Facebook Twitter
లేడికూన-మొసళ్ళు

లేడికూన-మొసళ్ళు

 


ఒకరోజున, నీళ్ళు తాగుదామని నది దగ్గరికి పోయింది, లేడికూన. దగ్గర్లోనే ఎక్కడో మొసలి దాక్కుని ఉందని దానికి అనుమానం వచ్చింది. మరి నిజంగానే నీళ్ళలో మొసలి ఉందో, లేదో- ఎట్లా, తెలిసేది? చటుక్కున లేడికూనకి ఒక ఉపాయం తట్టింది. అది పెద్దగా అన్నది- "చల్లటి నీళ్ళు తాగుదామని ఉంది- ఈ నీళ్ళు చల్లగా ఉన్నాయో లేదో?! కాలు పెట్టి చూస్తే పోలా?" అని. నిజంగానే అక్కడ నీళ్ళలో ఒక వెర్రి మొసలి దాక్కుని ఉంది. దానికి చాలా సంతోషం వేసింది. "ఆహా! ఇవ్వాళ లేడి కూర నాకు!" అని దాని నోట్లో చాలా నీళ్ళు ఊరాయి. అయితే లేడికూన ఏం చేసిందనుకున్నారు? కాలు పెట్టలేదు, నీళ్ళలో! ఒక కర్రపుల్లను తీసి, నీళ్ళలో ముంచింది, బుడుంగున. తయారుగా ఉన్న మొసలి వెంటనే ఒక్క దూకు దూకింది.

 

ఆ పుల్లను దొరకబుచ్చుకుని, నీళ్ళలోకి లాక్కున్నది. లేడికూన పెద్దగా నవ్వింది. వేరేచోటికి పోయి చక్కగా నీళ్ళు తాగింది. ఇంకో రోజున లేడికూన మళ్ళీ నీళ్ళు తాగడానికి పోయింది. చూస్తే నదిలో ఒక కర్ర దుంగ తేలుతూ ఉంది. అయితే నీళ్ళలో తేలే మొసలి కూడా దుంగలాగే ఉంటుంది! మరి అది మొసలా, కర్ర దుంగా? ఎలా, తెలిసేది? చటుక్కున లేడికూనకి ఒక ఉపాయం తట్టింది. అది పెద్దగా అరిచింది. "ఇది నా నేస్తం కర్ర దుంగ అనుకుంటాను. కర్ర దుంగ అయితే తప్పకుండా నాతో మాట్లాడుతుంది. అదే ఆ పాడు మొసలి అయితే అస్సలు మాట్లాడదు" అని. వెంటనే నీళ్ళలోంచి ఒక పెద్ద గొంతు వినిపించింది- "మిత్రమా! నేను నిజంగా కర్రదుంగనే" అని! లేడికూన నవ్వింది. "పిచ్చి మొసలీ! కర్ర దుంగలు ఎక్కడయినా మాట్లాడతాయా?" అని, పరుగెత్తి పారిపోయింది. 


ఒకరోజు లేడికూన తన నేస్తం ఏనుగుతో కలిసి నది అవతలివైపుకు పోయింది. అక్కడ చాలా పండ్లు, దుంపలు తిన్నది. కడుపు నిండగానే దానికి ఇంటికి పోవాలనిపించింది. చూస్తే ఏనుగు ఇంకా తింటూనే ఉంది. సరేనని లేడికూన ఒక్కతే బయలుదేరింది. నదిదాకా వెళ్ళి చూస్తే మొసలీ, దాని నేస్తాలూ నీళ్ళలో తయారుగా ఉన్నాయి. ఏనుగు కూడా తోడు లేదాయె. నది దాటేది ఎట్లా? కొంచెంసేపు ఆలోచిస్తే దానికి ఒక ఉపాయం తోచింది. అది నది దగ్గరికి పోయి, "మొసలీ!" అని పిలిచింది. మొసలి పెద్దగా నోరు తెరిచి "ఆహా లేడికూనా! ఇవ్వాళ నిన్ను తినేస్తాను" అన్నది.


"ఇవ్వాళ కాదు మొసలీ! రాజుగారు నన్ను నదిలో ఎన్ని మొసళ్ళు ఉన్నాయో లెక్క పెట్టుకు రమ్మన్నారు. లెక్క ప్రకారం మీకు సరిపోయినన్ని లేడికూనల్ని పంపిస్తారట. అప్పుడు కడుపునిండా తిందురు" అన్నది. మొసళ్ళన్నీ మహా సంతోషపడిపోయాయి. సరే ఎలా లెక్కపెడతావో చెప్పమన్నాయి.  "ఏముంది, మీరు నది ఈ చివర నుంచి ఆ చివర దాకా వరసా..గా నిలబడండి" అంది లేడికూన. "సరిగ్గా నిలబడకపోతే అన్ని మొసళ్ళూ లెక్కకి రావు! అప్పుడు రాజుగారు ఇచ్చే లేడికూనలు మీకే సరిపోవు. నాకేం?!" అని తొందర పెట్టింది కూడా. 


మొసళ్ళన్నీ గబగబా వరస కట్టాయి. లేడికూన మొదటి మొసలి మీదికి దూకింది - "ఒకటి" అని అరిచింది. తరవాత ఇంకో మొసలి మీదికి దూకి, "రెండు" అన్నది. అట్లా దూకుతూ దూకుతూ ఆ పక్కకి చేరి, గట్టు మీదికి దూకేసింది. "మొత్తం ఎన్ని మొసళ్ళం ఉన్నాం? ఎన్ని లేడికూనల్ని పంపిస్తారు, రాజుగారు?" అడిగాయి మొసళ్ళు, ఆత్రంగా. "సరిగ్గా నదిని దాటేందుకు కావలిసినన్ని మొసళ్ళు. అన్నీ శుద్ధ మొద్దులు" అని నవ్వుకుంటూ పోయింది లేడికూన.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో