Facebook Twitter
తాఖీదు ( అల్లూరి [గట్టు] నరసింగరావు స్మారక కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ)    

తాఖీదు ( అల్లూరి [గట్టు] నరసింగరావు స్మారక కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ)          

           

“ఊర్లో అందరికీ వస్తున్నాయంట. సామాన్లు సర్దుకోమంటున్నారు.” 
“ఏం వస్తున్నాయి అలమేలు తల్లీ?” స్థంభానికి కట్టిన పలుపు తాడు పేనుతూ అడిగాడు శివయ్య. 
“తాఖీదులు. మనూరు రాజధానికి దగ్గర్లో ఉందంటగా! అన్నన్ని డబ్బులిచ్చి ఇంకో ఊర్లో పొలాలు కొనుక్కోమని పంపేత్తారంట.” రెండు చేతులూ బార్లా చాపి అంది అలివేలు.
చేస్తున్న పనాపి మనవరాలికేసి చూశాడు శివయ్య. కళ్లు పెద్దవి చేసి, ఆశ్చర్యాన్నంతా మొహంలో నింపి చూస్తోంది. గాఢంగా నిట్టూర్చాడు శివయ్య. ఏమీ తెలీని వయసు. కొలనులో చేపపిల్లలా హాయిగా తిరిగి వస్తుంది. 
అలివేలుకి పదేళ్లు. శివయ్య, సామ్రాజ్యాల ఒక్కగా నొక్క కొడుకు కూతురు. కొడుకూ, కోడలూ బస్సాక్సిడెంట్ లో పోయారు. నెలల పిల్లగా అలివేలు నాన్నమ్మ గారింటికి వచ్చింది. మళ్లీ బాధ్యత మొదలయింది శివయ్యకి.
బెజవాడకీ, ఏలూరుకీ మధ్యలో వాజ్ పాయ్ క్వాడ్రాంగిల్ కి దగ్గరగా ఉన్న చిన్న ఊరు శివయ్యది. 
శివయ్యది మూడెకరా వరిపంట. అదీ.. వర్షాధారంతోనే.


“ఎవరు చెప్పారమ్మా?”
“మా హేమ టీచర్.. మనూరు ఖాళీ చేసి వెళ్లిపోవాలంట కదా అందరం. మరి రాములవారి గుడి కూడా తీసుకెళ్లి పోతామా?” అలివేలు సందేహం..
“టీచరుగారినే అడక్క పోయావా ఆ విషయం?” శివయ్య మళ్లీ తాడు పేనడం కొనసాగించాడు.
“అడిగా.. పూజారిగారిని అడగమన్నారు.” నిరుత్సాహంగా అంది అలివేలు.
ఆ వూరు పచ్చని చేలతో, ఊరి మధ్య చెరువుతో, చెరువు చుట్టూ కొబ్బరి చెట్లతో కన్నుల పండువగా ఉంటుంది. 
ఆ ఊరికి తలమానికంగా నిలిచింది గుట్ట మీది రామాలయం.
ముఖ్యంగా అందులో ఉండే ఆంజనేయస్వామి గుడి ముందున్న రావి చెట్టు. తమతమ కష్టాలు తీర్చమని మొక్కుకుని, చిన్నచిన్న మూటల్లో పసుపుబియ్యం కొమ్మలకి కడుతుంటారు. మొక్కు తీర్చుకోడానికి వచ్చినప్పుడు, మొక్కులని బట్టి రెండో మూడో శేర్ల బియ్యంలో ఆ పసుపుబియ్యం కలిపి వండించి అక్కడున్న బిచ్చగాళ్లకి సంతర్పణ చేస్తుంటారు.
గుట్ట కిందే, భక్తులు మొక్కులున్నన్నాళ్లూ ఉండడానికి పెద్ద సత్రం కట్టించారు, అక్కడికి దగ్గరలో ఉన్న పట్టణంలోని వణిక్ ప్రముఖులు.


ఊర్లో సగం వ్యాపారాలు గుడికి వచ్చే పోయే భక్తుల కోసమే నడుస్తుంటాయి. ఊరి వారికి తమకి కావలసిన పంటలు పండించడం, కిరాణా కొట్టు, తప్ప ఇంకేమీ రాదు.
రెండు సినిమాహాళ్లు, నాలుగు పాక హోటళ్లు కూడా ఉన్నాయి. ఒక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, మునిసిపల్ పార్కు.. సదుపాయమైన ఊరు.
తాతయ్య తను చెప్తున్నది పట్టించుకోక పోవడం నచ్చలేదు అలివేలుకి. 
“తాతయ్యా! నిజంగానేనట. ఏం మాట్లాడవేంటీ?”
“ఏం మాట్లాడనమ్మా? నలుగురితో పాటూ మనం..”
ఇంక లాభంలేదని, ఇంట్లోకెళ్లింది. నాన్నమ్మ ఎక్కడా కనిపించలేదు. పెరడంతా వెతికింది. నిమ్మచెట్టు దగ్గర నిల్చుని కాయల కేసి చూస్తూ, లెక్క పెడుతున్నట్లుగా వేళ్లు ముడిచి విప్పుతోంది కాంతమ్మ.
“నాన్నమ్మా! ఏం చేస్తున్నావూ.. మనం ఊరొదిలెళ్లి పోవాల్ట. తెల్సా?”


“నిమ్మకాయల్లెక్కెడతున్నా. వంద కాయలైతే మార్కెట్ కి పంపుదామనీ.. విన్నాలే.. ఇందాకే గుళ్లో చెప్పుకుంటున్నారు.”
“మరి గుడెలాగ? కొండంతా కొట్టేస్తారంటకదా?”
గట్టిగా నిట్టూర్చింది కాంతమ్మ. ఆహారానికెళ్లొచ్చిన పక్షికి, తన పిల్లలతో సహా గూడు, చెట్టుకింద కనిపిస్తే వచ్చే పక్షి కూతలా ఉందది. కాకపోతే, గూడు పోతుందని పక్షికి ముందు తెలీదు. కాంతమ్మకి తెలిసింది.. అంతే తేడా.
అలివేలుకి ఇంకేం చెయ్యలో తోచ లేదు.
గబగబా స్నానం చేసేసి, ఉతికిన బట్టలేసుకుని బైటికి పరుగెత్తింది. దిబ్బరొట్టె వేశాను తినెళ్లవే అని నాన్నమ్మ గోలెడుతున్నా విన కుండా.


ఒక్క హేమా టీచరే తన సందేహాలు తీర్చేది, తీర్చ గలిగేది.

“ఏంటలివేలూ.. అప్పుడే తయారైపోయావా? ఇంకా స్కూలుకి గంట టైముంది. ఏవన్నా తిన్నావా?” హేమ పనులన్నీ ముగించుకుని, జడ వేసుకుంటోంది.
హేమకి, అమాయకంగా ఉండే అలివేలంటే ప్రత్యేమైన అభిమానం. తల్లీతండ్రీ లేని ఆ అమ్మాయికే లోటు రానీకుండా పెంచుతున్న శివయ్య దంపతులంటే ఎంతో గౌరవం. 
అలివేలు మాట్లాడకుండా నిల్చుంది. అబద్ధం ఆడకూడదు కదా!
“నాన్నమ్మ పిలుస్తుంటే వినకుండా పరిగెట్టుకుని వచ్చేశావా? మా ఇంట్లో చల్దన్నవే మరి.. తింటావా?
“టీచర్.. మనం వెళ్లిపోతే రాములవారెలా? కొండ తవ్వేస్తే మరి ఆయనెక్కడికెళ్తారు? మొక్కులు తీర్చుకోడానికి ఇక్కడికొచ్చే వాళ్లంతా ఏమైపోతారూ?” ఆవకాయ కలిపిన చద్దన్నం ముద్దలు తింటూ అడిగింది అలివేలు. దానికి రాములవారి ఉనికే పెద్ద సమస్య ఐపోయింది.


ఊళ్లో జనం అంతా ఎక్కడికెళ్తారూ, ఏం చేస్తారూ.. మళ్లీ ఇళ్లూ అవీ ఎలా కట్టుకుంటారూ.. ఏం తిని బ్రతుకుతారూ.. ఆ వివరాలేం అక్కర్లేదు.
హేమ అదే అడిగింది. 
“మనందరి మాటేంటి? ఎక్కడికనెళ్తాం? ఏం తింటాం?”
“మనం ఫర్లేదు టీచర్. నడవగలం, మాట్లాడగలం. కావలసింది ఎవర్నైనా అడగ్గలం. కానీ రాములోరికి అన్నీ పూజారిగారే చెయ్యాలి కదా? పరిగెట్టి ఎక్కడికీ వెళ్లలేరు కదా! పాపం.. ఆయన మాత్రం.. తన సామాన్లే తీసుకెళ్తారా, రాములోరివే తీసుకెళ్తారా?”

                  
హేమ నవ్వాపుకుంది.
ఎంతటి అమాయకత్వం? అందుకే పిల్లలూ దేముడూ ఒక్కటే అన్నారు కవి. ఇద్దరూ ఎదుటివారి కష్టాలే పట్టించుకుంటారు.
“మరేం చేద్దామంటావూ?”
“అదే ఆలోచిస్తున్నా. ఏదో ఒకటి చెయ్యాలి.” కంచం కడిగి బోర్లించి, చూపుడువేలు గడ్డం కింద పెట్టుకుని పైకి చూస్తూ అంది అలివేలు.
వరదలో గండికడ్డం పడుక్కుని తన ఊరిని కాపాడిన హాలండ్ కుర్రాడు జ్ఞాపకం వచ్చాడు హేమకి.

“తాతయ్యా! మనూరికి బోలెడు కార్లొస్తున్నాయి. సర్పంచి గారు నిన్ను రమ్మన్నారు.”
అలివేలు హడావుడిగా వచ్చింది.
ఆ రోజు ఆదివారం. అలివేలు రోజూ కంటే తొందరగా లేచి తయారయి వీధులన్నీ తిరిగి అందరినీ పలుకరించి వస్తుంది. ఆ పక్క వీధిలో అత్తయ్య గారి దగ్గర సంగీతం, ఈ పక్క వీధిలో పిన్నిగారి దగ్గర పూలదండలు అల్లడం, సరిగ్గా చూపానక కొంచెం ఆలిశ్యంగా నిద్రలేచే ఎదురింటి దొడ్డమ్మగారికి అవీ ఇవీ అందించడం.. చాలా పనులే ఉంటాయి. తీరిగ్గా అప్పుడొచ్చి, నాన్నమ్మకి కబుర్లన్నీ చెప్తూ.. పన్లో సాయం చేస్తూ ఫలారం చేస్తుంది.
మధ్యాన్నించి హేమ టీచర్ ఇంటికెళ్లి, హోవర్కు.. చదువు, కథలు కబుర్లు కానిస్తుంది.


“ఎందుకో తెలుసా తల్లీ?”
“నువ్వస్సలు పట్టించుకోవట్లేదు తాతయ్యా! ఎన్ని సార్లు చెప్పాను? ఊరంతా గగ్గోలెట్టేస్తున్నారు. మనం ఊరొదిలెళ్లిపోవాలంట. నువ్వేమో తాపీగా తాళ్లు పేనుకుంటూ, చుట్టలు కాల్చుకుంటూ కూర్చుంటావు. అక్కడేమో కొంపలు మునిగి పోతున్నాయి.”
నిర్లిప్తంగా బట్టలు మార్చుకుని బైటికి నడిచాడు శివయ్య. గగ్గోలు పడి చెయ్యగలిగిందేముంది? రాజుగారు తలచుకుంటే దెబ్బలకి కొదవా?
శివయ్య, అలివేలు వెళ్లేసరికే పెద్దలంతా పంచాయితీ ఆఫీసు దగ్గరున్నారు. సర్పంచ్ కొలువు తీరినట్లుగా కూర్చున్నాడు. తెల్లని పైజామా లాల్చీలతో నలభై ఏళ్ల లోపు వాళ్లు నలుగురు, సూటేసుకున్న యాభై ఏళ్ల వాళ్లిద్దరు.. కొత్త కుర్చీల్లో కూర్చున్నారు. ఎర్ర కుషనున్న కుర్చీలు అరడజను తెప్పించాడు సర్పంచ్.. పంచాయితీ బడ్జెట్ లోంచి. 
ఒక లాల్చీకి కనుబొమ్మల మధ్య బొట్టు, ఇంకొకరికి నుదుట విభూతి, మరొకాయనకి టోపీ గడ్డం, నాలుగో పెద్ద మనిషికి సింధూర నామం ఉన్నాయి. సూట్ల వాళ్లిద్దరూ, ఎండకి, చెమటకి టైలు, కోట్లు అసహనంగా సర్దుకుంటున్నారు.


ఊర్లో కాస్త ఆస్థి, పేరు ఉన్న వాళ్లంతా వచ్చారు. ఆరెంపీ డాక్టరు, స్కూలు హెడ్ మాస్టరూ కూడా.. వాళ్లకేం పొలాల్లేక పోయినా కూడా వచ్చారు. వచ్చిన కొద్దిమంది ఆడవాళ్లలో హేమ టీచర్ కూడా ఉంది.
ఎవరో లేచి, శివయ్యకి ముందు వరుసలో చోటిచ్చారు.. విరిగి పోవడానికి సిద్ధంగా ఉన్న పాత ఇనప కుర్చీలో.
అలివేలు హేమ టీచర్ పక్కన కూర్చుంది.. చాప మీద.
బొట్టున్న లాల్చీ పెద్దమనిషి, పంచాయితీ రిజిస్టర్లో సంతకం చేస్తూ చూశాడు..
“మీరు కాదా సర్పంచ్?” ఆశ్చర్యంగా అడిగాడు. 
సర్పంచ్ వెంకటరెడ్డి కనుబొమ్మలెగరేసి నవ్వాడు.


“ఇది ఆడోళ్ల కోటా.. మా ఇంటిదాన్ని నిలబెట్టా. అందుకని రికార్డుల్లో ఆమె పేరే ఉంటాది. ఈ సంగతి అందరికీ తెల్సు. ఆవైతేనేంది నేనైతే నేంది..”
మిగిలిన లాల్చీలవాళ్లు కూడా నవ్వారు. సూట్ల పెద్దమనుషులకి నచ్చినట్లు లేదు. పైకేం అనలేక, కంఠనాళాలు బిగించారు.
“మరామెగారిని పిలిచారా?” విబూథి లాల్చీ..
“వస్తాది లెండి. సంతకాలెట్టాలిగా.. ఆ టయానికి. మీరంతా రిజిస్ట్రీలో సైన్లు చెయ్యండి. త్వరగా మీటింగైపోతే.. భోయనానికెళ్దాం. మాంచి రొయ్యల కూర చేయించా, భీంవరం నుంచి తెప్పించి.” వెంకటరెడ్డి హడావుడి పెట్టాడు.
సంభాషణంతా వింటున్న శివయ్య నిర్వికారంగా చూశాడు. అతనికి రాజకీయాల మీద ఆసక్తి లేదు. చేతికందొచ్చిన కొడుకు పోయినప్పట్నుంచీ, ఏరోజుకారోజు బిగపెట్టుకుని బ్రతుకుతున్నాడు. ఎవరి చేతిలో ఏముంది.. పైవాడు ఆడించినట్టు ఆడడమేగా!
సంతకాలయ్యాక సూటాయన లేచాడు.. అరగంట పైగా ఇంగ్లీషులో మాట్లాడాడు. అమెరికాలో చదుకునొచ్చాడు మరి. కొత్త రాజధాని ఆవశ్యకత, దాని నిర్మాణం కోసం తామందరూ పడుతున్న అవస్థలు.. కంటున్న కలలు. అవన్నీ తీర్చడానికి ప్రజలు చెయ్య వలసిన త్యాగాలు. దేశ స్వాతంత్ర్యం రావడానికి ఎందరో మహానుభావులు కష్ట పడినట్లు, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కష్టపడాలని చివరి మాటగా చెప్పి కూర్చున్నాడు.


