కడున్న ఓ రాయిని తట్టుకొని బొక్క బోర్లా పడ్డాడు వాడు. చేతిలోని మామిడిపండు కాస్తా దొర్లుకుంటూ పోయింది. పండు ఆ పండు వెంట పడ్డాడు. అది పోయి అక్కడే ఉన్న ఓ మల్లెపొదలో దూరి మాయమైంది. వాడు ఆ పొదలో అంతా వెతికాడు. ఎంత వెతికినా మామిడిపండు మాత్రం కనబడదే?! పండుకి చాలా బాధ వేసింది. "ఇంకో పండు ఎప్పటికి దొరుకుతుందో ఏమో" అని పైకి చూశాడు. చెట్టులో ఒక్క కాయ కూడా లేదు! అన్నీ మాయం! దు:ఖం ఆపుకోలేక ఒక్కసారి గట్టిగా ఏడ్చేశాడు పండు. వాడి ఏడుపు విని వంట పనిలో ఉన్న అమ్మ పరుగున వచ్చింది. "ఎందుకు నాన్నా, ఏడుస్తున్నావ్? అమ్మ నీ ప్రక్కనే ఉన్నదిలే, ఏడవకు. అప్పుడే తెల్లవారింది పండూ, ఇంక లే! లేచి, మొహం కడుక్కొని, స్నానం చేసి, బడికి వెళ్ళాలి కదా, నీ మామిడి మొక్కకి నీళ్ళూ పోయాలి!" అంది. "నా మామిడి మొక్క పెద్దదైపోయింది- పెద్ద మానైందిప్పుడు!" అన్నాడు పండు. "అవునా? అంత తొందరగానా?" అంది అమ్మ ఆశ్చర్యపోతూ.

 

"దానికి ఇంతలేసి కాయలు కూడా వచ్చాయి. ఇప్పుడిప్పుడే మాగుతున్నాయి" అన్నాడు పండు. అమ్మ నవ్వింది- "అంటే నీకో మంచి కల వచ్చిందన్నమాట!" అన్నది పండుని దగ్గరికి తీసుకుంటూ. "నీ చెట్టుకి పండ్లు వచ్చేసరికి నువ్వు నా అంత ఎత్తు అవుతావు. ఆలోగా నువ్వూ, నేనూ, అందరం వాటిని గురించి బాగా ఊహించుకోవచ్చు" అన్నది. "ఒక మంచి మామిడి పండు దొరికిందమ్మా; కానీ అది దొర్లుకుంటూ‌ మల్లెపొదలోకి వెళ్ళిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు!" అన్నాడు పండు ఏడుపు ముఖం పెట్టి. "నువ్వు రోజూ నీళ్ళు పోస్తుంటే, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే అది అట్లాంటి పళ్ళు నిజంగానే చాలా వస్తాయిరా, ఏమీ పర్లేదు" అంది అమ్మ వాడిని సముదాయిస్తూ.

"చెట్టుకు చాలానే పళ్ళు ఉన్నాయి. కానీ అన్నీ‌ మాయమైపోయాయిగా?" అన్నాడు పండు నిజంగానే ఏడుస్తూ. "లేదురా, అవన్నీ ఇంకా నీ మామిడి మొక్క లోపలే ఉన్నై. అది పెద్దయ్యాక కదా, అవన్నీ బయటికి వచ్చేది? అంత వరకూ అవి నీకు ఇట్లా కలల్లో కనిపిస్తుంటాయి. అట్లాంటి కలలు చాలా సార్లు వస్తాయిలే, అదంతా మామూలే!" వివరించింది అమ్మ. పండుకి ఆ ఐడియా నచ్చింది. వాడి పెదాలమీద చిరునవ్వు మొలిచింది. ఆలోగా ఒక పని చెయ్యాలి. మీ టీచరుగారిని అడిగి 'మామిడి చెట్టు ఎప్పుడు పూలు పూస్తుంది, ఎప్పుడు కాయలు కాస్తుంది, మామిడి చెట్లను ఎట్లా పెంచాలి' అన్ని వివరాలూ కనుక్కొని రావాలి. అవన్నీ తెలిస్తే మనకు గుర్తుగా ఉంటుంది కదా" పని పెట్టింది అమ్మ. కార్యశీలి పండు గబగబా లేచాడు- ముఖం కడుక్కునేందుకు.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో


నేనూ, మా అన్న ఉండేవాళ్ళం, మా యింటికల్లా పిల్లలం. మా ఇంటికెవరేనా పిల్లలొస్తే మాకెంతో సంతోషంగా ఉండేది. ఎవరూ లేనప్పుడు, మేం చదవనప్పుడూ మేమిద్దరం ఆడుకునేవాళ్లం....
Mar 2, 2020
పవన్, గణేష్ ఇద్దరూ ఒక రోజున వాళ్ళ ఊరి ప్రక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి, దారి తప్పారు. అడవిలో అంతా తిరిగి అలసిపోయారు. ...
Dec 18, 2019
తీరిన కష్టం
Aug 8, 2019
నన్ను కాపాడిన పిల్లి
Aug 27, 2019
అంతరంగ ఆలోచన..!!
May 10, 2019
అనగనగా నాగసముద్రంలో గంగరాజు అనే నేతగాడు ఒకడు ఉండేవాడు.
Apr 29, 2019
"అయ్యో, ఉడతా, నీ అమాయకత్వానికి నవ్వుతున్నాను! నీ చారలు చూసుకొనే నువ్వు..
May 13, 2019
పాముకి గుణపాఠం చెప్పిన కోడిపెట్ట
Apr 8, 2019
పిల్లలకు ఆకలి ఎక్కువ. టామీ కుక్కపిల్ల చిన్నగా ఉన్నప్పుడు దానికి కూడా చాలా ఆకలి ఉండేది.
Mar 1, 2019
రాజీవ్‌ అనే కుర్రవాడు చక్కగా చదివి, చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతుక్కుంటూ పట్టణం చేరాడు..
Feb 23, 2019
TeluguOne For Your Business
About TeluguOne