The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Romantic Stories>>Sobhanam
శోభనం

- ముచ్చర్ల రజనీ శకుంతల

ఆఫీసు నుండి అలసటగా వచ్చి కుర్చీలో వాలాడు రాంపండు. ”ఏరా రాంపండూ! ఇవాళయినా ఇల్లు దొరికిందా లేదా?” బామ్మగారు కాఫీ గ్లాసు అందిస్తూ అంది.

”ఎక్కడే బాబూ! ఈ భాగ్యనగరంలో రెండు గదులున్న ఇల్లు దొరకాలంటే ఓ బ్రహ్మప్రళయం అయిపొయింది. నా వల్ల కాదు ఇక నీకు ఓపిక ఉంటే నువ్వు చూసుకో, లేకపోతే లేదు నన్ను చంపకు” నీరసంగా అన్నాడు రాంపండు.

”అదేమిట్రా! ఇప్పటికే ఇల్లు దొరక్క అమ్మాయిని తీసుకు రావడం లేటయిపోయింది. వాళ్ళ అమ్మా, నాన్న ఏమను కుంటారు చెప్పు. పెళ్ళి చేసుకుని ఉడాయించారు కాపురానికి అమ్మాయిని తీసుకెళ్ళరా అని దెప్పుతారు”

”నన్నేం చేయమంటావే? పెళ్ళి ఇప్పుడే వద్దు మొర్రో అంటే పిల్ల బావుందిరా అని చేశావ్. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు.”

”ఇది మరీ బావుంది. మగాడివి నువ్వే తిరిగి ఇల్లు వెతకలేకపోతే ముసలిదాన్ని నాకేం చేతనవుతుంది.”

”అయితే నోరు మూసుకుని ఊరుకో. లక్ష్మిని తీసుకు రమ్మని అనకు” మరింత కోపంగా అన్నాడు రాంపండు.

”చోద్యం కాకపొతే ఇల్లు దొరకలేదని పిల్లని కాపురానికి తీసుకురాకపోతే అందరూ ఏమనుకుంటార్రా… నీకం తెలియదుగానీ రేపు ఉదయాన్నే అమ్మాయికి ఫోన్ చేసి చెప్పు వెంటనే బయలుదేరమని”

”మరి ఇల్లు”

”ఎలాగోలా సర్దుకుందాం. ఏం చేస్తాం. ఈలోగా అందరికీ నేనూ చెప్పి పెడతాలే. అదృష్టం బావుంటే దొరుకుతుంది. లేకపోతె దొరికేవరకూ ఎలాగోలా సర్దుకుందాం సరేనా…?”

”సరే అనక చస్తానా! ఏ ముహూర్తంలో పుట్టావే బామ్మా! ప్రతీది నీమాట చెల్లాలంటావు. తాతయ్య ఎలా వేగేవాడో ఏమో నీతో”

”ఆయనకేం రా, నేనెంత చెప్తే అంత గర్వంగా అంది ముసిముసిగా నవ్వుతూ.

”ఆ ఆయనగారు అలవాటు చేశారు. ఇప్పుడు నువ్వు నానెత్తిన ఎక్కి కూర్చున్నావు…”

”ఒరే రాంపండూ లక్ష్మిని తీసుకు రమ్మన్నాననేగా నీ కోపం అంతా…. చూడు పెళ్ళి జరిగి నెల దాటుతోందా ఆ అమ్మాయి మాత్రం ఏమనుకుంటుంది చెప్పు. ముచ్చటగా మూడు ముక్కలయినా మాట్లాడతారా ఆమెతో? అదేం ఖర్మో పెళ్ళి బాగానే జరిగినా శోభనమే వాయిదా పడింది. వాళ్ళ బాబాయి చావుతో ఆ ముచ్చట కాస్తా ఇక్కడ జరిపించేస్తే ఏం గొడవా ఉండదు  అయినా పండూ నీకు మాత్రం ఆత్రంగా లేదూ ఆ అమ్మాయితో మాట్లాడాలని…” నవ్వుతూ అంది బామ్మ.

