Home » కథలు » భూతాలు చేసిన మేలుFacebook Twitter Google
భూతాలు చేసిన మేలు

భూతాలు చేసిన మేలు !

 


అనగనగా అడవిని ఆనుకొని ఒక ఊరు ఉండేది. ఆ ఊళ్ళో నరసయ్య, నరసమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళ కొడుకు భరత్ చాలా మంచివాడు. ఒకరోజున అతను అలా సరదాగా తోటలో తిరుగుతూ ఉంటే అందమైన సీతాకోకచిలుక ఒకటి కనబడ్డది. అది చాలా అందంగా ఉంది; ఒకసారి వచ్చి అతని చెయ్యి మీదనే వాలి, మళ్ళీ దూరంగా ఉన్న పువ్వుల మీద వాలి, హడావిడిగా అటూ-ఇటూ తిరుగుతూ సందడి చేసిందది. దాన్నే కొద్ది సేపు చూసిన భరత్‌కి 'ఇక దాన్ని పట్టుకుందాం' అనిపించింది. ఆ సీతాకోక-చిలుక వెంట పడ్డాడు. అయితే అది ఎంత సేపటికీ అతన్ని ఊరిస్తూ పోయింది గానీ, చేతికి మాత్రం చిక్కలేదు. తెలివి వచ్చి చూసుకునే సరికి, భరత్ తమ తోటను ఎప్పుడో దాటిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడో, అడవిమధ్యలో ఉన్నాడు. వెనక్కి వెళ్ళే దారేది?!

అడవిలో కనబడిన దార్లను పట్టుకొని పోబోయాడు భరత్. అయితే ఎటు పోయినా మళ్ళీ తను వచ్చిన చోటికే వస్తున్నాడు! అతను అట్లా కంగారు పడుతూ ఉంటే దగ్గరలో ఉన్న మర్రి చెట్టు తొర్రలోంచి గుసగుసగా ఏవో మాటలు వినవచ్చాయి. ఆ మాట్లాడుకుంటున్నవి మూడు దయ్యాలు! ఆ సంగతి మొదట వాడికి తెలీలేదుగానీ, ఆ తొర్ర దగ్గర చెవి పెట్టి జాగ్రత్తగా వింటే తర్వాత తర్వాత అర్థమైంది. వాటిలో ఒక దయ్యం అంటున్నది: "నేను చనిపోక ముందు ఓ మందు కనిపెట్టాను. ఎవరికైనా పిచ్చి పడితే వాళ్ల చేతులకు ఆ మందును ఆరు రోజుల పాటు పట్టిస్తే చాలు- పిచ్చి పూర్తిగా నయమౌతుంది" అని. అప్పుడు రెండో దయ్యం అన్నది: "నేను చనిపోకముందు నా దగ్గర మహిమగల కత్తి ఒకటి ఉండేది. దాంతో ఎవరు యుద్ధం చేస్తే వాళ్లదే విజయం!" అని.

 

ఇక మూడో దయ్యం అన్నది: "నా దగ్గర ఒక ప్రతిమ ఉంది. ఆ ప్రతిమను పూజించి ఏ వస్తువును కోరుకుంటే దాన్ని ప్రసాదిస్తుందది!" అని. "ఏదీ, చూపించు - చూపించు" అని ముచ్చట పడ్డాయి మొదటి దయ్యాలు రెండూ. మూడోది వాటికి తన దగ్గరున్న ప్రతిమను చూపించింది. "భలే ఉంది, మేమూ తెస్తాం, ఆగు- మేం చెప్పిన వస్తువుల్ని కూడా మాకు అందుబాటులోనే ఉంచుకున్నాం మేము!" అంటూ అవి రెండూ ఎగిరివెళ్ళి, క్షణాల్లో తమ తమ వస్తువులతో తిరిగివచ్చాయి. అన్నీ అట్లా ఆ వస్తువులను చూసుకొని మురిసిపోయాయి. ఇదంతా వింటున్న భరత్‌కి ఏం చెయ్యాలో తోచలేదు. 'దూరంగా పారిపోదాం' అని ఎంత ప్రయత్నించినా మళ్ళీ అక్కడికే వస్తున్నాడాయెను! అంతలోనే దయ్యాలు మూడూ తొర్రలోంచి బయటికి వచ్చి, ఏవో కబుర్లు చెప్పుకుంటూ భరత్‌ను గమనించకనే ఎటో ఎగిరిపోయాయి.

అప్పుడుగాని భరత్‌కి భయం తగ్గలేదు. అవి ఇక దగ్గరలో లేవు గనక, అతని మెదడు మళ్ళీ ఓసారి చురుకుగా పనిచేయటం మొదలు పెట్టింది. అతను వెంటనే ఆ తొర్రలోకి దూరి, అక్కడున్న మూడు వస్తువులనూ అందుకొని, ప్రతిమకు నమస్కారం పెడుతూ "మా ఇంటికి దారి తీసే చెప్పుల్ని ప్రసాదించు" అని కోరుకున్నాడు. వెంటనే అతని ముందు రెండు చెప్పులు ప్రత్యక్షం అయ్యాయి. అతను వాటిని వేసుకోగానే అవి అతన్ని వాళ్ళ ఇంటికి చేర్చాయి! ప్రతిమ సహాయంతో నరసయ్య, నరసమ్మ, భరత్ ముగ్గురూ త్వరలోనే గొప్ప ధనవంతులైపోయారు. వాళ్ళకిప్పుడు గొప్ప గొప్ప వాళ్లతో పరిచయాలూ, సంబంధాలూ ఏర్పడ్డాయి.

అంతలోనే ఆ దేశపు రాజుగారికి ఒక సమస్య వచ్చింది. రాజ కుమారికి అకస్మాత్తుగా ఏదో అయ్యింది. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నది. ఆమె పిచ్చిని కుదిర్చేందుకు ఆయన అనేకమంది వైద్యులను పిలిపించాడు; కానీ ఎవ్వరూ ఆమెను బాగు చేయలేకపోయారు. ఆ వైద్యులలోనే ఒకడు, మాటల సందర్భంలో ఈ సంగతిని తెలియజేశాడు భరత్‌కు.

 

భరత్ వెంటనే బయలుదేరి వెళ్ళి నేరుగా రాజుగారిని కలిసి, రాకుమారికి వైద్యం చేసే అవకాశం ఇవ్వమని వేడుకున్నాడు. "నువ్వు వైద్యుడివి కావు గదా" అన్నారు రాజుగారు. "అయినా ఒక అవకాశం ఇచ్చి చూద్దాం" అని 'సరే'నన్నారు. భరత్ తన దగ్గరున్న పసరు మందును రాకుమారి చేతులకు పట్టిస్తూ వచ్చాడు. రాకుమారి క్రమంగా బాగైంది. ఆరవనాడు మందును పట్టించాడో, లేదో- వాడి ముందు మూడు భూతాలు ప్రత్యక్షం అయ్యాయి: "ఒరే, నువ్వు మా వస్తువుల్నే ఎత్తుకెళ్తావురా?! 'మేం కనుక్కోలేం' అనుకున్నావా?! నిన్ను రప్పించేందుకేరా, ఇంత నాటకం ఆడింది!" అన్నాయి చేతులు చాపి వాడిని పట్టుకోబోతూ. భరత్ చిటికెలో తప్పించుకొని, తన దగ్గరున్న కత్తిని బయటికి లాగి వాటితో యుద్ధం మొదలు పెట్టాడు. దీన్ని అక్కడున్న వాళ్లంతా నోళ్ళు వెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు. సహజంగానే, ఆ యుద్ధంలో భరతుడే గెల్చాడు!

