Facebook Twitter
ప్రకృతిని తడిమిన కృష్ణశాస్త్రి కవిత్వం

 

 

ప్రకృతిని తడిమిన కృష్ణశాస్త్రి కవిత్వం

 

బెంగాల్ వారికి రవీంద్రానాధ్ టాగూర్ ఓ వరం. ఆయన రాసిన కథలు, కవితల సంగతి అలా ఉంచితే.... రవీంద్రుని గీతాలు ‘రవీంద్ర సంగీత్’ పేరుతో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అదృష్టవశాత్తు తెలుగులో ఆ స్థాయి గీతాలు లేకపోలేదు. నోబెల్ బహుమతులను అందుకోకపోయినా, ప్రపంచం తలవంచకపోయినా... మన తెలుగులోనూ అద్భుతమైన భావగీతాలు రాకపోలేదు. వాటిలో తలమానికం కృష్ణశాస్త్రి సాహిత్యం!
దేవులపల్లి కృష్ణశాస్త్రి పిఠాపురం దగ్గర రావువారిచంద్రంపాళెం అనే పల్లెలో నవంబరు 1, 1897న జన్మించారు. పండిత కుటుంబం, దానికి తోడు సాహిత్యమంటే అభిరుచి ఉన్న తండ్రి... దాంతో ఇంట్లో తరచూ సాహిత్య చర్చలు జరుగుతూ ఉండేవి. దీనికి తోడు సాహిత్యాభిలాష ఉన్న గురువులు దొరకడంతో కృష్ణశాస్త్రికి చిన్నప్పటి నుంచే రచనలు చేయాలన్న అభిలాష మొదలైంది. వాటికి ఆనాటి బ్రిటిష్ పాలన, బ్రహ్మసమాజం వంటి అంశాలు కూడా బలాన్ని చేకూర్చాయి. దాంతో చిన్నా చితకా వ్యాసాలు, కవితలూ రాయడం ఆరంభించారు కృష్ణశాస్త్రి.

1925లో కృష్ణపక్షం రచనతో కృష్ణశాస్త్రి ప్రతిభ ఏపాటిదో తెలుగువారికి తెలిసిపోయింది. తెలుగునాట భావగీతాలకు ఒక కొత్త ఒకరవడి మొదలైంది. ‘ఆకులో ఆకునై, పూవులో పూవునై’ అంటూ సాగే గీతం అందులోదే! ప్రకృతితో మమేకమవుతూ ఆయన సాగించిన సాహితీ ప్రస్థానం, భార్య మరణంతో మరో మలుపు తీసుకుంది. చిన్న వయసులోనే భార్య చనిపోవడంతో ఆయన భావగీతాలలో విషాదం వినిపించసాగింది. ‘ఎడతగని యాత్రనిట్లు సాగింప లేక, యేడ్వగా లేక కృశియింతు నే నొకండ!’ అంటూ తన బాధను ప్రపంచంతో పంచుకున్నారు.

కృష్ణశాస్త్రి రచనల్లో ప్రకృతి పట్ల పలవరింపు, వ్యక్తిగత విషాదమే కానీ విప్లవం కనిపించదనే విమర్శలు లేకపోలేదు. అంతమాత్రాన కృష్ణశాస్త్రి వ్యక్తిగా నిరాశావాదనీ, నిర్లిప్తుడనీ అనుకోవడానికి లేదు. ఆనాటి హరిజనోద్ధరణ, కళావతుల వివాహం, బ్రహ్మసమాజం వంటి ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన బంధువుల విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. ఇలా విప్లవకారుడిగా, సాహిత్యకారునిగా, ఆకాశవాణి ఉద్యోగిగా సాగుతున్నా ఆయన ప్రస్థానం బి.ఎన్.రెడ్డి పరిచయంతో మరో మలుపు తిరిగింది.

 

 

అప్పట్లో బి.ఎన్.రెడ్డి మల్లీశ్వరి సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నారు. అదే సమయంలో కృష్ణశాస్త్రి పరిచయం కావడంతో మల్లీశ్వరికి మాటలు, పాటలు రాసే అవకాశాన్ని ఆయనకు ఇచ్చారు. ఆ అవకాశాన్ని రెండుచేతులా అందిపుచ్చుకున్నారు. అందులో  ‘మనసున మల్లెల మాలలూగెనే’ వంటి పాటలు తెలుగువారిని ఒక్క ఊపు ఊపాయి. అది మొదలు సినిమాసాహిత్యంలో కృష్ణశాస్త్రి శకం మొదలైపోయింది. రాసింది కొద్ది పాటలే అయినా... ప్రతి పాటా ఓ అద్భుతమైన కవిత్వంలా సాగుతుంది. కుశలమా నీకు కుశలమేనా (బలిపీఠం), మావి చిగురు తినగానే (సీతామహాలక్ష్మి) వంటి పాటలు తెలుగు సినిమాపై కృష్ణశాస్త్రి సంతకంగా మిగిలిపోయాయి. లలితంగా సాగే గీతాలే కాదు... విషాద గీతాలు (ఇది మల్లెల వేళయనీ, వెన్నెల మాసమనీ), భక్తి గీతాలు (నీవుండేదా కొండపై నా స్వామీ, నే నుండే దీ నేలపై), దేశభక్తి గేయాలు (జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి!) వంటి రచనలూ ఆయన కలం నుంచి వెలువడ్డాయి.

 

కృష్ణశాస్త్రి కవిత్వాన్ని ఆయన స్వరంలోనే వినడం ఓ గొప్ప అనుభూతిగా భావించేవారు ఆనాటి శ్రోతలు. కానీ 1964లో ఆయన స్వరపేటిక తొలగించాల్సి రావడంతో ఆ స్వరం మూగబోయింది. అయినా మరో 16 ఏళ్ల వరకు అడపాదడపా రచనలు చేస్తూనే వచ్చారు. ప్రతి రాత్రి వసంత రాత్రి (ఏకవీర), పాడనా తెలుగుపాట (1976) వంటి అద్భుతమైన గీతాలు ఆ తర్వాత రాసినవే! 1980లో కృష్ణశాస్త్రి కలం మూగబోయేవారకూ ఆయన రాసిన గీతాలు తెలుగు సినీగీతాలు కవిత్వ స్థాయిని అందించాయి. దశాబ్దాలు గడిచినా, తరాలు మారినా, కృష్ణశాస్త్రి కలమూ కంఠమూ మూగబోయినా... భావ గీతం అంటే కృష్ణశాస్త్రే గుర్తుకువస్తారు.

- నిర్జర.