Facebook Twitter
ఆశల చెట్టు

ఆశల చెట్టు

 

 

పవన్, గణేష్ ఇద్దరూ ఒక రోజున వాళ్ళ ఊరి ప్రక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి, దారి తప్పారు. అడవిలో అంతా తిరిగి అలసిపోయారు. .

అంతలో వాళ్లకు ఎదురుగుండా ఒక పెద్ద చెట్టు కనబడింది. దాని కాండమే కాదు, పూలు, కాయలు అన్నీ బంగారం రంగులో మెరుస్తున్నాయి.

"ఈ కాయలు కోసుకుందాం. ఆకలి వేస్తున్నది" అన్నాడు గణేష్.

"ఇవి తినేందుకు పనికి రావేమో. ఇక్కడ ఒక్క పిట్ట కూడా లేదు చూసావా?" అన్నాడు పవన్, తనూ చుట్టూ కలయ చూస్తూ. "కొన్ని కోసుకెళ్దాంలే; మా తాతకు తెలీని చెట్టు లేదు. కనీసం ఇది ఏం చెట్టో అయినా తెలుస్తుంది" అంటూనే గబగబా చెట్టు ఎక్కిన గణేష్, చకచకా కొన్ని కాయలు కోసి, పవన్ దగ్గరికి విసిరాడు.

పవన్‌ వాటిలోంచి ఒక కాయను తీసుకొని కొరికి చూసాడు.. కాయ చేదుగా ఉంది. చాలా గబ్బు వాసన కూడా! గణేష్ కూడా దిగివచ్చి, ఆ కాయని నాకి చూసాడు. "ఛీ! అందుకనే వీటిని పిట్టలు కూడా తినట్లేదు" అంటూ తాము ఏరిన కాయలన్నీ పడేసారు ఇద్దరూ.

"ఒక్క కాయని మాత్రం తీసుకెళ్దాం. తాతని అడిగితే ఇది ఏం కాయో చెబుతాడు" అని అని ఒక్క కాయని మటుకు జేబులో వేసుకున్నాడు గణేష్.

ఇద్దరూ దారులు, దిక్కులు చూసుకుంటూ అడవిలోంచి బయట పడి, అతి కష్టం మీద ఊరు చేరుకున్నారు.


గణేష్ వాళ్ల తాత మామూలుగా అయితే ఎప్పుడూ 'శక్తిలేదు' అని ముడుచుకొని పడుకొని ఉండేవాడు. అతను ఇప్పుడు ఆ కాయని చూడగానే లేచి గంతులు వేయటం మొదలు పెట్టాడు!

"ఇవి ఎన్ని తింటే అన్నేళ్ళు ఎక్కువ బ్రతుకుతారట! ఈ బంగారు చెట్టు మీకు ఎక్కడ కనిపించింది? నన్ను అక్కడికి తీసుకపోండి!" అంటూ.

 

 

పిల్లలు బిక్క మొహాలు వేసారు. దారి తప్పటం వల్ల అక్కడికి వెళ్ళగలిగారు గానీ, మళ్ళీ అక్కడికి వెళ్ళే దారి తెలీదు వాళ్ళకు!! "అయినా ఇది ఒట్టి పనికి మాలిన చెట్టు తాతా! వీటి కాయలు ఎంత చేదు, ఎంత గబ్బు! భరించలేం! బంగారం అయితే -నేమి, వెండి అయితేనేమి? ఇది ఒట్టి ఆశల చెట్టు! అంతే" అన్నారు పిల్లలిద్దరూ.

అయినా వాటి మీద ఆశ తోటి అడవి అంతా గాలించాడు తాత. ఎంత వెతికినా ఆ బంగారు చెట్టు కనిపించనే లేదు !