Facebook Twitter
అనంతాల అనుభూతి

అనంతాల అనుభూతి

 


అనంతాలలో నువ్వు
అర్దంతెలీని దూరంలో 
నేను ఒంటరిగా....
నన్ను పిచ్చిదంటోంది కాంతం
ఈ లోకం..
నువ్వు చెప్పు నీకు నేను పిచ్చివాడిలా కనిపిస్తున్నాన??
నీ మాటే కదే నాకు వేదవాక్కు
ఊహ తెలిసిన దగ్గరనుండి
నువ్వే కదా నాలోకం
బావ, బావ అంటూ 
నా చుట్టూ తిరిగి అల్లరి పెట్టే
నీ కొంటె చేష్టలు...
గమ్మత్తైన కబుర్లు 
గున్న మామిడి తోటలో
నీతో ఆడిన ఆటలు
తీయని ఊసులు...
ఎన్నాళ్ల బంధమే మనది
నీకంటే ముందు పుట్టినందుకు
వరస కలిసినందుకు 
మన పెద్దవాళ్ళు నిన్ను
మానసికంగా ఎప్పుడో
నా దాన్ని చేసేసారు...
ఏ మాట తప్పావుకదా...
హరిశ్చంద్రుడు చెల్లెలివి మరి..
మరి ఈ మాట ఎందుకు తప్పావు కాంతం...
నా కంటే ముందు వెళ్ళిపోయి 
నన్ను ఒంటరి వాడిని చేసేవు...
నీ విలువ తెలియాలనా...
లేదా ఇది నీ అలక పాన్పులో
ఒక భాగమా??
చెప్పు కాంతం...
క్షణం కూడా మౌనంగా
ఉండలేని నువ్వు...
ఇప్పుడు ఎందుకింత మూగనోము నోచావు...
అవునులే నీకు చిన్నప్పటి నుండి
కొంచం బడాయి ఎక్కువే...
నీ పుల్ల ఐసు నేను తినేసానని
చిన్న మావయ్య ఇంట్లో ఆ రోజు
ఎంత గొడవ చేసేవు...
మళ్ళా నే వెళ్లి
సుబయ్య తాత దగ్గరనుండి వడ్డీతో సహా 
మూడు ఐసులు, నాలుగు బెల్లం
కడ్డీలు ఇస్తే కానీ 
నీ మొహంలో నవ్వు రాలేదు...
పోద్దు నీ బడాయి...
ఈ వయసులో అంత 
మురిపిస్తే ఎలాగే కాంతం...
ఒక్క మారు చూడవే నా వంక...
చుట్టూ ఉన్న వాళ్ళు 
నువ్వు ఇంకో లోకం వెళ్లిపోయవంటున్నారే...
భూమి మీదకి ప్రతివాడు
ఒంటరి గానే వస్తాడు 
కానీ మనిద్దరం 
జంటగానే వచ్చామనే 
భ్రమలోనే ఉన్నా కాంతం...
నీ శరీరం వీడిందేమో 
ఈ మయాలోకం నుండి...
నీ ఉనికి, నీ తలుపు కాదు
అవి ఎప్పుడూ నాతో 
శాశ్వతం గానే ఉన్నాయి కాంతం...
మనిద్దరి శరీరాలు వేరు కానీ
ఆత్మలు ఒకటే.. 
నా మనసు ఎప్పుడు నిత్య
వసంతమే కాంతం 
నీ ఊహల చిగుర్లు 
నా మదిలో
వాడిపోనంత వరకు...
ఈ పిచ్చిలోకానికి ఏమితెలుసు
మన జ్ఞాపకాల పూదోటలో
ఇద్దరం ఎప్పటికి ఒకరికి ఒకరు తోడుగా పయనించే బాటసారులం అని...
"మృత్యువు మనిషిని
చేరిపేయకలదు కానీ మనసుని, దాంట్లో దాచుకున్న 
జ్ఞాపకాలను మాత్రం కానే కాదు"


-రేణుక సుసర్ల