రాంపండుకు పెళ్ళి బట్టల్లో వున్న లక్ష్మి గుర్తొచ్చింది. సన్నగా, సన్నజాజితీగ లాంటి ఆ నడుము, పోడుగుకు తగ్గ లావు, పొడుగాటి జడ, నవ్వితో సొట్టపడే ఆ బుగ్గ, కింద పెదవి దగ్గర చిన్న పుట్టుమచ్చ. రాంపండు శరీరం తీయగా మూలిగింది. బామ్మ అతని ముఖాన్ని పరీక్షగా చూస్తూ – ”నీకు మరీ ఇష్టం లేకపోతె ఫోన్ చెయ్యడం మానెయ్. ఇల్లు దొరికాకే ఆర్నెల్లయినా ఫర్లేదు అప్పుడే తీసుకువద్దాం” అంది.

”వద్దులే రాత్రికి వెళ్ళి ఫోన్ చేసి చెప్తాను” గబగబా అన్నాడు పండు.

నీ వేషాలు నా దగ్గరా అనుకుంది అనుభవంతో తల పండిన ఆ బామ్మ.

రాంపండు ఎల్.ఐ.సి. లొ క్లర్క్ గా పనిచేస్తున్నాడు. చిన్నతనంలోనే తల్లీతండ్రీ చనిపోతే మనవణ్ణి పెంచుకుంటూ వచ్చింది బామ్మగారు. ఆవిడకి రాంపండంటే బోలెడంత ప్రేమ. ఏదో నాలుగురాళ్ళు సంపాదిస్తున్నాడు. ఓ ఇంటివాణ్ణి చేసేస్తే తానీ క్షణంలొ గుటుక్కుమన్నా బాధ వుండదని అన్ని సంబంధాల్లోని తనకి నచ్చిన మహాలక్ష్మి ని ఇచ్చి పెళ్ళి జరిపించింది. మహాలక్ష్మికి ఏ వంకా లేకపోవడంతో పెళ్ళికి ఒప్పుకున్నాడు పండు.

అయితే అతనికి ఒకటే కష్టంగా ఉంది. అతను వుండేది ఒకటే గది. చిన్నవంటిల్లు, ఇన్నాళ్ళూ అయితే వుండేది అతనూ, బామ్మే కాబట్టి ఏం కష్టం లేకుండాపోయింది. ఇప్పుడు లక్ష్మి వస్తే బామ్మ ఎక్కడ పడుకోవాలని అతని బాధ. పోనీ వంటింట్లోనే ఎలాగోలా సర్ధుకుని పడుకున్నా, బామ్మకి రాత్రులు బాత్రూంకి ఓ నాలుగయిదు సార్లయితే వెళ్ళందే ఊరుకోలేదు. బాత్ రూం గదికి ఆనుకుని వుంది తనూ, లక్ష్మి వుండే ఆ గదిలోకి అన్నిసార్లు రావడానికి బామ్మకి వీలవదు. అందుకే కనీసం రెండుగదులున్న ఇల్లు, జీతం డబ్బులు సరిపోక పోయినా ఎలాగోలా ఎడ్జస్ట్ చేసుకుందామని అనుకుంటే దురదృష్టం కొద్దీ ఆ ఇల్లు దొరికిచావడం లేదు.

మరి ఇప్పుడు లక్ష్మి వచ్చేస్తే ఎలా బామ్మ పరిస్థితి? అదీ రాంపండు సమస్య ఇప్పుడు. అలా అని లక్ష్మిని తలచుకుంటూ వుండలేక పోతున్నాడు. పెళ్ళి తర్వాత రోజే శోభనానికి ఆమె తల్లిదండ్రులు ముహూర్తం పెట్టారు. వాళ్ళ ముసలి బాబాయి అనుకోకుండా హార్ట్ ఎటాక్ తొ పోవడంతో ఆ శోభనం కాస్తా వాయిదాపడుతూ వచ్చింది.

