Facebook Twitter
కలిసి బ్రతుకుదాం..

కలిసి బ్రతుకుదాం!

 

అనగనగా ఒక అడవిలో ఒక చీమ, మిడత, పేడపురుగు ఉండేవి. చీమ, మిడత ప్రతిరోజూ కలిసి తిరిగేవి, వానాకాలం కోసం అవసరమైన ఆహారాన్నంతా ముందుగా సేకరించుకునేవి. చీమ ఆహారాన్ని వాసన పట్టి చూపించేది; మిడత దాన్ని తెచ్చి చీమ పుట్ట దగ్గర విడిచేది. ఇక మిడత, పేడపురుగు రెండూ ప్రతిరోజూ కలిసి తిరిగి, ఎక్కడెక్కడి పాటలూ సేకరించుకొని పాడేవి. పేడపురుగు నోటితో తాళం పలికిస్తే, మిడత ఎగిరి గంతులు వేసేది. రెండూ సంతోషంగా బిగ్గరగా నవ్వుకునేవి.

ఎప్పుడో ఒకసారి ఈ మూడూ కలిసేవి. అట్లా కలిసినప్పుడు మరి పేడపురుగు, చీమ సరిగ్గా మాట్లాడుకునేవి కావు. ఒకదాన్ని చూసి ఒకటి ముఖం చిట్లించుకునేవి. మిడత మటుకు వాళ్లిద్దరి ముఖాలకేసీ చూసి నవ్వేది. "ఈ పేడ పురుగుకు పనిచేయటమే రాదు! ఎప్పుడూ ఆ పాటలేంటి?" అనేది చీమ ఆ తర్వాత. మిడత నవ్వేది- పేడపురుగును వెనకేసుకు వచ్చేది. "ఈ చీమకి అస్సలు పాట అంటే ఏంటో తెలీదు! ఎప్పుడూ ఆ పనేంటి?" అనేది పేడపురుగు. మిడత నవ్వి, ఈసారి చీమను వెనకేసుకు వచ్చేది.

 

అంతలో వానాకాలం‌ రానే వచ్చింది. అడవిలో అంతటా నీళ్ళు, బురద! బయటికి వెళ్ళాలంటే కష్టం అయిపోయింది చీమకి. అది ఇంట్లోనే ఉండి, దాచుకున్న ఆహారంతోటే వంట చేసుకుని, అందులో తను కొంచెం తిని, కొంచెం‌ మిడతకు కూడా పెట్టేది. మిడత అట్లా తనకు చీమ ఇచ్చిన ఆహారంలోంచే కొంచెం తీసుకెళ్ళి పేడపురుగుకు పెట్టేది. అటుపైన రెండూ కలిసి బురదలోనే చక్కగా పాటలు పాడుకుంటూ తిరిగేవి. ఆ సమయంలో అవి సేకరించిన ఆహారంలో కొంత తీసుకెళ్ళి మళ్ళీ చీమకు పెట్టేది మిడత!

ఇట్లా రెండు మూడేళ్ళు గడిచేసరికి, చీమకు పేడ పురుగంటే గౌరవం పెరిగింది. పేడ పురుగుకు కూడా చీమంటే ప్రేమ కలిగింది. "పేడపురుగు ఎంత బాగా పాడుతుందో కదా, ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది!" అన్నది చీమ. "చీమ ఎంత మంచిదో కదా, సంవత్సరమంతా శ్రమపడుతుంది- స్వార్ధమే లేదు దానికి!" అన్నది పేడపురుగు. అటుపైన మూడూ కలిసి సంవత్సరమంతా కచేరీలు చేసుకుంటూ, కలిసి ఆహారం సేకరించుకుంటూ, కలిసి తింటూ బ్రతికాయి.

 

మన సమాజం కూడా ఇలానే ఏర్పడింది అనిపిస్తుంది ఆలోచిస్తే. అందరమూ అన్ని సమయాల్లోనూ అన్ని పనులూ చెయ్యలేం కాబట్టి, ఎవరికి వీలైనట్లు వాళ్లం, ఎవరి శక్తికి తగినట్లు వాళ్లం, ఎవరి ఇష్టానికి తగినట్లు వాళ్లం- పనిచేసేందుకు అనువుగా ఈ వ్యవస్థల్ని ఏర్పరచుకున్నాం అనమాట. అయితే ఈ ఆదర్శాలు సరిగా పనిచేయాలంటే చీమలు, పేడపురుగుల్లాగా తమ పనిని తాము ఇష్టంగా చేసే వాళ్ళు ఎంత ముఖ్యమో, మిడత లాగా అందరినీ‌ కలుపుకు పోయే వాళ్ళు అంతకంటే ముఖ్యం.

 

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో