Facebook Twitter
కాలం నీడలో..

కాలం నీడలో..

కాలమింతలామారి
మనుషులపై విషంగక్కుతున్నదేమిటో
ఊహించైనా ఉండరెవరు

ఇన్నేండ్లెన్ని ఒడిదుడుకులెదురైనా
నిబ్బరంగా నిలవడ్డడు
విజయం సాధించిన సాహసికుడు
మనిషి

కానీ
కనిపించిన ప్రతిదాన్ని 
పాడుచేస్తూ
ప్రకృతికి వర్ణనకందని కీడుచేసీ
ఎవరెస్టు తీరం చేరినా
ఇంకా ఏదో చేయాలనే 
అంతరిక్ష దారుల్లో రహస్యాలు
ఛేదించనా
ఏంలాభం?
మనిషి ప్రాణం నిలబెట్టడం
తరంకాలేదెవరికి
కాదుకూడా

భూమి సారాన్ని పీల్చే
జలగలా
తన జీవాన్ని జీవనాన్ని
దహనం చేస్తున్నడు
మనిషి

ఎంతెదిగిన
భూమి పాదుల్లో సత్తాలేదాయే
విజ్ఞానం వికసించినా
వినియోగమైతే వినాశనానికే

మానవత్వం చచ్చిన మనిషి
నేడు
స్వార్థంపై సవారిచేస్తూ
పయనమెటో తెలియని
ఆధిపత్యం
అదెప్పుడు
అంధకారం
బయటపడని అగాధం

మనుషులు చెట్లతో చెలగాటమాడి
కృత్రిమమైన
ప్లాస్టిక్ వనాలు మొలిపిస్తున్నరు

అరచేతిలోకి సాంకేతికజ్ఞానం
రెండంచుల ఖడ్గమై
మెదళ్ళను తొలిచేసి
అయేమయంలోకి నెట్టి
మనిషి దశల ఎదుగుదలలో
కళ్ళు మూసుకుపోయి
కామాంధులౌతున్నరు
బదులు
ఎన్ని పూలు మానాలు కోల్పోయి
అనాథశవాలవుతున్నయ్

ఎన్నో సంఘటనలు
కంచికి చేరని కథలే

కరోనాకు వర్షం తోడై
కంగారుగా
తనవంతు నష్టం జరిగించె

దేశమేదైనా 
పేదవాడే నరకం చూసే
నష్టజాతకుడు
కూడుకోసం
గూడుకోసం
బతుకంతా వెట్టిచాకిరి

అతివృష్టి అనావృష్టికి
కొట్టుకుపోయో
ఎముకలగూడు
ఎటుతోచక
బతుకు పయనం ముగించి
పరలోకం పయనమాయే
పాపఖర్ముడు

సి. శేఖర్(సియస్సార్),