ప్రొలాక్టిన్ స్తనాల నుంచి స్తన్యం ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది ఎక్కువైతే అండాశయం, బీజాల కార్యాన్ని బాధిస్తుంది. ప్రొలాక్టిన్ ఇన్ హిబిటింగ్ హార్మోన్ ఫ్యాక్టర్ లేదా డోపామిన్ కార్యకలాపాలు తగ్గితే ప్రొలాక్టిన్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాంటి సందర్భంలో ప్రొలాక్టిన్ పెరిగినందువలన సెక్స్ లో బాధలు కలుగుతున్నాయా? లేదా డొపామినిర్జిక్ కార్యాలు తగ్గినందువలనా? అన్నది నిర్ణయించడం కష్టమౌతుంది. మగవారిలో ఇది పెరిగినప్పుడు సెక్స్ సమస్యలు కలగడం బువాట్ మొదలగువారు గుర్తించారు. సెక్స్ కోరికలు తగ్గడం, అంగస్తంభన సమస్యలు కలగడం చూశారు. ఆడవారిలో ప్రొలాక్టిన్ పెరిగినప్పుడు బహిష్టు రాకపోవడం, వంధ్యత్వం కలుగుతాయి. అంతేకాకుండా సెక్స్ సమస్యలు కూడా వస్తాయని ముల్లర్ మొదలగువారు గుర్తించారు.
ఆక్సిటోసిన్ పిట్యూటరీ గ్రంధి విడుదల చేసే మరొక హార్మోన్ ఆక్సిటోసిన్, ప్రసవం సమయంలో గర్భాశయాన్ని ప్రేరేపించి ప్రసవం అయ్యేట్టు చేయడం ఆ తరువాత స్తన్యం తయారయ్యేలా చేయడం దీని ముఖ్య కార్యాలు. ఆడవారిలోనూ, మగవారిలోనూ భావప్రాప్తి సమయంలో రక్తంలో ఆక్సిటోసిన్ పరిమాణం పెరుగుతుందని చూశారు. మగవారిలో స్ఖలనం అయ్యాక ఆక్సిటోసిన్ పరిమాణం పెరిగినట్లు, 30 నిమిషాల తర్వాత అది మామూలు పరిమాణంలోకి వచ్చినట్లు అనేక పరిశీలనలలో చూశారు. జననావయవాల కండరాలలో సంకోచాలు కలిగించి తద్వారా అండం, వీర్యకణాల రవాణాని పెంచడం ద్వారా గర్భం కలిగే అవకాశాన్ని ఇది పెంచుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎండార్ఫిన్స్ మెదడు ఉత్పత్తి చేసే నల్లమందును పోలిన అనేక రసాయనాల్ని గుర్తించారు. వీటిని ఎండార్ఫిన్స్ అంటారు. వీటిపై అమెరికాలో విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి.
భావప్రాప్తి సమయంలో ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. వీటికి ముఖ్యంగా రెండురకాలుగా పనిచేసే శక్తి వుంటుంది. నొప్పుల్ని తగ్గించడానికి. నిద్ర కలిగించడానికి ఇవి సహాయపడతాయి. శరీరంలో వున్న నొప్పుల్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా కీళ్ళనొప్పులు వున్నవారిలో రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొన్నందువలన నొప్పులు తగ్గడం గమనించారు. దీనికి కారణం ఎండార్ఫిన్స్ అని చాలామంది భావిస్తున్నారు. అలాగే ఎండార్పిన్స్ వల్లనే సెక్స్ తర్వాత మంచి నిద్ర వస్తుంది. నిద్ర పట్టనివారికి సెక్స్ నిద్ర కలిగిస్తుంది. ధ్యానం చేసినప్పుడు కూడా ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. ఆండ్రోజన్ లు మగవారిలో యుక్తవయసు వచ్చినపుడు పెరిగిన ఆండ్రోజన్ ల పరిమాణం అంగం, బీజకోశం, బీజాల పెరుగుదలను, వాటికి స్పర్శతో కలిగే ఉద్రేకాన్ని కలిగిస్తాయి.
శరీరంపై మగవారికుండే వెంట్రుకలను కలిగిస్తాయి. గొంతులో మార్పును, చెమట, సెబేషియన్ గ్రంధులను ప్రేరేపిస్తాయి. యుక్తవయసు వచ్చాక వీర్యకణాల ఉత్పత్తికి, ప్రోస్టేట్ గ్రంధి, సెమైనల్ వెసైకిల్స్ నుంచి స్రావాల ఉత్పత్తికి టెస్టోస్టిరాన్ అవసరం. వీర్యంలో ఎక్కువభాగం వుండేవి ప్రోస్టేట్ గ్రంధి, సెమైనల్ వెసైకిల్స్ నుంచి వచ్చే స్రావాలు. ఆండ్రోజెన్స్ పై రెండు శతాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఆండ్రోజెన్స్ తక్కువగా వున్నవారిలో వాటిని ఇచ్చినందువలన ఫలితం వుంటుంది. ఆండ్రోజెన్స్ మామూలుగా వున్నవారిలో ఆండ్రోజెన్స్ సెక్స్ కోరికల్ని కలిగిస్తాయి. 1961లో జాన్ మనీగారు టెస్టోస్టిరాన్ ని ఆడవారిలో కూడా లిబిడో (సెక్స్ కోరికల కలిగించే) హార్మోన్ గా పేర్కొన్నారు. దీన్నే ఇతర శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు. టెస్టోస్టిరాన్ అధికంగా వున్న ఆడవారికి కామోత్తేజం కలిగించినపుడు యోనిలో కలిగే రెస్పాన్స్ ఎక్కువగా వుంటుందని మరొక పరిశోధనలో చూశారు.
స్టీరాయిడ్స్ హార్మోన్ల లో మగవారి శృంగార ప్రవర్తన విషయంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ముఖ్యమైంది. టెస్టోస్టిరాన్ హార్మోన్ 5 ఆల్పా రిడక్టేజ్ అనే ఎంజైమ్ వలన డై హైడ్రో టెస్టోస్టిరాన్ (డి.హెచ్.టి)గా మారుతుంది. ఈ డి.హెచ్.టి టెస్టోస్టిరాన్ కన్నా శక్తివంతమైనది ఆండ్రోజెన్ యారోమటైజ్ అనే ఎంజైమ్ వలన ఈస్ట్రోజన్ ఈస్ట్రాడియోల్ గా మారుతుంది. డి.హెచ్.టి శరీరంలో వివిధ కణాలు ముఖ్యంగా ప్రోస్టేట్ గ్రంధి, బాహ్య జననావయవాలు, చర్మంలోని హెయిర్ ఫాలికల్స్ అభివృద్దికి అవసరం. కేంద్రీయ నాడీమండలం పై టెస్టోస్టిరాన్ ప్రత్యక్షంగా ప్రభావాన్ని కలిగి వుంటుంది. గర్భస్థ శిశువులో టెస్టోస్టిరాన్ పురుష బాహ్య అభ్యంతర జననావయవాలుగా మార్పునకు, పురుషాంగం, అభివృద్దికి తోడ్పడుతుంది.
అదేవిధంగా యుక్తవయసులో శారీరకంగానూ, వివిధ ప్రక్రియలపరంగానూ అనేక ముఖ్యమైన కార్యాలను టెస్టోస్టిరాన్ చేస్తోంది. జీవితాంతం టెస్టోస్టిరాన్ ఉత్పత్తి ఉంటుంది కానీ వయసు మళ్ళేకొద్దీ దీని పరిమాణం తగ్గుతూ వెళుతుంది. మగవారి సెక్స్ పై టెస్టోస్టిరాన్ ప్రభావం చూడాలి అంటే మూడు విషయాలు గుర్తుంచుకోవాలి. 1. సైక్లికల్ అండ్ పల్సటైల్ ఎపెక్ట్స్ 2. ఫ్రీ మరియు బౌండ్ టెస్టోస్టిరాన్ బయోఅవైలబిలిటీ 3. నెగటివ్ ఫీడ్ బ్యాక్ మెకానిజమ్స్. టెస్టోస్టిరాన్ పరిమాణం రోజంతా ఒకేలా వుండదు. రాపిడ్ ఐ మూమెంట్ నిద్రలోనూ, తెల్లవారుఝామున ఎక్కువ గా వుంటుంది. రోజులో కనీసం 6 నుండి 7 సార్లు కొంచెం ఎక్కువగా వుంటుంది.
టెస్టోస్టిరాన్ లో 30 నుండి 60 శాతం సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ తో కలిసి వుంటుంది. ఇది క్రియాహీనంగా వుంటుంది. ఇదేకాక మరో 40 నుండి 70 శాతం ఆల్బుమిన్ తో లూజుగా కలిసి వుంటుంది. కేవలం 5 శాతం లేదా అంతకంటే తక్కువ శాతమే దేనితో కలవకుండా ఫ్రీ టెస్టోస్టిరాన్ గా వుంటుంది. ఆల్బుమిన్ తో కలిసిన టెస్టోస్టిరాన్ తో కలిపి బయో అవైలబిల్ టెస్టోస్టిరాన్ అంటారు. అంతేకాకుండా టెస్టోస్టిరాన్ పరిమాణం హోమియోస్టాటిక్ లేదా నెగటివ్ ఫీడ్ బ్యాక్ మెకానిజమ్స్ తో నియంత్రించబడుతుంది.
|
|