అందరూ శూన్యంలోకి చూస్తూ, మొహాలు అభావంగా పెట్టి విన్నారు. ఎవరికీ ఏమీ అర్ధం కాలేదు. 
“సర్పంచ్ గారూ ఆరెవురండీ? ఒక్క ముక్కర్ధమైతే ఒట్టండి.”
తెలుగు పల్లెకొచ్చి ఇంగ్లీషులో మాట్టాడితే ఎలా?
అప్పుడు సింధూరం బొట్టాయన వివరించాడు తెలుగులో. 
ఏతావాతా తేలిందేమిటంటే.. కొత్త రాజధానికి వాళ్లూరు ఆనుకుని ఉంటుంది. అంచేత ఇక్కడంతా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లొస్తాయి. ఊరివారంతా పొలాలూ, ఇళ్లూ ఖాళీ చెయ్యాలి.  కొండకి అవతలి పక్క అందరికీ స్థలాలిస్తారు. అప్పుడు కొండ ఉండదు. అంతా చదును నేలే. అంచాత పెద్ద తేడా ఉండదు. ఇళ్లు కూడా కట్టిస్తారు తొందరలో. పొలాల బదులుగా, రాబోయే కాంప్లెక్స్ లో వాటికి రెట్టింపు ఖరీదైన షాపులిస్తారు. ఆ షాపుల్లో ఇష్టమైన వ్యాపారం చేసుకోవచ్చును. లేదా అద్దెకిచ్చుకోవచ్చు.


అక్కడున్న రైతులందరి మొహాల్లోనూ గాభరా.. తరతరాలుగా ఈ భూముల్ని నమ్ముకుని, తాతలిచ్చిన కొంపల్లో పడుంటున్నారు. చదువులూ లేవు.. వ్యాపారాలు చేసే తెలివీ లేదు. కొండవతల ఇళ్లు కట్టిస్తే.. కట్టించే వరకూ ఎక్కడుండాలి? అదంతా బీడు భూమి. నిలువెత్తు తీసి, నల్లమట్టి నింపుతే కానీ పెరట్లో ఏ కూరా పండదు. అక్కడంతా ఖాళీగా కనిపిస్తోందని వాడుకోవచ్చనుకుంటున్నారు. కానీ ఎందుకూ పనికి రాదని తెలీదు కావాలు.. ఇళ్లు కట్టడానిక్కూడా అంతా లూజు నేల. ఇరవై అడుగులెళ్లాలి పునాదులకి.


“తప్పదాండీ?” ఒక బక్కరైతు లేచి అడిగాడు.
ఒక సూటాయన, కోటుతీసి వెనక్కి తగిలించి, తల అడ్డంగా తిప్పాడు. భాష రాదాయె మరి.
“ఎప్పట్లోగా కాళీ చెయ్యాలండీ?” ఇంకొక రైతు..
“ఆరునెలలు టైముంది. ఈలోగా మీరు ఇళ్లు వెతుక్కోవచ్చు.”
“మరి భోయనానికండీ? పనెక్కడ దొరుకుద్దండీ?” ఒక యువకుడు లేచాడు. చాలా మంది యువత హైడ్రాబాడ్, బెంగుళూరు లాంటి సిటీలకెళ్లే పోయారు. ఉన్నవాళ్లు కొద్దిమంది, చదువు కోలేనివాళ్లే. తమకున్న కొద్దపాటి పొలాల్లో..  వ్యవసాయం చేసుకుంటున్నారు.
“ఎందుకు దొరకదు? కావలసినంత పని. భవనాలు కడతారు, రోడ్లు వేస్తారు.. కొత్త ఆఫీసులు పెట్తారు. మీరు ఏపని చెయ్యగలుగుతే ఆ పనే చెయ్యచ్చు.” సర్పంచ్ హామీ ఇచ్చాడు.
“మాకు వ్యవసాయం తప్ప ఏదీ రాదండీ. మా స్వంత పనులు తప్ప కూలికెప్పుడూ ఎళ్లలేదండీ.” ఒక యువకుడు లేచాడు.
“ఇప్పుడెళ్లండి. నామోషీ ఏటీ లేదు. పొట్టగడవాలంతే..” సర్పంచి కేకలేశాడు.


