Facebook Twitter
ఏడు సంవత్సరాల కరువు

ఏడు సంవత్సరాల కరువు

 

చేత్ సింగ్ ఒక రైతు. అతను పెద్దగా చదువుకోలేదుగానీ, వ్యవసాయంలో మెళకువలన్నీ చేత్ సింగ్ కు బాగా తెలుసు' అని ఊళ్లో పేరుండేది. ముఖ్యంగా,శ్రమించడం' అంటే మాత్రం చేత్ సింగ్ వెనకడుగు వేసేవాడు కాదు. "భగవంతుడి కృప వల్లనే మొక్కలు పెరుగుతాయి" అని అతనికి ప్రగాఢమైన విశ్వాసం ఉండేది. "ప్రకృతిని గమనించుకుంటూ, ఏ సమయంలో ఏం చేయాలో అవి చేస్తూండటమే మనిషి బాధ్యత" అని అతను నమ్మేవాడు. అందువల్ల అతను ప్రకృతికి తల ఒగ్గి వర్తించేవాడు; తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ పోయేవాడు. చేత్ సింగ్ పెద్ద ధనికుడేమీ కాదు - కానీ అతని కుటుంబ అవసరాలన్నీ ఎప్పటికప్పుడు తీరేంత సంపాదననిచ్చేది, అతని వ్యవసాయం.

ఒక సంవత్సరం, సమయానికి వానలు పడలేదు. తేమలేక, వేసిన పంటలన్నీ వాడిపోయాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ఆ సమయంలో చేత్ సింగ్ శ్రమించి, చేతనైనంత పంటను సేకరించుకొని, ఖర్చులు తగ్గించుకొని, ఆ సంవత్సరాన్ని పొదుపుగా గడిపేందుకు సిద్ధపడ్డాడు. నెలలు గడుస్తున్నకొద్దీ రైతులందరి పరిస్థితీ మరింత విషమించింది. కారణం, ఒక్క వాన చినుకుకూడా లేదు! గాలి అంతా పొడిగా ఉంది.. ఆకాశంలో మబ్బుతునక లేదు!

ఎక్కడెక్కడి జనాలూ జ్యోతిష్కుల్నీ, దైవజ్ఞుల్నీ సంప్రతించకుండా ఉండలేకపోయారు. జ్యోతిష్కులు అందరూ లెక్కలు వేసి, పెదిమ విరిచారు ఆ ఏడాదే కాదు, ఇక రాబోయే ఆరేడు సంవత్సరాలలోనూ వానలు పడే అవకాశం లేదన్నారు. దైవజ్ఞులు వివిధ రకాల దేవతల్ని సంప్రతించి, "మానవుల్లో పరస్పర ద్వేషమూ, హింసా, ప్రకృతి ధిక్కారం పెచ్చుమీరాయి. తమ పద్ధతుల్ని మార్చుకొమ్మని ఎందరు దేవతలు- ఎన్ని రకాలుగా- తెలిపినా, మనుషులు తమ శైలిని మార్చుకోలేదు. ఇప్పుడు దేవతలంతా విసిగిపోయారు. మనుషుల్ని శిక్షించక తప్పదని నిర్ణయించారు. ఏడు సంవత్సరాల కరువును పంపారు. ఇంకో ఆరేళ్లపాటు వానలురావు" అని చెప్పారు.

అందరి మనసుల్లోనూ భయం రాజ్యమేలింది. వానలు లేకుంటే పంటలు ఎలాగూ పండవు. రైతులు సాగు వదిలిపెట్టారు. అనేకమంది పల్లెల్ని వదిలి పోతున్నారు. ఎవ్వరికీ ఏం చేయాలో తెలీటంలేదు. గ్రామాల్లో పరిస్థితి అంతా అల్లకల్లోలం అయ్యింది. 
ఊరంతట్లోనూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొలానికి పోయి, పని కొనసాగించినవాడు చేత్ సింగ్ ఒక్కడే. తన నిరాశగానీ, చుట్టూఉన్న జనాల ఎగతాళిగానీ అతనిచేత పనిని ఆపించలేకపోయాయి. అతను యథా ప్రకారం ఉదయాన్నే పనికి వెళ్లి, ఆపకుండా నాలుగుగంటలపాటు పని చేసేవాడు. ఆ తరువాతనే ఉదయపు భోజనం, విశ్రాంతి.

ఒకనాడు దారినపోయే దాసప్ప ఒకడు పొలంపని చేస్తున్న చేత్ సింగ్ ని చూసి ఆగాడు. "ఏమయ్యా, రైతూ? నేలనెందుకు, దున్నుతున్నావు? ఏడు సంవత్సరాల కరువు గురించి విని ఉండలేదా నువ్వు? లేకపోతే అలాంటి వాటిలో నీకు నమ్మకం లేదా? నీ శక్తినీ, సమయాన్నీ ఇలా వృథా చేసుకుంటున్నావే, ఎందుకు? మరీ మూర్ఖంగా ఉన్నావనిపిస్తుంది. ఇంటికి పో! ఈ పనిని ఇక్కడితో ఆపెయ్యి! దీని వల్ల ఏమీ ప్రయోజనం లేదు!" అన్నాడతను బిగ్గరగా, చేత్ సింగ్ తో.

చేత్ సింగ్ మర్యాదగా జవాబిచ్చాడు - "అయ్యా! ఏడు సంవత్సరాల కరువు గురించి నేనూ విన్నాను. విత్తనాలు నాటే అవకాశం లేదని గ్రహించాను కూడాను. కానీ నాకింకో సంగతీ తెలుసు. కాలం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ ఏడు సంవత్సరాలు కూడా తప్పక గడుస్తాయి. ఆ తర్వాత వస్తాయి వానలు. అయితే ఈ ఏడేళ్లూ పనిచేయకుండా ఉండిపోతే, ఇక నాకు దున్నే అలవాటు తప్పిపోతుంది. శక్తి ఉండీ నిజానికి నేను శక్తి హీనుడినే అవుతాను. చివరికి వానలు పడ్డప్పటికి నాలో పనిచేసే క్రమశిక్షణ లోపించి, ఇక నా వృత్తికి నేను న్యాయం చేయలేకపోతాను. అందుకని, నేనిప్పుడు కేవలం పనిని సాధన చేస్తూ గడుపుతున్నాను, అంతే!" అని.

ఆ దాసప్ప ఎవరోకాదు. వరుణుడే! తోటి దేవతలు పురమాయించిన మీదట, ఏడు సంవత్సరాల నిషేధాన్ని విధించుకున్న వానదేవుడే ఆయన. చేత్ సింగ్ కార్య దీక్షా, జ్ఞానంతో కూడుకున్న ముందుచూపూ ఆయన్ని కరిగించాయి. అంతేకాదు, చేత్ సింగ్ స్థైర్యాన్ని చూసి, వాన దేవుడు కూడా ఆలోచనలో పడ్డాడు- "నిజమే! నేను వరుసగా ఏడేళ్లు వర్షాలను కురిపించకపోతే, వానను కురిపించే కళను నేనూ మర్చిపోయే ప్రమాదం ఉంది! ఆపైన ఇక నేనూ నా విధిని సరిగా నిర్వర్తించలేకపోతానేమో! ఎలాగ?" అనుకొని, ఆయన తక్షణం వానల్ని కురిపించాడు. భగవంతుడిని నమ్ముకున్న చేత్ సింగ్ వెంటనే పొలంలో విత్తనాలు చల్లాడు!

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో