పతీసా - సోన్ పాపిడి

 


తియ్యగా ఉండి ఘుమఘుమలాడే యాలకుల వాసనాతో చూడగానే నోరూరేలా ఉండే సోన్ పాపిడి ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలా అని చాలా సార్లు అనుకున్నా. ఆఖరికి దాన్ని ఎలా తయారుచెయ్యాలో తెలుసుకుని ఇంట్లోనే తయారుచేసి చేసి పిల్లలకి పెట్టి ఎవరెస్ట్ ఎక్కినంత ఆనంద పడ్డా. మరి మీరు కూడా అంత ఆనందాన్ని పొందాలంటే దీనిని ఎలా చెయ్యాలో చూసి తెలుకోండి.

 

కావాల్సిన పదార్థాలు:

మైదాపిండి - 1 కప్పు

సెనగపిండి - 1 కప్పు

పంచదార - 2 కప్పులు

నెయ్యి లేదా డాల్డా - 1 1/2 కప్పులు

యాలకుల పొడి 2 చెంచాలు

తేనే - 3 చెంచాలు

 

తయారుచేసుకునే విధానం:

స్టవ్ వెలిగింది మందంగా ఉండే నాన్ స్టిక్ పాన్ పెట్టి అందులో నెయ్యి లేదా డాల్డా వేసి కరిగాకా మైదా పిండి, సెనగ పిండి వేసి కలపాలి. పచ్చి వాసన పోయేదాకా 5నిమిషాలు ఉంచి తరువాత స్టవ్ మీదనుంచి దించి కాస్త చల్లరనివ్వాలి. ఇప్పుడు మరో కడాయిలో పంచదార వేసి కొన్ని అంటే అరకప్పు నీళ్ళు పోసి ముదర పాకం వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి. అందులో యాలకుల పొడి వెయ్యాలి. పాకం ముదిరిందో లేదో చూడటానికి ఆ పాకాన్నినీళ్ళు ఉన్న ప్లేట్ లో వేసి చేతితో ముట్టుకుంటే ఉండలా రావాలి. అప్పుడు పాకం ముదిరినట్టు అర్ధం. ఇందులో 2 చెంచాల తేనే వేస్తే రుచి ఇంకా బాగుంటుంది. అలా ముదిరిన పాకాన్ని సెనగపిండి, మైదా పిండి కలిపిన మిశ్రమంలో వేసి అట్లకాడతో అటు ఇటు కదుపుతూ ఉండాలి. మొత్తం మిశ్రమం గట్టిపడేదాకా అలానే తిప్పుతూ ఆఖరికి నెయ్యి రాసిన ప్లేట్ లో వెయ్యాలి. ఎంతలా తిప్పుతూ ఉంటే అంతలా దారాల్లాగా వచ్చి చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇప్పుడు చపాతీ కర్రకి నెయ్యి రాసి ఆ మిశ్రమాన్ని సమానంగా ఉండేలా చూసి పైన కావాలంటే జీడిపప్పు, బాదం పప్పు నేతిలో వేయించి చిన్న చిన్నముక్కలుగా చేసి అద్దుకోవచ్చు. ఇప్పుడు దీనిని చాకుతో కావాల్సిన షేప్ లో కట్ చేసుకుని పూర్తిగా ఆరాకా ఎయిర్ టైట్ డబ్బాలో నిలవ ఉంచుకోవచ్చు.

 

...కళ్యాణి