Facebook Twitter
మహాకాలుని గాథ

మహాకాలుని గాథ

 


బుద్ధుడు జీవించి ఉన్న కాలంలో సేతవ్యం అనే పట్టణం ఒకటి ఉండేది. చూలకాలుడు, మహాకాలుడు అనే ఇద్దరు సోదరులు ఆ పట్టణ పరిసరాలలో వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు.

ఒకనాడు వాళ్లిద్దరూ సరుకులు తీసుకొని వస్తూ ఉండగా దారిలో ఒక గ్రామంలో చాలా మంది ఒకచోట గుమిగూడి ఉండటం కనిపించింది. సోదరులు ఇద్దరూ ఉత్సుకత కొద్దీ అక్కడికి వెళ్లి చూసారు. ఆ సమయంలో బుద్ధుడు అక్కడ ప్రవచనం ఇస్తున్నాడు: “ఈ శరీరం, ఇంద్రియాలు, మనస్సు- అన్నీ క్షణికాలే! అన్నీ నశించేవే! భావనలు అన్నీ అనిత్యాలే!!” అని తార్కికంగా, అందరికీ అర్థమయ్యేట్లు వివరిస్తున్నాడు బుద్ధుడు. ఆ ప్రవచనం మహాకాళుడిని లోతుగా కదిలించింది.


ప్రవచనం పూర్తయ్యేసరికి మహాకాలుడు బుద్ధుడిని చేరుకొని, తనను కూడా శిష్యునిగా స్వీకరించమని వేడుకున్నాడు. చూలకాలుడు అతనిని వారించేందుకు చాలా ప్రయత్నించాడు. 'లాభదాయకమైన వ్యాపారాన్ని వదులుకోవడం ఎందుకు?' అని అనేక విధాలుగా చెప్పి చూసాడు. అయినా మహాకాలుడు తన పట్టు వీడలేదు. సన్యాస దీక్ష తీసుకోనే తీసుకున్నాడు.

 

చూలకాలుడు కొద్ది సేపు ఆలోచించాడు. 'ఇతన్ని వెనక్కి తీసుకుపోవాలంటే మార్గం ఏంటి?' అని. ఆ వెంటనే అతను కూడా బుద్ధున్ని సమీపించి సన్యాస దీక్ష తీసేసుకున్నాడు. 'ఏదో ఒక సమయంలో తను మహాకాలుడిని కూడా ఒప్పించి అతనితో బాటూ సన్యాసాశ్రమం నుండి వెనక్కి మరలిపోవచ్చు' అని ఆశించాడు చూలకాలుడు.

అటు మహాకాలుడు బుద్ధుడు చూపిన మార్గంలో చాలా వేగంగా ముందుకుపోయాడు. తాను తీవ్రంగా కృషి చేస్తూ, తనలోని ప్రజ్ఞను మేల్కొలుపుకొని, 'అరిహంతుడు' అయ్యాడు. చూలకాలుడు మాత్రం అతనిని వెనక్కి లాగేందుకు కొనసాగిస్తూనే ఉన్నాడు.

కొన్నాళ్లకు బుద్ధుడు తనతోటి భిక్షవులతో సహా సేతవ్యం చేరుకున్నాడు. నగరం బయట ఉన్న శింశుపా వనంలో వాళ్లందరికీ బస ఏర్పాటు చేయబడింది. నగరంలోని ప్రముఖులంతా ఒకరొకరుగా బుద్ధుడిని, భిక్షువులను తమ ఇళ్లలో భిక్షకు ఆహ్వానిస్తూ వచ్చారు. చూలకాలుడు వదిలేసిన కుటుంబ సభ్యులు కూడా ఒకనాడు ఆయన్ని శిష్యులతో సహా తమ ఇంటికి భిక్షకు రమ్మని ఆహ్వానించారు!

ఆ రోజు ఇంకా తెల్లవారకనే చూలకాలుడు ముందుగా బయలుదేరి ఇంటికిపోయాడు. భోజనానికి ఏర్పాట్లు పర్యవేక్షించటం మొదలుపెట్టాడు. కుటుంబ సభ్యులకు దగ్గరగా మెలిగాడు. వారి కష్ట సుఖాలు అన్నీ తనవిగా స్వీకరించాడు. ఆ రోజు సాయంత్రం భోజనాలు ముగిసేసరికి చూలకాలుడు సన్యాసాన్ని వదిలి యథా ప్రకారం గృహస్తు వేసుకునే బట్టలు ధరించేసాడు! బుద్ధుడు మిగిలిన శిష్యులతో పాటు శింశుపా వనం చేరుకున్నాడు. తరువాతి రోజున మహాకాలుడి భార్యలు కూడా బుద్ధుడిని శిష్య సహితంగా తమ ఇంటికి భిక్షకు రమ్మని ప్రార్థించారు. 'చూలకాలుడి భార్యల మాదిరే తాము కూడా మహాకాలుడిని వెనక్కి లాక్కోవచ్చు' అని ఆశించారు వాళ్లు. బుద్ధుడు 'సరే'నని శిష్య సమేతంగా వాళ్ల ఇంటికీ వెళ్ళాడు.

