కౌసస్య కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయ్యి. తనకు కాస్త ఊహ వచ్చినదగ్గర్నుంచీ పిల్లలంటే ఎంతో ముద్దు. అందుకనే తనకి వివాహం అవగానే భర్త కాంతారావు కొంతకాలం కుటుంబనియత్రణ పద్ధతులు అవలంభిద్దామన్నా ససేమిరా వద్దన్నది. ఇటువంటి కౌసల్యకి పెళ్ళయి ఆరుసంవత్సరాలయినా ఇంతవరకూ పిల్లలే కలగలేదు. పిల్లలకోసం ఆరాటం అంతులేకుండా ఉంది. పిల్లలకోసం భర్త అంతగా పట్టించుకోకుండా "అప్పుడే నీకు ఎందుకు ఇంతతొందర. పిల్లలు ఎప్పుడో ఒకప్పుడు పుట్టకపోరులే'' అంటూ వుంటే ఆమెకు ఏడుపు వచ్చేటంత అవుతూ వుండేది. భర్త ఎలాగూ ఈ విషయం పట్టించుకోవటంలేదని తానే డాక్టరుదగ్గరికి వెళ్ళి డి. అండ్ సి. ఆపరేషన్ చేయించుకుంది. ఏవేవో మందులు టానిక్కులు చాలాకాలం వాడింది. అయినా ఫలితం కనబడలేదు. తనకి పిల్లలమీద ఇంత ప్రేమం వాళ్ళకోసం ఇంత ఆరాటం ఉన్నా లోకం తనని గొడ్రాలు అంటుందనీ, పైగా గొడ్రాలు కేమి తెలుసు పిల్లలగురించి అని ఎత్తి పోడుస్తుందని బాధపడి కుమిలిపోతూ ఉండేది. పిల్లలు కలగక పోవడానికి లోపం అంతా తనలోనే ఉందని భావిస్తూ ఉండేది.
కాని ఒకరోజు డాక్టరు బలవంతంమీద కాంతారావు తన వీర్యపరీక్ష చేయించాడు. వీర్య పరీక్షలో పురుషబీజ కణాలే లేవని తేలిపోయింది. కాంతారావులోని లోపంవల్లనే కౌసల్యకి కడుపురాకుండా ఉంది. ఇంతవరకు కౌసల్య చేయించుకున్న ఆపరేషన్లు, వాడినమందులు అనవసరంగా వాడటం అయింది. సాధారణంగా పిల్లలు కలగాకపోవటానికి స్త్రీలల్లోనే లోపం ఉందని భావిస్తుంది. కాని వాస్తవానికి మూడింట ఒకవంతు మాత్రమే స్త్రీ కారణమయితే ఇంకొక వంతు పురుషుడు కారణం. అలాగే మరోకవంతు దంపతులిద్దరూ కారణం అవుతారు. అందుకని పిల్లలు కలగనప్పుడు స్త్రీ పురుషు లిద్దరినీ పూర్తిగా పరీక్ష చేయాలి. స్త్రీలోగాని, పురుషునిలోగాని లేదా ఇద్దరిలోగాని లోపంవల్ల గర్భాధారణ జరగకపోతే దానినే "వంధ్యత్వం'' (Sterility) అంటారు. కొందరి స్త్రీలలో ఎకపుత్ర వంధ్యత్వం కలుగుతుంది. ఇటువంటి స్త్రీలల్లో ఒకసారి సంతానం కలిగింతరువాత ఇక గర్భధారణ ఉండదు. అసలు పిల్లలు కలగకపోవటానికి, లేదా ఒక బిడ్డ పుట్టిన తరువాత బిడ్డలు కలగకపోవడానికి, సంబంధించిన విశేషాలు వివరంగా ముందు ముందు తెలుసుకుందాం.