Facebook Twitter
మనసున్న మారాజు – అడివి బాపిరాజు

 

మనసున్న మారాజు – అడివి బాపిరాజు

 

 

మనిషికి చాలా డిగ్రీలు ఉండవచ్చు. కానీ సమాజం అతణ్ని గుర్తించేందుకు ఆ డిగ్రీలేవీ ఉపయోగపడవు. అతని ప్రవృత్తి ఏమిటన్నదాంతోనే సమాజం అతణ్ని పిలుస్తుంది. అలా సమాజం గుర్తుంచుకునేందుకు చాలా విశేషణాలే వదిలి వెళ్లారు అడివి బాపిరాజు- కవి, నవలాకారుడు, చిత్రకారుడు, ఉపాధ్యాయుడు, కళా దర్శకుడు, నాటక రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు... ఇలా బోల్డు రకాలుగా చెప్పుకోవాలి అడివి బాపిరాజు గురించి. పశ్చిమగోదావరి జిల్లాలో 1895లో జన్మించారు అడివి బాపిరాజు. రాజమండ్రి, మద్రాసులలో ఆయన చదువు సాగింది. తెలుగు సాహిత్యం కావ్యాల స్థాయిని దాటి కవితలూ, కథలుగా రూపాంతరం చెందుతున్న కాలం అది! సహజంగానే భావకుడు అయినా బాపిరాజు తన సృజనకు మార్గంగా సాహిత్యాన్ని ఎన్నుకొన్నారు. ఒక పక్క న్యాయవాద వృత్తిని సాగిస్తూనే సాహిత్యం సృష్టించసాగారు. కొన్నాళ్లకు పూర్తిగా సాహిత్యానికే అంకితమవ్వడం కోసమో, వృత్తిరీత్యా అబద్ధాలు చెప్పడం ఇష్టం లేకపోవడం చేతనో... న్యాయవాద వృత్తిని వదిలి బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా ఉద్యోగాన్ని చేపట్టారు.

 

 

సాహిత్యం పట్ల బాపిరాజుకి అభిరుచి ఉండవచ్చుగాక. కానీ ఆ అభిరుచి పాఠకులని మెప్పించింది మాత్రం ‘నారాయణరావు’ నవలతోనే! 1934లో ఆంధ్రవిశ్వకళాపరిషత్తు నిర్వహించిన నవలల పోటీలో ఈ నవల ప్రథమ స్థానాన్ని పొంది ఒక్కసారిగా తెలుగు పాఠకుల దృష్టిని ఆకర్షించింది. ఆ పోటీలో విశ్వనాథ వేయిపడగలతో పాటుగా నారాయణరావు నవల ప్రథమ బహుమతిని పొందడం విశేషం. ఆనాటి సామాజిక పరిస్థితులు, స్వాతంత్ర్య ఉద్యమం, ఆధునిక భావాలు, మనుషుల మనస్తత్వం, జమీందారీ బేషజాలు... అన్నింటినీ రంగరించి వెలువరించిన నారాయణరావు నవలని తెలుగు నవలా సాహిత్యంలో ఒక మైలురాయిగా భావిస్తారు.

 


నారాయణరావు వంటి సాంఘిక నవలలే కాదు... గోనగన్నారెడ్డి, హిమబిందు, అంశుమతి, అడవిశాంతిశ్రీ వంటి చారిత్రక నవలలూ బాపిరాజు కలం నుంచి వెలువడ్డాయి. వీటిలో కొన్నింటిని ఆయన మీజాన్ పత్రిక సంపాదకునిగా ఉన్నప్పుడు అందులో ధారావాహికగా వెలువరించారు. అలా తెలుగులో తొలి సీరియల్ రచయిత బాపిరాజే కావచ్చు. ఆయన రచనలలో వర్ణన ఎక్కువగా ఉంటుందన్న విమర్శ వినిపిస్తూ ఉంటుంది. కొన్ని గ్రంథాలలో సమాసభూయిష్టమైన పదజాలం ఎక్కువన్న ఆరోపణా లేకపోలేదు. బాపిరాజు స్వతహాగా భావకుడు... ఆపై కవి! దాంతో ఆయన రచనల్లో వర్ణన కనిపించడం చిత్రమేమీ కాదు కదా! పైగా ఆ వర్ణన కోసమే ఆయన రచనలను అభిమానించే పాఠకులూ లేకపోలేదు.
ఇదంతా బాపిరాజుగారి నవలల గురించి ప్రశస్తి. ఆయన కవితలూ అందుకు తీసిపోయేవేమీ కాదు. ముఖ్యంగా శశికళ పేరుతో ఆయన వెలువరించిన కవితలని ఎంకిపాటలు, కిన్నెరసాని పాటల స్థాయిలో నిలపవచ్చు.
‘సృష్టి అంతా నిశ్చలమ్మయె - తుష్టి తీరక నేను మాత్రము
కాలమంతా నిదుర పోయెను - మేలుకొని నేనొకడ మాత్రము!
మినుకు మినుకను తారకలలో - కునుకులాడెను కటిక చీకటి
కన్ను మూసిన పూల ప్రోవుల - తెన్ను తెలియని గంధ బాలిక!’ (మేలుకొలుపు – శశికళ)
వంటి అద్భుతమైన భావాలు శశికళలోని ప్రతి కవితలోనూ పలకరిస్తాయి. ఈ కవితలతో పాటుగా ‘హంపి శిథిలాలు’ వంటి అరుదైన కథలు, ‘ఉషాసుందరి’ వంటి నాటికలు బాపిరాజు సృజనకు అద్దం పడతాయి.

 

 

బాపిరాజు కేవలం రచయిత మాత్రమే కాదు... గొప్ప చిత్రకారుడు కూడా! ఆయన గీసిన తైలవర్ణ చిత్రాలెన్నో ప్రముఖ మ్యూజియంలలో కొలువుతీరాయి. విశ్వనాథ సత్యనారాయణ రాసిన కిన్నెరసాని పాటలకు సైతం బాపిరాజు చిత్రాలను అందించారు. ఆ అభిరుచితోనే కొన్ని చిత్రాలకు కళాదర్శకునిగా కూడా పనిచేశారు. అలా తెలుగునాట తొలి కళాదర్శకుడిగా నిలిచారు.
పైన పేర్కొన్నవన్నీ కూడా బాపిరాజు సృజనను ప్రతిబింబించే విషయాలు. ఇక ఆయన వ్యక్తిత్వమూ అంటే ఉన్నతమైనదని అంటారు ఆయనను ఎరిగినవారు. స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా ఆయన రెండు సార్లు జైలుపాలయ్యారన్న విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. బాపిరాజుగారి భార్య నరాల వ్యాధితో బాధపడుతూ ఉండటం వల్ల పిల్లల ఆలనాపాలనా కూడా ఆయనే గమనించేవారట. ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు అప్పటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఉండేవారని చెబుతుంటారు. ఇలా సాహిత్యపరంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా అడివి బాపిరాజు ఏర్పరుచుని నడిచిన బాట... తెలుగునాట ఓ సాహిత్య ప్రస్థానంగా మిగిలిపోయింది.

- నిర్జర.