“మరి కొండ మీద రాములోరో?” అలివేలు లేచి అడిగింది.
తెలుగు సరిగ్గారాని సూట్లవాలాలతో సహా అందరూ నవ్వారు. 
“రాములోరికి మీ స్థలాలవతల పెద్ద గుడి కట్టిస్తారు. అక్కడికి మారుస్తారాయన్ని. ఐనా రాములోరెక్కడ లేరు?”
“అలా ఎలా? ఆయన ద్వాపరయుగం నుంచీ అక్కడుంటున్నారు. స్వయంగా అర్జనుడు ప్రతిష్ఠించాడుట. మారుస్తే రాములోరిదీ, ఆంజనేయస్వామిదీ మహత్యం తగ్గిపోదూ?” అలివేలు గట్టిగా అడిగింది.
అక్కడున్న అంత మంది పెద్దవారికి లేని ధైర్యం ఆ పిల్లకి ఉన్నందుకు, వచ్చిన లాల్చీవాలాలు కూడా మెచ్చుకోలుగా చూశారు. సూటు పెద్దలకి మాత్రం కోపం వచ్చింది.


“టెంపుల్.. వేరే ఖడ్తామంఠున్నారు ఖదా? ఐనా ఈ బేబీనా అడిగేది.. అడుగుతే మనం రెస్పాన్స్ ఇవ్వాలా?”
“బేబీ కాదు.. మేం అడుగుతున్నాం. చెప్పండి?” ఒక యువకుడు లేచాడు.
“అదికాదన్నా! రోడ్డు మధ్యలో ఉన్న వేరే మతం వాళ్ల టెంపుల్ తీస్తుంటే, వాళ్లంతా కోర్టుకెళ్లారుట. అప్పుడు.. ఆ జోలికెళ్లకుండా అలా మధ్యలోనే వదిలేశారు కూడా. మన రాముడెక్కడో దూరంగా గుట్ట మీదుంటే, గుట్టతో సహా లేపేస్తార్ట. ఇదేం బావుంది?” అలివేలు మాటలకి తెల్ల బోయి చూశారందరూ.


“ఈ పిల్లని రెచ్చగొట్టి మా మీదికి వదిలేస్తారా? దీన్నేం చెయ్యలేమనే కదా మీ ధీమా?” సర్పంచ్ మొగుడు రెచ్చి పోయాడు.
“మేం ఒప్పుకోవండీ. రాములోరి సంగతీ, మా ఇళ్ల సంగతీ తేల్చండి ముందు. ఆర్నెల్లలో చిన్నో చితకో ఇళ్లు కట్టియ్యండి. అప్పుడు కాళీ చేత్తాం. అ ఇళ్లిచ్చి, మీరు ప్రామిస్ చేసినట్లు, కాంప్లెక్స్ లో షాపులు కూడా..” యువకులంతా లేచెళ్లి పోయారు. హేమ టీచర్ మాత్రం కూర్చుంది, అలివేలు చెయ్యి పట్టుకుని.
లాల్చీల వాళ్లలోఇద్దరు యమ్మెల్యేలు. ఇద్దరు పార్టీ కార్యకర్తలు. ప్రభుత్వం తరఫున వచ్చామని చెప్తూ, ఆ ఊరిని ఖాళీ చేయించి, తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచుకోవాలని ఆశిస్తున్న వాళ్లు. సూటు వాలాలు, కాంట్రాక్టర్లు. ప్రభుత్వ సేకరణ అక్కడి వరకూ వచ్చిందో లేదో.. అనుమానమే.
“ఏవంటారండీ హెచ్చెమ్ గారూ, టీచర్ గారూ, డాట్రుగారూ?” సర్పంచ్ కాని సర్పంచ్ అడిగాడు.
“మేవనేదేవుంది? మాకేవన్నా పొలాలా మీకివ్వడానికి?” హెచ్చెమ్ అన్నాడు.


“అంటే.. మీరు చెప్తే తొందరగా పనై పోతుంది గదాని..”
అలివేలు హేమ చెవిలో ఏదో చెప్పింది.
“ఈ గడుగ్గాయేదో అంటాంది?” విభూది లాల్చీ అడిగాడు.
“గవర్న్ మెంటార్డర్ చూడ మంటోంది” హేమ చెప్పింది…

ఆరునెలల తరువాత..
చిన్నవే ఐనా తీరుగా కట్టిన ఇళ్లు. అలివేలు పరికిణీ కుచ్చిళ్లు పైకి లేపి పట్టుకుని, వీధిలో ముగ్గులు చెరిగి పోకుండా నడుస్తూ ఇంటింటికీ వెళ్లి అందరినీ పలుకరిస్తోంది.
“అందరం ఆంజనేయ స్వామికి ముడుపు కట్టాం కదా.. మరి మన జట్టుండడేంటీ..”
గుట్టకవతలివైపు ఆవాసాలు ఇస్తేనే కదులుతామని పట్టుపట్టారు రామాపురం ప్రజలు. మట్టి ఆరడుగులు తీయించి మంచి మట్టి కూడా వేయించాలని, గుట్టమీద గుడి జోలికి కూడా వెళ్ల కూడదనీ.. వెళ్తే కోర్ట్ కెళ్తామనీ చెప్పారు యువకులందరూ కలిసి.


వాళ్ల కోరికలన్నీ తీరుస్తే, రాబోయే లాభాల్లో.. ఒక పది శాతం మాత్రమే తగ్గుతుందని
మేధావులు సర్ది చెప్పారు, అవతలి వారికి.. పైగా ఇప్పుడు మీడియా ప్రభావం చాలా ఎక్కువ.. ఎందుకొచ్చిన గొడవ, సర్దుకోమని సలహా ఇచ్చారు.
బడా బాబులు దిగిరాక తప్పలేదు. ఇంతకీ ఆ గ్రామం, ప్రభుత్వం సేకరించే గ్రామాలలో లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులతో కలిసి.. హైవేకి దగ్గర్లో ఉందని, విమానాశ్రయానికి పావుగంట ప్రయాణం అనీ, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి.. మల్టిప్లెక్సులూ, గేటెడ్ కమ్యూనిటీలూ, సాఫ్ట్ వేర్ హబ్బులూ వగైరాలు కట్టేద్దామని.. అయిన కాడికి అక్కడి భూములు కొట్టేద్దామనీ ప్రణాలిక వేశారు.


పొలాలు పోయినా ఏదో పని చేసుకు బతకచ్చు కానీ, ఉండడానికిల్లు లేకపోతే.. చెట్టుకింద ఉండ లేరు కదా! అలివేలు రాములోరి ఇల్లు గురించి లేవనెత్తిన సందేహం, ఊరందరికీ ఉపకారం చేసింది.
“అలివేలూ! ఒకసారి కమ్యూనిటీ హాల్ కి రమ్మన్నారు, మహిళా మండలి వాళ్లు.” పక్కింటి రాము సైకిలు మీదొచ్చి చెప్పి తుర్రుమన్నాడు. పదంగల్లో చేరుకుందక్కడికి. కాలనీ కట్టేప్పుడే, వంద మంది పట్టే కమ్యూనిటీ హాల్ కూడా కట్టించేట్లు చెయ్య మన్నారు సర్పంచ్ ని గ్రామ యువత.


“ఇదే నండీ.. మా రాములోరి ప్రతినిధి. ఈవిడ గారి మూలానే మాకీ కాలనీ వచ్చింది.” హాల్లో ఉన్న కొత్తవాళ్లకి అలివేలుని పరిచయం చేశారు, హేమ టీచర్.
అలివేలు అందరికీ నమస్కారం పెట్టి, ఎవరన్నట్లు చూసింది టీచర్ గారికేసి.
“ఎయిర్ పోర్ట్ కి అటేపుండే ఊరి వాళ్లు. వాళ్ల ఊరి మీద కూడా కన్నేశార్ట. మందగ్గరికి సలహా కొచ్చారు.” హేమ టీచర్ చెప్తుంటే, చిరునవ్వు నవ్వింది అలివేలు, సిగ్గు పడుతూ.
                               
 

-మంథా భానుమతి.