భోజనాలు అయిన తర్వాత 'కొద్ది సేపు మహాకాలుడిని మాతో వదిలి వెళ్లండి. మాతోపాటు 'అనుమోదన' చేసేంతవరకు అతన్ని ఉండనివ్వండి' అని మహాకాలుడి భార్యలు బుద్ధుడిని ప్రార్థించారు. బుద్ధుడు ఏమాత్రం సంకోచించక, సరేనన్నాడు. మిగిలిన శిష్యులతోపాటు శింశుపావనం బయలు దేరాడు. పట్టణ పొలిమేరలు దాటుతుండగానే భిక్షువర్గంలో కలవరం మొదలైంది.

 

అనేక మంది భిక్షువులు బుద్ధుని నిర్ణయం పట్ల అసంతృప్తిని, భయాన్ని వ్యక్తం చేసారు. తన సోదరుడు చూలకారుడి లాగే మహాకాలుడు కూడా భార్యలకు లోబడతాడని, భిక్షు సంఘాన్ని వదిలి వేస్తాడనీ వాళ్లంతా అభిప్రాయపడ్డారు. వారిలో కొందరు బుద్ధునితో తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేసారు కూడా. 

బుద్ధుడు నవ్వి ఇట్లా చెప్పాడు:- "చూలకాలుడు ఇంద్రియములకు లోబడే రకం- బద్ధకస్తుడు; బలహీనుడు; లోపలినుండి కుళ్లిపోయిన చెట్టులాంటి వాడు. కానీ మహాకాలుడు శ్రద్ధ, స్థైర్యం, శక్తి విశ్వాసాలు ఉన్నవాడు- పర్వతంలాగా ఏమాత్రం చలించని హృదయం అతనిది.

 

సుభానుపస్సిం విహరంతం ఇంద్రియేసు అసంవుతం 
భోజనం హి చామత్తన్నుం కు సీతం హీన వీరియం 
తం వే పసహతి మారో, వాతో రుక్ఖం వ దుబ్బలం 

అసుభానుపస్సిం విహరంతం, ఇంద్రియేసు సుసంవుతం 
భోజనం హి చ మత్తన్నుం సద్భం ఆరధ్గవీరియం 
తం వే నప్పసహతి మారో, వాతో సేలం వ పబ్బతం 

"ఎవరైతే తమ మనసుని కేవలం సుఖాన్నిచ్చే వస్తువుల మీద ఉంచుతారో, ఎవరైతే తమ ఇంద్రియాలని వశంలో ఉంచుకోరో, ఎవరైతే ఆహారాన్ని అమితంగా భుజిస్తూ బద్ధకంగా, శక్తి హీనంగా ఉంటారో- అటువంటి వాళ్లు బలహీనమైన వృక్షం గాలికి కూకటి వేళ్లతో పెకలించి వేయబడినట్లు, తప్పక మారునికి లోబడతారు" 

 

"అలా కాక, ఎవరైతే మనస్సును తనలోని కల్మషాలపై నిలుపుతారో, ఎవరైతే ఇంద్రియాలను తమ ఆధీనంలో ఉంచుకుంటారో, శ్రద్ధ శక్తులు ఎవరిలో అయితే దండిగా ఉంటాయో- అటు వంటి వారు గండ శిలలలో కూడిన పర్వతం గాలికి చలించనట్లు నిశ్చలంగా ఉంటారు; మారునికి ఏమాత్రం లోబడరు” అని వివరించాడు బుద్ధుడు.

ఆలోగా మహాకాలుడి కుటుంబ సభ్యులంతా అతన్ని చుట్టుముట్టి, బలవంతంగా గృహస్తు ధరించే వస్త్రాలను ధరింపజేసేందుకు ప్రయత్నించారు. కానీ అరహంతుడైన 'మహాకాల ధేరుడు' వారి ఉద్ద్యేశాన్ని గ్రహించాడు; అద్భుతమైన ధ్యాన శక్తితో తక్షణమే అక్కడి నుండి మాయమై వచ్చి, బుద్ధుని పాదాలపై వ్రాలాడు. అతని శ్రద్ధా శక్తులను గ్రహించి, అంతకు ముందు బుద్ధుని నిర్ణయాన్ని తప్పుపట్టిన భిక్షువులంతా కూడా 'ధమ్మ శ్రోతస్సు'లో టక్కున నెలకొన్నారు!


కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో