Facebook Twitter
చిట్టిగాడి ఆకాశయానం

చిట్టిగాడి ఆకాశయానం

 

 

చిట్టికి ఆకాశం అంటే ఇష్టం. అది ఎంత చక్కగా నీలం రంగులో ఉంటుందో అని ముచ్చట. ఆకాశంలో ఎగిరే పక్షులంటే ఆశ్చర్యం. 'మనం ఎగరలేమెందుకు?' అని ప్రశ్నలు. ఆకాశం గురించి తెలుసుకోవాలని బలే ఉబలాటం. అస్తమానూ వాళ్ళ అమ్మానాన్నల్ని ఆకాశం గురించి ఏదో ఒకటి అడుగుతూ‌ ఉండేవాడు.

 

బడికి వెళ్ళి వచ్చాక, కాస్తంత ఏదైనా తిని, మళ్ళీ ఆడుకునేందుకు వెళ్ళేవాడు చిట్టి. ఒకసారి అట్లా ఆడుకుని వచ్చాడు. బాగా అలిసిపోయి ఉన్నాడేమో, వెంటనే నిద్రపట్టేసింది. ఆ వెంటనే వాడు అంతరిక్ష యాత్రకు బయలుదేరాడు. ఎగిరేటప్పుడు మొదట్లో వాడికి రెక్కలు లేవు. కానీ ఒకసారి ఎగిరి మబ్బులలోకి వెళ్తుండగానే వాడికి మబ్బుల్లాంటి రెక్కలు మొలిచాయి. అవి వాడిని ఇంకా పైపైకి తీసుకువెళ్ళాయి.

 

అట్లా పోతుంటే వాడికి కొంగల్లాగా తెల్లటి రెక్కలు పెట్టుకున్న పక్షులు కలిసి ఎగురుతూ కనపడ్డాయి. చిట్టి వాటి రెక్కలు పట్టుకుని చూశాడు. మెత్తని దూదిలాగా అనిపించినై, అవి. అంతలో వాడి వెనకనుండి నీలం రంగు పక్షులు దూసుకువచ్చాయి. 'ఇదేమి కొత్త పక్షి?!' అన్నట్లు, అవి వాడి వంక కోపంగా చూశాయి.


అంతలోనే ఉన్నట్టుండి చిట్టిగాడి శరీరం మరింత తేలికగా అయిపోయింది. 'ఏమిటా' అని చూసుకుంటే వాడి రెక్కలు ఇంకా పెద్దవి అయ్యాయి. ఇప్పుడు రెక్కలు కొంచెం ఊపితే చాలు- చాలా పైకి వెళ్ళిపోతున్నాడు. అట్లా పోతుంటే వాడికి తనలాగే ఎగురుతున్న పెట్టెలు కొన్ని కనిపించాయి. అవి బంగారపు రంగులో మెరుస్తున్నాయి. చిట్టిగాడికి ఆశ్చర్యం వేసింది. 'పెట్టెలు ఎగరటం ఏంటి? వాటిలో ఏముందో మరి, చూడాలి' అనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా వాటి మూతలు తెరుచుకోలేదు.


అంతలోనే వాడికి కొంచెం చలి వేయటం మొదలు పెట్టింది. ఒకసారి వణికిపోయాడు; కానీ 'లేదు, అంతరిక్షంలో చలికి తట్టుకోవాలి' అనుకోగానే ఇంక చలి వేయలేదు. అంతలోనే పెద్దగా శబ్దం చేసుకుంటూ ఓ విమానం అటుగా వచ్చింది. 'అది తనని గుద్దుతుందేమో' అని చిట్టిగాడు భయపడ్డాడు కానీ అది చాలా దూరంనుండే మరొక వైపుకు తిరిగి వెళ్ళిపోయింది. చిట్టి "హమ్మయ్య" అని ఊపిరి పీల్చుకున్నాడు.

 

అప్పుడు వాడు ఉన్న ఆ స్థలం ఏదో తెలిసిన చోటు లాగా అనిపించింది. చూస్తే ఎదురుగుండానే ఇంద్రధనస్సు! వాడికి చాలా సంతోషం వేసింది. వేగం తగ్గించి, ఆ రంగుల ప్రపంచంలోకి దూరాడు. చూస్తూండగానే ఏడు రంగులూ ఒకదాని తర్వాత ఒకటి వాడి మీద కురిసాయి. ఏడేడు రంగులూ వాడికి అంటుకున్నాయి. "అయ్యో, ఈ రంగులు మళ్ళీ వదులుతాయో, వదలవో" అని నవ్వాడు వాడు.

 

అంతలోనే నెమ్మదిగా వర్షం మొదలయ్యింది. వాడి మీద కురిసిన రంగులన్నీ‌ ఆ వర్షపు నీళ్లలో కొట్టుకుపోయాయి. కానీ ఏమంటే వాడు తడిసి ముద్దయ్యాడు. ఇంకాస్త పైకి ఎగిరేసరికి, వర్షం కాస్తా ఆగిపోయింది. అయితే వాడికి ఇప్పుడు ఒంటరిగా అనిపించసాగింద. "నాతోపాటు నా స్నేహితులు కూడా ఉంటే బాగుండేది" అనుకున్నాడు "మేమందరం కలిసి బంతి ఆట ఆడుకునేవాళ్ళం.. సరే, ఇంక ఎంత సేపని వెళ్తాను ఇట్లా? ఇంటికి వెళ్ళిపోతాను. అమ్మవాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు" అనిపించింది వాడికి. "సరే" అని కిందికి చూస్తే ఎక్కడా ఒక్క ఇల్లుకూడా లేదు! "ఎటువైపు పోవాలి ఇప్పుడు?!" అని ఆందోళన మొదలైంది. తికమక మొదలైంది. 


అయితే సరిగ్గా అదే సమయానికి నెమ్మదిగా వెలుగు మొదలైంది. ఏవేవో శబ్దాలు వచ్చాయి: "ఒరే చిట్టీ! లెగరా చిట్టీ!" అంటూ, వాళ్ళ అమ్మ గొంతుతోటే. కళ్ళు తెరిచి చూస్తే అమ్మే. నిద్ర లేపుతున్నది: "లేరా చిట్టీ, ఎంతో సేపటినుంచి లేపుతున్నా నిన్ను" అంటూ. చటుక్కున లేచి గడియారం కేసి చూసి "అమ్మో! ఆలస్యం అయిపోయింది" అంటూ బాత్ రూం వైపుకు పరుగు పెట్టాడు చిట్టి.

 

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో