Facebook Twitter
మధుమాసం

మధుమాసం

 

శిశిరమేలువాని
శీతకన్ను వలన,
వికృతత్వం పొందిన
ప్రకృతి శోభ?
మరుల శరుని చూసి 
మధుమాసమైంది.
వనమెల్ల మురిసింది,
వలపుల రతి కన్యలా.
మధుపానమొనరించి
మత్తెక్కిన భ్రమరాలు?
ఝంకారం చేసె,
విరామ పద్ధతిలో.
సహకార వరుడు,
సందడి చేస్తుండు.
వలపు విరిపూతలను,
వధువు కోకిలకివ్వ.
వగరు పులుపును తిన్న,
వయ్యారి కోయిల.
కులుకుతూ పాడింది,
కుహూ, కుహూ స్వరాలు.
మోడువారిన బతుకులు?
చిగురులేశాయి?
మొద్దునుండి ఆకు,
మొలకెత్తి చూసింది.
పల్లవించి తాను,
పయ్యెదను పరచింది.
పగలంత, వనమంత,
వెండి ఎండలు మండు.
రేయంత తనచెంత,
పండు వెన్నెల నిండు.
పచ్చని తృణాలు పుడమిని,
పానుపుగా మార్చాయి.
గట్ల మెత్తలను పెట్టి,
ఘల్లుమని నవ్వాయి.
చిలకమ్మ పెట్టింది,
సరి కొత్తకాపురము,
మామిడితొర్రలో
మసలి ఉందామని.
తలమీద దినకరుడు,
తాడించు కిరణాలు.
వనమంత పవనుడు,
వీచు శీతలాలు.
సౌరభాలు చిలుకు,
సుమ పరిమళాలు.
మది పులకించు,
తీయని హాయితో.
పిల్ల తెమ్మెరలు,
గాలి గంధాన్ని మోస్తూ.
ప్రకృతిలో ప్రతి అణువూ,
పరవశిస్తోంది.
కువకువలు,కళకళలు,
గలగలలు,సరిగమలు.
కాలం గీసిన అద్భుత
ఋతు చిత్రం?
వసంతం


ఇందిరా.వెల్ది,