”మా వూళ్ళో చేసుకుంటాం. ఇల్లు పెద్దది దొరకగానే ఉత్తరం రాస్తాం అమ్మాయిని పంపించండి” అని చెప్పి బామ్మ రాంపండుతొ వచ్చేసింది. నెలదాటినా ఇల్లు దొరకలేదు. దొరికినా ఇల్లు రాంపండుకు నచ్చలేదు. ఏదైతే అదే అయిందని లక్ష్మిని తీసుకోని రమ్మని ఇప్పుడు ఆర్డర్ వేసింది బామ్మ. అదీ సంగతి.

మంచిరోజు చూసుకుని మహాలక్ష్మి రానే వచ్చింది. ఉదయం వచ్చి ఆ సాయంత్రమే వెళ్ళిపోయారు వాళ్ళ నాన్న వుండడానికి ఎలాగూ ప్లేస్ లేదని. మహాలక్ష్మి ప్లేట్ నిండా అరిశెలు, వడలు, సున్నుండలు పెట్టి తెచ్చింది రాంపండుకి. ”తీసుకోండి”

అతను ప్లేట్ అందుకుని పక్కన పెట్టేస్తూ ”ఇప్పుడిదా ఇవ్వవలసింది?” అన్నాడు దగ్గరకి లాక్కుంటూ….

”మరి” అంది ఆశ్చర్యంగా లక్ష్మి.

”ఓ చిన్న ముద్దు ఇచ్చుకో…” అన్నాడు కళ్ళు మూసుకుని బుగ్గ చూపెడుతూ…

”ఛీ… ఛీ.. సిగ్గులేదు” అంటూ వెనక్కి జరిగింది లక్ష్మి.

”అరె ఎవరో పరాయివాడు అడిగితే అసహ్యించుకున్నట్లు అలా పెడతావేంటి ముఖం. నేను నీ భర్తని తెలుసా?” అన్నాడు కాస్త గట్టిగా.

అతని ముఖంలోని కోపాన్ని గమనించిన లక్ష్మి భయపడుతూ అలాగే భయంగా అతని ముఖంలోకి చూడసాగింది. లక్ష్మి ఏడో తరగతి ఫెయిలయింది. ఈ తరం అమ్మాయే అయినా పల్లెటూరిలొ పుట్టి పెరగడం వలన సిటీలోని అమ్మాయిలంత ఫాస్ట్ కాదు. ఉదయాన్నే చద్దన్నం తినేసి చింతగింజలాడుకునే టైపు.

బెదురుతూ చూస్తున్న లక్ష్మి ని దగ్గరకు లాక్కుని ”పోనీ నువ్వివ్వకపోతే నేను ఇచ్చుకుంటాను” అంటూ చటుక్కున బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు.

”రాత్రికి భోజనంలోకి ఏం వండమంటావురా పండూ?” వంటింట్లోనుండే అడిగింది బామ్మ.

లక్ష్మి గబుక్కున దూరం జరుగుతూ ”నే వెళ్తున్నా బాబు బామ్మ పిలుస్తున్నట్లుంది” అంది.

”పిలిచింది నన్ను, నిన్నుకాదు” అతను కౌగిట్లోకి లాక్కుంటూ అన్నాడు.

”ఛ… వదలండీ. ఆవిడ చూస్తే ఏమనుకుంటుంది?” అంటూ అతని చేతులు తీసేసి వంటింట్లోకి పారిపోయింది.

”హు… యిక ఈ రాంపండుకి శోభనం కాదుకదా, ముద్దూ ముచ్చటా కూడా తీరే యోగం ఈ జన్మకి వుందో లేదో” అనుకుంటూ తల పట్టుకుని కూర్చున్నాడు.

*****

రాత్రి అవుతోందిగానీ బామ్మ రాంపండు శోభనం గురించి ఏ మాటా ఎత్తలేదు. రాంపండుకి ఆశ్చర్యంగా వుంది. శోభనం చేయించేస్తాను… చేయించేస్తాను అని గోల పెట్టి లక్ష్మిని రప్పించి ఇప్పుడు ఇలా నిశ్శబ్దంగా ఊరుకుంటుందేవిటా అని అతనికి ఆశ్చర్యంగానూ, మరో పక్క కోపంగానూ వుంది. ఆఖరికి ఏడున్నరవుతుంటే ఆగలేక అడిగేశాడు. ”పూలు, పళ్ళు, స్వీట్స్ తేవా బామ్మా!” అని.

రాంపండు ఆత్రానికీ ముసిముసిగా నవ్వుతూ ”అర్థమయిందిలేరా పండూ నీ ఆత్రం” అంది.

”నీ ముఖం” నవ్వేశాడు ఏడ్వలేక.

”ఈరోజు అంత బాలేదురా… నాలుగురోజుల తర్వాత దివ్యమైన ముహూర్తం వుంది. ఆ రోజు ఖాయం చేస్తాను. అతవరకూ ఒపికపట్టు”

”తప్పదా బామ్మా!”

”నా మాటంటే మాటే నీకు తెల్సుగా! ఈలోగా ఇల్లు వెతుకు”’

రాంపండు బామ్మ మాటలకి తిట్టుకుంటూ అన్నం కూడా తినకుండా అలిగి ముసుగుతన్ని పడుకున్నాడు. అన్నం తినమని బామ్మ ఎంత బ్రతిమిలాడినా నాలుగురోజుల తర్వాత తింటాలే అని తెగేసి చెప్పాడు.

”వెధవ అన్నీ నా బుద్ధులే. మెండి ఘటం” అని వూరుకుంది బామ్మ.

*****

మధ్యరాత్రిలో మెలకువ వచ్చిన రాంపండు, గదిలో లైట్ వేసి చూసేసరికి హాయిగా బామ్మ పక్కన చెయ్యి వేసుకుని పడుకున్న మహాలక్ష్మి కనపడింది. ‘హు…! నా పక్కలో వుండవలసిన లక్ష్మిని నీ పక్కలో పడుకోపెట్టుకుంటావా! అనుకుంటూ పళ్ళు నూరుకున్నాడు రాంపండు.

నాలుగురోజుల తర్వాత బామ్మ పెట్టిన ముహూర్తానికి మహాలక్ష్మికి ,ఆడవాళ్ళ మూడురోజుల అవాంతరం వచ్చి పడింది. రాంపండుకి మరింత పిచ్చెక్కింది. ఆ తరువాత వారం రోజులకి మరో ముహూర్తం పెట్టింది. సరిగ్గా ఆరోజు ఉదయమే బామ్మగారికి అనుకోకుండా జ్వరం మొదలయింది. రాంపండు మనసు విలవిలలాడిపోయింది. బామ్మంటే ప్రాణం మరి! ఎప్పుడైనా కోపం వచ్చినా అది కాసేపే. ప్చ్! నా రాతే అలా వుంది ఏం చేస్తాం అని సరిపెట్టుకుని ఊరుకున్నాడు.

అతనికి మహాలక్ష్మిని చూస్తుంటే ఊరుకోబుద్ది అవడం లేదు. ఎదురుగా పంచభక్ష పరమాన్నాలు పెట్టి, నువ్వు ఉపవాసం వుండు అన్నట్టుగా వుంది అతని పరిస్థితి. అయినా ఏం చెయ్యలేని పరిస్థితి. తెగ విలవిలలాడిపోతున్నాడు. బామ్మకి జ్వరం తగ్గాలని, పది కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు కూడా.

ఐదురోజుల తర్వాత బామ్మ జ్వరం తగ్గింది. రెండుమూడు రోజుల్లో చూసి ముహూర్తం పెట్టించింది రాంపండు సంతోషానికి హద్దేలేదు. మరి మహాల్క్షక్మి వచ్చి ఇరవై రోజులు దాటిపోతున్నా కేవలం చిన్న చిన్న ముద్దు మురిపాలతోనే ఇప్పటివరకూ సాగిపోయింది. ఆరోజు పెట్టిన ముహూర్తానికి రాంపండు పూలు, పళ్ళు అన్నీ కొనేసి తెచ్చేశాడు. ఇంకా ఏం అవాంతరం వచ్చినా ఆగేది లేదని.

కానీ అనుకోకుండా ఆరోజు మధ్యాహ్నం బామ్మగారు బాత్ రూమ్ లొ కాలు జారిపడింది. డాక్టర్లు, ఎక్సరేలు, టెస్టులు అన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. మొత్తానికి అదే ముహూర్తానికి బామ్మ వున్న ఒక్క మంచం మీద కాలు ఫ్రాక్చరై నలభయి రోజులు చెట్టు ఎక్కేసారు. తనకువున్న ఒక్క బామ్మ మంచాన పడేసరికి దుఃఖం ముంచుకొచ్చింది రాంపండుకి. తన శోభనం సంగతి దేవుడెరుగు. పాపం బామ్మ ఇలా మంచాన పడిందేమిటి గుండ్రాయిలా ఏదో ఒక పని చేసుకుంటూ పోయే ఆవిడకి ఇలా జరిగిందేమిటీ అనుకుంటూ తెగ బాధపడిపోయాడు. మహాలక్ష్మి కూడా చాలా బాధపడింది.

బామ్మగారి పరిస్థితికి రెండు నెలలు అయితేగానీ మంచం మీదనుండి లేవలేకపోయింది బామ్మగారు. ఈసారి బామ్మ పంతుల్ని పిలిపించి ముహూర్తం పెట్టించింది. దీనికి తిరుగు లేదనుకున్నారంతా! వారం తర్వాత దివ్యమైన ముహూర్తం అంటూ పెట్టాడు ఆ పంతులు. కానీ ఆ ముందురోజే మహాలక్ష్మి అక్క డెలివరీ అయిందనీ, తప్పక పంపమని మామగారు ఫోన్ చేశారు. మహాలక్ష్మి వెళ్తానని ఒకటే గోల. రాంపండుకి ఓ ఆలోచన వచ్చింది.

తను కూడా వెళ్తే తనకీ, లక్ష్మికీ ఎలాగైనా వేరే రూమ్ ఇస్తారు అత్తగారు . హాయిగా అక్కడ చేసేసుకోవచ్చు శోభనం అనుకున్నాడు. కానీ కోనసీమకు టికెట్ ఖర్చు అంతా లెక్కలేసుకుని చూసుకునేసరికి ఆరువందలపైనే ఖర్చు కనపడింది. ”హమ్మో! ఆ ఆరువందలు దేనికైనా పనికొస్తాయని చెప్పి ఆ ఉద్దేశ్యం మార్చుకున్నాడు.

శోభనం కోసం కక్కుర్తిపడితే తనకో ఆరేడు వందల ఖర్చు పైగా పురుడి గోలలో వుంటారు. తనకి రూమ్ ఇవ్వకపోతే అని ఆలోచించు కున్న రామపండు లక్ష్మి నొక్కర్తనే రైలేక్కించాడు తర్వగా రమ్మంటూ. పాపం శ్రీ వారు అనుకుంటూ టాటా చెప్పింది లక్ష్మి. తొందరగా వచ్చేయమని చెప్పినా బారసాల అయినాక వస్తాను. మళ్ళీ వచ్చి వెళ్ళడం రైలు ఖర్చులు దండగ అని లెటర్ రాసింది లక్ష్మి.

రాంపండు ఏం చేయలేక నిట్టూర్చాడు. ఇరవయి ఒకటోరోజు బారసాల కాగానే వస్తానన్న లక్ష్మి మూడునెలల వరకూ రాలేకపోయింది. చంటి పిల్లాడికి ఒంట్లో బాగోలేని కారణాన వాళ్ళు బారసాల మూడొనెలలో చేసుకోవలసి వచ్చింది. తనని క్షమించమంటూ ఫంక్షన్ కాగానే వస్తానని లెటర్ రాసింది లక్ష్మి. రాంపండు విరక్తిగా నవ్వుకున్నాడు తప్ప కోపం తెచ్చుకోలేదు. లక్ష్మి వచ్చేసింది.

హాయిగా పుట్టింట్లో రెస్టుగా వుంది. నిశ్చింతగా వుందేమో, మునపటికంటే తెల్లగా, లావుగా అయి మరింత అందంగా వున్నట్లు కనబడింది రాంపండుకి. బామ్మ కూడా మనవడిని చూసుకుని తెగ ముచ్చట పడిపోయింది. ఆ శోభనం ముహూర్తం కాస్తా పెట్టించి జరిపించేస్తే ఏ మునిమనవన్నో ఎత్తుకుంటే చాలు, నాకింకే కోరికలూ లేవు” అంటూ మొదలుపెట్టింది బామ్మ.

”శోభనం మాట ఎత్తితే… నిన్ను చంపేస్తా” అన్నాడు రాంపండు.

”ఇంకో ఇల్లు దొరికేవరకూ నేను చేసుకోను పో” అన్నాడు.

బామ్మగారు ఎన్నివిధాలుగానో చెప్పి చూసింది. మొండిగా వున్నాడు రాంపండు. ”పెళ్ళయి ఎనిమిది నెలలవుతున్నా విశేషం లేదా” అంటూ చుట్టుపక్కలవాళ్ళు ప్రశ్నలు మొదలుపెట్టారు. బామ్మకి చాలా దిగులుగా వుంది.

”అవును తను చచ్చిపోయేలోగా మునిమన్నవణ్ణి ఎత్తుకుంటుందో లేదో ఎలా” అని ఒకటే దిగులు పెట్టుకుంది.

*****

మరో నెలరోజులు అలాగే గడిచిపోయాయిగానీ ఇల్లు దొరకలేదు. బామ్మగారు ఓ రోజు పక్కింటికి వెళ్ళింది. పక్కింట్లో వుంటున్న సరోజ తల్లీ తండ్రీ యాత్రలకు వెళ్తున్నట్లుగా చెప్తే ఓ ఆలోచన వచ్చింది బామ్మగారికి. వెంటనే అది అమలు చేయ్యదలచుకుంది. సరోజ చేత తనకీ వాళ్ళతోపాటు యాత్రలకి టికేట్టు తెప్పించుకుని తనుకూడా వాళ్ళతో వస్తానని చెప్పింది.

వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. తిరుపతి, మద్రాస్, మదురై, కన్యాకుమారి, రామేశ్వరం అన్నీ మొత్తం నెలరోజులు యాత్రలు. హాయిగా తనకీ పుణ్యమూ దక్కుతుంది. రామపండు వాళ్ళకు ఏకాంతమూ చిక్కుతుంది అనుకుంది బామ్మగారు. తను యాత్రలకి వెళ్తున్నాని చెప్పింది రాత్రికి రామపండుకి. ఒక్కర్తివీ, పెద్దదానివి, వద్దు అన్నాడు రామపండు. అయినా బామ్మగారు వినలేదు. అన్నీ సర్ధుకుంది. ఈ సారి రామపండు శోభనానికి ముహూర్తం పెట్టలేదు బామ్మ.

”ఒరే రాంపండూ నేను నెలరోజులు తిరిగి వచ్చేసరికి మహాలక్ష్మి నెలతప్పి వుండాలి తెలిసిందా? నా బుజ్జిపండు కదూ! నాకో మునిమనవణ్ణి ఇచ్చేస్తే ఇంకేం అడగనురా నిన్ను”

”నేను వెళ్ళే ప్రతిచోటా ఏమని మొక్కుకుంటానో తెలుసా… మహాలక్ష్మికి కొడుకు పుట్టాలని సరేనా వెళ్ళనా?” బిక్కముఖం వేసుకున్న రామపండు దిగులుగా తల వూపాడు.

బామ్మగారు మాత్రం సంతోషంగా చేయి వూపింది. ముహూర్తం పెట్టని శోభనానికి రామపండు బయలుదేరాడు.