"ఒరే, కత్తి కూడా ఉంది కాబట్టి గెల్చావు. లేకపోతే నీ ప్రాణాలు తీసి ఉందుము!" అన్నాయి భూతాలు, ఓడిపోయాక. వెంటనే భరత్ తన కత్తిని, మిగిలిన పసరును, ప్రతిమను కూడా వాటి ముందు పెట్టి, చేతులు జోడిస్తూ "ఇవి మీవే, నన్ను మన్నించండి. వీటిని నేను అసలు తీసుకునేవాడిని కాదు. కానీ వేరే దారి లేక అలా చేయాల్సి వచ్చింది. నాకుగా వీటితో ఏలాంటి అవసరమూ లేదు. ఇప్పుడు మీకెలా తోస్తే అలా చెయ్యండి" అన్నాడు నిజాయితీగా. దయ్యాలు మూడూ నవ్వి, "నువ్వు నిజంగానే మంచి వాడివిలాగున్నావు. నిజానికి ఈ వస్తువులు మాకూ అవసరం లేదు. నీ దగ్గరే ఉంచుకో, కానీ వీటిని ఎక్కువ వాడకు. నీ శక్తిమీద నువ్వు ఆధారపడటమే మంచిది ఎప్పటికైనా" అని చెప్పి మాయం అయిపోయాయి.

ఆ తర్వాత రాజుగారు భరత్‌ను సన్మానించి, రాకుమార్తెనిచ్చి పెళ్ళి చేస్తానన్నారు. "నాదంటూ సొంత ధనమూ లేదు; సొంత వైద్యమూ లేదు; సొంత బలమూ లేదు- నాకేమీ వద్దు" అన్నాడు భరత్. "ఇవేవీ‌ లేకున్నా కొండంత ధైర్యం ఉంది; కొండంత నిజాయితీ ఉంది- అవి చాలు. నేను ఇతన్ని పెళ్ళి చేసుకుంటాను" అన్నది రాకుమారి. ఇంకేముంది, భరత్ రాజైపోయాడు! అటు తర్వాత అతను సొంతగా విద్యలన్నీ నేర్చుకొని, 'చక్కని రాజు' అని పేరు తెచ్చుకున్నాడు.

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో


అనగనగా ఒక మంచాయన ఉండేవాడట. వాళ్ళ ఊరికి దగ్గర చాలా పండ్ల తోటలు ఉండేవి. పండ్లని తినేందుకు చిలకలు, వగైరా పక్షులు వచ్చేవి...
Feb 27, 2020
అది మంచి వేసవి కాలం. పిల్లలందరికీ సెలవలు. నారాయణ రెడ్డి ఆ రోజు ఉదయం బజారునుండి ఒక పుచ్చ కాయని తెచ్చాడు. పిల్లలంతా అది చూసి చాలా సంబరపడ్డారు....
Feb 8, 2020
అనగనగా ఒక ఊళ్లో ఇద్దరు దంపతులుండేవారు.
Aug 7, 2019
మతి మరుపు
Jul 31, 2019
ఆవులు కాసే రంగన్నకు ఉన్నట్టుండి ఓ సందేహం కలిగింది. "నేనేం చెయ్యాలి..
Jun 25, 2019
“అబ్బా!” తెల్లని డోరియా చీరపై గులాబీలు క్రాస్..
May 11, 2019
ఒక ఊరిలో రాజయ్య అని ఒక కట్టెలు కొట్టేవాడు వుండేటోడు...
Apr 27, 2019
గిరి వాళ్ళ నాన్న వీరయ్య కష్టజీవి. వాళ్ళు పడే కష్టం తెలుసు గనకనే..
Apr 26, 2019
అనగనగా ఒక ఊళ్లో ఒక అన్న, ఒక తమ్ముడు ఉండేవాళ్ళు.
Oct 30, 2019
ధర్మపురంలో చాలా పేద కుటుంబం ఒకటి ఉండేది.
Apr 24, 2019
TeluguOne For Your Business
About TeluguOne