Facebook Twitter
చందురునికో దస్తావేజు

 

చందురునికో దస్తావేజు

 

 

నిజమొకటి గట్టిగా చెప్పాలని
ఎప్పట్నుంచి అనుకుంటున్నానో
పున్నమి రేయిన
ఆకశాన నువ్వు పడే మిడిసిపాటులో
ఓయ్ చందురుడా అని!

నా కనురెప్పలను
హంసతూలికా తల్పాలని,
శయనిస్తున్న ఆ కొన్ని క్షణాల
లక్షణాన్ని నే అనిర్వచనీయంగా
కలల్ని తాగే రేయిలో..,
మధురాత్మక అనుభూతుల రేవులోని
భావాత్మక నౌకలో
నీ దగ్గరకొచ్చి..

తగ్గి పెరిగే
నీ అందం ఏముందోయ్
నన్ను తనలో పెంచుకోని
తనలోకి నన్ను ఇమడ్చుకునే
ఒక బంధం గురించి,
నీ కంటే తియ్యగా
అంతకంటే కమ్మగా
చిక్కనైన సుధగా
మధుర మనోహరంగా
ఒక చల్లటి 'తన'గా,
నా దగ్గరా ఒక వింత ఉందని!

ఓయ్ చందురుడా
నీ 'పక్ష' పాతి సంద్రానికి కూడా చెప్పు
నా మదిలోని అలలూ
తన తమకాల గమకాలకి
ఉవ్వెత్తున ఎగసిపడతాయని!

ఒక లోకానికి మేమెప్పుడూ
పయనిస్తుంటాం తెలుసా నీకు?
నీ పైన ఒక స్వప్నపు తోటలో
మేం పరుగులిడే
సరసాల వేళల్నిచూసి కదూ
నువ్వలా కుచించుకోని
వ్యాకోచిస్తావ్!

నిజం తెలుసులేవో నెలవంక
ఎవరికీ చెప్పనులే
నీకు తప్ప
నిజం నమ్మవయ్యా
ఇదిగో నా చెలి హృదంటి
తెల్లటి కాగితంపై
నే నీకిస్తున్న హామీ పత్రం
దస్తా పేజీల కవిత్వానికి సమానమైన
మా ఇద్దరి ప్రణయ దస్తావేజు పత్రం!
నీకిస్తున్నాం!!
నిజమొకటి చెప్పాలని
నీకు చెప్తున్నాం!!!

Raghu Alla